గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 19, 2014

తెలంగాణపై కేంద్ర అధికారుల శీతకన్ను

-రాష్ట్రం విడిపోయినా ఏపీ ఖాతాలోకే కేంద్ర నిధులు
-ఆలస్యంగా గుర్తించిన తెలంగాణ అధికారులు
-అకౌంట్ వివరాలతో ఢిల్లీ వెళ్లాలని సీఎస్ ఆదేశం
-ప్రధానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కార్


కేంద్ర ప్రభుత్వం మొద్దునిద్ర వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న స్పృహ లేకుండా కేంద్రం వ్యవహరిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కేంద్రం అమలు చేస్తున్న దాదాపు 66 పథకాలకు సంబంధించిన రూ.వేలాది కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అకౌంట్‌లోనే జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు సమాచారాన్ని అందించారు. దీంతో సీఎస్ బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అప్రమత్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అకౌంట్, శాఖల హెడ్ ఆఫ్ అకౌంట్ల వివరాలతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి నిధులను రాబట్టుకోవాలని ఆదేశించారు.ఢిల్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా అకౌంట్‌ను తెరిచింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల పలు పథకాల నిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అకౌంట్‌లోనే జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తవైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా దక్కని పరిస్థితి నెలకొంది.

కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పలు పథకాల అమలు కోసం నిధులను మంజూరు చేయడం గత కొన్నేళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా కేంద్ర పథకాల నిధులు తెలంగాణ రాష్ట్రానికి కూడా దక్కాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వ అకౌంట్ ఇంకా కేంద్రానికి చేరకపోవడం వల్ల ఆ పథకాల నిధులు రాష్ట్రానికి దక్కడం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. అరకొర నిధులతో పాలనను సాగిస్తున్న రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులపై ఆశలు పెట్టుకుంది. నిధులు వస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఆరా తీసిన తెలంగాణ ఆర్థికశాఖ అధికారులకు అసలు విషయం తెలియడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.

రాజీవ్ విద్యా మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యం, అటవీ, టూరిజం, గ్రామీణాభివృద్ధితోపాటు పలు శాఖల్లో అమలు అవుతున్న కేంద్ర పథకాల నిధులను రాబట్టుకునేందుకు రాష్ట్ర అధికారులు కసరత్తు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు 66 పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల అమలు కోసం నిధులను ఆయా రాష్ట్రాల ఖజానాలో జమ చేస్తోంది. ఈ పద్ధతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభమైంది. గతంలో ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిధులను విడుదల చేసే పద్ధతి ఉండేది. కేంద్ర పథకాల నిధులు సమకూరితే తెలంగాణ రాష్ట్రంలో పలు పథకాలు విజయవంతంగా అమలయ్యేందుకు అవకాశముంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

1 కామెంట్‌:

vvvv చెప్పారు...

Share your Website Link, promote your website or Blog and Increase traffic to your site.
http://forum.telugushortfilmz.com/

కామెంట్‌ను పోస్ట్ చేయండి