గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 29, 2014

అక్కినేని నాగార్జున "ఎన్-కన్వెన్షన్" అక్రమమే!

-మూడెకరాలు ఆక్రమించిన నాగార్జున
-వివాదాస్పద భూమి, పైగా చెరువు కబ్జా
-సర్వేలో నిర్ధారించిన అధికారులు
-ఆక్రమిత స్థలానికి మార్కింగ్
-ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఖాయం!
-నిర్మాణానికి అనుమతి లేదు
-ఐదేళ్లుగా పైసా పన్ను కట్టలేదు
-ఆదాయం మాత్రం కోట్లలో
-రెవెన్యూ రికార్డుల్లో 6 ఎకరాల 30 గుంటలు
-తేలిన అదనపు భూమి 3 ఎకరాల 12 గుంటలు
-మార్కింగ్‌లో మార్పులతో వివాదం
-సూపరింగ్ పొజిషన్ మ్యాప్‌తో తేలనున్న బాగోతం
సీమాంధ్రుల అక్రమాల పుట్టలు ఒకటొకటిగా బద్దలవుతున్నాయి. నిన్నటిదాకా భూములు దిగమింగిన బకాసురుల భరతంపట్టిన తెలంగాణ ప్రభుత్వం నేడు చెరువులు మింగిన బడాబాబులను కూడా బయటికి లాగుతున్నది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు తార్కాణం. ఎకరాలకు ఎకరాలు నీటివనరులు కబ్జాలుపెట్టిన వెండితెర మన్మథుల బాగోతాలను ప్రభుత్వం బయటకు లాగుతున్నది. పేదపిల్లల నోళ్లుకొట్టి ఆక్రమించిన భూముల్లో కోట్లు పండించుకున్న అక్రమార్కుల కోటలను బద్దలు కొడుతున్నది. చెక్కుచెదరని దీక్షతో విముక్తి దిశగా అడుగులు వేస్తున్నది. ఈ జోరు కొనసాగాలన్నది సకల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ఆశీస్సు. పునర్నిర్మాణమంటే కూల్చేసి కట్టుకుంటారా? అన్నాడో సీమాంధ్ర మహామేధావి. అవును.. ఈ అక్రమ సామ్రాజ్యాలు కూల్చేయకుండా తెలంగాణ విముక్తి పరిపూర్ణం కాదు.. పునర్నిర్మాణమూ సాధ్యం కాదన్నది తెలంగాణవాదుల నిశ్చితాభిప్రాయం. center

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఖానామెట్‌లో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణమేనని అధికారులు తేల్చారు. ఆక్రమించిన భూమిలోనే సగానికి పైగా నిర్మాణం ఉందని కూడా దాదాపు అంచనాకు వచ్చారు. పక్కనే ఉన్న చెరువును ఆక్రమించి పూడ్చేసి నిర్మాణాలు సాగించారని శనివారం అధికారులు జరిపిన సర్వేలో బట్టబయలైంది. సర్వేకు సంబంధించి మరికొన్ని లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం నిర్మాణం కూల్చేయనున్నారని సమాచారం. సీమాంధ్రులు నగరంలో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా భూములను కబళించి కట్టిన అక్రమ నిర్మాణాలపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ పరంపరలో ఒక ప్రముఖుడి పేరు బయటకు రావడం ఇదే ప్రథమం.
వేగం పెరిగిన ఆపరేషన్...

మాదాపూర్ గురుకుల్ ట్రస్ట్ అక్రమ నిర్మాణాల విముక్తి ఆపరేషన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పీడు పెంచారు. నిన్న మొన్నటి దాకా నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేత, ఆ తర్వాత అక్రమ భవనాల సీజింగ్ పూర్తి చేసిన అధికారులు తాజాగా బడాబాబుల ఆక్రమణలపైకి దృష్టి మరల్చారు. ఈ క్రమంలోనే మాదాపూర్ ఖానామెట్‌లో ఉన్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలాలను రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేశారు. తమ్మిడికుంట చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్టీఎల్), బఫర్ జోన్ పరిధులను దాటి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని అధికారులు గుర్తించారు. చెరువు ఆక్రమణ జరిగినంత మేర ఉన్న నిర్మాణానికి మార్కింగ్ కూడా వేశారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొన్నారు.
Naga

రికార్డుల్లో 6 ఎకరాల 30 గుంటలే..

రికార్డుల ప్రకారం తమ్మిడిచెరువుకు ఆనుకుని సినీ నటుడు నాగార్జునకు వివాదాస్పద గురుకుల్ ట్రస్ట్ కు చెందిన 6 ఎకరాల 30 గుంటల స్థలం మాత్రమే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌లోని 11/2అ లో 3 ఎకరాలు, 11/3/ఆ 3 గుంటలు, 11/36/అ 3 ఎకరాల 27 గుంటల స్థలం నాగార్జున పేరిట ఉంది. కానీ ఈ కన్వెన్షన్ సెంటర్ దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం అధిగమించింది. ఈ స్థలంలో నాలుగేళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టారు. శనివారం అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం 3 ఎకరాల 12 గుంటల చెరువు స్థలం ఆక్రమణకు గురైనట్టు నిర్దారించారు. అందులో ఒక ఎకరా 12 గుంటల స్థలం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోది కాగా, 2 ఎకరాల స్థలం బఫర్ జోన్‌లోకి వస్తుందని అధికారులు తేల్చి చెప్పారు. ఈ స్థలంలో ఏర్పాటైనందున ఈ ఎన్‌కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం అక్రమమని అధికారులు ధ్రువీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై మార్కింగ్ వేశారు. 

గోప్యంగా ఉంచుతున్న అధికారులు..

శనివారం ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలంలో అధికారుల సర్వే సుదీర్ఘంగానే సాగింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ సర్వే జరుపుతున్న సమయంలో మీడియా ప్రతినిధులెవ్వరినీ ఎన్ కన్వెన్షన్ లోపలికి అనుమతించలేదు. వివరాలేవీ బయటికి పొక్కకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు పాటించారు. శనివారం ఉదయం 9 గంటలకు ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్న అధికారులు 10 గంటలకు లోపలికి వెళ్లగా 3 గంటల సర్వే అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బయటికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించక పోవడం, వివరాలను గోప్యంగా ఉంచడంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. 

మార్కింగ్ కుదింపు ఎందుకు?

ఎన్ కన్వెన్షన్ సంబంధిత స్థలాల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఆక్రమణకు గురైన స్థలాన్ని గుర్తించి వేసిన మార్కింగ్ పలు అనుమానాలకు తావిస్తోంది. మొదట సగానికి పైగా కన్వెన్షన్ సెంటర్ ఆక్రమిత స్థలంలో ఉన్నట్టు మార్కింగ్ వేసిన అధికారులు కాసేపటికే దాన్ని మారుస్తూ సుమారు 20 అడుగుల స్థలాన్ని కుదించి తిరిగి మార్కింగ్ వేశారు. మార్కింగ్‌లో తేడాలు చోటు చేసుకోవడంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మార్కింగ్ కుదింపులో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించినప్పటికీ అధికారులు భిన్నంగా ప్రవర్తిస్తున్నారా? అన్న అనుమానాలకు దారి తీసింది. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గతంలో నిర్మాణదారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందాల కారణంగానే చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. 

సూపరింగ్ పొజిషన్ మ్యాప్‌తో గుర్తిస్తాం: తహసీల్దార్

ఎన్ కన్వెన్షన్ సెంటర్ స్థలాల సర్వే, తదుపరి చర్యల విషయమై శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌రావును టీ మీడియా వివరణ కోరగా సూపరింగ్ పొజిషన్ మ్యాప్ ద్వారా పాయింట్ అవుట్ చేస్తే ఎంత ఆక్రమణకు గురైందీ కచ్చితంగా తెలుస్తుందని అన్నారు. దీనిద్వారా వివరాలను సేకరించి సదరు సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులకు అందజేస్తామని చెప్పారు. దాని ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తమ్మిడి చెరువు మొత్తం విస్తీర్ణం 29 ఎకరాలు ఉంటుందని, ఈ సర్వే ద్వారా చెరువు ఎంత ఆక్రమణకు గురైందో తేలుతుందని స్పష్టం చేశారు. 

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు..

కాగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం భూముల కబ్జాపై వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. గత వారం రోజులుగా గురుకుల్ ట్రస్ట్ భూముల్లో రాజీ లేకుండా అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ వాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్, బాబు ప్రభుత్వాల మాదిరిగా పైపై చర్యలు కాకుండా ఈ వైఖరి ఇలాగే కొనసాగి తెలంగాణ ప్రభుత్వ భూముల్లో సీమాంధ్రుల కబ్జాలను విముక్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి: పాశం యాదగిరి

ఏ నగరానికైనా, పట్టణానికైనా చెరువులు, కుంటలు "కిడ్నీ"ల లాంటివని తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధి పాశం యాదగిరి అన్నారు. ఎన్‌కన్వెన్షన్ సెంటర్ స్థలం సర్వే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో 2 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని అన్నారు. నాగార్జున నిజ స్వరూపం ఎన్ కన్వెన్షన్ ఆక్రమణతో బయట పడిందన్నారు. పిల్లి పిల్లలను, కుక్క పిల్లలను అక్కున చేర్చుకునే వారి కుటుంబం ప్రభుత్వ, శిఖం భూములను కబ్జా చేసి చెరువులో ఉన్న జలచరాలను, సహజ సంపదను నాశనం చేయడం, జలకాలుష్యానికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిని స్వాధీనం చేసుకుని దానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 

నాగార్జునను అరెస్టు చేయాలి: కసిరెడ్డి భాస్కర్ రెడ్డి

చెరువు శిఖం భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న నటుడు నాగార్జునను వెంటనే అరెస్టు చేయాలని జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, గతంలో నాగార్జునపై కోర్టులో ఫిర్యాదు చేసిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్‌కన్వెన్షన్ సెంటర్ నిర్మించారంటూ తమ సంస్థ తరఫున లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఇందుకు స్పందించిన లోకాయుక్త అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, హెచ్‌ఎండీఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ సెక్రటరీ సునీల్ కుమార్ గుప్తా, నార్త్ ట్యాంక్ డివిజన్ ఇరిగేషన్ ఈఈ ఏసుబాబు, వెస్ట్‌జోన్ కమిషనర్ అలీం బాషా, సర్కిల్ 12 డిప్యూటీ కమిషనర్ మనోహర్, శేరిలింగంపల్లి తహసీల్దార్ రాజేశంలకు నోటీసులు కూడా పంపిందని చెప్పారు. చెరువు శిఖం స్థలం ఆక్రమణ అధికారులు తేల్చినందున నాగార్జునపై వాల్టా చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

పైసా పన్ను లేదు.. ఆదాయం కోట్లలో..ప్లేటు భోజనం రూ.2 వేలు

అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉండడంతో నగరంలో ప్రముఖుల ఖరీదైన విందు, వివాహాల వేడుకలకు ఎన్-కన్వెన్షన్‌ను వేదికగా ఎంచుకుంటారు. ఈ ప్రాంగణంలో ఎన్-డైమండ్, ఎన్-బనియాన్ ట్రీ, ఎన్-కన్వెన్షన్ అనే మూడు హాళ్లున్నాయి. డైమండ్‌లో సుమారు 500మంది, బనియన్‌లో 1200-1500మంది, కన్వెన్షన్‌లో 1500-2000మంది కూర్చునే వీలుంది. వీటి అద్దె రూ. లక్షల్లో ఉంది. ఇక ఇక్కడ విందులు చేస్తే ఏ స్టార్ హోటల్‌కూ తగ్గకుండా ఒక్కో ప్లేటుకి కనీసం రెండు వేలనుంచి చార్జ్ వసూలు చేస్తారు.ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ చేసినా కనీసం తక్కువలో తక్కువ రూ. 20 లక్షల బిల్లు అవుతుంది. దీన్నిబట్టి ఈ కన్వెన్షన్ సెంటర్ ఆదాయం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ స్థలం పూర్తిగా గురుకుల్ ట్రస్టు భూమి కావడం వల్ల అమ్మకాలకు అనుమతి లేకపోవడంతో దీని నిర్మాణానికి ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదు. అనుమతులే లేకపోవడంతో ఆక్యుపెన్సీ అనే ప్రశ్నే తలెత్తదు. అనుమతి లేని నిర్మాణం కావడంతో దానిపై ఎటువంటి పన్ను కూడా జీహెచ్‌ఎంసీ వసూలుచేయడంలేదు. అంటే ప్రభుత్వానికి పైసా కట్టక పోయినా అనుమతులు రాక పోయినా అద్దెల రూపంలో మాత్రం కోట్ల ఆదాయం వస్తోంది. విచిత్రంగా ఈ అనుమతి లేని నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ లక్షల ఖర్చుతో రోడ్డు కూడావేసింది.

పత్రాలు లేకుండానే క్రమబద్ధీకరణ యత్నం..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008-09లో దీన్ని నిర్మించారు. నిర్మాణానికి అనుమతి లేదు. భూమికి సరైన ప్రతాలుకూడా లేవు. అయినా క్రమబద్దీకరణకు మాత్రం యత్నించారు. అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 6.69ఎకరాల స్థలాన్ని తమదిగా పేర్కొంటూ అక్రమ భవనాల క్రమబద్ధీకరణ పథకం కింద(బీపీఎస్) దరఖాస్తు చేశారు. అయితే డాక్యుమెంట్లు మాత్రం కేవలం 45సెంట్ల((2175చదరపు గజాలు,అర ఎకరానికన్నా తక్కువ)కు మాత్రమే సమర్పించారు. అసలే ట్రస్టు భూమి కావడం, అదీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉండడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు క్రమబద్దీకరణ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు చట్ట వ్యతిరేకంగా చర్యలు చేపట్టరాదని తీర్పు వెలువరించింది. కన్వెన్షన్ నిర్మాణం పూర్తిగా అక్రమం కావడంతో కోర్టు తీర్పు పరోక్షంగా జీహెచ్‌ఎంసీకి అనుకూలంగానే వచ్చినట్లు చెప్పవచ్చు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి