గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 30, 2015

వాటర్ గ్రిడ్‍లపై వక్రభాష్యాలొద్దు!!!


కుట్రలు పన్నడం చాలా సులభం. కానీ కలలు కనడం, ఆ కలల సాకారానికి అహర్నిశలు కష్టపడటం అందరికీ చేతకాదు. కలలు నిజమవుతాయని నమ్మకం లేని వారు జీవితంలో ఏదీ సాధించలేరు. అందుకే.. కలలు కనాలి. ఆ కలలను నిజం చేసుకునే దిశగా నిరంతర ప్రయ త్నం చేయాలి. అపుడే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతుంటాయి. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కలలు కన్నారు. నిరంతరం కృషి చేశారు. ఫలితం సాధించారు. అలాగే కొత్త ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పట్ల విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం, అందులో అవినీతికి అవకాశముందని నానా విమర్శలు గుప్పిస్తుండటం మీడియాలో చూస్తున్నాం. ఒక మంచి పథకం చేపడుతున్నపుడు దాన్ని ఆహ్వానించాలే తప్ప అడ్డంగా మాట్లాడమే లక్ష్యం కాకూడదు. నిజంగానే దాని అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తెచ్చి నిలయదీయడం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఆ రకంగా పని చేస్తున్నాయా?
మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా నీటి కొరత, ఫ్లోరైడ్ కలుషిత నీరు తప్ప స్వచ్ఛమైన నీరు దొరకదు. పంచాయతీ సంస్థలు లేదా ఇతర సంస్థలు శుద్ధి చేసి తాగునీటిని కొన్ని గ్రామాలలో అందిస్తున్నాయి. వాటిలోనూ శుద్ధి శాతం ఎంత అంటే అదీ అనుమానమే. తాగునీటి స్వచ్ఛత, దాని లభ్యతపైనే ఏ సమాజం ఆరోగ్యమైనా అధారపడి వుంటది. అంతేకాదు దేశంలోనే తెలంగాణ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. అలాంటి ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీటి లభ్యతకు ఎంతటి ప్రాధాన్యముంటదో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని రకా లుగా అవశ్యమైనది కాబట్టే జలహారం (వాటర్‌గ్రిడ్)కు ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఉన్నది.


దేశంలో ప్రభుత్వాలు గుక్కెడు కలుషితం లేని తాగునీరు అందించలేకపోతున్నాయి. ఫలితంగా తాగునీరును కూడా వ్యాపారం చేశాయి. నదులనే అమ్మేసిన ఘటనలు ఈ దేశంలో ఉన్నాయి. తమిళనాడులో 12 ఏళ్ల క్రితం కావేరి ఉపనది భవానీ నదిని ఓ అమెరికా కంపెనీకి (లీజుకు)అమ్మేశారు. ఛత్తీస్‌గఢ్‌లో శివనాథ్ అనే చిన్న నదిని 23 కి.మీ పొడవున ఓ కంపెనీకి అమ్మేశారు. గొప్పగా చెప్పుకునే గుజరాత్‌లోనూ కిమ్ నదిని, కాక్‌పాడ కాలువను 2003లో ఓ కంపెనీకి అమ్మేశారు. దీంతో బహుళజాతి సంస్థలు తాగునీటిని వ్యాపారంచేసి వేల కోట్లు కొల్లగొట్టుకుపోతున్నాయి. కిన్లే లాంటి విదేశీ కంపెనీలు మన నీటిని మనకే అమ్మి ఈ దేశం నుంచి కోట్లాది లాభాలను తరలించుకుపోతున్నాయి. ప్రకృతిలోని పంచభూతాలను కూడా వ్యాపార వస్తువులుగా మన ప్రభుత్వాలే మార్చేస్తున్న ఈ కాలంలో.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో పదివేల గ్రామాలకు వందలాది పట్టణాలకు శుభ్రమైన తాగునీటిని ప్రభుత్వమే అందించడానికి వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టడం గొప్ప సదాశయం. అందుకే ఈ పథకాన్ని కేంద్రం కూడా ప్రశంసించింది. తెలంగాణలో జరుగుతున్న ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుసుకొని అమలు చేయాలని కేంద్రం ఆదేశించడమే ఈ పథకంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. హడ్కో లాంటి ప్రఖ్యాత సంస్థ తెలంగాణలో చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకానికి ముగ్ధురాలై ప్రతిష్టాత్మక అవార్డును కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసింది. అంతేకాదు, హడ్కో సంస్థ పదివేల కోట్ల రూపాయల ఆర్థిక రుణ సాయాన్ని కూడా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రతిపక్షాలకు ఇవేమీ కనిపిస్తున్నట్లు లేదు. ఎంతసేపూ విమర్శించడమే తమ హక్కుగా భావించే ఇలాంటి ప్రతిపక్షాలకు మంచిని మెచ్చుకోవడం ఎన్నటికీ చేతకాదని తమకు తామే చెప్పుకుంటున్నారు.


వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి నదుల నుంచి 42 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్‌కు ఉపయోగిస్తామంటున్నది. ప్రతి వ్యక్తి ఉపయో గానికి 100 లీటర్ల నుంచి 150 లీటర్ల నీరు అందిస్తామంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 సెగ్మెంట్లు ఏర్పాటు చేసి, 19 ఇంటెక్ వెల్స్, 67 ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మిస్తామంటున్నది. మొత్తం పథకంలో ఒక లక్షా 25 వేల కి.మీ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నది. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ పథక నిర్మాణ ప్రణాళికను మన ప్రభుత్వ ఇంజినీర్లే తయారు చేశారు. దాని అంచనాలను కూడా నిపుణులే నిర్ధారించారని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రతిపక్షాలలో కొందరు ఈ పథకాన్ని అనుమానించడమే పనిగా పెట్టుకొన్నారు. రంద్రాన్వేషణతో రాజకీయ ఆరోపణలు సహజమే కావచ్చు, కానీ ఆ పథకం అమలు అంచనాల పట్ల ప్రతిపక్షాలకే సరైన అవగాహన లేకపోతే అవి రాజకీయ ఆరోపణలుగానే మిగులుతాయి తప్ప నిజాలు కాలేవు.


ఒక విపక్షనేత వాటర్ గ్రిడ్ పథకాన్ని పది వేల కోట్లలో పూర్తి చేయవచ్చన్నారు. 38 వేల కోట్ల అంచనాలెందుకన్నారు. నిజంగానే పదివేల కోట్లతోనే పది వేల గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించగలిగితే విపక్షాలు ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే ఏడు వేల కోట్లు కేటాయించారు. ఒక్క జిల్లా తాగు నీటికే ఏడు వేల కోట్లు కేటాయించినపుడు, పది జిల్లా ల తెలంగాణ తాగునీటి పథకానికి ఎంత కేటాయించాలనేది సహజంగా వచ్చే మౌలిక ప్రశ్న. పది జల్లాలకు 70 వేల కోట్లు ఖర్చవుతాయని స్కూలు పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయినా, తెలంగాణ పది జిల్లాల వాటర్ గ్రిడ్ పథకం అంచనాను ఈ ప్రభుత్వం సుమారు 38వేల కోట్లు మాత్రమే వేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారే ఇపుడు వాటర్‌గ్రిడ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. నిజంగానే పది వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయగలిగే పరిజ్ఞానముంటే, తమకు పంపాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది. నిర్మాణాత్మక విమర్శ కన్నా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమివ్వడాన్ని ప్రజలు హర్షించరు.


గత ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకానికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేవి. జలయజ్ఞంలో జరిగింది కూడా అదే. పని జరగకముందే అడ్వాన్సు లు ఇవ్వడం వెనకాల అవినీతి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులిచ్చి కమీషన్లు కాజేసిన ఆరోపణలు గత ఉమ్మడి పాలకులపై లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ఇపుడు వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు అడ్వాన్సులివ్వ బోవడంలేదని ఈ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. దేశంలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వబోమని ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. అవినీతి పట్ల ప్రభుత్వం చాలా మేరకు అప్రమత్తత పాటిస్తున్నదనడానికి అదొక ఉదాహరణ. వాటర్‌గ్రిడ్ టెండర్లు కూడా అంచనా కన్నా తక్కువకు పోయాయని, కొంత ప్రజాధనం ఆదా అయిందని కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పారదర్శకతకు ఏ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినా ప్రజలు హర్షిస్తారు. అలాగే విపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేసినపుడు మాత్రమే ప్రజలు స్వీకరిస్తారు.


తెలంగాణ ఉద్యమానికి - నీటికి బలమైన సంబంధం ఉన్నది. అటు సాగు, ఇటు తాగునీటి కోసం దశాబ్దాల తరబడి తల్లడిల్లిన గోస తెలంగాణోడికి తప్ప బయటి అధిష్టానాల కింద పనిచేసే వారికి అంతగా పట్టదు. అందుకే విపక్షాల విమర్శల్లో రాజకీయ కోణం మాత్రమే ఉంటున్నది. నిజంగానే గత పాలకులకు ఫ్లోరైడ్ తెలంగాణ పట్ల అంత చిత్తశుద్ధే ఉంటే, ఎప్పుడో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అంది ఉండాలి. తెచ్చుకున్న తెలంగాణలో స్వచ్ఛమైన తాగునీరుకు నిక్కచ్చిగా మొదటి ప్రాధాన్యం. తెలంగాణ గ్రామాల ఆరోగ్యం మినరల్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడి ఉన్నది. అయినా ఆ నీళ్లలోనూ ఆరోగ్యానికి ఎక్క డా గ్యారంటీ లేదు. కొన్ని వేల గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా అందుబాటులో లేవు. మొత్తం తెలంగాణ గ్రామాలకు పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటే భగీరథ ప్రయత్నమే జరగాలి. అందుకే వాటర్‌గ్రిడ్ అనే ఒక భగీరథ ప్రయత్నం నిరాటంకంగా పూర్తి కావాలి. దేశంలో స్వచ్ఛమైన తాగునీటిని సాధించుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడాలి. అందుకే ఇదొక మహత్కార్యం. దేశంలో ప్రతి దాన్ని ప్రైవేటు వ్యాపారాలకు వదిలేస్తున్న నేటి కాలం లో ప్రభుత్వమే వాటర్ గ్రిడ్‌లాంటి శాశ్వత మంచినీటి పథకాన్ని చేపట్టడం తెలంగాణకు ఒక వరం. బయటి అధిష్టానాలు కలిగిన పార్టీలే తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉంటే.. తాగునీటిని వ్యాపారానికి వదిలేవారు. తెలంగాణ ఉద్యమానికి- నీటికి ఉన్న సంబం ధం అలాంటిది కాబట్టే ఇవాళ ప్రభుత్వమే వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టింది. సాగు-తాగు నీటిని ప్రజలకు అందుబాటులోకి తేగలిగితే తెలంగాణ అస్థిత్వ పార్టీకి తిరుగుండదనే విషయాన్ని విపక్షాలు కూడా గుర్తిస్తున్నాయి. అందుకే ఆధారాలను గాలికి వదిలేసి వాటర్‌గ్రిడ్ పథకంపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. 


తెలంగాణ రాజకీయాల్లో డైనమిజం చాలా అవసరం. వేగంగా పనిచేయడం, భవిష్యత్తు అవసరాలను గుర్తించడం, దార్శనికతతో పనిచేయడం మరింత అవసరం. ఈ పథకం పట్ల కేసీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, దాని పని వేగం పట్ల పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ అంతకు మించి శ్రద్ధ చూపిస్తున్నారు. ఏ పథకానికైనా రుణాలు లభించాలంటే, పాలకుడికి, అధికారులకు ఆ పథకం పట్ల చిత్తశుద్ధి, దార్శనికత ఉన్నపుడే అలాంటి రుణాలు లభించగలుగుతాయి. హడ్కో సంస్థ ఇవాళ వాటర్‌గ్రిడ్‌కు పదివేల కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధపడిందంటే ఆ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సంబంధిత మంత్రికి ఉన్న కార్యసాధన పట్టుదలే ప్రధాన కారణం. నిబద్ధత ఉన్న కేటీఆర్ లాంటి మంత్రి కలిగి ఉండడం వల్లనే వాటర్‌గ్రిడ్ పథకం దేశంలో ప్రశంసలు అందుకోగలుగుతున్నది.


-kallurisreddy@gmail.com


(నమస్స్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



ఆదివారం, ఏప్రిల్ 26, 2015

చంద్రబాబూ.. ఇక చాలించు!


నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు. నీకు నవ్వు రాకపోతే పక్కవాడిని ఏడిపించు. విజయాలను నీఖాతాలో వేసుకో అపజయాలను అవతలివాడి ఖాతాలో వెయ్యి. నీకు తెలివి లేకపోతే తెలివైనవాళ్లంతా నా శిష్యులేనని ప్రకటించుకో... ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనుచర మీడియా ప్రసంగాలు, ప్రచారాల సారాంశం ఇది. స్వరాష్ట్రంలో ఏడవడానికి ఏమీ లేదు. తెలంగాణను ఉద్ధరిస్తాడట. తెలంగాణ ఇప్పుడు ఇలా మిగులు నిధులతో ఉండడానికి ఆయనే కారణమట. ఇంకా నయం... మహబూబ్‌నగర్ ఇప్పడు ఇలా ఉండడానికి కూడా తానే కారణమని చెప్పలేదు. చెప్పడు. మొదట తన మామ, తర్వాత తానూ దత్తత తీసుకుని మహబూబ్‌నగర్‌కు ఏమి చేశారో ఆయనే కాదు, ఆయనకు చెంచాగిరి చేస్తున్నవారు ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. 
మహబూబ్‌నగర్‌కు కొత్తగా ఒక్క చుక్క నీటిని కూడా తేలేకపోయిన దౌర్భాగ్యపాలన టీడీపీది. కృష్ణానది లోతున ప్రవహిస్తున్నది, మహబూబ్‌నగర్ గడ్డమీద ఉంది. కాబట్టి నీళ్లు ఎలా వస్తాయి అని మంత్రులు ప్రకటించింది చంద్రబాబు పాలనలోనే. శ్రీశైలం రిజర్వాయరుకు ఆ వైపున అన్ని ప్రాజెక్టులనూ వెంటబడి పూర్తి చేసిన చంద్రబాబు, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి మొదలు ఎస్‌ఎల్‌బీసీ వరకు అన్నింటినీ తుంగలో తొక్కారు. ఎంతోపోరాటం చేసి, లోక్‌సభ ఎన్నికకు 485 మంది నామినేషన్లు వేసి నిరసన తెలిపిన తర్వాత కూడా ఎస్‌ఎల్‌బీసీని ముందుకు సాగన్విలేదు. అది పనికి రాని ప్రాజెక్టు అని అదీ నల్లగొండకు వచ్చి ప్రకటించినవాడు చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖను చూసిన ఆంధ్రా పెద్దమనిషే. మాధవరెడ్డి కొట్లాడి, రాజీనామాకు సిద్ధపడి, పట్టుబడితే చివరకు పుట్టంగండి లిఫ్టుపనులు మొదలు పెట్టారు. చంద్రబాబు మెడమీద మాధవరెడ్డి కత్తిపెడితే ఆ ప్రాజెక్టు అమలయింది. ఇటువంటి చరిత్ర కలిగిన మహానుభావులు తెలంగాణను ఉద్ధరించారట. మళ్లీ అవకాశం ఇస్తే ఇంకా చాలా ఉద్ధరిస్తారట. మహబూబ్‌నగర్ రుణం తీర్చుకుంటాడట. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మద్దతుగా చంద్రబాబుతో ప్రకటన చేయించండి...చూద్దాం...! ఉచ్ఛనీచాలు మరిచిన గుంపునొకదానిని వెంటేసుకుని చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణలో అశాంతిని రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్లను జనం కనిపెట్టవలసిన అవసరం ఉంది.
సొంత బలంతో, నాయకత్వ దీక్షాదక్షతలతో, వినూత్నమైన ఆలోచనలతో ఒక ఉద్యమానికి గానీ, ఒక పార్టీకి గానీమార్గదర్శనం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. మహాఅయితే మంచి మేనేజరుగా పనిచేస్తాడు.ఒక కంపెనీ యజమానిలాగా ప్రవర్తిస్తాడు. అందుకే మంచి నాయకులను చూస్తే భయపడతాడు.ఉద్యమాలను చూస్తే ఈసడించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఆయనకుంపటిని రాజేయడంలోని ఆంతర్యం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ఒకఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక ఎత్తుపల్లాలను చూశాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.తెలంగాణ విముక్తి యోధునిగా చరిత్రలో నిలిచిపోయారు. 
ఆంధ్రప్రదేశ్‌తో కలిసే నాటికే తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ మిగులు నిధులను తెలంగాణలో ఖర్చు చేయకుండా ఆంధ్రాకు మళ్లించడం కారణంగానే. స్వయంగా సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య అప్పటి రాష్ట్ర శాసనసభలో తెలంగాణ మిగులు నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ తర్వాత కూడా అంకెల గారడీ పెరిగిందే తప్ప మారలేదు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు నుంచే తెలంగాణ మిగులు రాష్ట్రం. రాజకీయాల్లోకి వచ్చిన రోజుకూడా తెలంగాణ మిగులు రాష్ట్రమే. కానీ ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం అనిపించుకోగలమనే పాడు నమ్మకం చంద్రబాబుకు, ఆయన అనుచర మీడియాకు బాగా బలపడిపోయింది. ఇప్పటికీ అదే మంత్రాన్ని చదువుతున్నారు. కాస్మొపాలిటన్ నగరంగా, ముందునుంచీ పరిశ్రమలకు కేంద్రంగా, కేంద్ర పరిశోధనా సంస్థలకు నిలయంగా హైదరాబాద్‌కు సహజసిద్ధంగా ఉన్న శక్తిని తమ ఖాతాలో చూపించుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లింది. చంద్రబాబయినా, రాజశేఖర్‌రెడ్డి అయినా, మరో మీడియా బాబయినా హైదరాబాద్ వల్ల బాగుపడ్డారు. హైదరాబాద్ చాలా మందికి చాలా ఇచ్చింది. ఆ క్రమంలో అనివార్యంగా హైదరాబాద్‌కూడా ఎదిగింది. ఎవరయినా హైదరాబాద్‌నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందారు తప్ప హైదరాబాద్‌ను తామే ఉద్ధరించామని చెప్పుకోవడం సొంతడబ్బాకొట్టుకోవడమే. హైదరాబాద్ 1930ల దాకా ఢిల్లీ కంటే పెద్ద నగరం. 
ఆనాడే నిజాం నవాబు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు. అప్పుడే అనేక పరిశ్రమలు ఇక్కడ వెలశాయి. అంటే హైదరాబాద్‌కు సహజసిద్ధమైన బలాలు అప్పటి నుంచే ఉన్నాయి. అప్పటికే హైదరాబాద్ ఒక మహానగరంగా ఎదిగింది కాబట్టే, రాజధానికి అవసరమైన అన్ని హంగులు రెడీమేడ్‌గా ఉన్నాయి కాబట్టే ఆరోజు ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర నినాదాన్ని ముందుకు తెచ్చి, తెలంగాణ నాయకులను మాయ చేసి రెండు ప్రాంతాలను కలిపేశారు. నగరం ఆధునీకరణ, విస్తృతి, వయసుతోపాటు పెరిగాయి. అందువల్ల చంద్రబాబు హైదరాబాద్ గురించి అడ్డగోలు క్లెయిములు మానేయడం మంచిది. ఆయన తెలంగాణ గురించి కాన్‌సెంట్రేట్ చేయడం మానేసి ఆంధ్ర రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అమరావతిని మహానగరంగా నిర్మించడం మీద శ్రద్ధపెడితే అక్కడ ఓటేసిన ప్రజలు సంతోషపడతారు. చంద్రబాబు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గురించి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురించి అసలు మాట్లాడకపోతే మంచిది. 
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన విద్రోహాలకు బ్రాండు అంబాసిడర్ చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రం అవతరణకు అడ్డంగా నిలబడిన ముఖ్యుల్లో ఒకడు. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాత ఆయన వేసిన వేషాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకుల్లో ఒకరు. ఆయన, ఆయన పార్టీ నాయకులు ఇవ్వాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతుంటే హంతకులే సంతాపసభలు జరిపినట్టుగా ఉంది. తెలంగాణ గురించి, తెలంగాణ నాయకత్వం గురించి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎంత మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అంత కనువిప్పు. తెలంగాణ పాలిట ఆయనది ఇనుపపాదం. కరువులు, కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు అన్నీ తారాస్థాయికి చేరింది అప్పుడే. తెలంగాణ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మహానాయకుడాయన. శాసనసభలో తెలంగాణ పదం పలకడానికి వీలు లేదని నిషేధించిన పెద్ద మనిషి. తెలంగాణ ఉద్యమం మొదలు కాగానే ఆగమేఘాలపై దేవాదులకు వెళ్లి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో వరంగల్ జిల్లాకు నీళ్లిస్తామని ఆ రోజు చంద్రబాబు ప్రకటించారు. అనుచర మీడియా ఆయనను అపరభగీరథుడే అని కీర్తనలు పాడాయి. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబుకు సొంత తెలివితేటలు ఎప్పుడూ లేవు. సృజనాత్మకత అంతకంటే లేదు. అన్నీ కన్సల్టెన్సీ తెలువులే. 
కాపీ కార్యాచరణలే. ఎదుటివారిని తగ్గించి తాను పెరగాలని చూడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అత్యంత జనాదరణ కలిగిన ఎన్‌టిఆర్‌ను జయించింది ఆ కుట్రలతోనే. లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టి పత్రికల్లో రోజుకో కథ రాయించేవాడు. అంతఃపురంలో ఏవేవో జరుగుతున్నాయన్నట్టుగా పుకార్లు వ్యాపింప చేశారు. తెలుగుదేశం సర్వనాశనం అయిపోతున్నట్టుగా ప్రచారం చేయించాడు. పార్టీలో గ్రూపులను తయారు చేసి, కొందరిని ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా పోగేశాడు. ఎమ్మెల్యేలను పోగేయడంలో కూడా మీడియాను విపరీతంగా వాడుకున్నాడు. లక్ష్మీపార్వతిని ఒక భూతంగా చూపించి ఒక్కొక్కరినీ ఎన్‌టిఆర్ నుంచి దూరం చేశారు. ఎన్‌టిఆర్ నానాటికీ పతనమైపోతున్నట్టుగా, చంద్రబాబు రోజురోజుకు మేరువుగా ఎదుగుతున్నట్టుగా మీడియా కట్టగట్టుకుని చిత్రీకరిస్తూ వచ్చాయి. చివరికి తెలుగుదేశంను కాపాడడానికి చంద్రబాబు ఒక్కరే దిక్కు అన్న పరిస్థితిని తీసుకువచ్చాడు. అలా టీడీపీని చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఒక్క ఎన్నికలోనూ సొంత నాయకత్వ పటిమతో పార్టీని నడిపించింది లేదు గెలిపించింది లేదు. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి, మొన్న నరేంద్ర మోడీ ఆయనకు కలిసొచ్చిన అదృష్టాలు. ఆపద వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త గాలికోసం వెంపర్లాడడం ఆయనకు అలవాటు.
సొంత బలంతో, నాయకత్వ దీక్షాదక్షతలతో, వినూత్నమైన ఆలోచనలతో ఒక ఉద్యమానికి గానీ, ఒక పార్టీకి గానీ మార్గదర్శనం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. మహాఅయితే మంచి మేనేజరుగా పనిచేస్తాడు. ఒక కంపెనీ యజమానిలాగా ప్రవర్తిస్తాడు. అందుకే మంచి నాయకులను చూస్తే భయపడతాడు. ఉద్యమాలను చూస్తే ఈసడించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఆయన కుంపటిని రాజేయడంలోని ఆంతర్యం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక ఎత్తుపల్లాలను చూశాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. తెలంగాణ విముక్తి యోధునిగా చరిత్రలో నిలిచిపోయారు. తన పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. కొత్త ఆలోచనలతో, ఊహకందని వేగంతో ఆయన పనులు చేసుకుపోతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో పరుగులు పెట్టిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రప్రదాతగా తన పేరును శాశ్వతం చేసుకునే దిశగా ఆయన భారీ లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నారు. అంతేగాక రాజకీయ శక్తుల పునరేకీకరణతో టీఆర్‌ఎస్‌ను ఒక బలమైన శక్తిగా నిర్మించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. తెలంగాణ విఫలమవుతుందని, చంద్రశేఖర్‌రావు పాలన సాగించలేరని, కరెంటులేక తెలంగాణ అంధకారమయం అవుతుందని, ఆర్థికంగా అస్తవ్యస్థం అవుతుందని కలలుగన్న వాళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందేమిటా అని వలపోస్తున్నారు. విపరీతమైన అక్కసును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అడ్డగోలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రవ్వంత మనుషులు కొండంత నేతలపై విషం చిమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడలో భాగమే. అయితే కేసీఆర్ ఎన్‌టిఆర్ కాదని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదని చంద్రబాబు, ఆయన పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.
-kattashekar@gmail.com

(
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, ఏప్రిల్ 25, 2015

గోదావరి పొడవునా బరాజ్‌లు, ప్రాజెక్టులు...

-ఇక ఎక్కడి నీళ్లు అక్కడే వాడకం
-వీలున్నచోటల్లా జల విద్యుదుత్పత్తి
-రాష్ర్టానికి ఉపయోగకరంగా ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్
-సీమాంధ్ర అన్యాయానికి తెలంగాణ పరిష్కారం
-మన నీళ్లు మనకే దక్కేలా ప్రాజెక్టులు
-ప్రాజెక్టుగా కాళేశ్వరం-పాములపర్తి
-సాహసోపేత నిర్ణయాలతో కేసీఆర్ సర్కార్
ప్రాజెక్టులు మొదలుపెట్టాలి.. తమవారైన కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొమ్ము చేసుకోవాలి.. కానీ ప్రాజెక్టు పూర్తికాకూడదు.. నీరు పారకూడదు! అదీ సిద్ధాంతం!! తెలంగాణ దాటేలోపు గోదావరికి అడ్డంకులు ఉండకూడదు! అదీ లోగుట్టు! అత్యంత భారీ.. అత్యంత క్లిష్టమైన.. అత్యంత అసాధ్యమైన ప్రాజెక్టుగా తయారైన ప్రాణహిత-చేవెళ్ల మొదలు.. ఏ చిన్నాచితక ప్రాజెక్టు చూసినా నాటి సమైక్య పాలకుల కుట్రలన్నింటికీ ఈ రెండు అంశాలే మెట్లు! ఎప్పుడో పూర్తయిపోయినా.. ఇంకా దిగువ ప్రాంతాలకు కనీస స్థాయిలో నీళ్లందించలేకపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టే సాక్ష్యం! ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి! గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా తెలంగాణ పొలాలు ఎండిపోయాయి! దశాబ్దాలుగా అనుభవించిన ఈ నీటి గోసను తీర్చేందుకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంతం పట్టింది! ఇక గోదావరి నీళ్లు ఎక్కడికక్కడే వినియోగమయ్యేలా సాహసోపేత నిర్ణయాలకు సిద్ధమవుతున్నది! గోదావరి, దాని ఉపనదుల పొడవునా.. వీలున్నచోట ప్రాజెక్టులు.. కాదంటే బరాజ్‌లు! వాటినుంచి సమీప గ్రామాలు.. పట్టణాలకు, అక్కడి పొలాలకు అవసరమైన తాగు.. సాగునీరు! పనిలోపనిగా అదనంగా జల విద్యుత్ ఉత్పత్తి! ఇప్పటికే మన హక్కుగా మిగిలి ఉన్న 487 టీఎంసీల నీటి వినియోగంతోపాటు.. వరద జలాల్లో 500 టీఎంసీల నుంచి వెయ్యి టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం! ఈ సత్సంకల్పం పూర్తయితే.. ఇంక బంగారు తెలంగాణ నిర్మాణానికి అడ్డెవ్వరు? 


godavari610


నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:గోదావరిలో నీళ్లున్నా ఇంతకాలం తెలంగాణ నెత్తిపై శని ఉంది. సమైక్య ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టలేదు. చేపట్టినా వివాదాలలో ఇరికించేందుకు ప్రయత్నించాయి. వివాదాలు లేకపోతే సృష్టించాయి. ప్రాజెక్టులు మొదలు పెట్టాలి కానీ పూర్తి కావద్దు. కాలువలు తవ్వాలి కానీ నీళ్లు పారొద్దు. సమైక్య ప్రభుత్వాల కుట్రలను గుర్తుపట్టిన తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులను పునఃసమీక్షిస్తున్నది. వీలైనంత ఎక్కువ నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సృష్టించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంతంగా పనిచేస్తున్నారు.
గోదావరి నదిపై వీలైనన్ని బరాజ్‌లు నిర్మించి నీటిని లిఫ్టు చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున జలవిద్యుత్ ప్రాజెక్టులు చేపట్టే విషయమూ పరిశీలిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించేవాళ్లు, తొర్రలు వెతికేవాళ్లు కొందరున్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని ఎత్తేస్తున్నారని ఒకరు, ఆదిలాబాద్‌కు అన్యాయం చేస్తున్నారని మరొకరు, కంతానపల్లి ఎలా కడతారని ఇంకొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉన్నవీలేనివీ పోగేసి ఆంధ్రా మీడియాలో కుప్పపోస్తున్నారు. 

ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్


తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలవల్ల ఏదో భారం పెరగబోతున్నదని, ప్రాజెక్టులు ఆచరణ సాధ్యం కావని, ఇంకా ఏవేవో ప్రచారాలు ప్రారంభించారు. ఆంధ్రా మీడియాకు, నాయకత్వానికి కావలసింది తెలంగాణ ప్రాజెక్టులు ముందుపడొద్దు. వాళ్లు తెలంగాణ వారినే కొందరిని కవచంగా పెట్టుకుని ప్రచార యుద్ధాలు సాగిస్తున్నారు. మీరు పాత ఆలోచనలు వదిలేయండి.

ఇప్పుడు మనం స్వరాష్ట్రంలో ఉన్నాం. కొత్తగా ఆలోచించండి. స్వేచ్ఛగా ఆలోచించండి. మన ప్రాంతానికి మనం ఎక్కువగా ఏం చేయగలమో పరిశీలించండి. ఎవరో ఏదో అంటారని మరచిపోండి. ప్రజలకు నీళ్లిస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారు అని ముఖ్యమంత్రి నీటిపారుదల ఇంజినీర్లతో పదేపదే చెప్తున్నారు. ఇటువంటి ఆలోచనలనుంచి పుట్టిందే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సమీక్ష కూడా అందులో భాగమే. దానికంటే మంచి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అన్న ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌కు అధ్యయనం బాధ్యత అప్పగించింది.

ప్రాణహిత-చేవెళ్లపై మహారాష్ట్ర ఆందోళన


ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడినుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లినుంచి మిడ్‌మానేరుకు నీటిని మళ్లించాలన్నది ప్రస్తుత ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల మొత్తం 6140 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అంచనా.

అందులో 5247 ఎకరాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకే బ్యారేజీ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు విషయంలో ఆందోళనలు చేసిన ఫడ్నవీస్ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, తమ ప్రాంతానికి మేలు చేయాలనే సంకల్పంతో, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలో ముంపు తగ్గే అవకాశాన్ని పరిశీలించాని విజ్ఞప్తి చేస్తూ స్వయంగా ఓ వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు అందజేసినట్లు నీటిపారుదలవర్గాలు తెలిపాయి.

మహారాష్ట్రలో ముంపు తగ్గించగలిగితే 160 టీఎంసీలే కాదు, అంతకన్నా ఎక్కువ వినియోగించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఫడ్నవీస్ అన్నట్లు తెలిసింది. ప్రాణహిత బ్యారేజీవద్ద నుంచి 90 రోజుల పాటు నీటిని మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మేడిగడ్డ వద్ద ప్రతిపాదిస్తున్న బ్యారేజీ నుంచి ఆరు మాసాల పాటు నీటిని మళ్లించుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ఏడు జిల్లాల రైతాంగానికి సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు కనుక, ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఏది ఏమైనా వ్యాప్కోస్ సంస్థ అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.

ప్రాణహిత-చేవెళ్ల పూర్తి చేసే ప్రాజెక్టు కాదు


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో చాలా సమస్యలున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంకోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు. పూర్తికాకుండా ఉండడంకోసం రూపొందించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు. 28 ప్యాకేజీలు, 206 కిలోమీటర్ల టన్నెళ్లు, 849 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 22 లిఫ్టులు, 3466 మెగావాట్ల విద్యుత్ అవసరం, 1757 మీటర్ల ఎత్తిపోత.. ఎప్పటికి పూర్తి కావాలి? చేవెళ్లకు ఎప్పుడు నీరందించాలి? చేవెళ్లకు సూటిగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూరాలనుంచి కాకుండా 1055 కిలోమీటర్ల దూరంలోని ప్రాణహితనుంచి నీటిని తీసుకురావాలని ప్రణాళిక రూపొందించడమే పెద్ద కుట్ర. కృష్ణానదిలో తెలంగాణ వాటాను కాజేసే దూరదృష్టితో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నడిపించిన కుతంత్రం. శ్రీశైలంను కబ్జా చేయడంకోసమే ఆయన పోలవరంను హడావిడిగా మొదలుపెట్టారు. కృష్ణా నదిని రాయలసీమకు మళ్లించడం కోసమే ఆయన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టును ప్రారంభించారు.

చివరి భూములకు నీళ్లివ్వలేని ఎస్సారెస్పీ


విచిత్రం ఏమంటే శ్రీరాంసాగర్ నుంచి కరీంనగర్ జిల్లాలోనే చివరి భూములకు నీళ్లు రావడం ఆగిపోయింది. వరంగల్ జిల్లాకు ఎప్పుడో ఒకసారి కాకతీయకాలువ నీళ్లు వస్తాయి. ఎండాకాలమయితే మంచినీటికోసంకూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. వరంగల్ జిల్లా నిండా కాలువలైతే తవ్విపెట్టారు. ఒకటికాదు రెండు కాదు. శ్రీరాంసాగర్ రెండో దశ. రెండు పాయలుగా చీలి ఒకటి సూర్యాపేట సమీపంలోని మోతెదాకా వెళుతుంది. మరో కాలువ మహబూబాబాద్‌దాకా వెళుతుంది.

మరోవైపునుంచి వరద కాలువకూడా చేర్యాల ప్రాంతంలో ప్రవేశించి దేవరుప్పలదాకా వచ్చింది. ఇంకోవైపు దేవాదులకోసం వేసిన పైపులైన్లు. కాలువల మీద కాలువలు. కాలువలమీద పైపులైన్లు. ఒక పద్ధతి లేదు, పాడు లేదు, ప్లాను లేదు. రైతులకు నీళ్లు మాత్రం రావడం లేదు. కాలువలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చెట్లు మొలుస్తున్నాయి. గోదావరి నీటిని ఇక్కడెక్కడా ఇద్దామని ఆలోచన చేయని రాజశేఖర్‌రెడ్డి ప్రాణహితకు ఎందుకు వెళ్లాడో ఎవరికీ ఎందుకు అర్థం కావడం లేదు? పోనీ అదయినా సక్కగా చేశారా? తుమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి పోయకుండానే అక్కడి నుంచి చేవెళ్లదాకా కాలువల తవ్వకం కాంట్రాక్టులు ఇచ్చేశారు. తుమ్మిడిహట్టి బరాజ్‌పై మహారాష్ట్రతో అవగాహనకు రాకుండానే దిగువన వందల కోట్లు ఖర్చుచేశారు.

మొబిలైజేషను అడ్వాన్సులు ఇచ్చేశారు. ఒక వరుసక్రమం, ప్రాధాన్యతాక్రమం ఏదీ లేదు. ఏరోజుకు నీళ్లివ్వాలన్న కాల నిర్ణయ ప్రణాళిక లేదు. గోదావరి నీటితో నిమిత్తం లేకుండా 16.4 లక్షల ఎకరాలను సాగులోకి తేగలమని అప్పటి ప్రభుత్వం నమ్మబలికింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 2,46,704 ఎకరాలను సాగులోకి తేనున్నట్టు రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. మనవాళ్లు కూడా చాలా మంది నిజమే కాబోలు అనుకున్నారు. కానీ అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. వాళ్లకు కావలసింది గోదావరిపై మరో ప్రాజెక్టు ఏదీ లేకుండా చూడడమేనని లోతుగా పరిశీలిస్తే తప్ప తెలియదు.

ఇప్పుడు ఏం చేయబోతున్నారు?


వ్యాప్కోస్ నివేదిక చేసే సూచనల ప్రకారం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో మార్పులు చేస్తే ప్రాజెక్టు కాళేశ్వరానికి దిగువకు మారుతుంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టివద్ద చిన్న ఆనకట్ట నిర్మించి పశ్చిమ ఆదిలాబాద్ జిల్లాలో ముందు నిర్ణయించిన ప్రకారం 56,200 ఎకరాల ఆయకట్టుకు నీరిస్తారు. తుమ్మిడిహట్టి వద్ద నదిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. ఇప్పటివరకు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి లోపు 900 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు, కొంత టన్నెల్ తవ్వారు.

ఇంకా రూ.4500 కోట్ల విలువచేసే పనులు పెండింగులో ఉన్నాయి. ఆ నిధులను కొత్త ప్రాజెక్టుకు మళ్లించవచ్చు. ముంపు వివాదానికి తావివ్వని రీతిలో ఆనకట్టను నిర్మించి, నీటిని మళ్లించి, ఇప్పటికే తవ్విన కాలువల ద్వారా పైన పేర్కొన్న ఆయకట్టుకు నీరందించాలి. ఆనకట్ట నిర్మాణానికి, ఈ ఆయకట్టును సాగులోకి తీసుకురావడానికి 300 నుంచి 400 ఖర్చవుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. అలాగే చేవెళ్లనుకూడా ప్రాణహిత ప్రాజెక్టునుంచి విడదీయాలి. చేవెళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుద్వారా నీరివ్వడం సులువు. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. చేవెళ్ల కృష్ణా పరివాహక ప్రాంతం కూడా అని రిటైర్డు చీఫ్ ఇంజినీరు ఒకరు చెప్పారు.

అంటే ప్రాణహిత, చేవెళ్ల రెండు కూడా ఈ ప్రాజెక్టునుంచి డీలింక్ అయ్యే అవకాశాలున్నాయి అని ఆయన చెప్పారు. ఈ మార్పులు జరిగితే కాళేశ్వరం-పాములపర్తి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోబోతున్నదా లేక మరో రూపం తీసుకుంటుందా అన్నది వ్యాప్కోస్ నివేదికపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన పనులు కూడా వరదల కాలంలో ఉపయోగపడతాయి. మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయరుగా ఉపయోగపడే మిడ్‌మానేరుకు కాళేశ్వరంతోపాటు ఎల్లంపల్లి కూడా అదనపు ఫీడరుగా పనిచేస్తుంది. మిడ్‌మానేరు నుంచి పాములపర్తి దాకా ప్రాజెక్టు రూపు రేఖల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.

కాళేశ్వరం ఎందుకు?


తుమ్మిడిహట్టి వద్ద లభించే ప్రాణహిత నీరే వందకిలోమీటర్లు దిగువన కాళేశ్వరం వద్ద కూడా లభిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులనుంచి వచ్చే అనేక వాగులు తుమ్మిడిహట్టికి దిగువనే ప్రాణహితలో కలుస్తాయి. పెద్దవాగు, రాళ్లవాగుదాకా అరడజనుకు పైగా ఆదిలాబాద్ వాగులు అటు ప్రాణహిత ఒడిని, ఇటు గోదావరి ఒడిని చేరతాయి. కాళేశ్వరం వద్ద నీటి లభ్యత ఎక్కువ. కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద నది సన్నగా మారుతుంది. అక్కడినుంచి కాళేశ్వరందాకా నది వెడల్పుగా ఉంటుంది. అక్కడ నదీగర్భంలోనే వీలైనంత ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు చెప్తున్నారు. ముంపు వివాదానికి ఎక్కువగా ఆస్కారం ఉండదని వారంటున్నారు. అక్కడ ఒక్క చోట లిఫ్టు చేసి టన్నెల్ ద్వారా కరీంనగర్ పట్టణానికి ఎగువన వరద కాలువదాకా తీసుకువస్తే అక్కడ మరో లిఫ్టుద్వారా వరద కాలువలోకి నీటిని మళ్లించవచ్చునని వారు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. రెండే లిఫ్టులతో మిడ్ మానేరు దాకా నీరు తేవచ్చునని ఇంజినీర్లు ప్రాథమిక అంచనాలు వేశారు. నీటిలభ్యత, ఫీజిబులిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

నీటి విలువ


గోదావరిలో ఇప్పటివరకు మనం ఉపయోగించుకోగా ఇంకా మనకు హక్కుగా మిగిలి ఉన్న నికరజలాలు 487 టీఎంసీలు. గోదావరిలో వరద జలాలపై కూడా రాష్ర్టానికి పూర్తి హక్కులున్నాయి. ఇప్పుడు సీడబ్ల్యుసీ అంచనాల ప్రకారం 75 శాతం నీటి లభ్యత ప్రాతిపదికన ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న నీరు గత యాభైయ్యేళ్ల సగటు 1781 టీఎంసీలు. సముద్రంలో కలిసిన జలాలు గత పదిహేనేళ్ల సగటు 2783 టీఎంసీలు. వరద జలాలు ప్రతిఏటా సుమారు మరో 500 నుంచి 1000 టీఎంసీలు ఉపయోగించుకునే హక్కు, అవకాశం మనకు ఉంది.

-ఒక శతకోటి ఘనపుటడుగుల (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్స్-టీఎంసీ) నీరు అంటే
2.80 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు.
-2831.6 కోట్ల లీటర్ల నీరు.
-22,956.84 ఎకరాల్లో ఒక అడుగు మందం నిలుకోగలిగిన నీరు.
-6000 ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి పండించవచ్చు.
-రూ.25కోట్లనుంచి రూ.30కోట్ల విలువచేసే 2,40,000 బస్తాల ధాన్యం పండించవచ్చు.
-10,000 ఎకరాల్లో ఆరుతడి పంటలు పండించవచ్చు.
-15,000-20,000 ఎకరాల్లో బిందుసేద్యం చేయవచ్చు.
-56,63,200 వాటర్ ట్యాంకర్లు (5000 లీటర్లవి) నింపవచ్చు.

వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు


మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించడంతోపాటు దుమ్ముగూడెందాకా వరుసగా బరాజ్ కం రోడ్డు బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రయత్నం చేయాలని ఇంజినీర్లు సూచించారు. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత పన్నెండు కిలోమీటర్లు దిగువన ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కంతానపల్లి, దుమ్ముగూడెంలలో బరాజ్‌లు నిర్మించాలని ఇంజినీర్లు ప్రతిపాదిస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో నీరందండం లేదని, అవసరమైతే ఇక్కడ కూడా ఒక చిన్న బరాజ్‌ను నిర్మించడం కానీ కంతానపల్లి ఎత్తుపెంచి నిర్మించడం కానీ వాంఛనీయమని వారు సూచిస్తున్నారు.

జలవిద్యుత్


తుమ్మిడిహట్టినుంచి కాళేశ్వరం వచ్చేసరికి ప్రాణహిత సుమారు 80 మీటర్లు దిగువకు ప్రవహిస్తుంది. ఇంద్రావతి 70 మీటర్లు దిగువకు ఉధృతితో ప్రవహించి ప్రతాపగిరి వద్ద గోదావరిలో కలుస్తుంది. తుమ్మిడిహట్టినుంచి దుమ్ముగూడెందాకా పెద్ద ఎత్తున జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి. వెయ్యి టీఎంసీల నీటినుంచి సుమారు 50వేల మిలియన్ యూనిట్‌ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది అని విద్యుత్ నిపుణుడు వెంకట్ గాంధీ చెబుతున్నారు. ఇంద్రావతి చాలా వేగంగా ప్రవహించేనది. ప్రాణహిత కూడా ఉధృతి ఎక్కువే. కాళేశ్వరం నుంచి దుమ్ముగూడెం వరకు నదీ ప్రవాహం మంద్రంగా ఉంటుంది. ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో కలసి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. రామగుండంనుంచి భద్రాచలందాకా మంచి జలమార్గాన్ని కూడా నిర్మించవచ్చు అని ఆయన సూచించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!





శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

గలగలా గోదారి... వలవలా తెలగాణ...

godavaribesin
 
తెలంగాణలో పది జిల్లాలుంటే అందులో ఐదు జిల్లాలను తాకుతూ ప్రవహించే గోదావరి.. తెలంగాణ మాగాణాన్ని తడుపకుండానే తరలిపోయిన విషాద గాథ ఇది! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నాలుగు అనకట్టల్లో ఒకటిగా నిలువాల్సిన ఇచ్ఛంపల్లి అతీగతీలేకుండా పోయిన కుట్రలను అన్వేషించే ప్రయత్నమిది! ఎప్పుడో ప్రతిపాదనలు వచ్చిన ఇచ్ఛంపల్లి ఇంకా ఎందుకు కునారిల్లుతున్నదో.. దేవనూరు ఏమైందో.. లోయర్ పెన్‌గంగా చిరునామా ఎక్కడుందో కనిపెట్టే కథనమిది! రాష్ర్టానికి 1495 టీఎంసీల నీటి కేటాయింపులుంటే.. అత్యంత దయనీయంగా కేవలం 168.5 టీఎంసీల నీటినే నిల్వ చేసుకునే రిజర్వాయర్లు ఉండటం వెనుక పన్నాగాలేంటి? ఏటా 2783.6 టీఎంసీలు వృథాగా సముద్రం పాలువుతున్నా.. వాటిని నిలిపి.. పొలాలను తడిపి తెలంగాణను పండించాలన్న ఆలోచనే రాకపోవడం వెనుక నిర్లక్ష్యపూరిత కుట్రలేంటి? ఆంధ్రప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి లేని పొరుగు రాష్ర్టాలతో వివాదాలు తెలంగాణ ప్రాజెక్టులను కట్టేటప్పుడే నాటి పాలకులకు ఎందుకు గుర్తొచ్చాయి? వరద వస్తే తప్ప పనికిరాని దేవాదుల లిఫ్టుతో తెలంగాణ బావుకునేదేంటి? మన ఖర్చుతో.. మన భూములు ముంచి.. మన నుంచి.. మన నీటిని మళ్లించుపోయేందుకు ఉద్దేశించిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ తోక కత్తిరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సవాలక్ష సందేహాలు.. ప్రతి సందేహానికి సమాధానం! తెలంగాణను ఎండబెట్టి.. ముంచి.. ఆంధ్రను పండించాలనే నాటి సమైక్య పాలకుల వివక్షాపూరిత విధానాల కుట్రల సమ్మేళనమిది! మన నేలపై గలగలా పారే గోదారమ్మ.. మనకు కాకుండా పోతే.. ఎండుతున్న నోళ్లు.. బీళ్ల అంతులేని వ్యథ ఇది!! 
 
-నీటి దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం
-గోదావరి తీరాన ఎండిపోయిన చేలు
-రాష్ర్టానికి1495 టీఎంసీల నీటి కేటాయింపులున్నా 
నిల్వ సామర్థ్యం కేవలం 168.5 టీఎంసీలే!
-ఏండ్లుగా కునారిల్లుతున్న పెండింగ్ ప్రాజెక్టులు
-పదుల సంఖ్యలో ఉపనదులు.. ఉధృతమైన వాగులు
-ఒక్క ఆదిలాబాద్ అడవులనుంచే 150 టీఎంసీలు
-సమైక్య రాష్ట్రంలో పట్టని తెలంగాణ నీటి అవసరాలు
-లెక్క సరిచేసేందుకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇది తెలంగాణలో గోదావరి కథ! దక్షిణ గంగ (Ganges of The South)గా ప్రసిద్ధిగాంచిన గోదారమ్మ గలగలాపారుతూ.. తెలంగాణ గొంతులను తడుపకుండానే ముందుకు సాగిపోయింది. దేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవది గోదావరి. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద నది. నాసిక్ వద్ద త్రయంబకేశ్వరం సమీపంలో సహ్యాద్రి పర్వతాల్లో జన్మించిన గోదావరి మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు ప్రయాణించి మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తెలంగాణ గడ్డపై సుమారు 550 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది.


BAYOFBENGAL

ఉత్తర తలాపున ఆదిలాబాద్, దక్షిణ తలాపున నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను ఒరుసుకుని ప్రవహించే గోదావరి తెలంగాణ నేలలపై కరుణ చూపకుండానే తరలిపోయింది. గోదావరి ఐదున్నర దశాబ్దాల సమైక్య నిర్వాకాలకు, నిర్లక్ష్యాలకు మౌనసాక్షి. కృష్ణా నదిలో తెలుగు ప్రజలకు లభించే నీటికంటే రెండు రెట్లు అదనంగా నీరు లభించే గోదావరి బీళ్లు పడిన తెలంగాణ ముఖం చూడకుండానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దేవనూరు రాలేదు. ఇచ్ఛంపల్లి రాలేదు. లోయర్ పెన్‌గంగా కాలేదు. పోచంపాడు హైడ్యాం ప్రణాళికను తుంగలో తొక్కి, సగానికి సగం కుదించి నిర్మించారు. అది కూడా బక్క చిక్కి, నానాటికీ కుంచించుకుపోతున్నది. 

నిజాంసాగర్ ఎండిపోయింది. సమైక్య రాష్ర్టానికి 1495 టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణలో ఈ ఐదున్నర దశాబ్దాల్లో నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 168.5 టీఎంసీలు. మైనర్ ఇరిగేషన్‌కింద మరో 175 టీఎంసీల వినియోగిస్తున్నట్టు గోదావరి ట్రిబ్యునల్ తన తీర్పులోనే గుర్తించింది. మైనర్ ఇరిగేషను కింద చూపించినవన్నీ చెరువులే. సమైక్య ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యం కారనంగా చెరువులు పూడిపోయి తగినంత నీటిని నిలుపుకోలేని పరిస్థితి తలెత్తింది. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారమే గోదావరిలో మొత్తం 854.7 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే హక్కు తెలంగాణకు ఉంది. ఇవికాకుండ వరద జలాలు ఎంతయినా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ర్టానికి ఉంది. 

గోదావరిలో నీటి లభ్యత ఉండేది శ్రీరాంసాగర్ దిగువ భాగంలోనే. ఆదిలాబాద్‌లో ఉపనదులు, వాగులు అనేకం వచ్చి గోదావరిని చేరతాయి. మానేరు పొంగినా చేరేది గోదావరికే. ప్రాణహిత జీవనది. మహారాష్ట్రలోని గడ్చిరోలి అభయారణ్యాలను, ఆదిలాబాద్ సిర్పూర్-చెన్నూరు అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ప్రాణహితలో నీటికి కొదువలేదు. అక్కడ వేరే ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా లేదు.

గోదావరి నిండుకుండ..


ప్రతిపాదిత ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకి పన్నెండు కిలోమీటర్ల ఎగువన గోదావరిలో కలిసే ఇంద్రావతి నది కూడా జీవనదే. దట్టమైన అబూజ్‌మాడ్ కొండలు, ఇంద్రావతి అభయారణ్యం, మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ఈ నదిలో కూడా నీటి లభ్యత ఎక్కువే. ఇంకా దిగువన జంపన్నవాగు, తాలిపేరు కూడా గోదావరి నదికే వన్నెతెస్తాయి. ఇక్కడెక్కడా నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలేదు. పైగా రాష్ర్టానికి కేటాయించిన నీటిని వాడుకోవలసిన వాటా చాలా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికీ గోదావరి నుంచి బంగాళాఖాతంలో కలిసే నీరు సగటున ఏటా 1781 టీఎంసీలు. ఇది గత యాభైయ్యేళ్ల సగటు. 1999 నుంచి గత పదిహేనేండ్ల సగటును పరిశీలిస్తే ఏటా 2783.6 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. నిజానికి 2012-13లో 3013 టీఎంసీలు, 2013-14లో 5069 టీఎంసీలు సముద్రం పాలయినట్టు సీడబ్ల్యూసీ లెక్కలు చెబుతున్నాయి.

మనసంతా ఆంధ్ర పైనే


ఎంత అడ్డగోలు అంటే పైన తెలంగాణకు అత్యంత అవసరమైన ప్రాజెక్టులపై శ్రద్ధ చూపించలేదు, సరికదా దిగువన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్, పోలవరం-ప్రకాశం బరాజ్‌లకు ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం, కాలువలు తవ్వించడం మొదలుపెట్టారు. గోదావరి నదినుంచి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నదికి నీటిని మళ్లించి శ్రీశైలం నదిని మొత్తానికి మొత్తం కాజేయాలన్నది అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కుతంత్రం. వాళ్ల పరిపాలన మాత్రమే హైదరాబాద్ నుంచి, మనుషులు, మనసులు అంతా ఆంధ్రాపైనే. ఇప్పటికే అధికారికంగా 224 టీఎంసీల నీటిని వాడుకుంటున్న గోదావరి డెల్టాకు అండగా పోలవరం వద్ద 194.6 నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఈ ప్రాజెక్టుద్వారా మొత్తం 301 టీఎంసీలను ఉపయోగించుకోవాలని, ఇందులో 80 టీఎంసీలు ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణా నదికి చేర్చాలని, మొత్తం 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది కాకుండా ఇప్పుడు పట్టిసీమ నుంచి గోదావరి నీటిని లిఫ్టు చేయడానికి అదనంగా మరో ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఒడిశాతో ఒప్పందం లేదు. ఛత్తీస్‌గఢ్‌తో చర్చించింది లేదు. తెలంగాణతో అంగీకారం లేదు. కానీ కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్మాణాలు చేపడుతుంది.

వాటానే ఉపయోగించుకోని తెలంగాణ


విషాదం ఏమంటే రెండు నదుల్లో తెలంగాణకు ఇప్పటికి కేటాయించిన వాటా జలాలనే వినియోగించలేదు. రాయలసీమవైపు కృష్ణా నదిపై ఆయన అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు. నీళ్లు మళ్లించుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. సమైక్యపాలకులు తెలంగాణ ప్రాజెక్టుల విషయం వచ్చే సరికి అన్ని అంతర్రాష్ట్ర వివాదాలు గుర్తుకు తెచ్చేవారు. అన్ని ఒప్పందాలు పూర్తయిన ఇచ్చంపల్లికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఒప్పుకోవడం లేదంటారు. ఏ ఒప్పందాలు లేకుండానే ప్రాణహిత-చేవెళ్లను ప్రారంభిస్తారు. ఇదంతా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్రలో భాగమే.కానీ నీటి లభ్యత అధికంగా ఉండే ప్రాణహిత, ఇంద్రావతి నదీ సంగమాలకు దిగువన మరో ప్రాజెక్టు రాకుండా సమైక్య ప్రభుత్వం కుట్ర చేస్తూ వచ్చింది.

గోదావరి నది గలగలాపారుతూ ఆంధ్రలో ప్రవేశించాలన్నది వారి కుతంత్రం. ఇంజినీరింగ్ నిపుణుల సలహాలను పెడచెవినపెట్టి కాళేశ్వరాన్ని వదలి తుమ్మిడిహట్టిని ఎంచుకోవడంలో కూడా ఇదే కుట్ర దాగి ఉంది. 1955లోనే అంగీకారానికి వచ్చిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును పనిగట్టుకుని తొక్కిపెట్టారు. సమైక్యాంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. అవి ఏమంటే 
1.వీలైన మేరకు ప్రాజెక్టులు చేపట్టకుండా చూడడం.
2.ఒక వేళ తప్పనిసరై ప్రాజెక్టులు చేపట్టాల్సివస్తే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేట్టు చూడడం. 
3.ముందే వివాదాలు ఉంటే సంతోషం. లేకుంటే కొత్తగా వివాదాలు తలెత్తే విధంగా చర్యలు తీసుకోవడం.

ప్రాణహిత-చేవెళ్ల విషయంలో కూడా అదే జరిగింది. ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 25 గ్రామాలు మునుగుతాయి. అక్కడ ఒక సంరక్షణ కేంద్రం(శాంక్చువరీ) మునుగుతుంది. అటవీ భూములు మునుగుతాయి. మహారాష్ట్రతో కనీస చర్చలు జరుపలేదు. రెండు రాష్ర్టాల ఉన్నతాధికారులతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఒకసారి ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారు. కానీ బోర్డులు వేయడం కానీ, చర్చలు జరుపడం కానీ, అంగీకారానికి రావడం కానీ జరుగలేదు. పైగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు మొదలు పెట్టారు. ఈ పనులేవీ నీళ్లిచ్చే ఉద్దేశంతో చేసినవి కాదు. వీలైనంత ఎక్కువకాలం కాలయాపన చేయడం. వీలైనంత ధనాన్ని కాజేయడం. ఇది చాలా ఇష్టంగా, శ్రద్ధగా, ఒక పద్ధతి ప్రకారం చేసిన మోసం.

అతీగతీలేని ఇచ్ఛంపల్లి


ఇచ్ఛంపల్లిని అంగీకారం జరిగిన తొలిరోజుల్లోనే నిర్మాణం చేపట్టి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇచ్ఛంపల్లి ఎగువన గోదావరి పొడవున అప్పట్లో ఇన్ని గ్రామాలు లేవు. తెలంగాణ ప్రాజెక్టులు అనుకున్న సమయంలో చేపట్టకపోవడం వల్ల ఈలోపున మహారాష్ట్ర ఎడాపెడా ప్రాజెక్టులు, బరాజ్‌లు నిర్మించుకుని నీటి హక్కులు దక్కించుకుంది. దిగువన ఆంధ్రా ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే హడావిడి జరిగింది. మధ్యలో తెలంగాణ ప్రాజెక్టులే ఇవ్వాళ నీటి హక్కులకోసం, అంతర్రాష్ట వివాదాల పరిష్కారం కోసం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యంత అధికంగా నీటిని నిలువచేసే నాలుగవ డ్యాంగా నిర్మించాలని తలపెట్టారు.

125 మీటర్ల ఎత్తుతో డ్యాంను నిర్మించి 1000 టీఎంసీల నీటిని నిలువ చేయవచ్చునని తొలుత అంచనా వేశారు. ఈజిప్టులోని అశ్వాన్ డ్యాంను 4600 టీఎంసీలు, ఘనాలోని లేక్ ఓల్టా డ్యాంను 4200 టీఎంసీలు, చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంను 1350 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఉదాహరణలున్నాయి. కానీ పెద్ద ఎత్తున అడవులు మునుగుతాయని, బొగ్గు నిక్షేపాలు మునిగిపోతాయని కారణం చూపి ఇక్కడ ఇచ్ఛపల్లి డ్యాం ఎ త్తును 122 మీటర్లకు, ఆ తర్వాత 90 మీటర్లకు తగ్గిం చి నిర్మించాలని సమైక్య ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చివరకు 95 మీటర్ల ఎత్తుతో డ్యాం నిర్మించాలని నిర్ణయించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ సమైక్య ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఛత్తీస్‌గఢ్ మాత్రమే స్పందించాల్సి ఉంది. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.

అనేక నాగరికతలు వర్ధిల్లిన నదీ తీరం. జ్యోతిర్లింగ త్రయంబకేశ్వరుని సన్నిధిన జన్మించి, నాసిక్, కోపర్‌గాం, పైఠాన్, నాందేడ్‌ల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్-ఆదిలాబాద్ సరిహద్దులో కందకుర్తి వద్ద తెలుగునేలను పునీతం చేస్తుంది. కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులు గోదావరి నదితో కలిసి త్రివేణి సంగమంగా ముందుకు సాగుతాయి. తెలుగునేలను పాలించిన శాతవాహనులు పుట్టిందీ, పెరిగింది, రాజధానులను నిర్మించిందీ, సామ్రాజ్యాన్ని విస్తరించిందీ ఈ నది తీరాన్ని అనుకునే. తొలుత ప్రతిష్ఠానపురం(నేటి పైఠాన్), ఆ తర్వాత కోటిలింగాల వర్ధిల్లిందీ ఈ నదీతీరం వెంబడే. మానేరు, ప్రాణహితలు గోదావరిలో లీనమై కాళేశ్వరుడిని అభిషేకం చేసే త్రివేణి సంగమం ఇక్కడే. నాగరికతలు, రాజులు, రాజ్యాలు నదీ జలాలు ఆలంబనగా చేసుకునే తమ పాలన సాగించారు.

దండగమారి టెయిల్‌పాండ్


దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ తెలంగాణకు అత్యంత దండగమారి ప్రాజెక్టు. నాగార్జునసాగర్‌నుంచి ఎడమకాలువ ఖమ్మం జిల్లా చివరి భూములదాకా నీటిని కొనిపోతుంటే, దానికి రివర్సులో దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు దిగువన అడవిదేవులపల్లి సమీపంలో కృష్ణానదిలో నిర్మించి టెయిల్‌పాండ్‌కు నీళ్లు మళ్లించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం సేకరించే భూములు మనవి. దీని నిర్మాణం ఖర్చు మనది. అప్పుమనది. ఈ ప్రాజెక్టుద్వారా ఏకంగా 135 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించాలని రాజశేఖర్‌రెడ్డి ప్లాన్ వేశారు. అంటే భారం తెలంగాణది, నీరు ఆంధ్రకు. అంటే మొత్తం 215 టీఎంసీలు కృష్ణాకు మళ్లించాలన్నది ప్రణాళిక. ఈ నీటిని మళ్లిస్తే రాయలసీమ-తెలంగాణలకు సాగర్, శ్రీశైలంలో 175 టీఎంసీలు అదనంగా నికర జలాలు వస్తాయని ఆయన ఆశ చూపారు. 

సమైక్య పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం



సమైక్య ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే గోదావరిపై ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాయి. పోచంపాడు ప్రాజెక్టువద్ద 330 టీఎంసీల నీటిని నిల్వచేసే హైడ్యాం నిర్మించాలని తొలుత ప్రతిపాదించగా దానిని కుదించి, కుదించి 110 టీఎంసీలకు తగ్గించి నిర్మించారు. ఇసుక మేట వేసి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 90 టీఎంసీలకు, ఇప్పుడు 76టీఎంసీలకు తగ్గిపోయిందని నీటిపారుదల ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పోచంపాడు తర్వాత గోదావరి నదిపై ఇంకే ప్రాజెక్టు రాకుండా చూడాలన్న కుట్రలో భాగంగానే ఇంతకాలం మరో భారీ ప్రాజెక్టు ఏదీ చేపట్టలేదు.

ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక విధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. పరిమిత నీటి నిల్వ సామర్థ్యం కలిగినది. ప్రాణహిత నీరు మొత్తం 70 కిలోమీటర్లకు దిగువన కాళేశ్వరంవద్ద గోదావరి నదికే వచ్చి చేరుతుండగా కావాలని అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి ప్రాజెక్టును పూర్తి చేయకుండా సతాయించడంకోసం తుమ్మిడిహట్టినుంచి నీటిని తరలించాలని ప్రాజెక్టును రూపొందించారు. గోదావరిపై నిర్మిస్తే పోలవరానికి, గోదావరి డెల్టాకు అడ్డం అవుతుందని భావించి ఇటువంటి ఎత్తులు జిత్తులు ఎన్నో సమైక్య ప్రభుత్వాలు చేశాయి. ఎంత విడ్డూరమంటే గోదావరి నదిపై దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. కానీ నదీ ప్రవాహం నుంచి ఎవరూ లిఫ్టు చేయరు. నది నిండుగా ప్రవహించిన రోజులలో అలా లిఫ్టు చేయడం సాధ్యం కావచ్చు. కానీ కనీస మట్టాల్లో ప్రవహించే రోజుల్లో అలా చేయడం సాధ్యం కాదు. నదిపై బరాజ్ నిర్మించి నీటిని నిల్వచేసి, అందులోనుంచి నీటిని లిఫ్టు చేస్తారు. అటువంటి ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. 
 
 
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 
 
 జై తెలంగాణ! జై జై తెలంగాణ!
 
 
 

దత్తపది: జలుబు-దగ్గు-నొప్పి-నలత(అన్యార్థంలో)...రామాయణార్థంలో...నచ్చిన ఛందంలో...

తేది: ఏప్రిల్ 24, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
జలుబు-దగ్గు-నొప్పి-నలత పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన ఉత్పలమాలా వృత్తము:


image of ravana with vibhishana కోసం చిత్ర ఫలితం


(విభీషణుఁడు రావణునకు హితము బోధించి, బోధించి, వినకపోవుటచేఁ జివఱకు నిటుల భాషించిన సందర్భము)

ఉత్పలమాల:
"పూజలు బుగ్గికాఁగఁ బరపూరుషు భార్యఁ జెఱన్ గదింతువే?
నీ జపహోమముల్ దొలఁగె నీ విధిఁ, దగ్గుము, గర్వమేల? నేఁ
డా జనకాత్మజాపతియె యంబుజగర్భుని మాడ్కి నొప్పి, వి
భ్రాజిత దేహియైన లతవంటి యయోనిజఁ గొంచుఁబోయెడిన్!"

-గుండు మధుసూదన్