గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 20, 2014

తెలంగాణతో సీమాంధ్ర సర్కారు..."డేంజర్ గేమ్"!?

-పీపీఏలపై ఆంధ్రా సర్కార్ తొండాట
-కేంద్రం వద్దన్నా బేఖాతర్.. వితండవాదంతో ప్రత్యుత్తరాలు
-ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి మరో లేఖ రాసిన ఏపీజెన్‌కో
-పీపీఏల రద్దు సాధ్యం కాదన్న ఈఆర్సీ
-రద్దుకు నాలుగు డిస్కమ్‌ల ఆమోదం తప్పనిసరి
-ఈఆర్సీకి నేడు ఏపీజెన్‌కో ప్రత్యుత్తరం
-మిగులు విద్యుత్ ఇస్తామని ఏపీ సీఎం ప్రకటన
-ఇప్పటికే భారీ లోటులో ఏపీ
-పైగా రైతులకు 9 గంటల విద్యుత్ వాగ్దానం
-వచ్చే మూడేళ్లదాకా మిగిలే ప్రశ్నేలేదు
-సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్న తెలంగాణ సర్కార్
కేంద్రం ఆదేశాలు పట్టవు. ఈఆర్సీ స్పష్టీకరణలు చెవికెక్కవు. పార్లమెంటు ఆమోదించిన విభజన బిల్లు నిబంధనలు చూపుకు ఆనవు. ఒకటే లక్ష్యం. నవజాత తెలంగాణ శిశువు గొంతు నొక్కేయడం. తమ కళ్లముందే స్వాతంత్య్రం సాధించిన తెలంగాణను విద్యుత్ సంక్షోభంలోకి నెట్టేసి, కసి తీర్చుకోవడం. ఆరు దశాబ్దాలు తెలంగాణ బొగ్గుతో తమ ప్రాంతపు విద్యుత్ అవసరాలు కరువుతీరా తీర్చుకున్న సీమాంధ్ర బాబులు అవసర కాలంలో తెలంగాణకు ప్రకటిస్తున్న కృతజ్ఞత ఇది. కేంద్రంలో సర్కారు తమ జేబులోదేనన్న భరోసా.. ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా! వెరసి తెలంగాణపై ఏపీ సర్కారు క్రూరమైన దాడికి దిగింది. అంతటితో ఆగకుండా విద్యుత్తు మిగిలితే తెలంగాణకు ఇస్తామంటూ పరిహాసాలు చేస్తున్నది. ఇప్పటికే భారీ లోటు ఉన్న రాష్ట్రం.. దానికి తోడు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ వాగ్దానం.. ఆ మాటల్లోని డొల్లతనానికి అద్దం పడుతుంటే... ఇరు రాష్ట్రాల మధ్య ఒక ప్రమాదకరమైన యుద్ధానికి బీజం వేస్తున్నది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే అనడం తెలంగాణ రాష్ట్రానికి తెలుసునన్న విషయం విస్మరిస్తున్నది. 
power


ఆంధ్రా సర్కార్ బరితెగించింది. కేంద్రం ఆదేశాన్ని ధిక్కరించి తెలంగాణ రాష్ట్రంమీద యుద్ధానికే నిర్ణయించింది. విభజన బిల్లులోని అంశాలకు చిల్లు పెడుతూ వితండవాదంతో విద్యుత్ కేటాయింపును అడ్డుకునేందుకు సమాయత్తమవుతోంది. పీపీఏల రద్దు కుదరదని ఈఆర్సీ మొట్టికాయలు వేసినా ఏపీ సర్కార్ పట్టించుకోవడంలేదు. ఏపీజెన్‌కోను అడ్డుపెట్టి ఆడుతున్న ఈ రాజకీయక్రీడతో తెలంగాణకు విద్యుత్ ముప్పు ముంచుకువస్తున్నది. తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేని ఆంధ్రాబాబులు విద్యుత్ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రమాదకరంగా పవర్‌గేమ్ కొనసాగిస్తున్నారు. డిస్కమ్‌ల విద్యుత్‌కోటాలను యథాతథంగా కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలను బేఖాతర్ చేస్తున్నారు. పీపీఏల రద్దు సాధ్యంకాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) గురువారం వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని సైతం పట్టించుకోనవసరం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నది.

బెంగళూరులోని సదరన్ రీజనల్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ)కి, ఢిల్లీలోని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ)కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ-ఏపీజెన్‌కో) గురువారం మరో లేఖను రాసింది. అదేవిధంగా ఏపీఈఆర్సీకి కూడా శుక్రవారం ప్రత్యుత్తరం అందించాలని ఏపీజెన్‌కోను ఆంధ్రాసర్కార్ ఆదేశించింది. దీంతో ఈమొత్తం వివాదం న్యాయపరమైన వివాదాలకు ఆజ్యంపోసే విధంగా తయారవుతున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వివాదాన్ని జటిలం చేస్తున్నారు. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.

పక్కా ప్రణాళిక ప్రకారమే...ఈ కుట్ర
ఆంధ్రా సీఎం ఆదేశాల మేరకు ఏపీ జెన్‌కో ఈఆర్సీ వద్ద పెండింగ్‌లో ఉన్న పీపీఏలను రద్దుచేయాలని కోరింది. అదే సమయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందకుండా మూడు రోజుల ముందే ఏపీ జెన్‌కో హైకోర్టులో కేవీయేట్ దాఖలు చేసింది. అంతే కాకుండా పీపీఏల రద్దు కోరుతూ ఈఆర్సీకి లేఖ ఇచ్చిందే తడవుగా బుధవారం మధ్యాహ్నం అర్ధగంట పాటు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ)కు విద్యుత్‌కోటా అంతరాయాన్ని కలిగించింది. ఏపీజెన్‌కో పీపీఏ రద్దు రాద్దాంతంపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(పోసోకో) ద్వారా అధికారికంగా బుధవారం సాయంత్రం విద్యుత్‌సౌధలోని ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ)కు ఫ్యాక్స్ సమాచారం అందడంతో తెలంగాణకు యథాతథంగా విద్యుత్ పంపిణీ కొనసాగించారు.

ఆంధ్రా సర్కార్ వితండవాదం

ఈఆర్సీని పీపీఏల రద్దు కోరిన ఏపీజెన్‌కో మా రాష్ట్రానికి మా కరెంటు ఇచ్చుకుంటామని పరోక్షంగా పేర్కొంది. బుధవారం బెంగళూరు నుంచి వచ్చిన లేఖకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ) గురువారం ప్రత్యుత్తరం ఇచ్చింది. 2014 మార్చి 28వ తేదీన జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో చేసుకున్న నిర్ణయాలకు(మినిట్స్) కట్టుబడి ఉండాలన్న అంశంపై ఆనాటి(మార్చి 28) సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎవ్వరూ హాజరుకాలేదని తొండి మాటలు సదరు లేఖలో పేర్కొనడం విశేషం. అంతే కాకుండా జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏర్పాటైందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు లోబడి ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కమ్‌లకు నూటికి నూరు శాతం అందించాలని ఆదేశించినట్లు పేర్కొంది. ఏపీ జెన్‌కో పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు మాత్రమే అందిస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఆ లేఖలో స్పష్టంచేయడం గమనార్హం. దాంతో ఏపీజెన్‌కో పరిధిలోని ఎనిమిది పవర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే 4,418 మెగావాట్ల విద్యుత్తు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు డిస్కమ్‌లకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.

పీపీఏల రద్దు సాధ్యం కాదు: ఈఆర్సీ

ఏపీ జెన్‌కో నుంచి వచ్చిన లేఖ ఆధారంగా పీపీఏల రద్దు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఏపీజెన్‌కో చీఫ్ ఇంజనీర్(కమర్షియల్)కు ఈఆర్సీ కార్యదర్శి లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై ఏపీజెన్‌కోతో పాటుగా నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సంతకాలు చేసినందున అందరూ(ఏపీజెన్‌కో, డిస్కమ్‌లు) సమిష్టిగా పీపీఏల రద్దు కోరితే తప్ప పీపీఏల రద్దు సాధ్యంకాదని తేల్చిచెప్పింది.

ఈఆర్సీకి నేడు మరో లేఖ

ఈఆర్సీ నుంచి వచ్చిన లేఖకు ఏపీజెన్‌కో శుక్రవారం ప్రత్యుత్తరం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. గతంలో పీపీఏలపై ఏపీజెన్‌కోతో పాటు నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల తరపున ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీసీపీడీసీఎల్) ప్రతినిధి సంతకం చేశారు. అయితే ప్రస్తుతం(రాష్ట్ర విభజన తదుపరి ఏపీ సెంట్రల్ పవర్ డిస్కమ్ ఉనికిలో లేదనే అంశాన్ని ఆంధ్రాసర్కార్ తెరపైకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి ఏపీ సెంట్రల్ పవర్ డిస్కమ్ పేరు తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్‌గా మార్పుచెందిన విషయం తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకుని సమస్యను పక్కదారి పట్టించేందుకు ఆంధ్రాబాబులు యత్నిస్తున్నారు. వాస్తవానికి గత దశాబ్దకాలంగా ప్రతిఒక్క విద్యుత్ ఒప్పందాలపై నాలుగు డిస్కమ్‌ల తరపున సెంట్రల్ పవర్ డిస్కమ్ ఒప్పందాలపై సంతకం చేయడం రివాజుగా మారింది. మిగతా మూడు డిస్కమ్‌ల కంటె అన్ని విధాలుగా సెంట్రల్ పవర్ డిస్కమ్ పెద్ద సంస్థగా ఉండడంతో దాదాపు అన్ని సందర్భాల్లోనూ సెంట్రల్ పవర్ డిస్కమ్ పెద్దన్న పాత్రను పోషిస్తు వస్తున్నది.

మా ఉత్పత్తి మాకే: ఏపీజెన్‌కో

ఇకపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)కి వెల్లడించకూడదని ఏపీజెన్‌కో నిర్ణయించింది. పీపీఏ రద్దు వివాదం కొనసాగింపుగా ఏపీ పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి ఏపీపరిధిలోని డిస్కమ్‌లకే అందిస్తున్నందున ఏపీజెన్‌కో ప్రాజెక్టులన్నీ ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులుగా పేర్కొంటుంది. దీంతో తలెత్తే సమస్యలపై కేంద్ర విద్యుత్‌రంగ సంస్థలతో వచ్చే సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొనేందుకు వెనుకాడరాదని కూడా యోచిస్తున్నట్లు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి