గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 25, 2014

ఆంధ్రా తాగునీటికై 3.5 టీఎంసీలు చాలు!

-డెల్టాకు తాగునీటికే నీరు.. కేంద్ర జలసంఘం ఆదేశం
-తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభావం
-రోజు 6వేల క్యూసెక్కుల చొప్పున 3.5 టీఎంసీల కేటాయింపు
-నీటి విడుదల సమయంలో తెలంగాణకు విద్యుత్
ప్రతిఏటా తాగునీటి అవసరాల ముసుగులో సాగుకు నీరు మళ్లించుకుంటున్న సీమాంధ్రకు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. సమైక్య సర్కారు కొనసాగినంతకాలం అడిగేవాడు లేక తాగునీరు పేర పంటలు తడుపుకొని తెలంగాణను ఎండపెడుతూ వచ్చిన ఆనవాయితీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంతకాలం గాలిలో దీపంలా ఉన్న తెలంగాణ సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు నడుం బిగించింది. డెల్టాలో తాగునీటి పేరిట గాయి చేసి 10 టీఎంసీలు కావాల్సిందేనన్న ఏపీ వాదనను కేంద్ర జలసంఘం చైర్మన్ ముందు తెలంగాణ సమర్థంగా తిప్పికొట్టింది. ఫలితంగా ఇపుడు 10 టీఎంసీల స్థానంలో 3.5 టీఎంసీల నీటితోనే ఏపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో నదులకు నదులే మళ్లించుకున్న సీమాంధ్రకు తెలంగాణ దిమ్మదిరిగే పాఠం చెప్పింది. ఇక తెలంగాణను విస్మరించి కృష్ణమ్మ బిరబిరా ఆంధ్రకు పరుగులు తీయదన్న సత్యాన్ని బోధపరిచింది.

కృష్ణా డెల్టాలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు కావాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో కేంద్ర జలసంఘం ఏకీభవించలేదు. డెల్టా తాగునీటికి 10 టీఎంసీల నీరు అవసరం లేదని కేంద్ర జలసంఘం చైర్మన్, కృష్ణావాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌కూడా అయిన ఏబీ పాండ్య తేల్చిచెప్పారు. తాగునీటి అవసరాల కోసం వారంపాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 3.5 టీఎంసీల నీటిని వాడుకునేందుకు మాత్రమే అనుమతించారు. అదే సమయంలో ఈ నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసి దానిని తెలంగాణ ప్రాంతానికి వినియోగించాలని అధికారులకు సూచించారు. మొదటి నుంచి సీమాంధ్ర సర్కారు కృష్ణాజలాల విషయంలో తొండి వాదనలకు దిగుతూనే ఉంది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కావాలంటూ రకరకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసి కరువు సీజన్‌లో నారుమళ్ల కోసం నీటిని తీసుకువెళ్లడానికి ప్రయత్నించింది. ఈ ఎత్తుగడలు గమనించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు గవర్నర్‌ను కలుసుకున్నారు.

tmc
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఉన్న వాస్తవ నీటి నిల్వల పరిస్థితిని ఆయనకు వివరించారు. తాగునీరు మినహా భిన్నంగా వెళితే నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని లెక్కలతో సహా వివరించారు. మరోవైపు సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులతో సమావేశమై రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షించారు. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు అనూహ్యంగా పడిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోరిన 10 టీఎంసీల నీటిని ఇవ్వలేమని తెలంగాణ సర్కారు సీమాంధ్రకు తేల్చి చెప్పింది. కానీ 10 టీఎంసీల నీరు కావల్సిందేనని ఏపీ వివాదానికి దిగడంతో జాతీయ జలవనరుల సంఘం ఛైర్మన్ పాండ్య మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చారు. ఉదయం 10గంటలకు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సాగునీటిశాఖ ముఖ్య కార్యదర్శిలతో భేటీ సమావేశమాయ్యరు. తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను ఆయనకు వివరించింది. కృష్ణా డెల్టాలో మంచినీటి అవసరాలను తీర్చడానికి ఒకటి నుంచి రెండు టీఎంసీలు సరిపోతాయని, తాగునీటి పేరుతో సాగుకు నీటిని వాడుకోవాలనే కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని పాండ్య ముందు వ్యక్తం చేశారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. శ్రీశైలంలో కనిష్ఠ స్థాయి అంటే 834అడుగుల నీరు ఉన్నందున నీటి విడుదలకు మార్గదర్శకాలు ఒప్పుకోవని చెప్పారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 517అడుగులకు పడిపోయింది. సాగర్ కనిష్ట నీటి మట్టం 510అడుగులు. ఆ తర్వాత చుక్కనీరు వదలడానికి వీల్లేదు. ఇప్పడు ప్రాజెక్ట్‌లో 7 అడుగులలో కేవలం 13టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. డెల్టాకు తాగునీటికే 10 టీఎంసీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఆధ్వాన్నంగా మారుతుందని వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 2 టీఎంసీల నీరు సరిపోవన్నారు. తాగునీటికే 5 టీఎంసీల నీరు సరిపోతుందని చెప్పారు. డెల్టా ప్రాంతంలో వరినార్లు వేయలేదని ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. ఇరు ప్రభుత్వాల నుంచి సమాచారంను సేకరించిన అనంతరం పాండ్య గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తాగునీటి కోసం రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల పాటు 3.5టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు సరఫరా చేయాలని చెప్పారు. వారం రోజుల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని నీటి మట్టాన్ని పరిశీలించి , అప్పటికీ వర్షాలు పడకపోతే పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

నీటి విడుదలకు ఓకే:

కేంద్ర జలవనరుల సంఘం మంగళవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా డెల్టా పరిధిలోని సీమాంధ్ర ప్రాంతానికి ఆరువేల క్యూసెక్కుల నీటిని ఏడు రోజులపాటు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని షరతు విధించింది. ఈ మేరకు తగిన యంత్రాంగాన్ని కేంద్ర జలవనరుల సంఘం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరింది. ఈ విధానంలో లోటుపాట్లు ఉంటే తరువాతి దశలో నీటి విడుదలపై తాము పునరాలోచించుకోవాల్సి ఉంటుందని కేంద్ర జలసంఘం చైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బీ అరవింద్‌రెడ్డి రాసిన లేఖలో స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు రిజర్వ్ చేసిన నీటిని తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ఎద్దడి ఎదురైనపుడు వినియోగించుకుంటుందని లేఖలో పేర్కొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సి ఉంది:

1. కృష్ణా జలాల పంపకాల గురించి ఆంధ్రుల లెక్క ప్రకారం చూసినా ఆంధ్రకు ఎక్కడా తాగు నీరు కేటాయించలేదు. తాగు నీరు & పారిశ్రామిక జలాలు కేవలం తెలంగాణా ఖాతాలోనే ఉన్నాయి. కృష్ణా డెల్టా కేటాయింపులు కేవలం వ్యవసాయపరమయినవి.

http://www.myteluguroots.com/chapter_19_11.html

2. మానవీయ దృక్పథంతో ఇచ్చిన తాగు నీరు కోసం సరఫరాలో షుమారు 80% తిరిగి వస్తుంది. ఆంటే 3.5 TMC నీళ్ళలో 2.8 ఆంధ్రకు మళ్ళీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని భవిష్యత్తు సరఫరా నుండి తగ్గించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి