గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 22, 2015

అమ్మ! దయామయి! సింహవాహనా!!

తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు

దసరా పండుగ శుభాకాంక్షలు!!




చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! వరదాయి! శుభప్రద! భద్రకాళి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)


నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌ నటుల శీఘ్రమె కాంక్షలఁ దీర్చి, మాకు నీ
యాతన డుల్చి, ప్రీతిఁ గనుమమ్మ! దయామయి! సింహవాహనా! (2)


నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిర నవ రాష్ట్ర మిచ్చితివి దీక్షలు సేసి, తపించి పోవ, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత హేమ రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (3)


ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
త్రుల మానసమ్ములనుఁ జక్క నొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, స్వర్ణ తెలగాణము నీఁగదె సింహవాహనా! (4)


ప్రజలను నిత్య సత్య యుత వర్తన శీ లురఁ జేసి, వారలన్
గుజనులు కాక యుంటకయి కూర్మినిఁ బంచి, మహోత్తమాశయాం
బుజ ఘన శోభి తాత్మ నిడి, ప్రోచి, ప్రశస్త సువృత్తతోన్మహా
యజనముఁ జేయు శక్తి సదయన్నిడు మో శివ! సింహవాహనా! (5)


-:శుభం భూయాత్:-




మంగళవారం, అక్టోబర్ 20, 2015

సద్దుల బతుకమ్మా...సల్లంగ జూడమ్మా...!!!

మిత్రులందఱకు బ్రతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!


(తెలంగాణమునం బడతు లందఱు బ్రతుకమ్మ పండుగ నాఁ డెట్టుల బ్రతుకమ్మ నలంకరించి, పూజింతు రనఁగా...)


సీ.
తంగేడు పూవులఁ  దాంబాలమునఁ గుండ్ర
.....ముగ నందముగఁ బేర్చి,  మురువు సూపు
వివిధమ్ములగు రంగు  లవి గునుగులఁ జేర్చి,
.....మందార, కట్ల, చే  మంతుల నిడి,
బంతిపూవులు పోఁక  బంతిపూవులు వింత
.....సొబగుల నీనఁగాఁ  జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ  బండువు సేయంగ
.....బ్రతుకమ్మ నడుమ గౌ  రమ్మనుంచి,
.
గీ.
ధగధగలతోడి పట్టుపీ  తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు  ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ  గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు  పడతులంత!
.
కం.
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరి చివర  నిక్కపు భక్త్యు
న్నతి నాడి పాడియును స
న్మతి బ్రతుకమ్మను నిమజ్జ  నము సేతురయా!
.
ఆ.వె.
ముత్తయిదువ లపుడు  పూతురు పసుపును
పుస్తెలకును గౌరి  పూజసేసి!
సన్నిహితులు హితులు  సఖులంత కష్టసు
ఖములఁ జెప్పుకొండ్రు  కలిసిన కడ!
.
తే.గీ.
ఇంటినుండియుఁ దెచ్చిన  హితకరమగు
తీపి వస్తువులనుఁ బంచి,  తినియు, మఱల
సద్దులను మూటఁగట్టియు  సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా  యింతులంత!
.
కం.
బ్రతుకమ్మ పర్వదినమున
నతి సంతోషమున దుర్గ  నవ్యానందాల్
సతులందఱ కిడి, వారలఁ
బతులకుఁ బిల్లలకు స్థిరత బ్రతు కిడుఁ గాతన్!
.

--(::శుభం భూయాత్::)--


.

బుధవారం, అక్టోబర్ 14, 2015

ఏపీఎస్‍ఎఫ్‍సీ విభజన ప్రకటనలో... ఆంధ్రా డైరెక్టర్ల కుట్రలు...!



ఏపీఎస్‍ఎఫ్‍సీలో
ఉద్యోగుల విభజనమ్ము
ఆంధ్రాప్రాంతమునకె లాభము
కలిగించేలా ఉన్నది!


తెలగాణకు అన్యాయము
జరుగునట్లు విభజనమ్ము
చేయుదురని  తెలుపుచుండ్రి
తెలంగాణ ఉద్యోగులు!


ఐక్యకార్యాచరణ స
మితి ప్రకటన పూర్తిగాను
అవాస్తవ సహితమనుచు
తెలుపుచుండ్రి ఉద్యోగులు!


బోర్డువారి మీటింగ్‍లో
విజయవాడ, గుంటూర్లలొ
భవనపు నిర్మాణములకు
ఇరవై కోట్లను కేటా
యించుటయే నిజము కాదె?


ఈ పాలక వర్గమందు
బోర్డాఫ్ డైరెక్టరులుగ
తెలగాణులు సమపాళ్ళలొ
లేకుండుట నిజము కాదె?


తెలంగాణ ప్రాతినిధ్య
మే లేకుండగ విభజన
ప్రణాళికల ఆమోదం
పొందుటయే నిజము కాదె?


న్యాయమ్మింతయు లేకయె
అక్రమముగ నిర్ణయములు
ప్రతిపాదనలను చేయుట
మీ యిష్టమ? మీ రాజ్యమ??


చట్టప్రకారమ్ముగాను
తెలంగాణ ఉద్యోగుల
తెలంగాణ వాటాలను
సక్రమముగ విభజనమ్ము
చేయవలెను! చేయవలెను!!


జాయింట్ డైరెక్టర్ టూర్‍లో
ఉండగానె బోర్డ్ మీటింగ్
ఏర్పాటును చేయుటేల?
తప్పుచేయు కొఱకె కదా!!


ఇకనైనా కుటిల బుద్ధి
ప్రదర్శించుటను మానియు
చట్ట ప్రకారమ్ముగాను
వర్తించుడు! వర్తించుడు!!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




మంగళవారం, అక్టోబర్ 13, 2015

భూగర్భ జలశోక నివారణ చర్యలివి...!!!

-వంద మండలాలు.. వెయ్యి గ్రామాల్లో
-మోగుతున్న ప్రమాద ఘంటికలు
-హైదరాబాద్, వరంగల్ నగరాల్లో భయానకంగా భవిష్యత్ చిత్రం
-ఆశరేపుతున్న మిషన్ కాకతీయ
-దారి చూపుతున్న కర్ణాటక మోడల్
-పట్టణజ్యోతిలో భూగర్భజల సిరుల ఎజెండా
నదుల నీటిని సమైక్య పాలకులు యథేచ్ఛగా కొల్లగొట్టుకుపోయారు. నీరులేక.. వేరే దారిలేక భూగర్భ జలాలే తెలంగాణ రైతులకు దిక్కయ్యాయి. అందుకే తెలంగాణలో ఏ పొలంలో చూసినా గొట్టపు బావులే! దశాబ్దాల వాడుక ఫలితంగా దేశంలోనే అత్యంత ప్రమాదకర లోతులకు పడిపోయాయి తెలంగాణ భూగర్భ జలాలు! 115 మండలాల్లోని 1057 గ్రామాలు ఇప్పుడు ప్రమాదపుటంచున నిలబడ్డాయి. మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మహాయజ్ఞంతో గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా కొంత ఆశావహ పరిస్థితులు నెలకొంటున్నాయి.


water


అయితే.. అటు హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో, పట్టణప్రాంతాల్లోనూ అనేక చెరువులు, కుంటలు కబ్జాలకు గురై, పూడుకుపోయి.. మాయం అయిపోవడంతో భవిష్యత్ దృశ్యం భయానకంగా కనిపిస్తున్నది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తున్నది! ఆ క్రమంలోనే కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తున్నది. కర్ణాటకలో నీటి కోసం బోరు వేసుకున్న ప్రతి కుటుంబం.. భూగర్భ జలాలు తిరిగి రీచార్జ్ అయ్యేందుకు వీలుగా వర్షపు నీరు తిరిగి భూమిలోకి వెళ్లిపోయేలా మరో బోరును కూడా ఏర్పాటుచేసుకోవడం తప్పనిసరి. 


ఇటువంటి విధానాన్ని రాష్ట్రంలో అనుసరించడంవల్ల భూగర్భ జలాలు సాధారణ స్థాయిలో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనిని తొలుత హైదరాబాద్‌లో చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితోపాటు ఇటీవలి గ్రామజ్యోతి కార్యక్రమంలో సహజవనరుల పరిరక్షణ కమిటీ తరహాలోనే త్వరలో చేపట్టనున్న పట్టణజ్యోతి కార్యక్రమంలోనూ భూగర్భ జలాల పరిరక్షణను ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా ముందుకు తేనుంది. 


ఇదీ మన వినియోగం


దేశంలో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నది మన రాష్ట్రంలోనే. రాష్ట్రవ్యాప్తంగా 13లక్షల వ్యవసాయ బావులు, 17లక్షల గొట్టపు బావులతో మొత్తం వ్యవసాయ నీటి వినియోగంలో 74శాతం భూగర్భజలాలే కావడం విశేషం. దీంతో ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పెట్టుబడులకు రైతాంగం ఎక్కువ భాగం నీటికే కేటాయించడం, అదీ దశాబ్దాల తరబడి లెక్కకుమించిన బోర్లు వేయడంతో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువమంది పరిమితికిమించి నీటి వనరులు లేకపోవడంవల్ల, వేసిన బోర్లతో పెరిగిన అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంచనావేయడం గమనార్హం. అయితే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నాయని వాటర్‌బోర్డు అంచనాలు స్పష్టం చేశాయి.


line


భూగర్భజలాల లెక్క ఇదీ


రాష్ట్రంలో భూగర్భజలాల వినియోగం దశాబ్దాలకాలం నుంచి పెరిగిపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేకుండా ఆందోళనకర స్థాయికి చేరింది. రాష్ట్రంలో 115 మండలాలు, 1057 గ్రామాల్లో భూగర్భజలాల వినియోగం ప్రమాదపుటంచున ఉందని భూగర్భజల శాఖ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. భూగర్భజల శాఖ పరిభాషలో ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ (అతి వినియోగం) ఉన్న మండలాలు 42ఉన్నాయి. సంక్లిష్ట స్థాయిలో 8మండలాలు, పాక్షిక సంక్లిష్టంలో 65మండలాలు ఉన్నాయి. అతి వినియోగం ఉన్న మండలాలు అత్యధికంగా మెదక్‌లో 14, కరీంనగర్‌లో 12, వరంగల్‌లో 10 ఉన్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా 1057 గ్రామాలను భూగర్భజల శాఖ అతి వినియోగ గ్రామాలుగా పేర్కొంది. ఇందులో అత్యధిక గ్రామాలు మెదక్ జిల్లావి. ఇలాంటి గ్రామాల్లో వాల్టా చట్టం ప్రకారం ఎటువంటి బోర్లు వేయకూడదు. కానీ నిబంధనను తుంగలోకి తొక్కి బోర్‌వెల్ యజమానులు ఇష్టారీతిగా బోర్లు వేస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లా రిగ్ యజమానులకు భూగర్భజల శాఖ ఆ గ్రామాలు, మండలాల స్థితిగతులపై సమాచారం అందిస్తే ఆ జిల్లాల వారు కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి బోర్లు ఇష్టారీతిగా వేస్తున్నారు.


ఫలితమివ్వని పథకాలు


జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను, హెచ్చరికలను, సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల మట్టాన్ని పెంచేందుకు దశాబ్దాలకాలంగా చేపట్టిన పథకాలు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. అడవుల్లో చేపట్టిన చెక్‌డ్యామ్‌లు, వాటర్‌షెడ్ పథకాలు మినహాయించి ఇతర పథకాలు అంతగా ఫలితాలు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశాల్లో భూగర్భజలాలను పెంచడం ఒకటి. అయితే అది పదేండ్లపాటు కొనసాగినా, ఇంకనూ కొనసాగుతున్నా దానివల్ల వచ్చిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కాకుండా ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌లో చేపట్టిన పాంపాండ్స్‌గానీ, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ పథకాలుగానీ, ఆర్‌ఐడీఎఫ్, హరియాలి లాంటి స్కీమ్‌లుగానీ అనేకం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం మారకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.


మిషన్ కాకతీయతో చిగురిస్తున్న ఆశలు


రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకంతో ఉపరితల జలాలతోపాటు భూగర్భజలాలూ పెరుగుతాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10బేసిన్ల (బేసిన్ అంటే 120నుంచి 125చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం)లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పరివాహక ప్రాంతాల్లో శాస్త్రీయ అధ్యయనం చేసి భూగర్భజలశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ జిల్లా రఘునాథ్‌పల్లి బేసిన్‌ను అధ్యయనం చేసింది. రఘునాథ్‌పల్లి బేసిన్ పరిధిలో రెండు మండలాలున్నాయి. రఘునాథ్‌పల్లి మండలంలో 12 గ్రామాలు, నర్మెట్ట మండలంలో మూడు గ్రామాలో 42 చిన్నతరహా చెరువులు ఉన్నాయి. తొలి దశ మిషన్ కాకతీయద్వారా 11 చెరువులను పునరుద్ధరించారు. 


రఘునాథ్‌పల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పెద్ద చెరువులు, బానోజీపేట గ్రామంలో పోచమ్మకుంట, కన్నాయిపల్లిలో కొత్త చెరువు, వెల్ది గ్రామంలో ధర్మారెడ్డి చెరువు, నిడిగొండలో అర్థచెరువు, నర్మెట్ట మండలం మల్లక్కపేట గ్రామంలోని పెద్ద చెరువులను భూగర్భజల శాఖ ప్రభావ (ఇంపాక్ట్) అంచనాల పరిశోధన చేసింది. పరిశీలన సందర్భంగా కేవలం చెరువులను చూడడమేకాకుండా వ్యవసాయ బావులను, గొట్టపు బావులను కూడా పరిశీలించారు. ఈ చెరువులు 40నుంచి 100ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్నవి కావడం విశేషం. 


సాధారణ వర్షపాతం, వాస్తవ వర్షపాతం, మిషన్‌కాకతీయ కన్నా ముందు ఉన్న నీటి మట్టాలు, ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలు, ఆయా చెరువుల్లో తీసిన పూడిక లోతు, విస్తీర్ణం, ఆయకట్టు, ఆయా చెరువుల కింద సాగయ్యే పంటలు, ఆయా చెరువుల నీటి వినియోగం, ఉన్న పశు సంపద తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని భూగర్భజలశాఖ అధ్యయనం చేసింది. భూగర్భజల శాఖకు అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం వర్షపాతం 22శాతం తక్కువగా నమోదైన రఘునాథ్‌పల్లి బేసిన్‌లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వల్ల భూగర్భ నీటి మట్టాలు పెరిగాయని తేలింది. 


రఘునాథ్‌పల్లి మండలంలో సాధారణ వర్షపాతం 330.10మి.మీ కాగా, ఈ సారి కురిసిన వర్షం 255.6 మి.మీ. అదే నర్మెట్ట మండలంలో సాధారణ వర్షపాతం 294.1మి.మీ, కురిసిన వర్షపాతం 230.మి.మీ. అంటే సాధారణ వర్షపాతంకంటే దాదాపు 22శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయినా ఈ రెండు చోట్ల భూగర్భ నీటి మట్టాలు గతంతో పోలిస్తే 0.8మీటర్ల నుంచి 2.35మీటర్లకు పెరిగాయని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ పైలట్ ప్రాజెక్టు తొలిదశ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 9బేసిన్లను సాధ్యమైనంత తొందరగా తులనాత్మక అధ్యయనాలు చేయాలని భూగర్భజలశాఖ భావిస్తున్నది. 


బస్తీల్లో పరేషాన్


గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో భూగర్భజల వినియోగమే కాదు, ఆ జలాల పరిరక్షణ చేపట్టాల్సిన అనివార్యతలున్నాయి. హైదరాబాద్, వరంగల్‌లాంటి మహానగరాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాల్టా ప్రకారం 120 మీటర్ల కంటే అధికలోతు నుంచి నీటిని తోడకూడదు. హాఫ్ హెచ్‌పీ పంపులతోనే నీటిని తోడాలి. అయితే జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో కనీసం 300-500 మీటర్లలోతుకు, కొన్ని ప్రాంతాల్లో 1000 మీటర్ల కంటే లోతునుంచి కూడా నీటిని తోడేస్తున్నారని భూగర్భజలశాఖ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ పరిస్థితి మారేందుకు, తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే పట్టణజ్యోతిలో భూగర్భ జలశాఖ వనరుల పరిరక్షణ ఆవశ్యతను తెలిపే కార్యక్రమంగానీ, కమిటీగానీ చేపడితే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


కర్ణాటక విధానం ఆలోచిస్తున్నాం


భూగర్భ జలాల పరిరక్షణ అనివార్యతల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల, చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జల నీటిమట్టాలు పెరుగుతున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో ప్రతి ఇంటికీ విధిగా రెండు బోర్లు వేసుకోవాలని చట్టం ఉంది. ఒక బోరు ద్వారా నీటిని తోడుకుంటే మరో బోరు భూగర్భ జలాల రీచార్జ్‌కి ఉపయోగించాలి. పడిన ప్రతి వాననీటిబొట్టు భూమిలోకి ఇంకే విధంగా ప్రణాళికల్ని అక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు. 


ఇక్కడా అటువంటి విధానం అమలు చేసేందుకు, ముఖ్యంగా ఇంటింటికీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తీసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజలకు భూగర్భ జలాలపై విస్తృత అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఒక మాస్ క్యాంపెయిన్ తీసుకోవాలి. నీటి పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల చేపట్టిన గ్రామజ్యోతిలో ప్రకృతి వనరుల పరిరక్షణ కమిటీని వేయడం అందులో భాగమే.



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


సోమవారం, అక్టోబర్ 12, 2015

అంతర్రాష్ట్ర వివాదరహితంగా ప్రాజెక్టులు...!!!

-రీడిజైనింగ్‌పై కసరత్తు
-నీటిపారుదల కీలక అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
- వీలున్నంత వరకు మన భూభాగంలోనే ముంపు
-గరిష్ఠస్థాయిలో గోదావరి జలాల వినియోగం
-తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో సంప్రదింపులు
- మేడిగడ్డ వద్దనే భారీ బ్యారేజీకి సంకేతాలు
-తుపాకులగూడెంవద్ద బ్యారేజీతో దేవాదులకు జీవం
గత అనుభవాలు, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించే లక్ష్యం వెరసి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు, ఒప్పందాల పేరుతో సమయం వృథాకాకుండా సాధ్యమైనంత మేరకు తెలంగాణ భూభాగానికే ముంపు పరిమితమయ్యేలా నిర్మాణాలు చేపట్టి, గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించడానికే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల నీటి లభ్యతకు మార్గం సుగమంచేయడం, ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై చర్చించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారని తెలిసింది.



గరిష్ఠంగా గోదావరి వినియోగం


తెలంగాణ ప్రభుత్వం ఆదినుంచి గోదావరి జలాలను గరిష్ఠంగా బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భారీ బ్యారేజీ నిర్మాణానికి చాలాకాలంగా సాంకేతిక కసరత్తు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలానికి తుమ్మిడిహట్టి బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్నది. ఈ మేరకు తుమ్మిడిహట్టి నిర్మాణంపై మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టాల్సిందిగా సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని తెలిసింది. అయితే ఈ విషయంలో సమావేశం అవుదామని కోరుతూ నాగపూర్ సీఈకి లేఖ కూడా రాసినట్టు ప్రాణహిత-చేవెళ్ల సీఈ హరిరాం సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 25న బ్యారేజీ నిర్మాణంపై సమావేశం జరిగే అవకాశముందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 152 మీటర్లతో చర్చలు ప్రారంభించి.. సాధ్యమైనమేరకు అంశాన్ని కొలిక్కి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించినట్లు తెలిసింది.


మేడిగడ్డ వద్ద భారీ బ్యారేజీ


గతంలో అనుకున్నట్లుగా మేడిగడ్డవద్ద భారీ బ్యారేజీ ప్రతిపాదనపై సీఎం చర్చించారు. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ నీటి లభ్యత బాగానే ఉందని ఇప్పటికే వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 160 రోజుల పాటు ఇక్కడ నీటి లభ్యత ఉంటుందని, వరద ప్రవాహం 102 మీటర్ల స్థాయిలో ఉంటే.. వంద మీటర్ల స్థాయి వరకు బ్యారేజీ నిర్మించవచ్చని వ్యాప్కోస్ తన నివేదికలో స్పష్టంచేసింది. ఈ మేరకు వంద మీటర్ల స్థాయిలో భారీ బ్యారేజీ నిర్మాణం మేలనే అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక్కడ కూడా మహారాష్ట్రతో సంబంధం లేకుండా వీలైతే.. 99 మీటర్లవరకు బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ఈ స్థాయిలోనూ పది టీఎంసీల వరకు నీటినిల్వ సామర్థ్యం ఉండనుంది. దీంతో దాదాపుగా దీనివైపే సీఎం మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మేడిగడ్డనుంచి ఎల్లంపల్లివరకు కాలువ అలైన్‌మెంట్‌పై గతంలో కొన్ని క్లిష్టమైన పాయింట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లైడార్ సర్వే నివేదిక ఆధారంగా సదరు అలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. 


ఇచ్చంపల్లిపైనా చర్చ


సమీక్షలో భాగంగా ఇచ్చంపల్లిపై కూడా సీఎం చర్చించారు. వాస్తవంగా ఇక్కడైతే ప్రాణహిత, ఇంద్రావతి రెండు నదులనుంచి నీటి లభ్యత ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు అనగానే ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లనుంది. తద్వారా ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ర్టాల ఒప్పందం (ట్రైపార్టీ) తెరపైకి వస్తుంది. దీంతో ఏ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో తెలియని స్థితి. దీనిద్వారా కాలయాపన జరిగే అవకాశముందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతానికి మేడిగడ్డ వద్ద భారీ బ్యారేజీ ప్రతిపాదనతోనే ముందుకు పోయేలా సూచనలు చేశారని సమాచారం.


తెరపైకి తుపాకులగూడెం


సమీక్షలో దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోయడంపై చర్చించారు. ఏ రూపంలోనైనా దేవాదులకు నీటి లభ్యత ఉంచితేనే ఆ ప్రాజెక్టు మనుగడ సాధిస్తుందనే భావనతో మొదటినుంచి తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్‌పై దృష్టిసారిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కంతనపల్లి ప్రాజెక్టుపై సీఎం చర్చించారు. ఇదికూడా అంతర్రాష్ట్ర అంశంతో ముడిపడి ఉంది. ముంపు పొరుగు రాష్ట్రంలో ఉండనున్నందున ఆ రాష్ట్రంతో సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. అయితే ఇలా కాకుండా కంతానపల్లికి పైకి ఉన్న దేవాదులనుంచి దిగువన సుమారు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండే తుపాకులగూడెంవద్ద బ్యారేజీ నిర్మాణానికి సీఎం మొగ్గు చూపినట్లు తెలిసింది. 


ఇక్కడ దాదాపు 85మీటర్ల మేర బ్యారేజీ నిర్మిస్తే... నదిలోనే (రివర్ పోర్షన్) ముంపు ఉంటుంది. పైగా ఇక్కడ ఇంద్రావతి నీళ్లు ఉండటంతోపాటు ఆవలివైపు కూడా తెలంగాణ భూభాగమే కావడంతో ఇక్కడ అంతర్రాష్ట్ర వివాదం అంశమనేది ఉండదు. దీంతో తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తే దేవాదులకు నీటి లభ్యత ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిసింది. అదేవిధంగా మేడిగడ్డ వందమీటర్ల స్థాయిలో ఉంటే తుపాకులగూడెం 85మీటర్ల స్థాయి.. వెరసి తేడా 15 మీటర్లు మాత్రమే ఉన్నందున మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు లేనపుడు తిరిగి తుపాకులగూడెంనుంచి లిఫ్టుద్వారా నీటిని తరలించే అవకాశమూ ఉంటుందని అనుకున్నట్లు తెలిసింది. అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి వచ్చే కాకతీయకాలువ కూడా సమాంతరంగా ఉంటున్నందున అందులోకి కూడా తరలించే అవకాశం ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు.


వ్యాప్కోస్‌కు దుమ్ముగూడెం సర్వే బాధ్యత


ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల రీడిజైన్‌పైనా చర్చ జరిగింది. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెంద్వారా.. కిన్నెరసాని, రోళ్లపాడు, మార్లపాడు అలా దిగువకు నీటిని తరలించే డిజైన్‌పై సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాప్కోస్ సీఎండీని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇందిరాసాగర్‌ద్వారా నిర్మించిన కాలువలు కొంతమేర ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నా.. మరికొంత వ్యవస్థ తెలంగాణలో ఉంది. దీంతో ఆ వ్యవస్థ వృథాగా ఉండకుండా.. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెంద్వారా ఇందిరాసాగర్‌లోని కాలువలను అనుసంధానించే డిజైన్‌పైనా సర్వే చేయాలని సూచించినట్లు తెలిసింది. 


మరోవైపు ఇప్పటివరకు జరిగిన లైడార్ సర్వే వివరాల్ని సీఎం కేసీఆర్ వ్యాప్కోస్ సీఎండీ శంభు ఆజాద్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఏయే లింకులపై సర్వే చేశారు? భారీ బ్యారేజీలకు సంబంధించి ఎక్కడెక్కడ చేశారు? అనే వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ఈఎన్సీ మురళీధర్‌రావు, ప్రాణహిత-చేవెళ్ల సీఈ హరిరాం, వ్యాప్కోస్ సీఎండీ శంభు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, అక్టోబర్ 10, 2015

ప‌సికూన‌పై క‌త్తి ఎత్తిన‌ కంసులు..

 
రాజధాని పేరిట, ప్రాజెక్టులకోసమని రైతులకు ప్రాణప్రదమయిన వేలాది ఎకరాలను ఆక్రమిస్తున్నారు.రాజధాని నిర్మాణంలో అవినీతి బుసలు కొట్టబోతున్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయినా, కుడి ఎడమ పార్టీలు తెలంగాణలోనే ఎందుకు గగ్గోలు చేస్తున్నయ్. మోదీయుల పాలనలోని మరాట్వాడాలో, విదర్భలో ఎన్ని సంవత్సరాలయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు ఎందుకు? ఎందుకు నోరు విప్పరు?
వ్యాసకర్త: దేవులపల్లి ప్రభాకరరావు 


హమ్ ఆహ్‌భి కర్తేహైఁ తొ/ హొజాతేహైఁ బద్‌నామ్!
వొ ఖతల్ భి కర్తేహైఁ తొ/ చర్చ నహి హోతా!.... 

ఉర్దూ కవీశ్వరుడు గాలిబ్ రాసిన పై వాక్యాలు పదహారు మాసాల కిందట తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం నుంచి పదేపదే జ్ఞాపకం వస్తున్నయ్. మనం ఊపిరి పీల్చినా బద్‌నామ్ అవుతం. వాళ్లు హత్యలు చేసినా చర్చ జరుగదు...ఇది గాలిబ్ వాక్యాల తాత్పర్యం. నాకు ఉర్దూ రాకపోవడం నా దురదృష్టం. నాలుగవ తరగతిలోనే నా తరం వాళ్లకు ఉర్దూ చదువు ఆగిపోయింది. మా అన్నగారు మదన్‌మోహన్ రావు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషలలోఉద్ధండ పండితుడు. ఆయనది ప్రచారం లేని పాండిత్యం. తెలుగులోనికి ఆయన అనువదించిన గాలిబ్ గీతాల సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఆయన మాటలే పాఠాలై ఉర్దూతో లవలేశ పరిచయం ఏర్పడింది. 


ఆయన తెలంగాణ ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని తహతహలాడేవాడు, కలత చెందేవాడు. తెలంగాణ అవతరణ చరిత్రాత్మక, మహత్తర ఘటనను ఆయన చూడలేక పొయిండు. ఆయనతోపాటు కోట్లమంది ఆరాటపడిన, పోరాడిన వారి కృషి ఫలితంగా తెలంగాణ వచ్చింది. అరవై ఏళ్లు పరాయి పాలనలో నలిగిన, అణగిన, ఛిద్రమయిన తెలంగాణ, ఇప్పుడు పదహారు మాసాలు మాత్రమే నిండిన తెలంగాణ(రాష్ట్రం) ముక్కుపచ్చలారని పసికందు. దేవకి బిడ్డ గొంతు నులుమడానికి ఒక్క కంసుడే కత్తి పట్టిండు. పసిబిడ్డ తెలంగాణ గొంతు నులుమడానికి పదిమంది కంసులు తెలంగాణ అవతరణ క్షణం నుంచే పొంచి ఉన్నారు.


బాల భాస్కర తెలంగాణ కిరణం 2014 జూన్ 2 ఉదయం ప్రసరించిందో లేదో, నవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వేసిందో లేదో ఆంధ్ర మీడియా విద్వేష విషం కక్కడం మొదలయింది. బిడ్డ తొట్లె తాళ్లకు సర్పాలు చుట్టుకున్నట్టు ఈ కోటీశ్వరుల మీడియా తెలంగాణపై బుసలు కొట్టింది. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ రానేరాదని అబద్ధాల కట్టుకథలను ప్రచారం చేసి, తెలంగాణ యువతీయువకులకు నిస్పృహ కల్గించి ఆత్మహత్యలకు అమానుష ప్రేరణ కల్గించిన మీడియా ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కసితో, విద్వేషంతో ఈ మీడియా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆత్మహత్యల ప్రచారం ప్రారంభించింది. విద్యుచ్ఛక్తి సరఫరాలేక, వ్యవసాయం దెబ్బతిని తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది అప్పటి ప్రచారం. రుణమాఫీ పూర్తిగా జరుగలేదని తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది ఇప్పటి ప్రచారం. ఆంధ్ర మీడియాలో తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు ఇస్తున్నంత స్థలం, సమయం, ప్రాధాన్యం ఇంకే అంశానికి లభించడం లేదు. 


తెలంగాణ రైతులపై ఆంధ్ర మీడియాకు, ఆంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇక్కడి వాళ్లకు ఎంత ఘాటు ప్రేమ! తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగిపోతే (రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా) అప్పుడు చచ్చేది ఈ ఆంధ్ర మీడియా వాళ్లే! తాము అడ్డుకున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలనా పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అస్థిరత్వం పాలు చేసి, పల్లవిస్తున్న తరుణంలోనె తుంచివేయాలన్నది ఆంధ్ర మీడియా, ఆ మీడియాకు పాలుపోసి పెంచుతున్న పొరుగు పాలకుల, వారి పంచమాంగ దళాల అంతిమ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పడదని విద్యార్థులు, యువతీ యువకుల ఆత్మహత్యలకు కారణమై న ఆంధ్ర మీడియా, పంచమాంగ దళాలు, ట్రోజన్‌హార్స్‌లు, క్విజ్‌లింగ్‌లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదన్న అనుమానాలు కల్గిస్తూ రైతుల ఆత్మహత్యలకు ఆజ్యం పోస్తున్నారు. 


ఆంధ్ర మీడియా కామెర్లపచ్చకళ్లకు తెలంగాణలో, తెలంగాణ ప్రభుత్వంలో మంచి ఏదీ కన్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ సమర్థ నాయకత్వం ధైర్యంగా నిలిచి స్వల్ప సమయంలో కొంత వరకు విద్యుచ్ఛక్తి కొరత సమస్యను పరిష్కరించడంతో తెలంగాణ శత్రువులకు చెమటలు పట్టినయ్. కాకతీయ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  మిషన్ కాకతీయ తెలంగాణ రైతుల జీవితాలలో వినూత్న అధ్యాయాన్ని ప్రారంభించగల, తెలంగాణను సస్యశ్యామలం చేయగల, శత్రు మూకలకు చెంపపెట్టుకాగల అపూర్వ పథకం.


పైత్యం ప్రకోపించిన రాతలతో, తాటికాయంత హెడ్డింగులతో తెలంగాణ రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్న ఆంధ్ర మీడియా తెలంగాణలోని ఆంధ్ర కోటరీ పదిహేను మాసాల కిందటి నుంచి తెలంగాణ ప్రగతికి అడ్డుపడుతున్న నిదర్శనాలు అనేకం. హైదరాబాద్‌లోని కొందరు ఆంధ్రులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి నిర్ణయాన్ని, తీసుకుంటున్న ప్రతిచర్యను హైకోర్టులో (పదిహేను మాసాల నుంచి హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నదెవరో అందరికి తెలుసు) సవాలు చేస్తారు. బెజవాడ లాయర్లు వారి పక్షాన వకాల్తా పుచ్చుకుంటారు. క్షణాలలో స్టే ఆర్డర్లు జారీ అవుతయ్. కోర్టులిచ్చే ప్రతి తీర్పు సవ్యమైనదని చెప్పలేం. బ్యాంకుల జాతీయీకరణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ అచంచల ధైర్యంతో బ్యాంకులను జాతీయం చేయకపోతే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉండేది. ఒకవంక ఆంధ్ర మీడియా, ఆంధ్ర లాబీ వికృత చేష్టలు, మరో వంక అవిభక్త హైకోర్టు! ఒక వంక సానుభూతి ఉన్నట్లు నటిస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. మరోవంక ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నది. 


తెలంగాణ నష్టాలకు, కష్టాలకు కారణమవుతున్నాయి. అరవై ఏళ్లు పరాయి పాలనతో అన్ని రంగాలలో దోపిడికి గురి అయి, ధ్వంసమై కృశించిన తెలంగాణ పునర్నిర్మాణం సులభం కాదు.అది క్లిష్టమయిన కార్యం. పరాయిపాలకులు, స్థానిక మాజీ పాలకులు గద్దెలు దిగారు గాని వాళ్లు వదిలి వెళ్లిన ఘోర సమస్యలు సర్పాలవలె వెంటాడుతున్నాయి. మన రాష్ట్రం ఏర్పడి పదిహేను నెలలైనప్పటికి విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వివక్షత స్పష్టంగా కన్పిస్తున్నది. 


పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలకులు తమకు అన్యాయం జరిగిందని విలపిస్తూ కేంద్రాన్ని వశపరచుకుంటున్నారు. తమది ధనిక రాష్ట్రం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసంతో అన్నందుకు అసూయాగ్రస్తులు హేళన చేస్తున్నారు. మూడు రాష్ర్టాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వనివాళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి క్షణం వరకు అడ్డుకున్న వాళ్లు...రానున్న రోజుల్లో తెలంగాణలో రాజ్యం తమదేనని కలలు గంటున్నారు. ఎవరు ఎన్ని కలలు గన్నా తెలంగాణ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉంటుంది. జాతీయ పార్టీ లేబుల్స్ ఉన్న వారి ఎజెండా వేరు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సత్య సంధులు పాలించడం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడ హత్యలు, ఆత్మహత్యలు, అక్రమాలు,వాగ్దాన భంగాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. అక్కడ అరాచకత్వం ప్రబలుతున్నది. 


లంచగొండితనానికి హద్దు లేదు. రాజధాని పేరిట, ప్రాజెక్టుల కోసమని రైతులకు ప్రాణప్రదమయిన వేలాది ఎకరాలను ఆక్రమిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి బుసలు కొట్టబోతున్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయినా, కుడి ఎడమ పార్టీలు తెలంగాణలోనే ఎందుకు గగ్గోలు చేస్తున్నయ్. మోదీయుల పాలనలోని మరాట్వాడాలో, విదర్భలో ఎన్ని సంవత్సరాలయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు ఎందుకు? ఎందుకు నోరు విప్పరు? మనం ఊపిరి పీల్చినా బద్‌నామ్ అవుతం. వాళ్లు హత్యలు చేసినా చర్చ జరుగదు! అని గాలిబ్ అన్నది ఇటువంటి దుష్టనీతిపరులను చూసేనేమో..!




జై తెలంగాణ! జై జై తెలంగాణ!

బుధవారం, అక్టోబర్ 07, 2015

ఏపీఎస్‌ఎఫ్‌సీలో ఆంధ్రా అధికారుల అజమాయిషీ...!!!

- ఏపీకి కోట్ల రూపాయల ఉమ్మడి నిధుల మళ్లింపు
-వాటాలేదు.. హక్కేలేదంటూ అధికారుల దబాయింపు
రాష్ట్ర విభజన జరిగినా.. కొన్ని సంస్థల్లో ఇంకా ఆంధ్ర పెత్తనం కింద తెలంగాణ నలిగిపోతూనే ఉంది. చట్టం ప్రకారం ఆస్తుల విభజన చేయకుండా ఆంధ్రా అధికారుల ఆధీనంలోనే సంస్థలను కొనసాగిస్తూ.. చివరికి ఆ సంస్థలు తమవేనని, వాటిపై తెలంగాణకు ఎటువంటి హక్కూ లేదనే స్థాయికి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ)గా కొనసాగుతున్న ఆర్థిక సంస్థలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.



ఆంధ్రా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర విభజన జరిగినా తమ సంస్థను మాత్రం విభజించేదిలేదని మొండికేస్తున్నారు. విభజన లేదు.. తెలంగాణకు అసలు వాటాయే లేదంటూ అడ్డంగా వాదిస్తున్నారు. తమకు ఏ విభజన చట్టమూ వర్తించదని, ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. చట్టాలను ధిక్కరించి ఆర్థిక సంస్థలోని కోట్ల రూపాయల ఉమ్మడి నిధులను ఆంధ్రకు మళ్లిస్తున్నారు. తెలంగాణ వాటాగా రావాల్సిన సొమ్ముతో ఆంధ్రలో షోకు చేసుకుంటున్నారు. తాజా ఉమ్మడి నిధుల నుంచి దాదాపు రూ.20 కోట్లు మళ్లించడానికి రంగం సిద్ధం చేశారు.


బుధవారం జరిగే బోర్డు సమావేశంలో ఏకపక్షంగా ఈ నిధుల మంజూరుకు సిద్ధమయ్యారు. ఇదేమిటని తెలంగాణ ఉద్యోగులు, అధికారులు ప్రశ్నిస్తే, మీకు అడిగే హక్కు లేదు.. అసలు తెలంగాణకు వాటాయే లేదు అని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు మంగళవారం సాయంత్రం హడావుడిగా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ మేరకు నిధుల మళ్లింపును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఉమ్మడి నిధులపై ఆంధ్రా అధికారుల కన్ను..


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాదిన్నర కావస్తున్నా ఏపీఎస్‌ఎఫ్‌సీలో మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ అధికారుల అజమాయిషీ నడుస్తున్నది. ఉమ్మడి ఆస్తిపై వారే పెత్తనం చెలాయిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మొత్తం బోర్టు సభ్యులంతా ఆంధ్రవారినే నియమించి తెలంగాణవారికి అప్పటి పాలకులు తీరని అన్యాయం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారులు బలవంతంగా ఒక సభ్యుడిని మాత్రమే బోర్డు డైరెక్టర్‌గా చేర్చుకున్నారు.


ప్రస్తుతం 11మంది సభ్యులున్న కమిటీలో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆస్తుల విభజన చేయకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53ను ధిక్కరిస్తున్నారు. కార్పొరేషన్‌లో ఉమ్మడి ఆస్తులు, నిధులపై కన్నేసి.. రూ.168 కోట్ల నగదు నిల్వలను పంచకుండా ఖజానా తాళంచెవిని తమ వద్దే ఉంచుకున్నారు. నగదును 52:48 నిష్పత్తిలో విభజించాల్సి ఉండగా ఏపీకి 70శాతం, తెలంగాణకు 30శాతం మాత్రమే అని అడ్డంగా వాదిస్తున్నారు. తాజాగా అసలు ఎస్‌ఎఫ్‌సీకి విభజన చట్టమే వర్తించదంటూ ఏపీఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ పీఎస్ అప్పారావు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 


ఉద్యోగుల విభజనలోనూ అన్యాయం..


కార్పొరేషన్‌లో ఇప్పటివరకు ఉద్యోగుల విభజనలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు 120మందిని, ఆంధ్రకు 240మందిని కేటాయించామని అధికారులు రికార్డుల్లో చూపారు. కానీ దాదాపు 30శాతం ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ కోటాలో కలిపారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల విభజనతో మొదలైన పక్షపాత వైఖరి ఆస్తుల పంపకాల వరకు కొనసాగుతున్నదని ఎస్‌ఎఫ్‌సీ తెలంగాణ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఏ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 


ఖజానా తాళంచెవితోపాటు బ్యాలెన్స్ షీట్‌ను కూడా వారి వద్దే పెట్టుకుని నిధులను గోల్‌మాల్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ భూభాగంలో రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలోని 271 ఎకరాల విలువైన భూమి, నానక్‌రామ్‌గూడలోని కార్యాలయం కూడా తమదేనని మొండిగా వాదిస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం షీలాభిడే కమిటీతో ఆస్తులు, అప్పుల విభజన జరగాల్సి ఉండగా దానిని ఆంధ్ర అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిధుల మళ్లింపు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.



జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


ఆదివారం, అక్టోబర్ 04, 2015

వంచకుల విప్లవగీతాలు!!!

 

ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగదీసుకుంటాం అని భ్రమించిన మీడియా, తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి, విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే. 

గద్దర్ వెన్నులో గన్ను దించినవాడికి దీపారాధనలు చేసేవారు, మెరికల్లాంటి మావోయిస్టు యోధులను ఎక్కడో పట్టుకొచ్చి తెలంగాణ గడ్డపై దారుణంగా కాల్చి చంపిన హంతక హస్తాలతో నిత్య కరచాలనం చేసేవారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చీ రాగానే మావోయిస్టులను బలితీసుకున్న ఎన్‌కౌంటర్ స్పెషలిస్టును తన అక్షరాల పల్లకీలో ఒహోం ఒహోం అని ఊరేగిస్తున్నవారు....


ప్రజల పేరుచెప్పి నక్సల్బరీ బిడ్డలను సజీవ దహనం చేసే విద్యను కనిపెట్టినవారు, మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను కనిపెట్టిన రాజ్యానికి నాయకత్వం వహించినవారు, మమతా బెనర్జీ రాకముందు వరకూ కూడా మావోయిస్టులను కాల్చి చంపే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టినవారు....


చర్చల పేరుతో మావోయిస్టుల ఆనుపానులను కనిపెట్టి ఆనక రక్తపుటేరుల్లో ముంచిన మహానేత కరస్పర్శతోనూ, ముగింపు తెలియని ఉద్యమంలో ఉద్వేగంతో ఊగిపోతున్న యువకుల కరస్పర్శతోనూ ఏకకాలంలో పులకించిపోయే వంచక మేధావులు.... అందరూ తెలంగాణ గడ్డమీద ఇప్పుడు ఒకే భాష మాట్లాడుతుండడం, ఒకే బాటన నడుస్తూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది.


మావోయిస్టుల సిద్ధాంతాలు, ఆశయాలు, త్యాగాలు, నిజాయితీ ఎంత గొప్పవయినా కావచ్చు. అటువంటి త్యాగం అందరూ చేయలేరన్నదీ నిజం. సమాజంలో ఎంతో కొంతమందిలో అసంతృప్తి, నిరసన, పోరాటం అనివార్యంగా కొనసాగుతాయన్నదీ నిజం. కానీ వారు అనురిస్తున్న మార్గం తప్పా ఒప్పా అని చెప్పలేని మేధావులు వారిని కీర్తించడమే విషాదకరం. గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం ప్రమాదకరం. నక్సల్బరీలో మొదలయిన వసంతకాల మేఘ గర్జనలు అక్కడ పలుచబడిపోయి శ్రీకాకుళం వచ్చాయి. అక్కడ కూడా ఆధునిక రాజ్య వ్యవస్థ ధాటికి తట్టుకోలేక ఓడిపోయి, బలహీనపడిపోయి, గోదావరి లోయకు పాకాయి. అక్కడా అదే అనుభవం. అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారు. అక్కడ కూడా ముగింపు తెలుస్తూనే ఉంది. మావోయిస్టులు నిర్మించుకున్న దుర్భేద్యత శాశ్వతం కాదు. పల్లెలను విముక్తి చేసి, పట్టణాలను స్వాధీనం చేసుకుని, మొత్తం దేశాన్ని మావోయిస్టు రాజ్యంగా మార్చడం అన్నది ఎంత అమాయకపు ఆలోచనో మనవాళ్లకు ఇంకా ఎందుకు అర్థం కావడంలేదు? 

1949లో చైనా విముక్తికోసం మావో అనుసరించిన రైతాంగ సాయుధ పోరాట పరిస్థితులు నేడున్నాయా? రోడ్డు, రవాణా, కమ్యూనికేషన్, నిఘా... ఏ వ్యవస్థలూ అందుబాటులో లేని ఆ కాలంలో మావో ముందుగా గ్రామీణ ప్రాంతాలను, ఆ తర్వాత పట్టణాలను విముక్తి చేసి చైనాలో విప్లవ విజయం సాధించారు. అదే విధానాన్ని కొనసాగించడం 1950లోనే తెలంగాణలో సాధ్యం కాలేదు. 1970లలోనే సాధ్యం కాలేదు. ఇప్పుడెలా సాధ్యమవుతుందని ఆ యువకులను బలిపీఠంపైకి ఎక్కిస్తున్నారు? గట్టు మీద కూర్చుని గట్టి మాటలు చెప్పడం సులువే. నమ్మి ఆచరించేవారు, బలైపోతున్నవారు మావోయిస్టులు. నమ్మకం లేకపోయినా సానుభూతి చూపేవారు మానవతావాదులు. గతం, వర్తమానం అంతా రక్తంతో తడిసిన చేతులతో కరచాలనం చేసినవాళ్లు, చేస్తున్నవాళ్లు విప్లవం గురించి మాట్లాడటమే వంచన. తప్పును తప్పని చెప్పకపోవడం, అంతిమ ఫలితాలు తెలిసీ వారిని నిప్పుల కుంపటిలోకి తోయడం నేరం. సాయుధ పోరాట పంథా తప్పని చెబితే త్యాగాలు చేసిన వారిని కించపర్చడం కాదు. తప్పని చెప్పినంత మాత్రాన పోరాటం ఆగిపోతుందనీ కాదు. కానీ విచక్షణాపరులు చేయవలసిన పని చేయకపోతే అది ఆ సమాజానికి చేటు చేస్తుంది. చివరికి దుఃఖం, సంతాపాలు మిగులుతాయి.


ఎన్‌కౌంటర్ నిజమో కాదో తెలియదు. పోలీసులు ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారు. చేతికి చిక్కిన వారిని చిత్రవధ చేసి చంపారని మావోయిస్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకటి మాత్రం వాస్తవం ఎన్‌కౌంటర్ చేసిన తీరు, శృతి, విద్యాసాగర్‌ల మృతదేహాలను ఛిద్రం చేసిన తీరు చూస్తే అది కేవలం ఎన్‌కౌంటర్‌లాగా లేదు. ఏదో శత్రుదేశ సైనికులపై దాడి చేసి కసి తీర్చుకున్నట్టనిపించింది. పోలీసులు ఏ యుద్ధ నీతినీ పాటించలేదు. మనిషిని చంపడానికి ఒక్క బుల్లెట్, అయినా వంద బుల్లెట్‌లు అయినా తేడా ఏమీ ఉండదు. కానీ పోలీసులు అణువణువూ ఛిద్రం చేసేంత దౌష్ట్యాన్ని వారి శరీరాలపై చూపించారు. కనీసం మనుషులుగా వ్యవహరించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి ఇటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు పోలీసులు పరిస్థితిని సంయమనంతో ఎదుర్కోవలసింది. శృతి, వివేక్, సాగర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారు. వారిని సజీవంగా పట్టుకుని సమాజం ముందు పెట్టి, తెలంగాణలో ఇటువంటి కార్యకలాపాలను అంగీకరించబోమని చెప్పి ఉండవలసింది. మారడానికి వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మన రాష్ట్రం మనం సాధించుకున్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రాష్ట్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటిదాకా చేసిన త్యాగాలు చాలు. ఇప్పుడు మీరు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్న సందేశాన్ని ఈ సందర్భంగా యువతకు పంపి ఉంటే బాగుండేది. మొదలు పెట్టడమే సంహారంతో మొదలుపెట్టారు. ఎంత బీభత్సంగా చంపితే అంత భయపడతారని పోలీసులు భావిస్తుండవచ్చు. కానీ చరిత్రలో ఎప్పు డూ అలా జరగలేదు. యువకులు మరింత రిపల్సివ్‌గా తిరగబడతారని ఎందుకు అర్థం కావడం లేదు? ఇంత ఆధునిక యుగంలో కూడా ఈ అనాగరిక యుద్ధ నీతి ఎందుకు? మన రాష్ట్రం ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణను కోరుకోవడం నిజమే. అంటే మావోయిస్టుల అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ పోరాటం అవసరం లేని తెలంగాణను కోరుకోవడం. సాయుధ మావోయిస్టులను స్వేచ్ఛగా తిరగనిచ్చే తెలంగాణ కాదు అన్న వాస్తవాన్ని కూడా వారిని సమర్థించేవారు గ్రహించాలి. తెలంగాణ ఇప్పటివరకు అనుభవించిన క్షోభ చాలు. ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు. అత్యంత చైతన్యవంతులైన, క్రియాశీలురైన, సాహసులైన యువకులు, సమాజానికి గొప్పగొప్ప పనులు చేసిపెట్టగల యువకులు వేలాదిమంది ఇలా అడవిదారిలో నేలకొరగడం ఎంతమాత్రం మంచిది కాదు.


తెలంగాణ సాయుధపోరాటాన్ని ప్రారంభించిన రావి నారాయణరెడ్డి, ఈ త్యాగాలు, రక్తపాతం ఇక చాలు. ఇంకా సాయుధ పోరాటం కొనసాగించడానికి తరుణం కాదు అన్న పాపానికి పార్టీ డబ్బులతో పరారయిన రావి నారాయణరెడ్డి అని ఆనాడే పత్రికల్లో రాయించారు కొందరు సాయుధ పోరాట ప్రేమికులు. చైనా మార్గమే మన మార్గమని నమ్మి, విముక్తి ప్రాంతాలను కాపాడుకోవడానికి సాయుధ పోరాటం కొనసాగించాలని జాతీయ కమ్యూనిస్టు పార్టీతో తీర్మానం చేయించి తెలంగాణను బలిపీఠంగా మార్చేశారు అప్పటికి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీపై పెత్తనం చేస్తున్న కొందరు ఆంధ్రా కమ్యూనిస్టు నాయకులు. దళాల్లో సాయుధ పోరాటాన్ని విరమిద్దామని అన్న పాపానికి కొంత మంది కామ్రేడ్లను దారుణంగా కాల్చి చంపారు. దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో ప్రజలు కూడా స్వాతంత్య్రం వచ్చింది ఇంకెందుకు ఈ పోరాటం అన్న భావనతో దళాలకు సహకరించడం మానేశారు. అట్టడుగుస్థాయిలో వచ్చిన మార్పులను గమనించకుండా సాయుధపోరాటం కొనసాగించడం తప్పని రావి నారాయణరెడ్డి పార్టీ పెద్దలకు నివేదించడానికి బొంబాయి వెళ్లారు. ఆంధ్ర నాయకత్వంపై నమ్మకం లేక ఆయన బొంబాయికి వెళ్లారని వేరే చెప్పనవసరం లేదు. అలా వెళ్లినందుకు ఆయనను ఎన్నిరకాల వేధించాలో అన్ని రకాలుగా వేధించింది సాయుధ పోరాటాన్ని వెనుకేసుకొచ్చిన అతివాద ముఠా ఆయనను కేంద్ర కమిటీ నుంచి తొలగించింది. బొంబాయి నుంచి కదలవద్దంది. ఆయన ఖర్చులు ఆయనే భరించుకోవాలని చెప్పింది. ఎవరూ ఆయనను కలవకుండా కట్టడి చేసింది. చివరికి 1951లో ఆయన చెప్పిన మార్గానికే వచ్చి సాయుధ పోరాటాన్ని విరమించింది కమ్యూనిస్టు పార్టీ. రావి నారాయణ రెడ్డి రాష్ర్టానికి చేరే సమయానికి ఆయనపై చేయాల్సిన దుష్ప్రచారమంతా చేసిపెట్టింది సాయుధ పోరాటాన్ని సమర్థించిన గుంపు. పిరికివాడని, పారిపోయాడని, అమ్ముడుపోయాడని, రెనెగేడ్ అనీ.. ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెట్టారాయనకు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. కానీ పార్టీలో చండ్ర రాజేశ్వర్‌రావు వంటి చాలా మంది సీనియర్ నాయకులు తమ తప్పిదాలను గుర్తించి 1952 ఎన్నికల్లో ఆయనకు పార్లమెంటు టికెట్ ఇచ్చారు. అతివాద ముఠా కూడా రావి నారాయణ రెడ్డి ఎలాగూ ఓడిపోతాడని భావించి ఆయన అభ్యర్థిత్వానికి ఎదురు చెప్పలేదు. కానీ ఎన్నికలలో నల్లగొండ ప్రజలు రావి నారాయణ రెడ్డికి మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కంటే అధిక మెజారిటీని కట్టబెట్టి భారత ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. సాయుధ పోరాటం ఇప్పుడు ఇక్కడ సరిపోదని ప్రకటించిన రావి నారాయణరెడ్డిని నల్లగొండ ప్రజలు ఎందుకు గెలిపించినట్టు? అరవై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా తిరిగి ఇదే చర్చ. సాయుధ పోరాటం ఇప్పుడు ఆచరణ సాధ్యమా? కాదని చెప్పే ధైర్యం లేదు.


ఆచరణ సాధ్యం కాని ఆయుధాలు పట్టుకోవడం, కాలుతుందని తెలిసి మంటల్లో దూకడం, అంతిమ ఫలితాలు పదేపదే ఇలాగే ఉంటున్నాయని అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా బలిపీఠంపైకి ఎక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అడవుల్లో పాఠాలు చెప్పుకోవడానికి, గిరిజనులకు వ్యవసాయం, విద్యాబుద్ధులు చెప్పడానికి వెళితే ఎవరూ అభ్యంతర పెట్టరు. దేశంలో నడిమధ్యన నాలుగు జిల్లాల పరిధిలో తుపాకులతో ప్రవేశించి ఇది జనతన రాజ్యమని ప్రకటించి, సరిహద్దులు గీసి, ఇది దాటివస్తే శిక్షలు ఉంటాయని చెప్పిన తర్వాత ఈ చిన్న రాజ్యం చుట్టూ ఉన్న పెద్ద రాజ్యం చూస్తూ ఊరుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? ఒక వర్గం మీడియా, సీపీఎంతో సహా కొన్ని రాజకీయపార్టీలు ఇప్పుడు విప్లవగీతాలు ఆలాపించవచ్చు. కానీ వారి చరిత్రను ఎవరూ తుడిపేయలేరు. మేము ప్రభుత్వాలను శాసిస్తాం. నడిపిస్తాం. కాళ్లదగ్గరకు తెచ్చుకుంటాం. ఎవరినయినా లొంగ దీసుకుంటాం అని భ్రమించిన మీడియా తెలంగాణలో అది సాగకపోయే సరికి భంగపడి విచ్చలవిడిగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది. అందుకు ఏ సందర్భం దొరికినా అది వదలడం లేదు. మావోయిస్టులపై వారి విపరీత ప్రేమ కూడా అందులో భాగమే. ఆ మీడియా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వంద అబద్ధాలను చెబుతుంది. 


లేని పెద్దరికాన్ని మీద వేసుకుని, తెలంగాణకోసం తామేదో పొడిచామని చెప్పుకోడానికి అబద్ధాలను కుమ్మరిస్తున్నది. మీడియా అధిపతులు పైరవీలు చేస్తే గద్దర్ వంటి వారు అంగీకరించి దీక్ష విరమించాల్సిందిగా కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని ఎవరయినా నమ్మితే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. సీపీఎంది కూడా ఈ మీడియాధిపతి లక్షణమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఏకైక పార్టీగా ఆ పార్టీ గత కొన్నేళ్లలో చాలా పేరు మూటగట్టుకుంది. మావోయిస్టులను ఊచకోత కోసిన పార్టీగా కూడా వారికి ఘనమైన చరిత్రే ఉంది. ఇప్పుడు అవన్నీ మరిపించడానికి మావోయిస్టులను మించిన మావోయిస్టు పార్టీగా ఆ పార్టీ ప్రవర్తిస్తున్నది. చెదిరిపోయిన శ్రేణులను పోగేసుకోవడానికి, మసకబారిన ప్రతిష్టను పునరుద్ధరించుకోవడానికి ఆ పార్టీ ఎవరో ఉసిగొల్పిన పందెంకోడిలాగా కాలు దువ్వుతున్నది. అయితే ప్రజలకు ఇవన్నీ అర్థం కాకుండా పోవు. వీరంతా తెలంగాణను విఫలం చేయడానికి పాటుపడుతున్నారా సఫలం చేయడానికి తోడ్పడుతున్నారా అన్నది జనానికి మెల్లగానయినా తెలిసి వస్తుంది. ఒక మౌనం నియంతృత్వానికి దారితీస్తుందని కొందరు బాధపడిపోతున్నారు. నిజమే మాట్లాడితే విద్రోహుల ముద్ర పడిపోతుందేమోనని చాలా మంది మౌనం వహిస్తుండవచ్చు. మాట్లాడకపోతే భావజాల నియంతృత్వం రాజ్యం చేస్తుందన్నదీ నిజం.

వ్యాసకర్త:
కట్టా శేఖర్ రెడ్డి

kattashekar@gmail.com


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!