గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 26, 2014

ఇంకా అదే వంకర బుద్ధి బయటపెట్టుకుంటున్నారు!

-సీజీఎస్ కోటాలపై ఆంధ్రా సర్కారు మరో కిరికిరి
-జీవో నంబర్ 20లో తప్పులున్నాయనే వితండ వాదన
-హైదరాబాద్ విద్యుత్ వినియోగంపై వివాదం
-అదీ సీమాంధ్రులవల్లనే అనే వాస్తవం విస్మరణ
-టీ మీడియాకు చిక్కిన ఆంధ్రా సర్కార్ లేఖ
దోపిడీకి అలవాటుపడ్డ ఆంధ్రా బాబుల బుద్ధి మారడంలేదు. తెలంగాణ తప్పదనుకున్నప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా మార్చాలని నానా యాగి చేసిన సీమాంధ్రులు నేడు హైదరాబాద్ విద్యుత్ వినియోగాన్ని సైతం వివాదాస్పదం చేయాలనుకుంటున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై వివాదాన్ని లేవనెత్తి తెలంగాణపై విషం కక్కిన ఆంధ్రా సర్కారు కొత్తగా మరో కిరికిరి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) విద్యుత్ ఉత్పత్తి విభజనలో తెలంగాణకు ఎక్కువ వాటా ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని ఇంకో కయ్యానికి దిగింది. సెంట్రల్ జనరేషన్ స్టేషన్ల నుంచి ఇరు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కొత్త కేటాయింపులు జరపాలంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి రాసిన ఆ లేఖ (నంబర్ 1895) టీ మీడియా చేతికి చిక్కింది. కేంద్రం సీజీఎస్ విద్యుత్‌ను తెలంగాణకు 53.80 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.20 శాతం చొప్పున కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 షెడ్యూల్ 12లోని నిబంధన (సీ-6) ప్రకారం సీజీఎస్ విద్యుత్ కేటాయింపులు జరిపిన తీరును ఆంధ్రా సర్కార్ తప్పుబట్టింది. సమైక్యరాష్ట్రంలో కరెంటు కోతలు (లోడ్ రిలీఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఒకేరీతిలో అమలు చేయలేదని, సీమాంధ్రలో విద్యుత్ కోతలు విధించి మరీ హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలకు కోతలు లేకుండా కరెంటు వినియోగం (సరఫరా) జరిగిందనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం అందులో ప్రస్తావించడం గమనార్హం. నాటి అంచనాల ఆధారంగా ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ విద్యుత్ వినియోగం గణనీయంగా నమోదైందని, దాంతో తెలంగాణకు సీజీఎస్ కోటా ఎక్కువగా నిర్దేశించారని, ఇది సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది.

వాస్తవానికి కేంద్ర కేటాయింపులకు సహేతుక ఆధారాలున్నాయి. జిల్లాలు, ప్రాంతాల (ఆంధ్రా, తెలంగాణ)వారీగా ఐదు సంవత్సరాల విద్యుత్ వినియోగం ఆధారంగా సీజీఎస్ విద్యుత్ కేటాయింపులను నిర్దేశిస్తూ విభజనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 20) జారీచేసింది. దాని ఆధారంగా కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మే 30వ తేదీన కేటాయింపులు జరిపింది. అయితే ఈ నిర్ణయం సమంజసంకాదని, దానివల్ల విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రా సర్కార్ ఆ లేఖలో అభిప్రాయపడింది. 2008-09 సంవత్సరం నుంచి 2012-13 వరకు ఐదేండ్లపాటు డిస్కమ్‌లవారీగా జరిగిన విద్యుత్ అమ్మకాల వివరాల గణాంకాలను సదరు లేఖతో జతచేశారు. సీమాంధ్ర జిల్లాల్లో గత ఐదేండ్ల కరెంటు కోతల(లోడ్ రిలీఫ్)ను పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆంధ్రాకే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల విద్యుత్ కోటా ఎక్కువగా వస్తుందని పేర్కొంది. వీలైనంత త్వరలో సీజీఎస్ కోటా మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీచేయాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తిచేసింది.

హైదరాబాద్‌లోనూ సీమాంధ్రుల వినియోగమే అధికం..

హైదరాబాద్ విద్యుత్ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన వివాదంపై తెలంగాణ సర్కారు ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నది. ఏపీ సర్కార్ పన్నుతున్న కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది జిల్లాల విద్యుత్తు కనెక్టెడ్ లోడ్ ఒక్క గుంటూరు జిల్లా కనెక్టెడ్ లోడ్‌తో సమానం. గత ఐదేండ్ల కాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల విద్యుత్ వినియోగమే అధికం. ఆంధ్రాసర్కారు ఈ వాస్తవాలను విస్మరిస్తున్నది. 2008-09 సంవత్సరంలో జారీచేసిన జీవో నంబర్ 53 ప్రకారంగా నాటి ఏడు జిల్లాలతో కూడిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కర్నూలు, అనంతపురం జిల్లాల విద్యుత్ వినియోగం 12.45 శాతంగా ఉంది.

అయితే 2013నాటికి ఆ రెండు జిల్లాల (కర్నూలు, అనంతపురం) వాటా 18.5 శాతానికి మారింది. గత ఐదేండ్లుగా సెంట్రల్ పవర్ డిస్కమ్ పరిధి తెలంగాణలోని ఐదు జిల్లాలలో మితిమీరిన కోతలు విధించి మరీ కర్నూలు, అనంతపురం జిల్లాకు విద్యుత్తు మళ్ళించిన విషయాలను ఆంధ్రా సర్కారు విస్మరిస్తున్నది. ప్రపంచబ్యాంకుతో లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకుని విద్యుత్‌రంగంలో సంస్కరణలకు ఆజ్యంపోసినవారే ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌రంగ విచ్ఛిన్నానికి యత్నించడం దురదృష్టకరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక మరో గమనార్హమైన వాస్తవమేమిటంటే.. హైదరాబాద్‌లో కూడా సీమాంధ్రులు ఉండే ప్రాంతాల్లోనే విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం. తెలంగాణ జేఏసీ నిర్వహించిన ఒక సర్వే ద్వారా ఈ వాస్తవం వెలుగుచూసింది. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజానీకం ఉండే ప్రాంతాల విద్యుత్ వినియోగం, సీమాంధ్రులు ఉండే ప్రాంతాల విద్యుత్ వినియోగం వివరాలు సర్వే ద్వారా వెలుగులోకి వచ్చాయి. అంటే హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ వినియోగం నిజానికి సీమాంధ్ర విద్యుత్ వినియోగమనేది సుస్పష్టం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి