గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 23, 2014

లిటిగేషన్ల ఆంధ్రాసర్కార్‌...ఒక కిరికిరి బ్రాండ్!

-పోలవరంపై ఆర్డినెన్స్‌కుకేంద్రంపై ఒత్తిడి
-విద్యుత్ పీపీఏల ఏకపక్ష రద్దుతో తెలంగాణ పీకనొక్కే యత్నం
-ఉద్యోగుల కేటాయింపులో స్థానికతపై రాద్ధాంతాలు
-తమ ఉద్యోగుల పెన్షన్ భారం తెలంగాణకు అంటగట్టే కుట్ర
-తెలంగాణ సొమ్ముతోఆంధ్ర విద్యార్థుల ఫీజులు కట్టించే యత్నం
మొన్న ఉద్యోగాలు, పెన్షన్లు.. నిన్న పోలవరం.. నేడు విద్య, విద్యుత్ పీపీఏలు.. తమ ఆధిపత్యాన్ని సవాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కక్ష పూనినట్టే కనిపిస్తున్నది. లేనిపోని కిరికిరీలు రేపి ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నది. నవజాత తెలంగాణ శిశువు గొంతు నులిమివేసే కుట్రలకు తెగబడుతున్నది. తమ తాతలు దాచుకున్న సొమ్మేదో తెలంగాణవారు దోచుకున్నట్టుగా నానా యాగీ చేస్తున్నది. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్రంలో అన్ని వనరులు అనుభవించింది తామేనన్న విషయం విస్మరించి, తేరగా వచ్చిన ప్రయోజనాలు నిలిచిపోవడం తట్టుకోలేక తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నది. రాష్ట్ర ఆవిర్భావం జరిగీ జరగకముందే పోలవరం ప్రాజెక్టు కోసమంటూ ఏడు మండలాలు కైంకర్యం చేసిన ఆంధ్రా సర్కారు, ఇరు రాష్ర్టాల మధ్య సుహద్భావ సంబంధాలకు తెలంగాణ సాచిన స్నేహ హస్తాన్ని విసిరికొట్టింది. విద్యుత్తు, ఉద్యోగులు, పింఛన్‌దారులు, విద్యార్థులు.. ప్రతి విషయంలోనూ వివాదాలకు కాలు దువ్వుతున్నది.

కేంద్రం తన జేబులో ఉందన్న దురహంకారంతో ప్రవర్తిస్తున్నది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ ఉండాలన్న తెలంగాణ న్యాయబద్ధమైన వాదనపైనా, స్థానికత ఆధారంగా పెన్షన్లు ఇవ్వాలన్న విధానంపైనా రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు వాళ్ల విద్యార్థుల చదువులకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులివ్వాలనే వితండ వాదన చేస్తున్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఇంకా తేలాల్సిన కీలక అంశాలు ఎన్నో ఉండగా మామూలు అంశాలపైనే ఆంధ్రా సర్కారు పెడుతున్న మడత పేచీలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహుముఖ యుద్ధానికి తెలంగాణ సిద్ధం కావల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

పీపీఏల మడత పేచీలు..

రాష్ట్ర విభజన చట్టంలో విద్యుత్ అంశాన్ని విపులంగానే చర్చించారు. ఎవరికి ఏది ఇవ్వాలో నిర్దిష్టంగానే నిర్ణయించారు. అరవై ఏళ్ల సమైక్య పాలన తెలంగాణకు చేసిన పాపానికి పరిహారంగా వినియోగాన్ని బట్టి విద్యుత్తు ఇవ్వాలని శాసించారు. అయితే పుచ్చుకోవడం తప్ప ఇచ్చుకోవడం తెలియని ఆంధ్రా సర్కారు దీనికి గిలగిలలాడుతున్నది. తమ పాపం కారణంగానే ఎన్నో అవకాశాలున్నా తెలంగాణలో విద్యుదుత్పత్తికి నోచుకోలేకపోయిందన్న వాస్తవాన్ని విస్మరించి నిబంధనలు కెలికి పీపీఏల వివాదాన్ని రేపింది. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం సష్టించి అంతఃకలహాలు రేకెత్తించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని తెలంగాణ సమాజం అంటున్నది. విభజన చట్టంలో విద్యుత్‌లో 52 శాతం తెలంగాణకు,48 శాతం సీమాంధ్రకు కేటాయించారు. ఈ కేటాయింపులకు ప్రధానకారణం సీమాంధ్రలో కాలువల ద్వారా వ్యవసాయం జరుగడం... తెలంగాణలో బోరుబావులే ప్రధానం కావడం కారణం. దీంతో తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎక్కువైంది.

అయినా సీమాంధ్ర సర్కారు తెలంగాణ రైతును కరెంటు తీగలకు ఉరివేసే విధంగా పీపీఏలను రద్దు చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పీపీఏల రద్దు తీవ్ర విఘాతమవుతుందని విద్యుత్ రంగనిపుణులు అంటున్నారు. పీపీఏలను రద్దు చేస్తానని చెపుతున్న సీమాంధ్ర ముఖ్యమంత్రి మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తానని ఎకసక్కాలాడుతున్నాడని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సీమాంధ్రలోనే విద్యుత్ లోటు ఉందని, అక్కడ మిగులు రావాలంటే కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే తెలంగాణ సర్కారు మాత్రం విద్యుత్ సంక్షోభంలో నుంచి బయట పడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషిస్తూనే తమకు చట్టపరంగా రావాల్సిన విద్యుత్ కోసం న్యాయ పోరాటానికి దిగాల్సిన పరిస్థితిని ఆంధ్రా సర్కారు కల్పిస్తున్నది. చేసేంత చేసి పీపీఏలపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళితే విభజనపై తాము కోర్టుకు వెళతామని బెదిరింపులకు దిగుతున్నది.

పోలవరంపై మాయమాటలు..

రాష్ట్ర ఆవిర్భావానికి ముందే కేంద్రంలో లాబీయింగ్ చేసి పోలవరంపై ఆర్డినెన్స్ తెచ్చుకున్న సీమాంధ్ర సర్కారు కయ్యానికి కాలు దువ్వింది. పైగా దొంగే దొంగ అని అరిచిన చందంగా తెలంగాణ ప్రభుత్వాన్ని బలి చేయాలని చూస్తున్నది. వాస్తవానికి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ సర్కారు పోలవరంపై ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించినపుడు నాడు ఎంపీగా ఉన్న నేటి ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రతిఘటించారు. పోలవరంవల్ల ఖమ్మం జిల్లాలోని గ్రామాలు ముంపుకు గురవుతాయని, చత్తీస్‌గడ్, ఒరిస్సా రాష్ట్రాలతో అంతర్‍రాష్ట్ర వివాదాలు ఏర్పడుతాయని అటవీ సంపదతో పాటు గిరిజన గ్రామాలు కూడా ముంపుబారిన పడతాయని వాదించారు.

ఈ నష్టాన్ని తగ్గించడానికి డిజైన్ మార్చుకోవడం ఉత్తమమని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దీనికి ఖమ్మంజిల్లా ప్రజాప్రతినిధులుకూడా మద్దతుగా నిలిచారు. కేసీఆర్‌తో చర్చల తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్ నుంచి కేంద్రం నివేదిక తెప్పించుకుంది. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, కేంద్రంలో టీడీపీ బలపరిచిన బీజేపీ అధికారంలోకి రావడంతో ఆంధ్రా సర్కారు లాబీయింగ్ చేసి హడావిడిగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీంతో తెలంగాణ యావత్ సమాజం బంద్ పాటించి నిరసన వ్యక్త పరిచింది. ఒక రాష్ట్ర పరిధిలోని ప్రాంతాలు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితిని తెలంగాణ ప్రజలకు కల్పించింది.

ఉద్యోగులు, పెన్షన్ల పంపిణీపై..

తెలంగాణ ఉద్యమానికి పునాదే నీళ్లు, నిధులు, ఉద్యోగాలలో జరిగిన అవకతవకలు. కానీ రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణలో తిష్ఠవేయడానికి సీమాంధ్ర సర్కారు కుట్రలు చేస్తున్నది. ఉద్యోగుల పంపిణీలో సీమాంధ్రులను తెలంగాణలోనే ఉంచే కుట్రలకు సీమాంధ్రులు తెర తీశారు. ఉన్నతస్థాయి అధికారులు వారే కావడంతో భారీగా సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంలోని కీలక ఫైళ్ల సమాచారానికి రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి సమాచారమంతా సీమాంధ్ర సర్కారు పెద్దలకు చేరుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర దురహంకారానికి ప్రతీకగా ఉద్యోగుల ఉద్యమానికి నాయకత్వం వహించిన విఠల్‌ను సీమాంధ్రకు కేటాయించి అవహేళన చేశారు. పెన్షన్ల పంపిణీలో తెలంగాణ ఆదాయాన్ని కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.

విద్యార్థుల వ్యవహారంలో...

తెలంగాణ నిధులు తెలంగాణ ప్రయోజనాలకే వెచ్చించాలనే సంకల్పంతో ఇక్కడ చదివే తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది న్యాయబద్దం కూడా. ఉమ్మడి విద్య కొనసాగుతుండడంతో ఇది తప్పనిసరి. అయితే ఈ భారం కూడా తెలంగాణ మీదికి నెట్టివేసి చోద్యం చూడాలని సీమాంధ్ర సర్కారు యోచిస్తున్నది. సీమాంధ్ర నుంచి అకమ్రంగా ఇక్కడ ఉద్యోగాలలో తిష్ఠవేసిన వారి సంతానం స్థానికులుగా క్లయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించి అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ బిడ్డలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించాయి.

విద్యార్థుల స్థానికతను నిర్థారించడంలో ప్రస్తుత విధానంలో ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల తండ్రుల స్థానికత ఆధారంగానే ఫీజు రీయింబర్ప్‌మెంట్ చేయాలని నిర్ణయించింది. తన రాష్ట్రంలో ఎవరికి ఫీజు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వరాదో నిర్ణయించుకునే హక్కు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. అయితే దీన్ని కూడా సీమాంధ్ర ప్రభుత్వం వివాదాస్పదం చేస్తున్నది. తనది కాని చోట తగదునమ్మా అని వివాదాలు రేపుతున్నది. ఇలాంటి సమస్యలు వస్తాయని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఎమ్‌సెట్ అడ్మిషన్లను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే విడిగా చేపడతామని ప్రతిపాదించినా ఆంధ్రసర్కారు అంగీకరించలేదు.

పీపీఏలపై మీరు కోర్టుకు వెళితే మేము విభజనపై వెళతాం: సీమాంధ్ర మంత్రి పల్లెరఘునాథరెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పీపీఏలపై కోర్టుకు వెళితే తాము విభజనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతామని ఆంధ్ర ప్రదేశ్ సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పల్లెరఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మరో మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఉన్న పీపీఏలు అలాగే ఉంటాయని అనుమతిలేని వాటిని రద్దు చేస్తామన్నారు. తమకు లోటు బడ్జెట్ ఉందని, మీకు మిగులుబడ్జెట్ ఉన్నదని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోలు చేసి లోటును పూడ్చుకునే శక్తి ఉందని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల ఉసురు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగులుతుందని మంత్రి పల్లెరఘునాధరెడ్డి శాపనార్థాలు పెట్టారు. పోలవరం ముంపు గ్రామాలను తాము న్యాయబద్ధంగానే అడుగుతున్నామని, కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని మంత్రి అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి