"...దోషాలోకన నిపుణాః పరుషగిరో
దుర్జనాశ్చ ఘూకశ్చ..."గుడ్లగూబలు.. దుష్టులు దోషాలోకనంలోను, పరుష భాషణంలోనూ నేర్పరులు అని పెద్దల వాక్యం.
దుర్జనాశ్చ ఘూకశ్చ..."గుడ్లగూబలు.. దుష్టులు దోషాలోకనంలోను, పరుష భాషణంలోనూ నేర్పరులు అని పెద్దల వాక్యం.
పాపం రాధాకృష్ణకు ఓ పెద్ద కల. తెలంగాణ సెంటిమెంటు అనేది లేకుండా పోవాలని. కేసీఆర్‌ను ఉద్యమనాయకుడుగా కాకుండా ఒక సాదాసీదా రాజకీయనాయకుడుగా ప్రజలు గుర్తించాలని. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోవాలని.. ఇదేం తెలంగాణ?...ఆయన ఉన్నపుడే బాగుండేది.. ఆయనొస్తే బాగుంటుంది అని ప్రజలంతా చంద్రబాబుకోసం ఎదురుతెన్నులు చూడాలని.. అందుకే పాపం ఎడాపెడా కథలు కహానీలు పత్రిక నిండా పరిచేస్తూ ఉంటాడు. సరే.. ఆయనకదో తుత్తి.. వదిలేద్దాం.
ఈ ప్రచారపరంపరలో ఒక గొప్ప రహస్యాన్ని కనిపెట్టి తాజా కొత్తపలుకులో పరిచేశాడు. ఏమిటట? కేసీఆర్‌లో కరడుగట్టిన నియంత ఉన్నాడట. ఓ పెద్ద అపరిచితుడు ఉన్నాడట. చాలాకాలంగా ఎవరికీ తెలియకుండా లోపల దాచేసుకుని 15 నెలలు అయ్యాక ఇపుడిపుడే బయటకు తీస్తున్నాడట. కేసీఆర్ నియంతృత్వానికి ఉదాహరణ ఏమిటంటే.. రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు ఆత్మహత్యలు, మున్సిపల్ వర్కర్లు, ఆశా వర్కర్ల ఆందోళన, వరంగల్ ఎన్‌కౌంటర్ పట్ల ఆయన వైఖరి. అందువల్ల ఆయన నియంత.
మరి ఏపీలో మున్సిపల్ సమ్మె, డ్వాక్రా మహిళల ఆందోళనలు జరిగినపుడు అక్కడి ప్రభుత్వం బంతిపూల దండలేసి స్వాగతించిందా?..చీరెలు సారెలు పెట్టి సత్కరించిందా? హైదరాబాద్ వీధుల్లో చితకబాదిందా? తిరుపతి అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లకు విందుభోజనాలు పెట్టిందా? పిట్లల్ని కాల్చినట్టు కాల్చేసిందా? ఏవోబీలో వారానికో ఎన్‌కౌంటర్ ద్వారా మావోయిస్టులకు సన్మానాలు చేస్తున్నదా? ఆచూకీ కూడా దొరక్కుండా మాయం చేస్తున్నదా? రాజధాని పేరిట తూళ్లూరు భూములను, బందరు పోర్టు పేర అక్కడి భూములను దానం చేస్తే పుచ్చుకున్నదా? పంటలు తగులబెట్టి మరీ లాక్కున్నదా? చిన్నచిన్న అంశాలకే కేసీఆర్ నియంత అయితే... ఇవన్నీ చేసిన చంద్రబాబును ఏమనాలి? సరే.. అదలా ఉంటే, ఇంతకాలం కేసీఆర్‌పై ఈగ వాలనివ్వని వారికి సైతం ఇవాళ ఆయన గురించి తెలిసిపోయిందట. వాళ్లంతా తిరగబడుతున్నారట. ఇక బ్రహ్మాండం బద్దలు కావడమే ఆలస్యమట. గతంలో కొందరు తెలంగాణ రాష్ట్రం వేరు- తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వేరు అన్న సోయి లేకుండా మాట్లాడేవారట. అలాంటి సన్నాసులకు ఇపుడుసోయి వచ్చిందని రాధాకృష్ణ ఆనందం. మరి ఆ సోయిలేని సన్నాసుల జాబితాలో ఎవరెవరున్నారో.. ఎవరెవరిని సన్నాసులని రాధాకృష్ణ అనుకున్నాడో మనకు తెలియదు.
వేలు విడిచిన బంధుత్వాలా?..
నిజానికి కేసీఆర్ మీద నియంత అనే ప్రచారం రాధాకృష్ణ ఇవాళ కొత్తగా చేస్తున్నదేం కాదు.. తెలంగాణ ఆవిర్భావానికి ముందూ భారీగానే ప్రచారం చేశాడు. అయినా ఆనాడు జనం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని తీర్పు ఇచ్చారు. ఇవాళ కొత్తగా వచ్చిందల్లా కమ్యూనిస్టులు.. వాళ్ల సంఘాల ఉనికి సమస్య. ఆంధ్ర పెత్తనంలోని ఒక్కో సంస్థా చేజారి పోతుంటే ఠారెత్తి పోతుంటే పుట్టుకువచ్చిన సమస్య. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఇప్పుడూ బండి ముందుకు సాగకపోవడం వల్ల వచ్చిన సమస్య. రాధాకృష్ణకు వీరితో వేలు విడిచిందో కాలు పట్టుకున్నదో ఓ సంబంధం వీరితో ఉన్నట్టుంది. బంధుమిత్రుల బాధ ఈయనకూ బాధే.
పాపం కేసీఆర్ మాయలో పడి మోసపోని పార్టీ ఒక్కటీ లేదని కమ్యూనిస్టు నాయకుడొకరు రాధాకృష్ణకు చెప్పుకుని ఓదార్పు పొందారట. నిజమే.. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మాదిరిగా సంఘాలు ముందు పెట్టుకుని మాయలో పడేసిన వాళ్ల పప్పులు ఇప్పుడు ఉడకడం లేదు. ఆ రకంగా వాళ్లు మోసపోయినట్టే మరి.
తెలంగాణ ప్రేమికుడట..
మనవడు నేర్చుకున్నట్టు.. అవ్వకు దురద తీరినట్టు అని వెనకటికో సామెత. పలక అడిగిన మనవడికి వీపు అప్పగించి రాసుకోమందట ఓ అవ్వ. తద్వారా మనవడు అక్షరాలు నేర్చుకున్నట్టు అవ్వ దురద తీరినట్టు అయిందట. తాజా కొత్త పలుకులో కేసీఆర్ దీక్ష విరమణ కోసం గద్దర్‌ను తాను ఒప్పించానని రాధాకృష్ణ రాసుకున్న వైనం అలాగే ఉంది. ఈ ప్రచారం ద్వారా అటు తాను తెలంగాణకు కృషి చేశానని చెప్పుకోడానికి... ఇటు కేసీఆర్ మధ్యలోనే విరమణకు సిద్ధమయ్యాడని బురద చల్లడానికి ఉపయోగ పడిపోయింది.
ఇంతకీ కేసీఆర్ దీక్ష విరమణే చేయాలంటే ఈ భూమ్మీద ఎవరూ దొరకనట్టు రాధాకృష్ణే ఉన్నాడా? అప్పటికి పూజ్య జయశంకర్‌సార్ లేరా? తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యుడి స్థాయిలో కోదండరాం లేరా? అనేక ప్రజా సంఘాలు లేవా? ఎంఆర్‌పీఎస్ మందకృష్ణ కూడా అపుడు కేసీఆర్ వద్దనే లేరా? కొంచెం హోంవర్క్ చేసి రాసి ఉంటే బాగుండేదేమో.. పోనీ ఈయన వెళ్లాడని అనుకున్నా. గద్దర్‌లాంటి ఉద్యమకారుడు రాధాకృష్ణ పైరవీలకు పడిపోయి ప్రకటనలు ఇచ్చేస్తారా? ఇలాంటి కథలు ఆంధ్రజ్యోతి బానర్‌గా వేసుకుంటే పాఠకులకు కాస్త వినోదం పంచినట్టుగా ఉంటుందేమో ఆర్కే ఆలోచిస్తే బాగుంటుంది. నిజానికి కేసీఆర్ హాస్పిటల్‌లో దీక్షలో ఉండగా రాధాకృష్ణ వ్యవహరించిన తీరు చూసి తెలంగాణ సీనియర్ జర్నలిస్టు ఒకరు తలబాదుకున్న విషయం అప్పుడు అంతా చెప్పుకున్నారు.
ఇక్కడ ఇంకో ట్విస్టు ఏమిటంటే, చిదంబరం ప్రకటన అనంతరం రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. ఆ సందర్భంగా ఖమ్మం హాస్పిటల్‌లో దీక్ష విరమణ నుంచి అనేక వంకర టింకర ప్రశ్నలు రాధాకృష్ణ వేశారు. మరి అపుడే ఈ గద్దర్ అంశం ఎందుకు బయటపెట్టలేదు? ఓపెన్ హార్ట్ అంటే హృదయం పరిచేయడమే కదా? మహిళలను కూడా అడగదగినవీ దగనివీ అడిగేవారు కదా! అపుడు ఆర్కేకు ఏ మొహమాటం అడ్డం వచ్చింది? ఇవాళ ఏ అవసరం దాన్ని చెప్పిస్తున్నది?
ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో..
కేసీఆర్‌లో అపరిచితుడు ఉన్నాడని రాధాకృష్ణ ఉవాచ. అధికారంలోకి వచ్చాక ఆ అపరిచితుడు కనిపిస్తున్నాడట. నిజమే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలన ఇలా ఉంటుందని రాధాకృష్ణ గ్యాంగు ఊహించి ఉండరు. అసలు కేసీఆర్ ఫాంహౌసే దాటి రాడని డిసైడై ఉంటారు. ఎపుడో ఒంటి గంటకు సచివాలయానికి ఇలా వచ్చి అలా వెళ్తాడని అనుకుని ఉంటారు. ఏదో నాలుగు మాటలు చెప్పడం తప్ప పాలన ఏం తెలుస్తుంది? నాలుగు నెల్లలో బజార్లో పెట్టేయమూ? అనుకుని లెక్కలేసుకుని ఉంటారు.
"తెలంగాణ వాళ్లకు పాలన కూడా వస్తదా? అధికారులు చెప్పిందానికి బుర్రలూపడం తప్ప" అనుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లైట్ తీస్కొని ఉంటారు. పార్టీలో నాలుగు రోజులకే కల్లోలం పుట్టదా? ముక్కలు కాకపోదా అనుకుని పార్టీలకు కూడా రెడీ అయి ఉంటారు. ఉన్నమాట చెప్పాలి.. రాధాకృష్ణే కాదు చివరకు తెలంగాణవాదులు కూడా ఊహించని అనేక దృశ్యాలు ఆవిష్కారమయ్యాయి. నిజమే కేసీఆర్‌లో ఒక సమర్థ పాలకుడనే అపరిచితుడు బయటికి వచ్చాడు.
మాటల మరాఠీ అని పిలిపించుకున్న పాత కేసీఆర్ మౌన గంభీర ముద్రలోకి పాలన అంతరాంతరాల్లోకి.. సమస్యల మూలాలను తడిమితడిమి శాశ్వత పరిష్కరాల్లోకి వెళ్లే ఒక కొత్త పాలకుడు బయటికి వచ్చాడు. ఫాంహౌజ్‌లో పడుకుంటాడనుకున్న కేసీఆర్ వరంగల్‌లో మూడు రోజుల బస రాధాకృష్ణలాంటి వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ప్రజల్లోకి పేదల ఇండ్లలోకి చొచ్చుకు పోవడం అనుకుని ఉండరు. కృష్ణా గోదావరి నదుల నడకల సంపూర్ణ అధ్యయనం ఆశించి ఉండరు. కాలం కలిసిరాక కొన్ని అపశ్రుతులు అనివార్యంగా ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇవాల్టికీ తెలంగాణ అభివృద్ధి మీద ఆయన చిత్తశుద్ధిని ప్రజలు కాదు...కనీసం ఆర్కే వెంటేసుకునే నాయకులు కూడా శంకించలేరు. చెప్పినా ఇవేవీ రాధాకృష్ణ అంగీకరించలేడు. ఆయనకు జీర్ణం కాదు.
ఘంటాకర్ణుడికి అష్టాక్షరీమంత్రం ఉపదేశం చేయడం రాధాకృష్ణకు బుద్ధి చెప్పడం వృథా ప్రయాసే.
ఎవరు అపరిచితుడు?
సరే ఆ విషయం అలా ఉంచితే.. కేసీఆర్‌లో ఉన్నాడో లేడో కానీ రాధాకృష్ణలో వేనవేల అపరిచితులు ఉన్నారంటారంతా. వాళ్లు అవసరాలకోసం ఆవిర్భవిస్తారుట. ఊసరవెల్లిలా రంగులు మార్చుతారట. ఒకరు యుద్ధం చేస్తే మరొకరు పంచన చేరుతారుట. అందుకేనేమో రాధాకృష్ణకు నిన్నటిదాకా శత్రువుగా ఉన్న వాళ్లు హఠాత్తుగా మిత్రులవుతాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టే అపరిచితులకు కేరాఫ్ మనోడే అంటారు పాత్రికేయులు. 2002లో చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల వార్తలను లంపెన్‌గాళ్లు అంటూ రాధాకృష్ణ నిషేధిస్తే, వైఎస్ హయాంలో ఒత్తిడులు పెరగగానే అపరిచితుడు ఆవిర్భవించిన వాళ్లతోనే ప్రత్యేక ఇంటర్వ్యూలు, కవర్‌పేజీ కథనాలతో మచ్చిక చేసుకున్నాడు.
రాధాకృష్ణకు జర్నలిస్టు యూనియన్ నాయకుల మీద బోలెడంత ప్రేమ. కానీ పాపం ఆయనలోని అపరిచితుడు 2005లో ఏలూరు సభలో మంత్రాంగం చేసి యూనియన్‌ను చీల్చిపారేశాడు. ఇదే యూనియన్ నాయకులకు వ్యతిరేకంగా బానర్ స్టోరీలు కూడా వేసుకున్నాడు. కాలం ప్రతిసారి కలిసి రాదు కదా.. కర్మ చాలక బడుగు నేతలను బాడుగనేతలంటూ వార్తలు రాయడం మందకృష్ణ దాడులు, కేసుల నమోదు వ్యవహారాలు ఎదురు కాగానే అదే యూనియన్ నేతల కాళ్లు గడ్డాలు పట్టుకుని మద్దతుగా తెచ్చుకున్నాడు.
ఎవ్వరికీ భయపడను పొమ్మన్నాడు. తర్వాత అపరిచితుడో పరిచితుడో తెలియదు కానీ... అదే మందకృష్ణను టీవీ ఇంటర్వ్యూలకు పిలిపించి శాంతింప చేసుకున్నాడు. ఇక సుజనా చౌదరి మీద వరుస కథనాలు రాధాకృష్ణ రాస్తుంటే హఠాత్తుగా అపరిచితుడు వాటిని నిలిపివేసిన వైనాలు ప్రెస్‌క్లబ్బుల్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆంధ్రజ్యోతి జీవితంగా బతికిన పెద్ద మనిషి ఓ చానెల్ పెట్టుకుంటే ఆర్థిక చేయూత అందించే వారిని మేనేజ్ చేసి చానెల్‌ను ఆర్థికంగా దెబ్బతీసి అప్పులపాలు చేసిన అపరిచితుడూ ఆర్కేలోనే ఉన్నారని పాత్రికేయుల ఉవాచ. ఇందరు అపరిచితులను తనలో పెట్టుకున్న పెద్దమనిషి ఇతరుల మీద నిందలు మోపడం వింత. ఇంతకీ ఈ సారి కొత్తపలుకు రాసింది.. పరిచితుడా? అపరిచితుడా?
చవి యెరిగిన కుక్క - చావగొట్టినా పోదు అని పెద్దల మాట. ప్రభుత్వం పాత పద్ధతిలో ఉండాలి. మేం సమ్మె అనగానే సాష్టాంగపడాలి.. మా పంట పండాలి.. అని రాధాకృష్ణకు ఆయన బంధుమిత్రులకు ఉండవచ్చు. కానీ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల కోసం.. సంఘాల ఉనికికోసం నడవవు. పంచాయతీలు చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలని దబాయిస్తే ప్రభుత్వాలు సాష్టాంగపడవు.
కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల మీద ఆంధ్రులు పెత్తనం చేయడం.. రాధాకృష్ణకు ఆ సంఘాల నాయకులకు అవసరం కావచ్చేమో. కానీ తెలంగాణ ప్రభుత్వం ధర్మసత్రం కాదు.. ఏదో సంఘం ఉనికికి ప్రమాదమని చెప్పి డబ్బులు కుమ్మరించేందుకు. అయినా ఆంధ్రపెత్తనంలోని సంఘాలు ఎలా నట్టేట ముంచుతాయో సకలజనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీలో వీరి వైఖరి చూసిన అనుభవం ఉంది. అందుకే ఆ వాసనలున్న సంఘాలను పక్కకు పెట్టాల్సిందే. పాములకు పాలు పోస్తే నష్టం తెలంగాణకే. బ్రిటిష్ వాడి పాలన పోయాక అంతా భారతీయీకరణ జరిగినట్టే.. నూతన రాష్ట్రంలో ఆంధ్ర సంస్థలు, ఆంధ్ర సంఘాలన్నింటికీ చరమగీతం పాడాల్సిందే.
ఏ రాష్ట్రంలోనైనా 250శాతం జీతాలు పెంచమంటూ సమ్మెలు చేసిన సందర్భం ఉన్నదా? కార్మికుల జీతాల కోసం రాష్ట్ర బంద్ పాటించిన సందర్భం ఉన్నదా? ఇక్కడ అలాంటి సమ్మెలు జరుగుతున్నాయంటే.. పగ బట్టినట్టు వివిధ పక్షాలను కూడగడుతున్నాయంటే అర్థం ఏమిటో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమైనా చేసి లొంగదీయాలని వారికి కోరికగా ఉండవచ్చు. అందుకే మున్సిపల్ భంగపాటు మరిచీ మరువక ముందే ఆశా వర్కర్ల సమస్య ముందుకు తెచ్చారు. ఏపీలో వరుసగా మూడు ఎన్‌కౌంటర్లు జరిగినా పెదవి విప్పని వారు ఇక్కడ ఒక్క ఎన్‌కౌంటర్‌కే చలో అసెంబ్లీ అంటున్నారు.
వారి ప్రకటనలను, వారు కూడగడుతున్న సంఘాల జాబితా చూస్తే భారీ ఎత్తుగడే వున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు.. తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్ర పాలకులనే తరిమికొట్టిన అనుభవం ఉంది. ఇలాంటి ఎత్తుగడలు తిప్పికొట్టగల సామర్థ్యమూ ఉంది.
మహాగజాః పలాయంతే మశకానాం తు కా కథా?మహామహా ఏనుగులే పరుగులు పెడుతుంటే దోమల మాట చెప్పేదేమిటి? ప్రజల మద్దతు ఆదరణ ఉన్నంతకాలం ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
- సవాల్‌రెడ్డి