గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 22, 2014

ముదురుతున్న పీపీఏల కిరికిరి

-ఈఆర్సీకి ఏపీజెన్‌కో మరో లేఖ
-ఎస్‌ఆర్‌పీసీకి తెలంగాణ సర్కార్ నివేదిక
-బెంగళూరులో 24న కీలక సమావేశం
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) వివాదంపై ఆంధ్రా సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.
వివాదానికి ముందే హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం
ఏపీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తి వివరాలను సదరన్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)కి అందించకపోవడం
ఆపై ఓవర్‌లోడ్ డ్రా చేస్తూ పవర్‌గ్రిడ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడం
వంటి పరిణామాలు కుట్రపూరితమైనవిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ ప్రభుత్వం ఏపీజెన్‌కో, ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌లను ముందుపెట్టి ఆడిస్తున్న నాటకాలను దీటుగా ఎదుర్కొనాలనే అభిప్రాయానికి వచ్చింది. అత్యంత కీలకమైన విద్యుత్‌రంగానికి సంబంధించిన ఇలాంటి వివాదాన్ని రాజకీయ అంశంగా కాకుండా న్యాయపరంగా, పరిపాలనాపరంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధమైంది. ఒకవైపు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, మరొకవైపు ఆంధ్రాసర్కారు అనైతిక చర్యలను గత రెండు రోజులుగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ, బెంగళూరు సదరన్ రీజియన్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ)ల దృష్టికి తీసుకువెళ్తున్నది.

ఇదిలా ఉండగా, తెలంగాణ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా పీపీఏల వివాదం, తదుపరి పరిణామాలపై సమగ్ర నివేదికను శనివారం సదరన్ రీజియన్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ), కేంద్ర ఇంధన కార్యదర్శికి అందజేసింది. ఏపీజెన్‌కో పీపీఏల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్‌కు తెలంగాణ ఇంధన ముఖ్యకార్యదర్శి శనివారం మరొక లేఖ రాశారు. ఏపీజెన్‌కో అనుసరిస్తున్న తీరు భవిష్యత్తులో ప్రభుత్వరంగ సంస్థల మధ్య జరిగే ఒప్పందాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

అత్యవసర సర్వీసులుగా ఉన్న విద్యుత్‌రంగంలో ఇలాంటి వివాదాలు శ్రేయస్కరం కాదని తెలంగాణ ప్రభుత్వం హితవు పలికింది. గతంలో సదరన్ రీజియన్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) తీసుకున్న నిర్ణయాలను బాధ్యతాయుతంగా అమలుచేయడం మంచిదని కూడా సూచించింది. ఈ ఏడాది(2014)లో జరిగిన సదరన్ రీజియన్ పవర్ కమిటీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎవ్వరూ లేరని ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ప్రత్యుత్తరంలో పేర్కొనడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2వ తేదీన జరిగితే అంతకుముందు జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఏవిధంగా హాజరయ్యే అవకాశం ఉంటుందో మీ(ఆంధ్రప్రదేశ్) విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు సదరు లేఖలో స్పష్టంచేసినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తదుపరి(జూన్ 2) 16 రోజుల పాటు రెండు రాష్ట్రాలకు(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)కు విద్యుత్‌ను అందించిన ఏపీజెన్‌కో 17వ తేదీ తర్వాత ఏపీ జెన్‌కో పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేదనే కుట్రబుద్ధితో మా విద్యుత్ ఉత్పత్తి మా రాష్ట్రాని(ఆంధ్రప్రదేశ్)కేనంటూ మెలికపెట్టి రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ యుద్ధానికి తెరదీసిన సంగతి తెలిసిందే. పీపీఏల రద్దు చెల్లదని ఈఆర్సీ స్పష్టం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఏపీజెన్‌కో తన వాదనలతో ఈఆర్సీకి లేఖ రాసింది. అంతేకాకుండా శనివారం ఏపీజెన్‌కో యాజమాన్యం ఏపీఈఆర్సీ చైర్మన్ వెంకటరమణి భాస్కర్‌ను కలుసుకుని మరొక లేఖను అందజేసి అవే వాదనలను మరొకసారి వినిపించింది.

పాత పీపీఏలు ఈఆర్సీ ఆమోదం పొందనందున అవి రద్దు అయినట్లేనని, కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని రెండు డిస్కమ్‌లతో ఏపీజెన్‌కో కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) కుదుర్చుకుంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, విద్యుత్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 24వ తేదీన బెంగళూరులో నిర్వహించే సమావేశం కీలకంగా మారింది. అయితే బెంగళూరు సమావేశానికి ఇరు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) తరఫున ఎవరు హాజరుకావాలనే అంశంపై ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. ఈ అంశంపై ఏపీ సీఎంతో చర్చించేందుకు శనివారం ఆంధ్రా ఇంధన శాఖ, ఏపీజెన్‌కో యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవానికి సదరన్ రీజియన్ పవర్ కమిటీ సమావేశాలకు చీఫ్ ఇంజినీర్(ఎస్‌ఎల్‌డీసీ) హాజరుకావడం అనవాయితీ. అయితే పీపీఏల వివాదం తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ను బెంగళూరుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి