గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
తెలంగాణ వార్తలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణ వార్తలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, మే 03, 2016

వేరుపడినా... తీరుమారదా...!


gatikaపాలమూరు తెలంగాణకు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతపురం జిల్లాకు నీళ్లొచ్చాయనే ఆనందంతో హంద్రీనీవా భగీరథ విజయయాత్ర పేరుతో నాలుగేళ్ల క్రితం అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నిర్వహించిన పాదయాత్రకు కేబినెట్ మంత్రిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డీకే అరుణ హారతులిచ్చి దీవెనలందించారు. అనంతపురం కూడా పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లానే, రైతులెవరైనా రైతులేనని, తాను అందుకే వెళ్లానని నాటి తన చర్యను సమర్థించుకున్నారు. ఇప్పుడు తాజా సన్నివేశం పరిశీలిస్తే.. డీకె అరుణ సొంత జిల్లా అయిన పాలమూరు రైతులకు నీళ్లివ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నది. దీన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి గట్టిగా వ్యతిరేకించి ధర్నాకు దిగారు. ఎంత తేడా? ఎలాంటి అనుమతులు లేకుండా, ఎగువ రాష్ర్టాలకు సమాచారం అందివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమను పూర్తి చేసుకున్నది. అయినా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతగా తప్పుబట్టలేదు. సముద్రంలోకి పోయేకన్న ఎవరో ఒకరు వాడుకుంటే రైతులకే కదా మేలు జరిగేది అని నిండు అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. గతేడాది నాగార్జునసాగర్ నీళ్లను వాడుకునే విషయంలో కూడా రెండు రాష్ర్టాల మధ్య లొల్లి పుట్టింది. అప్పుడు కూడా కేసీఆర్ పట్టింపునకు పోకుండా, టీఎంసీల లెక్కలు చూసుకోకుండా రైతులెవరైనా రైతులే అనే విశాల దృక్పథంతో సాగర్ ఆయకట్టు రైతుల కోసం సాగునీరు విడుదల చేశారు. 


కేసీఆర్ ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్తత్వం మాత్రం రోజురోజకు మరుగుజ్జుదవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కరువును చూసి చలించి దత్తత తీసుకుంటునట్లు బాబు ప్రకటించారు. పాలమూరు దారిద్య్రాన్ని పారదోలే వరకు నిద్రపోనని మనవి చేసుకున్నారు. కానీ ఆయన తొమ్మిదేళ్ల పాలనలో పాలమూరు కోసం ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు జిల్లాను సస్యశామలం చేయడం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు ఉత్తర తెలంగాణకు నీళ్లిస్తానని నమ్మబలికి దేవాదులకు పునాదిరాయి వేశారు. కానీ ఆయన పదవిలో ఉండగా రూపాయి పని జరగలేదు. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఎకరానికి నీరివ్వలేదు. 


గత పాలకులు హామీలిచ్చి, నమ్మబలికి వదిలేసిన ప్రాజెక్టులను కేసీఆర్ పట్టుదలతో పూర్తి చేయడానికి నిర్ణయించారు. దీన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. ఉత్తర తెలంగాణకు నీళ్లిచ్చే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన రోజే ఏకంగా ఏపీ కేబినెట్ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం వారి రాక్షస మనస్తత్వాన్ని కూడా బయటపెట్టింది. ఇక వైఎస్సార్సీపీది మరో డ్రామా. జగన్ కూడా పాలమూరుకు నీళ్లివ్వడమే పాపమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. శ్రీశైలం దగ్గర ఆగిన నీళ్లను తెలంగాణ వాడుకుంటే మరి పోతిరెడ్డి పాడుకు నీళ్లెట్ల ఎక్కుతయని ప్రశ్నిస్తున్నడు. అక్రమంగా కట్టుకున్న పోతిరెడ్డిపాడు కోసం పాలమూరు రైతులు నష్టపోవాలని స్పష్టంగానే చెపుతున్నాడు. 


రాష్ట్ర విభజన జరగక ముందు తెలంగాణపై విషం కక్కి అక్కడ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించిన పార్టీలు నేటికీ అదే పంథా కొనసాగిస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయగలిగితే అది ఆంధ్ర ప్రజలకు లాభం చేసిపెట్టడంతో సమానమనే సంకుచిత భావజాలంతో అక్కడి పార్టీలున్నాయి. చంద్రబాబు, జగన్, రఘువీరారెడ్డి.. ఈ ముగ్గురు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలోని అంతరార్థం ఒక్కటే. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని జెండాలు ఒక్కటై తెలంగాణాను అడ్డుకోగలిగినట్టే (తాత్కాలికంగానైనా) కృష్ణాపై కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నదే వారి ఉమ్మడి లక్ష్యంగా కనిపిస్తున్నది. ఆంధ్రా నాయకుల్లో, పార్టీల్లో ఏక రూపత చూస్తే తెలంగాణ పార్టీలకు లేనిదేమిటో అర్థమవుతుంది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్ర పార్టీలు ప్రత్యక్షంగానే వ్యతిరేకిస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీలు ఎలాగైనా పాలమూరు పథకాన్ని ఆపాలని దొడ్డి దారిన ప్రయత్నిస్తున్నాయి. 


అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ పార్టీలు పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకించడానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజాప్రయోజనం కనిపించడం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రజనం ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని కేంద్రం వైపో లేక తెలంగాణ వైపో మళ్లించాలనే వ్యూహంలో చంద్రబాబున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణను అడ్డుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనను అధికార పీఠంపై కూర్చోబెట్టాయని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే మళ్లీ తెలంగాణ వ్యతిరేకతను ఎజెండాగా మార్చుకోవాలని చూస్తున్నారు. జగన్ కూడా ఇంచుమించు అదే పద్ధతిని అవలంబిస్తున్నాడు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా నీళ్ల దోపిడీ సాధ్యం కాదనీ తెలుసు. కాబట్టే పోతిరెడ్డిపాడును గుర్తు చేస్తున్నారు. 


తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రాయలసీమకు మళ్లించాడు, ఈ పని చంద్రబాబు చేయలేకపోతున్నాడని జగన్ ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. విభజనకు కారకుడు జగనే అని చంద్రబాబు అప్పుడు విపరీత ప్రచారం చేసి ఆంధ్రలో లబ్ధి పొందారు. ఇప్పుడు అదే అస్ర్తాన్ని చంద్రబాబుపై జగన్ ప్రయోగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా జనంలో పోయిన ఆదరణను కొద్దో గొప్పో నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ప్రత్యేక హోదా రాకపోవడంతో పాటు, చంద్రబాబు వైఫల్యాలను ఎండకట్టే పనిలో కాంగ్రెస్ ఉన్న ది. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తవుతాయనే విషయంలో ఆంధ్ర పార్టీలకు ఏకాభిప్రాయం ఉంది. కానీ పూర్తయ్యే పాలమూరు విషయాన్ని రాద్ధాంతం చేసే విషయంలో ఎవరెన్ని మార్కులు సాధించుకుంటారనే విషయంపైనే ఆంధ్రలో పోటీ నడుస్తున్నది. ఇక తెలంగాణలో కూడా అంతే. 


పాలమూరు, కాళేశ్వరం, డిండి పూర్తయితే ప్రజలు కేసీఆర్‌కు జేజేలు పలుకుతారు. ఎంత వ్యతిరేకత ఉన్నా పాలమూరు, నల్గొండ జిల్లాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటిదాకా ఆదరిస్తూ వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో సగం సీట్లు ఈ జిల్లాలవే కావడం గమనార్హం. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే జనం కాంగ్రెస్‌ను మరిచిపోతారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే పాలమూరు ఆగిపోవాలని, కనీసం జాప్యం కావాలని కోరుకుంటున్నారు. పాలమూరు ఎంత అవసరమైన ప్రాజెక్టో అందరికీ తెలుసు. కానీ రైతుల భవిష్యత్ కన్నా, తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకునే వాళ్లు పాల(మూరు)ల్లో విషం చుక్కలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, ఏప్రిల్ 25, 2016

పాలనకు ప్రజామోదం...

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందు వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.

sridar
సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే సమయానికి తెలంగాణలో సాధారణ ఎన్నికల ప్రక్రియ సాగింది. అంగబలం, అర్ధబలం పుష్కలంగా ఉన్న జాతీయపార్టీలు, ప్రాంతీయ పార్టీలు మోహరించిన వేళ తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా బరిలోకి దిగింది. మొత్తం 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఎవరికి తోచిన విధంగా వారు టీఆర్‌ఎస్‌ను తక్కువ అంచనా వేసి ఫలితాల నాటికి బొక్కబోర్లా పడ్డారు. 11 లోక్‌సభ సీట్లు, 63 అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్ అజేయశక్తిగా అవతరించింది. అనితర సాధ్యమైన ప్రజామోదంతో ఈ రెండేళ్లు అప్రతిహత ప్రస్థానాన్ని కొనసాగించింది.

2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తర్వాత మూడు నెలలకే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే ప్రజామోదం పొందడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుండటం విశేషం. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చతికిలబడింది. హర్యానాలోనూ అధికార ఎన్డీఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు సాధించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించినా, ఏడాదిన్నరకే బీజేపీ దెబ్బకు కుప్పకూలిపోయింది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలలో అధికార పార్టీల పరిస్థితి బాగా లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బెంగళూరు కార్పోరేషన్ ఎన్నికల్లో భంగపడింది. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. గుజరాత్‌లోనూ అదే పరిస్థితి. గత సాధారణ ఎన్నికల్లో 24 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన క్రమంలో అధికారంలో ఉన్న బీజేపీ పది మాత్రమే గెలిచుకొని పద్నాలుగు చోట్ల ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తమ సీటును కాపాడుకున్నా, సాధారణ ఎన్నికల్లో రెండు వేల ఓట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో ఏకంగా 24 వేలు సాధించింది.

ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో జరిగినన్ని ఎన్నికలు మిగతా రాష్ర్టాల్లో ఎక్కడా జరగలేదు. 2014 సెప్టెంబర్‌లో మెదక్ ఉపసఎన్నిక మొదలుకొని ఈ నెల సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల వరకు ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఓటర్లు మొత్తం కోటికి పైగానే. 43 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజామోదం ఈ ఎన్నికల్లో వెల్లడైంది. అంటే రాబోయే సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ లాంటివే. ఈ రెండేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజామోదానికి ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. అసాధారణ రీతిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాలు నమోదు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశాయి. సిద్ధాంతాలు పక్కనపెట్టి పొత్తులు కుదుర్చుకున్నప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత మీద, కాలవైపరీత్యాల మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షాలకు అవేవీ కలిసి రాలేదు సరికదా 2014 సాధారణ ఎన్నికల కంటే దీనాతి దీనమైన స్థితికి దిగజారిపోయాయి.

2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతోపాటు మెదక్ లోక్‌సభకు పోటీ చేశారు. లోక్‌సభకు రాజీనామా చేయడంతో నాలుగు నెలలకే మెదక్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన ఆధిక్యతను అదేస్థాయిలో నిలబెట్టుకుంది. విశేషమేమిటంటే నరేంద్రమోదీ రాజీనామా చేసిన వడోదర ఉప ఎన్నికలు అప్పుడే జరిగాయి. కానీ బీజేపీ మెజారిటీ రెండున్నర లక్షలు తగ్గింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని టీఆర్‌ఎస్ బద్దలు కొట్టింది. టీడీపీ, బీజేపీలకు ఒక్క వార్డూ దక్కలేదు. శాసనమండలి ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో 11 స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.

వీటిలో ఆరు సీట్లను టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా గెలుచుకోవడం విశేషం. గత నవంబర్‌లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితం సంచలనం సృష్టించింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 3 లక్షల 92 వేల మెజారిటీ వస్తే, ఇటీవల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దయాకర్‌కు 4 లక్షల 60 వేల మెజారిటీ లభించింది. 64 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో అత్యధికమెజారిటీ సాధించిన మొదటి 10 మందిలో ఒకరిగా దయాకర్ చరిత్రకెక్కాడు. టీడీపీ బలపరిచిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రిని రంగంలోకి దింపిన కాంగ్రెస్ సహా మిగతా పార్టీలకు డిపాజిట్లు రాలేదు. నారాయణఖేడ్‌లోనూ అదే జోరు. తొలిసారిగా టీఆర్‌ఎస్ 53 వేల మెజారిటీతో విజయం సాధించింది. ఆరు దశాబ్దాల నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇది రికార్డు మెజారిటీ.

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని డివిజన్లను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మూడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క డివిజన్‌ను మాత్రమే కోల్పోయినా టీఆర్‌ఎస్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. పాతబస్తీలో సైతం ఎంఐఎంకు దీటుగా నిలిచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 150లోని 99 డివిజన్లను భారీ మెజారిటీతో గెలుచుకుని టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌కే పరిమితమైన మజ్లిస్ మినహా విపక్షాల మనుగడ ప్రశ్నార్థంగా మారింది.

తెలంగాణ కొత్త రాష్ట్రమైనందువల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. అయినా ఇంత తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను కదం తొక్కించి అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందుకే సమర్థిద్దాం. సమయమిద్దాం అన్న వివేకం ప్రజల్లో ఉంది. అది ప్రతిపక్షాలకు లేకపోవడం విచారకరం.
-(ఈ నెల 27న ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా)




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



జై 

శనివారం, మార్చి 07, 2015

జేసీజే పరీక్షలకు ఓకే!!

-మూల్యాంకనం మాత్రం వద్దు: హైకోర్టు
-పరీక్షలపై స్టే కోరిన తెలంగాణ.. వ్యతిరేకించిన ఏపీ
-హైకోర్టులో ఉద్రిక్తత.. చాంబర్‌లోనే ధర్మాసనం తీర్పు
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)-2014 నోటిఫికేషన్ ఆధారంగా మార్చి 8న నిర్వహించే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. అయితే జవాబుపత్రాలను మూల్యాంకనం చేయద్దని స్పష్టంచేసింది. రానున్న ఆదివారం నిర్వహించబోయే రాతపరీక్షలు మినహా తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు మరేవిధంగా ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది.
అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలను సీల్డ్‌కవర్లలో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగిన సమయంలో 2014 ఫిబ్రవరిలో జారీచేసిన జేసీజే -2014 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 8న రాతపరీక్షలు నిర్వహించడాన్ని సవాల్‌చేస్తూ న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా రాతపరీక్షలు నిర్వహించడం సహేతుకం కాదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మార్చి 4న చివరిసారిగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. తీర్పును మార్చి 6వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ..


తెలంగాణ రాష్ర్టానికి నష్టం చేకూర్చేవిధంగా జేసీజే నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో శుక్రవారంనాటి కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం పదిన్నరకు ఉత్తర్వులు వెలువరిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ న్యాయవాదులు భారీస్థాయిలో హైకోర్టుకు చేరుకున్నారు. కేసు సంఖ్య రాగానే తెలంగాణ రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలను మరోసారి ధర్మాసనానికి నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ర్టానికి సంబంధం లేదని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్‌ను పట్టించుకోకుండానే నోటిఫికేషన్ జారీచేశారని నివేదించారు. జేసీజే పోస్టులను ఆరు నెలల్లోగా భర్తీ చేయాలని జనవరి 20న సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించినందున అత్యవసరంగా పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు విధించిన ఆరు నెలల గడువులోగా రెండు రాష్ర్టాలకు న్యాయవ్యవస్థను విభజించి, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇతర సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు కేటాయించిన తర్వాత ఖాళీల ఆధారంగా జేసీజే పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అప్పటి వరకు పరీక్షలపై, కొత్త నోటిఫికేషన్‌పై స్టే విధించాలని అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్ తరపున ఆ రాష్ట్ర ప్రత్యేక న్యాయవాది వాదనలు చేస్తూ.. తాము స్టేకు నిరాకరిస్తున్నామని తెలిపారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని కోరారు. ఏపీ వాదనలపై కోర్టు హాల్లోని తెలంగాణ న్యాయవాదుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. హైకోర్టు తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు చేస్తూ.. ఆరు నెలల్లో పోస్టులను భర్తీచేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలనుసారమే రాతపరీక్షల నిర్వహణతోపాటు కొత్త నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు. వాదనలు పూర్తవ్వడంతో తాము తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా పేర్కొని, బెంచి దిగి చాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో న్యాయవాదులను ఉద్దేశించి.. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు ఉందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదుల గూర్చి కాదని, దేశవ్యాప్తంగా ఉన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తదనంతరం నలబై నిమిషాల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ తిరిగి ధర్మాసనాన్ని అధిరోహించారు. అయితే అదే సమయంలో తీర్పు వెలువరిస్తారనే ఉత్కంఠతో తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాల్లోనే ఉన్నారు. కొద్దిపాటి సమయం వేరే కేసులు విచారణ చేపట్టిన ధర్మాసనం, తీర్పును వెలువరించకుండానే బెంచి దిగిపోయింది. మధ్యాహ్నం గడిచినప్పటికీ న్యాయవాదులు కోర్టు హాల్లోనే తీర్పుకోసం వేచిచూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామం సమయం తర్వాత ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లోనే ఉత్తర్వులు వెలువరించనున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులకు, అడ్వకేట్ జనరల్‌కు సమాచారం అందించారు. దీంతో వారందరూ చాంబర్‌కు చేరుకున్నారు. చాంబర్‌లోనే ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని పేర్కొంది. అయితే మూల్యంకనం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందున తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టినందున, అలాగే అభ్యర్థులు సైతం సిద్ధం అయినందున పరీక్షలను యథాతథంగా నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

lawyers


తీర్పు నేపథ్యంలో హైకోర్టులో పోలీసులు, బలగాల మోహరింపు


జేసీజే పరీక్షలపై, నోటిఫికేషన్లపై తీర్పు నేపథ్యంలో హైకోర్టు వద్ద పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. తెలంగాణ న్యాయవాదుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశంతో కోర్టు హాల్లోకి న్యాయవాదులను అనుమతించే విషయంలో పలు నిబంధనలు విధించారు. కోర్టు ప్రాంగణంలోకి ఇతరులు రాకుండా నిరోధించారు.

పరీక్షలు అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు : హైకోర్టు రిజిస్ట్రార్


జేసీజే పోస్టుల రాతపరీక్షలను అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికాప్రకటన విడుదలచేశారు. పరీక్షలు అడ్డుకోవడంద్వారా రీఎగ్జామినేషన్‌కు కారణమైనవారినుంచే రీఎగ్జామినేషన్‌కు అయ్యే ఖర్చు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల వరకే పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించబోమని రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లతోపాటు ఫోటో గుర్తింపుకార్డు లేదా బార్ అసోసియేషన్ జారీచేసిన గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

స్క్రీనింగ్ టెస్ట్‌లంటే మా గొంతులు నొక్కడమే: జేఏసీ


నమస్తే తెలంగాణ, చార్మినార్: జేసీజే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయవాద జేఏసీ నేతలు రాష్ట్ర హైకోర్టు ముందు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పు న్యాయవాదులకు, తెలంగాణ వాదులకు తీరని నష్టం కలిగిస్తుందని విచారం వ్యక్తంచేశారు. ఈ దఫా జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగితే వచ్చే 30 ఏండ్ల వరకు మళ్లీ జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ఉండదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం జ్యుడిషియల్ ఉద్యోగాల్లో భాగమైన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో నియామకాలను 42ః58 నిష్పత్తిలో విభజించి ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇదే విషయాన్ని కోరుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను చేపట్టినా హైకోర్ట్ ప్రతిస్పందించక పోవడం న్యాయవాదుల గొంతు నొక్కడమేనన్నారు. అయితే పరీక్ష జవాబు పత్రాలను మూల్యాకనం చేయొద్దని, ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించడం కొంత సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కేంద్రంతో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ఏర్పాటును త్వరితంగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు మాణిక్ ప్రభుగౌడ్, ఎంఎస్ తిరుమల్‌రావు, గోవర్థన్, ఉపేంద్ర, ట్రిబ్యునల్ న్యాయవాద జేఏసీ కార్యదర్శి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

జేసీఏ పరీక్షకు తప్పక హాజరు కండి


జేసీజే పోస్టుల రాతపరీక్షను బాగా రాయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యర్థులను కోరింది. జేఏసీ నాయకులు శ్రీరంగారావు, కే గోవర్దన్‌రెడ్డి, అనిల్ మాట్లాడుతూ కొద్దికాలంగా ఈ విషయంలో గందరగోళం నెలకొని ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


శుక్రవారం, మార్చి 06, 2015

విద్యుత్ ఇంజినీర్ల విభజనలో ఏపీ కిరికిరి...!!!


Power

విద్యుత్ వివాదాలకు అజ్యం పోసిన ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనలోనూ కోత్త కిరికిరిలకు ఆజ్యం పోస్తున్నది. కార్పొరేషన్ల ఉద్యోగుల విభజన అంశాన్ని కమలనాథన్ కమిటీ సిఫార్సులకు ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. విద్యుత్ ఇంజినీర్ల విభజన అంశంపై ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తదుపరి తమ సొంత రాష్ర్టాల్లో పనిచేయాలన్న ఆకాంక్షతో ఇంజినీర్లు ఉన్న నేపథ్యంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఉద్యోగుల విభజనను జాప్యం చేస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 4,592 మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా, వారిలో 1,100 మంది సీమాంధ్రకు చెందిన వారున్నారు. వీరిలో తొంబై శాతం మంది ఉద్యోగులు విభజన కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 200 మంది ఇంజినీర్లు మాత్రమే తెలంగాణలో కొనసాగాలని యోచిస్తున్నారు. విద్యుత్‌రంగంలో స్థానికత ప్రామాణికంగా ఇంజినీర్ల జాబితాను విద్యుత్‌సంస్థలు ఇప్పటికే సిద్ధం చేశాయి. అయితే విద్యుత్ యాజమాన్యాలు విధాన నిర్ణయాలు వెలువరించాల్సి ఉంది.

తెలంగాణ జెన్‌కోలో పనిచేస్తున్న సీమాంధ్ర ఇంజనీర్లు వెళ్ళిపోతే సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. విద్యుత్ ఇంజినీర్ల విభజన క్రమంలో మంజూరు పోస్టులకు మించి ఉద్యోగులున్నట్లయితే సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సుధాకర్‌రావు, జీ సంపత్‌కుమార్‌లు సూచించారు. విద్యుత్ సంస్కరణల సమయంలో అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆనాటి సెంట్రల్ పవర్ డిస్కమ్‌లలో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

విద్యుత్‌లోటుతో ఉన్న తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే చర్యలను నీరుగార్చేందుకే ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనను మరింత జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని తొమ్మిది, పదవ షెడ్యూళ్ల స్ఫూర్తికి భిన్నంగా ఏపీ ట్రాన్స్‌కో లేఖ రాయడాన్ని తప్పుపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు విద్యుత్ రంగంలో ఉద్యోగుల విభజనకు ఎలాంటి పొంతన లేదని, కార్పొరేషన్లు, కంపెనీలు సొంత మార్గదర్శకాలను రూపొందించుకుని ఏడాది కాలంలోగా ఉద్యోగుల విభజన చేసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలంటూ ఏపీ ట్రాన్స్‌కో తెలంగాణ ట్రాన్స్‌కోకు లేఖ రాయడంలోని ఔచిత్యాన్ని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!




వైద్యశాఖలో డిప్యుటేషన్ల మాయాజాలం!

-జోన్-6 పరిధిలో 130 మందికి స్థాన చలనం
-హైదరాబాద్‌కు క్యూ కడుతున్న ఉద్యోగులు
-మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పిన అధికారి



ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 130 మందికి డిప్యుటేషన్ల పేరిట అనధికార బదిలీలు చేసి ఓ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉండడంతో అనేక మంది ఈ అధికారిని సంతృప్తి పరిచి దొడ్డిదారిన బదిలీలు చేయించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పని చేసే సదరు అధికారి తాను మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పి రూ.లక్షల్లో వెనకేసుకున్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు ఆదేశించినా అది నేటికీ ముందుకు సాగలేదు. అక్రమాలు అత్యధికంగా జరిగాయని ఆరోపణలు వచ్చిన నల్లగొండ జిల్లాలో డిప్యుటేషన్లన్నింటినీ జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని ఆదేశించారు. అదీ అమలు కావడం లేదు.


అసలేం జరిగిందంటే..హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కొందరు అధికారులకు వరంగా మారింది. అయితే బదిలీలపై నిషేధం ఉండటంతో మాజీ మంత్రి బంధువునని చెప్పుకునే ప్రాంతీయ కార్యాలయంలోని ఒక అధికారి ఆర్డీతో కుమ్మక్కు కావడంతో కాసుల పంట పడింది. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు 130 మందికి పైగా ఎంపీహెచ్‌ఎస్ సూపర్‌వైజర్లు , పీహెచ్ స్టాఫ్ నర్సింగులకు దొడ్డిదారిన స్థాన చలనం కల్పించారు. ఒక జిల్లాలో సిబ్బంది పనితీరు బాగాలేకుంటే సంబంధిత డీఎంహెచ్‌ఓ మెమోలు జారీ చేసి ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేయవచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని 130 మందిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌ఓలు ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేశారు. వారికి హైదరాబాద్, చుట్టుపక్కల పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 నుండి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
ఏదీ విచారణ?:ఈ తతంగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా దీనిపై విచారణకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారికి బాధ్యతను అప్పగించారు. ఇప్పటిదాకా విచారణ ముందుకు సాగలేదు. ఇదిలాఉంటే ఈ వ్యవహారం నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నల్లగొండ డీఎంహెచ్‌ఓకు హైదరాబాద్ ప్రాంతీయ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సరెండర్ చేయడం డిప్యుటేషన్‌పై మరో చోటికి వేయడం ఆయనకే దక్కాయి. అందువల్లే ఈ జిల్లాలోనే అత్యధికంగా ఈ దొడ్డిదారి బదిలీలు జరిగాయి.ఇదిగమనించి జిల్లా కలెక్టర్ వెంటనే వాటన్నింటినీ రద్దుచేయాలని కొన్నిరోజుల కిందట ఆదేశించారు.ఆ ఆదేశాలు అరకొరగానే అమలైనట్లు సమాచారం. ఇప్పటికీ చాలామంది యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఒకవైపు విచారణ కొనసాగకపోవడం, మరోవైపు ఒక జిల్లాలోనే నామమాత్రపు చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!