-గురుకుల్ ట్రస్ట్ భూముల విమోచనలో తొలి అడుగు
-అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కు పాదం
-భారీ బందోబస్తు మధ్య 16 భవనాల కూల్చివేత
-నేడూ కొనసాగనున్న కూల్చివేతలు
-బల్దియా కమిషనర్, సైబరాబాద్ సీపీ పర్యవేక్షణ
-అక్రమార్కులకు టీడీపీ ఎమ్మెల్యే గాంధీ మద్దతు
-కూల్చివేతలు అడ్డుకునేందుకు విఫలయత్నం
-అక్రమనిర్మాణాలకు విద్యుత్, నీటి సరఫరా బంద్
-గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశం
బుల్డోజర్లు కదులుతుంటే అక్రమార్కుల గుండె అదిరింది! అక్రమ నిర్మాణాలను జేసీబీలు పొడిచి పొడిచి కూలగొడుతుంటే.. రానున్న రోజులు తల్చుకుని కబ్జాకోరుల వెన్ను జలదరించింది! మన రాష్ట్రంలో మన అస్తిత్వం పరిపాలనా పగ్గాలు చేపడితే ఏం జరుగుతుందో అరవై ఏళ్ల గోస అనుభవించిన సగటు తెలంగాణ పౌరుడికి భరోసా ఏర్పడింది! ఈ మూడు సన్నివేశాలకు నాందిగా నిలిచింది మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్టు భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపర్వం!! వలస పాలన అవకతవకల అవశేషాలను ఎలా తుడిచి పెట్టనుందీ తెలంగాణ ప్రభుత్వం చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నది! నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకించి గురుకుల్ ట్రస్ట్ భూములలోని అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేసిన మరుసటి రోజే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది! దశాబ్దాల సీమాంధ్ర పాలనలో ఉనికి కోల్పోయి.. పరాధీనమై.. రియల్ ఎస్టేట్ల ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్ భూముల విమోచనకు తొలి అడుగు పడింది.
మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూములలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత మంగళవారం ఉదయం మొదలైంది. భారీ సంఖ్యలో పోలీసుల భద్రత నడుమ మున్సిపల్ అధికారులు, సిబ్బంది కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షించారు. గ్రేటర్ అదనపు కమిషనర్లు (ప్లానింగ్) రఘు, వెంకట్రామిరెడ్డి, జోనల్ కమిషనర్ అలీం బాషా, సిటీ చీఫ్ ప్లానర్ రాముడు సారథ్యంలో ఐదు బందాలుగా ఏర్పడి, 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొలి దశలో మొత్తం 21 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు బుధవారం కూడా కూల్చివేతల పర్వాన్ని కొనసాగించే అవకాశం ఉంది. గురుకుల్ ట్రస్ట్ భూములలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు మూకుమ్మడిగా దండయాత్ర చేశారు.
దాదాపు వందకు పైగా సిబ్బందితో గ్రేటర్ కమిషనర్‌తోపాటు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కార్యాలయంలోని ఇతర విభాగాల అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలకు పూనుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాదాపూర్ డీసీపీ క్రాంతిరాణా, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, దాదాపు 250 మంది కానిస్టేబుళ్లతో మున్సిపల్ అధికారులకు రక్షణగా నిలబడ్డారు. ఉదయం 6 గంటలకు అయ్యప్ప సొసైటీకి చేరుకున్న అధికారులు, సిబ్బంది ఐదు బందాలుగా విడిపోయి కూల్చివేతలు ప్రారంభించారు. సిబ్బందితోపాటు 4 జేసీబీలు, 3 హిటాచీ బ్రేకర్లు, 5 కంప్రెషర్లతో కూల్చివేతలు కొనసాగించారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి అక్రమ నిర్మాణదారులు ప్రయత్నించారు. వారికి మద్దతుగా స్థానిక శేరిలింగంపల్లి ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్లు, ఇతర నాయకులు నిలిచారు. కానీ పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి, కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా చూశారు.
కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే గాంధీ ఆందోళన...
స్థానిక శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ ఉన్నతాధికారులతో వాదనకు దిగారు. గ్రేటర్ కమిషనర్ సోమేశ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగిన గాంధీ.. కూల్చివేతలను ఆపకపోతే తమ తడాఖా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను దింపి తేల్చుకుంటామని కమిషనర్‌ను బెదిరించారు. ప్రజాప్రతినిధులై ఉండి అక్రమ నిర్మాణాలకు మద్దతు పలకడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు ఎమ్మెల్యే మద్దతు పలకడంపై స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కార్పొరేటర్లు రంగారావు, భానుప్రసాద్, కాంగ్రెస్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు. కార్పొరేటర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి తరలించారు.
విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఉండవు...
గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం అందకుండా చూడాలని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాలని ట్రాన్స్‌కో, జలమండలి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు బుధవారం నుంచి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై తీసుకుంటున్న చర్యలు, నిఘా ఏర్పాటుపై ప్రతి రోజూ తనకు నివేదిక అందజేయాలని వెస్ట్‌జోన్ కమిషనర్ అలీం బాషాను సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు కొనసాగితే బల్దియా టోల్‌ఫ్రీ నెంబర్ 040-21111111లో సమాచారం అందించాలని కోరారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి