నాడు ఉద్యమ నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశంలో నూతన చరిత్రను సృష్టిస్తున్నారు. గాంధీ జీవిత చరిత్రను వ్యూహాత్మక కార్యక్రమాలను లోతుగా అధ్యయనం చేసి సమకాలీన సమాజానికి, ఉద్యమాలకు అన్వయించిన పద్ధతి కనబడుతున్నది. దాంతోపాటు రాంమనోహర్ లోహియా చేసిన ఆందోళన, నినాదాలు, కార్యక్రమాలు ప్రజలను సమీకరించిన తీరు కూడా కేసీఆర్ నైపుణ్యంలో కనబడుతుంది. అంబేద్కర్ ఎలాగైతే ఆయా సమస్యల గురించి సైద్ధాంతికంగా, లోతుగా చర్చించి, విశ్లేషించి వ్యతిరేకులను కూడా ఒప్పించిన విధంగా కేసీఆర్ ప్రసంగాలు, నినాదాలు ముందుకు తీసుకువచ్చే సమస్యలు, పరిష్కార సూచికలు కనబడుతుంటాయి. సర్దార్ వల్లభాయిపటేల్ వలె దృఢ దీక్షతో ముందుకుసాగడం, ఎప్పుడు ఎక్కడ ఆగాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో అనే అంశాల్లో వల్లభాయి పటేల్, గాంధీజీ ఇద్దరినీ సమంగా అర్థం చేసుకొనే తీరు కేసీఆర్‌లో కనబడుతుంది. ఒక సామాజిక శాస్త్రవేత్తగా, రాజనీతి శాస్త్రవేత్తగా కేసీఆర్ ఎంత లోతైన అధ్యయనం చేస్తాడో చాలామందికి తెలియదు. రాజకీయ ప్రసంగాలను చూసి అంచనావేయడం కొలనులోని తామర, కలువ పూలను చూసి దాని లోతు గురించి మాట్లాడినట్లు ఉంటుంది.
టీఆర్‌స్ ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశంలో బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా కృషిచేసిన కేసీఆర్ క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి దాక నేతలను, ప్రజలను సమీకరించారు. జాతీయ రాజకీయాల్లో కాన్షీరాం నిర్వహించిన పాత్రను ఆదర్శంగా తీసుకొని అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్రసాధనకు కదిలించడం గొప్పది. ఎక్కడ మంచి ఉన్నా అవన్నీ స్వీకరించి ఒక సమగ్ర దృక్పథాన్ని అలవర్చుకొని సామాజిక శాస్త్రవేత్తగా ఎదిగిన రాజనీతి శాస్త్రవేత్త కేసీఆర్.
సాహితీవేత్తగా కేసీఆర్ చేసిన అధ్యయనం సామాజిక, రాజకీయ ఉద్యమంలో ఆయన ఉపయోగించుకున్న తీరు అపూర్వం. పీవీనరసింహారావు, వాజపేయి సాహితీవేత్తలు అయినప్పటికీ వారి సాహితీ పటిమ రాజకీయాల్లోకి అన్వయించడం సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ తన సాహిత్య పటిమతో ప్రసంగాలు చేయడం గానీ, ప్రజల్ని ఉత్తేజపరచి ముందుకు నడపడం గానీ గొప్ప సాహితీవేత్త కావడం వల్లే సాధ్యపడింది. ఆచార్య కే.జయశంకర్, కాళోజీ వంటి వారి అడుగుజాడల్లో ప్రజల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు నడిచిన కేసీఆర్ ఒకనాటి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ గారిని తలపిస్తారు. ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు రెండూ ఒకటి కాదు. రాజకీయ నాయకుడు ఉద్యమ నాయకుడిగా నిలిచి గెలవడం అంత సులభం కాదు. కేసీఆర్ ఈ రెండింటినీ సవ్యసాచిలా నడిపిస్తూ నెహ్రూ వలె రాజకీయ అధికారం కూడా చేపట్టి పది నెలల్లోనే తనదైన పాలనా ముద్ర వేశారు.
రాష్ట్ర సాధన కోసం అనేక శ్రేణులు, వర్గాలు ఉద్యమించాయి. వాటి స్ఫూర్తిని ఒకచోటికి తీసుకురావడంలో కేసీఆర్ కృషి అనన్య సామాన్యమైనది. ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, జర్నలిస్టులు, విద్యార్థులు, యువకులు, మహిళలు తదితర శ్రేణు లు ఎన్నో సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్‌కు పోటీగా ఎంతోమంది రాజకీయ నాయకులు ముందుకు రావాలని, ఆయన్ని వెనక్కి నెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారే వెల్లికిలా పడిపోయారు. వాళ్లు కేవలం రాజకీయ నాయకులు కావడమో, అల్ప లక్ష్యాలు కలిగి ఉండటమో, ఉద్యమకారులుగా మాత్రమే ఆలోచించడమో, దీర్ఘకాలిక దృష్టిలేకుండా ఆవేశకావేశాలకు లోనుకావడమో, స్వార్థానికి లొంగిపోవడమో జరగడంవల్ల ప్రతిదశలో పదులకొద్ది నాయకులు వెనకబడిపోయారు. అనామకంగా మిగిలిపోయారు. ఇదంతా నడుస్తున్న చరిత్ర.
రాజనీతి శాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా కేసీఆర్ రాష్ర్టాన్ని ఎలా సాధించాలో అందుకు ఎన్నిరకాల మార్గాలున్నాయో అధ్యయనం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతదాకా సాగిన ఉద్యమాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పడటానికి చేసిన ఉద్యమాలు, అసోం, ఈశాన్య రాష్ర్టాల్లో సాగిన, సాగుతున్న ఉద్యమాలను అనేక కోణాల్లో అధ్యయనం చేసి, మన సమాజానికి ఏమేరకు స్వీకరించవచ్చో చర్చలు చేశారు. కొందరు రోడ్లమీద ఊరేగింపులు తీయాలని, తెలంగాణేతరుల గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు ఇవ్వాలని, వారి ఆర్థిక, సాంఘిక పునాదులను పెళ్లగించాలన్నారు. కేసీఆర్ మెతకగా ఉన్నారని విమర్శించారు. శాంతియుతంగా ఉద్యమాలు నిర్మించడం, ఆందోళనపూరిత ఉద్యమాలు ఎక్కువ కష్టం అనీ, అందుకు ఎంతో సహనం, ఓర్పు అవసరమని గాంధీ లాగే కేసీ ఆర్ విశ్వసించారు. శాంతియుత ఉద్యమం ద్వారానే రాష్ర్టాన్ని సాధించి పెట్టారు.
ఎప్పటికప్పుడు పదబంధాలను సృష్టించి, ప్రజల నాల్కలమీద నడయాడేవిధంగా మలచడంలో కేసీ ఆర్ దిట్ట. తెలంగాణ భాష, యాస, సంస్కృతికి పట్టంకట్టి దానికి సాధికారికతను సాధించడంలో అందరికీ స్ఫూర్తినిచ్చి వందలాది రచయితలు తెలంగాణ భాషలో రాయడానికి కారకులయ్యారు. తెలంగాణ పండుగలను, దేవాలయాలను, నదులను, వాటి గొప్పతనాన్ని, ప్రభవాన్ని విప్పిచెప్పి, ప్రచారం చేసి, తెలంగాణ పట్ల దశాబ్దాలుగా రుద్దబడిన ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి సగర్వంగా తలెత్తుకొని తిరిగే ఆత్మగౌరవ పోరాటాన్ని మహోన్నతంగా నడిపిన ఉద్యమకారుడు కేసీఆర్. ఉద్యమాన్ని ఒక పండుగలాగా నిర్వహించడమెలాగో చేసి చూపించారు. కోట్లాది ప్రజలు కలిసి నడిస్తే ఏ ఉద్యమమైనా పండుగలాగే కనపడుతుంది. తెలంగాణ చరిత్ర శతాబ్దాలుగా ఎంత మహోన్నతమైనదో, శాతవాహనుల పూర్వకాలం నుంచి చాళుక్యులు, కాకతీయులు, కులీకుతుబ్‌షా, నైజాం రాజ్యవంశం దాకా అనేక కోణాల్లో విశ్లేషించి, వారు చేసిన సేవలను, కృషిని కొనియాడారు. నైజాం రాజును ప్రపంచంలో ఎక్కడలేనంత దుర్మార్గుడిగా ప్రచారం చేసిన కుట్రలను బద్దలుకొట్టి నిజాం తన రాజ్యంలో నిర్మించిన కట్టడాలను, నిర్మాణాలను, దవాఖానాలను, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను, ఉస్మానియా విశ్వవిద్యాలయం, నీలోఫర్ హాస్పిటల్, నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి, అసెంబ్లీ, జూబ్లీహాల్, ట్యాంక్‌బండ్ వంటి వందలాది నిర్మాణాలను, వాటి ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. నైజాం రాజ్యంలో ఎన్ని పరిశ్రమలు ఎదిగాయో, వాటిని సమైక్య రాష్ట్రంలో ఎలా మూసివేస్తూ వచ్చారో, తెలంగాణ ప్రాజెక్టులను, ఉపాధికల్పనను, బడ్జెట్‌లను, ఆదాయాన్ని ఎలా సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకుపోయారో, అనేకమంది నిపుణులు వెలికి తెచ్చిన చారిత్రక సత్యాలను విస్తృతంగా ప్రచారం చేశారు.
ఉద్యమాలు నిర్వహించడంలో కేసీఆర్ దేశానికి ఒక నూతన మార్గాన్ని వేశారు. ఇలాంటి శాంతియుత ఉద్యమం, ఇంత సుదీర్ఘ కాలం జరగడం ప్రపంచ చరిత్రలోనే అరుదు. ఇదే ఉద్యమం మరే దేశంలోనైనా జరిగిఉంటే రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, క్యూబా, మయన్మార్, వెనుజులా దేశాల ఉద్యమాల స్థాయిలో, ప్రపంచ స్థాయిలో గుర్తింపువచ్చి ఉండేది. ఈ చరిత్రను ఇంగ్లీషులో రాసి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నేటి రచయితలు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తల మీద ఉన్నది.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కార్యకర్తల భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఇంటిలో జరిగే శుభకార్యాల్లో ఏ విధంగా శ్రద్ధతో, సాదరంగా ఆహ్వానించి ఏర్పాటు చేస్తారో అటువంటి స్థాయిలో ఏర్పాట్లు చేసి వేలాదిమందికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. ఆప్యాయ తను పంచారు.
ఉద్యమాల్లో ఆర్థిక సమస్య ప్రధానమైంది. ఈ సమస్యను కేసీఆర్ ఎలా అధిగమించారో చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం. కేసీఆర్ భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించే జ్ఞాని. రాజకీయాల్లో దాన్ని విజ్ఞతగా, సమయానుకూలంగా ప్రదర్శించడమే కేసీఆర్‌లోని గొప్పతనం. అదొక రహస్య విద్య. అంతకన్నా తెలిసినవారు మేధావులు, విజ్ఞులు ఎంతోమంది ఉండవచ్చు. కానీ బహుముఖీనంగా ఉంటూ మాస్ లీడర్‌గా ప్రభావితం చేస్తూ, ప్రజలను నడిపిస్తూ, నడిచే నాయకులు అరుదు. ఈ దృష్టితో చూసినప్పుడే కేసీఆర్ చారిత్రక పురుషుడు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను నాడే గుర్తించి, దూరదృష్టితో తర్కించి, రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని పొందుపరచిన అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు కేసీఆర్. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టం ప్రజల పక్షాన బాబాసాహెబ్ పట్ల కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 125 అడుగుల భారీ కాంస్య విగ్రహ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఇది ఆయనలోని దార్శనికతకు, నిలువెత్తు సామాజిక స్పృహకు నిదర్శనం.
సామాజిక శాస్త్రవేత్తగా, సామాజిక న్యాయం ద్వారా, సామాజిక మార్పు శాంతియుతంగా సాగాలని కేసీఆర్ అభిలాష. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలిరోజునుంచే సీమాంధ్ర నాయకులు, అధికారులు చేసిన అక్రమాలను, కుట్రలను, ఎక్కడికక్క డ పసిగట్టి మరింత నష్టం జరగకుండా తెలంగాణ ఆస్తులను, రికార్డులను జాగ్రత్తపరిచే కృషిచేశారు. కేసీఆర్ మాత్రమే పద్నాలుగేళ్ల సుదీర్ఘ ఉద్యమ అనుభవం, అంతకుముందటి పరిపాలనా అనుభవంతో పాటు దశాబ్దాల అనుభవాలు కలిగిన అధికారులను, నిపుణులను, గౌరవ సలహాదారుగా నియమించి తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించడానికి చేస్తున్న కృషి మహోన్నతమైనది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వేసిన బాట రేపటి తెలంగాణకు బంగారు బాటగా, ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!