-లక్ష్మీనరసింహుడి సాక్షిగా.. ధర్మపురిలో అధర్మ పాలన!
-రెవెన్యూ రికార్డులు తారుమారు
-వందల ఎకరాలు గోల్‌మాల్
-రూ.250 కోట్ల భూ స్కాం
-పట్టా భూములకు రెక్కలు
-గోదావరి సాక్షిగా ఆగడాలు
-గవర్నర్, కలెక్టర్లకు ఫిర్యాదు
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని రియల్ ఎస్టేట్ విజృభించింది. ఆ క్రమంలో వ్యాపారుల ముసుగులో మాఫియా రాజ్యం కొనసాగింది. ఎక్కడెక్కడ ఎలాంటి భూములున్నాయి, వారి సొంతదారులెవరు, వాటిని ఎలా కాజేయవచ్చు అని ఆలోచించి వ్యూహాలు పన్నిన మాఫియా భారీ స్థాయిలో అక్రమంగా భూదందాకు తెరలేపింది. కొందరు అధికారుల అండతో చెలరేగిపోయింది. గోదావరి తీరంలో మాగాణి, మెట్ట, సాగుకు అనుకూలంకాని పడావు భూములున్నాయి. ధర్మపురి పట్టణానికి పక్కనే ఉన్న భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి ఇష్టారాజ్యంగా పట్టాలను మార్చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
కొన్ని నిర్దిష్ట కేసుల్లో ఆధారాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద అడిగితే అలాంటివేవీ తమ దగ్గర అందుబాటులో లేవని రెవెన్యూ అధికారులు బదులిస్తున్నారు. ఇది కూడా ఆరోపణలకు, అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. దీని వెనుక మాఫియా ఉండటంతో బాధితులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరుగలేదు. దాంతో ధర్మపురికి చెందిన కొందరు బాధితులు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధి కోసం గ్రామాలు వదిలిపెట్టి వలసపోయినవారి, నోరులేని అమాయకులకు చెందిన భూములను అక్రమార్కులు పూర్తిస్థాయిలో కొల్లగొట్టారు. నిజానికి వారికి పట్టాలున్నాయి. రికార్డుల్లో భూముల వివరాలున్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అదృశ్యమయ్యాయి.
కొన్ని సర్వే నంబర్లలో విచిత్రంగా భూములు రెట్టింపయ్యాయి. పక్క సర్వే నంబర్లలోని భూములను అనుభవిస్తుండటమే ఇందుకు కారణం. ఈ అక్రమ కార్యకలాపాలకు దాదాపు దశాబ్దిన్నర చరిత్ర ఉన్నట్లు వెల్లడయింది. ప్రధానంగా 1999 నుంచి ధర్మపురి మండల రెవెన్యూ కార్యాలయంలో పహాణీలు మార్చేస్తూ యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి. రూ.250 కోట్ల విలువైన కొన్ని వందల ఎకరాల భూములను రెవెన్యూశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందినవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై స్వాహా చేశారు. ధర్మపురిలో సర్వే నంబర్ 30, 85, 102, 114, 115, 130, 1231, 1233, 1234, 1235 లోని స్థలాలు కనిపించడం లేదు. పట్టాదారులకు తెలియకుండా దళారులు ఆ భూములను కాజేశారు. అన్యాక్రాంతం చేశారు.
రికార్డుల్లో ఆధారాల్లేకుండా మార్పులుధర్మపురిలో రెవెన్యూ రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చారు. అధికారులు పహాణీలు, 1బీ రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా పట్టాదారుల, అనుభవదారుల పేర్లను మార్చారు. జుక్కల రాజ్యలక్ష్మి సర్వే నంబర్ 1234లో సంగనభట్ల పాపయ్యకు చెందిన 2 ఎకరాలను కొనుగోలు చేసినట్లుగా పేర్కొని పట్టాను జారీ చేశారు. బాధితులు సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరిస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐతే రికార్డుల్లో అసలు పట్టాదారుడు కాసర్ల పుల్లయ్యగా ఉంది. ఆర్‌ఓఆర్ ద్వారా ఆమెకు పట్టా ఇచ్చేశారు. కాసర్ల పుల్లయ్య పేరు 2007-08 వరకు రికార్డుల్లో భద్రంగానే ఉంది. ఆ తర్వాత కాశెట్ట చిన్నన్న, లింగన్న పేర్ల మీదికి పహాణీ మార్చారు.
దీని వివరాలు తీసుకుంటే సాదా కాగితంపై కొనుగోలు చేసినందున మార్చినట్లు రెవెన్యూ అధికారులు చెప్పారు. ఆ సాదా కాగితాల నకళ్ల కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే అవి కూడా కార్యాలయంలో అందుబాటులో లేవని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సర్వే నంబర్ 1231లోని 10.35 ఎకరాల భూమి 2007-08 వరకు పానుగంటి వెంకటరామయ్య పేరు మీద ఉంది. ఆ తర్వాత అందులోని 8.35 ఎకరాలను పాల లచ్చన్న పేరిట మార్చేశారు. దీనిపై వివరాలు అడిగితే సమాచారం లేదని మండల రెవెన్యూ అధికారి సమాధానం ఇచ్చారు. పట్టాదారులు, వారి వారసులకు తెలియకుండానే.. క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులు, ఆధారాలు లేకుండానే ఏకపక్షంగా మార్చారు.
ఫారం 10, 11, 12 వంటివి పట్టాదారులు పంపకుండానే, మార్పులు-
చేర్పుల రిజిస్టర్‌లో పట్టాదారుల సంతకాలు లేకుండానే మార్పిడి చేశారు. ఆర్‌ఓఆర్ యాక్ట్‌కు విరుద్ధంగా వందల లావాదేవీలు జరిగినట్లు సమాచారం. 1999 తర్వాత కొందరు రెవెన్యూ అధికారుల అండదండలతోనే భూములు మాయమైనట్లు తెలుస్తోంది. భూములు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు ఉంటే తప్ప పేరు మార్పిడి చేయరాదు. కాని ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అనేక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లేవని రెవెన్యూ అధికారులే ధ్రువీకరిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీన్నిబట్టి ఎలాంటి క్రయ విక్రయాలకు సంబంధించిన పత్రాలు లేకుండానే పట్టాదారుల పేర్లు మార్చినట్లు స్పష్టమవుతోంది. ఒకటీ రెండు కాదు.. ధర్మపురి చుట్టూ ఉన్న కొన్ని వందల ఎకరాల్లో పట్టాదారులకు తెలియకుండానే హక్కుదారులను పుట్టించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని బాధితులు పెండ్యాల శివకుమార్ గవర్నర్‌కు అర్జీ పెట్టుకున్నారు.
భూ సేకరణలోనూ మాయాజాలం
భూ సేకరణలోనూ మాయాజాలం
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూముల్లోనూ మాయాజాలం కనిపిస్తోంది. అవార్డు కాపీ నంబర్ 14, తేదీ. 29-03-1972, నం.106/77-78, తేదీ. 22-7-1977 ప్రకారం నష్టపరిహారం పొందినట్లుగా చూపిస్తున్న చాలా సర్వే నంబర్లు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పేరిట రికార్డుల్లో లేవు. వాటన్నిటినీ ఇప్పటికీ పట్టాభూములుగానే చూపిస్తున్నారు. జాతీయ రహదారి-16 కోసం సేకరించిన భూముల్లోనూ అవినీతి తంతు కనిపిస్తోంది. చాలామంది పట్టా భూముల్లో 2 ఎకరాల వంతున ఆర్ అండ్ బీకి ఇచ్చేసినట్లు పహాణీల్లో చూపించారు. కానీ మొత్తం విస్తీర్ణం మాత్రం సదరు పట్టాదారుల పేరిటనే ఉంది. అంటే ఆర్ అండ్ బీకి బదిలీ చేయలేదు. 1964-66 మధ్య కాలంలో ఆర్ అండ్ బీ విస్తరణ కోసం భూ సేకరణ చేపట్టినట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్ బీ శాఖ నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరిస్తే అసలు భూ సేకరణ జరుగలేదని తెలిసింది. ఎవరి భూములనైతే రికార్డుల్లో మార్చేశారో వారెప్పుడైనా అధికారులను తమ స్థలాలను చూపించాలని కోరితే ఎస్సారెస్పీ, ఆర్‌అండ్ బీ భూసేకరణలో పోయాయంటూ తిప్పి పంపిస్తున్నారు.
ఎలా నడిచింది..
ఎలా నడిచింది..
ధర్మపురికి చెందిన చాలామంది పట్టాదారులు ఉపాధి కోసం పలు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడూ వచ్చి వెళ్లడం తప్ప వారు తమ భూములను ఏనాడూ పరిశీలించుకోలేదు. ధర్మపురి కాలక్రమంలో పట్టణంగా మారింది. జనాభా పెరిగింది. వ్యాపారం విస్తరించింది. భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొంది. సాగుభూములన్నీ నివాస ప్రాంతాలుగా మారాయి. దాంతో అక్రమ దందాదారులు మొదట ఊళ్లు విడిచి వెళ్లిపోయినవారి భూములను , ఆ తర్వాత ఇంకొందరి హద్దురాళ్లను ధ్వంసం చేశారు. సాగుకు అనుకూలంగా లేని స్థలాలు కావడం వల్ల పట్టాదారులు వాటిని పట్టించుకోలేదు. అదే అక్రమార్కులకు వరంగా మారింది. తాజాగా ఎకరం రూ.20 లక్షల దాకా పలుకుతుండటంతో చాలామంది సొంతదారులు మేల్కొన్నారు. కానీ అక్రమార్కులు అప్పటికే ఉన్నదంతా ఊడ్చేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి