గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 12, 2014

తెలంగాణ ఆలయాల్లో ఆంధ్రా జులుం ఇంకా కొనసాగాలా?

Bhadrachalam

-తెలంగాణ సిబ్బందికి అడుగడుగునా అవమానాలు 
-దుర్భాషలాడుతూ వేధింపులు.. అణచివేత
-ప్రధాన ఆలయాలన్నింటిలో ఇదే పరిస్థితి
-భద్రాచలం ఈవో వైఖరిపై భగ్గుమన్న సిబ్బంది
-బదిలీ చేయాలని డిమాండ్.. వారం రోజులుగా కొనసాగుతున్న దీక్షలు

తెలంగాణ దేవాలయాల్లో సీమాంధ్ర అధికారుల పెత్తనం, అణచివేత తీవ్రస్థాయిలో కొనసాగుతున్నది. తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో, సర్వీసు విభాగంలో, సీమాంధ్ర ఉన్నతాధికారులే చక్రం తిప్పుతున్నారు. ఫలితంగా తెలంగాణ సిబ్బందికి అడుగడుగునా అవమానాలు తప్పడంలేదు. తెలంగాణలోని చిన్నచిన్న దేవాలయాల్లోని ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోతున్నది. భద్రాచలం దేవస్థానంలో ఈవో వైఖరి పట్ల సిబ్బంది భగ్గుమంటున్నారు. ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, అర్చకులు దీక్షలకు దిగారు. తెలంగాణ తిరుపతిగా వాసికెక్కిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం, బాసర శ్రీసరస్వతీక్షేత్రం, చెర్వుగట్టు శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయాల్లో సీమాంధ్ర అధికారులే ఈవోలుగా కొనసాగుతున్నారు. 

ఈ కారణంతో తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. లండన్‌లో స్థిరపడిన తెలంగాణ డాక్టర్లు భద్రాచలంలో తమ సొంత ఖర్చులతో భక్తుల కోసం సత్రం నిర్మిస్తామని రెండేళ్లుగా సీమాంధ్ర అధికారులకు విజ్ఞాపనలపైన విజ్ఞాపనలు అందచేసినప్పటికీ సీమాంధ్ర కమిషనర్లు అనుమతించలేదు. నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలలో సీమాంధ్ర అధికారులే అసిస్టెంట్ కమిషనర్లుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ అర్చక సంక్షేమనిధి, ధూపదీపనైవేద్యం, సీజీఎఫ్ వంటి విభాగాలన్నింటిలో సీమాంధ్ర అధికారులే చక్రం తిప్పుతున్నారు. 

ట్రిబ్యునల్ ఏర్పాటుపై చొరవచూపని ప్రభుత్వం
భద్రాచలంలో తెలంగాణ ఉద్యోగుల సీనియార్టీని, ఇతర అలవెన్సులను జూన్‌లోనే చెల్లించాలని కొన్నేళ్లుగా అభ్యర్థిస్తున్నా ఖాతరు చేయడం లేదని, సొంతరాష్ట్రంలోనైనా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని మొరపెట్టుకున్నందుకు ఉద్యోగులను, ఈవో నానా దుర్భాషలాడినట్లు విమర్శలొచ్చాయి. అర్చకులను కూడా ఉన్నతాధికారులు దుర్భాషలాడారు. ఈ క్రమంలోనే భద్రాచలంలో ఈవోకు వ్యతిరేకంగా దీక్షలు మొదలయ్యాయి. ఈవోను మార్చాలని సీమాంధ్ర అధికారి స్థానంలో తెలంగాణ అధికారిని నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ నుంచి స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో బాసర ఈవోగా వచ్చిన సీమాంధ్ర అధికారి, ఉన్నతాధికారులు ఉద్యోగులను అగౌరవంగా చూస్తున్నారని, వారితో అమర్యాదగా మాట్లాడుతున్నారని విమర్శలున్నాయి. 

నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న సీమాంధ్ర అధికారికి సికింద్రాబాద్ గణపతి దేవాలయం, నల్లగొండ చెర్వుగట్టు దేవాలయం, బల్కంపేట దేవాలయం తదితర ప్రముఖ దేవాలయాల బాధ్యతలను అప్పగించారు. చిక్కడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో సీమాంధ్రకు చెందిన అధికారి ఈవోగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ను ఏర్పరచాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రభుత్వం చొరవ చూపడం లేదని తెలంగాణ దేవాలయ ఉద్యోగుల జేఏసీ విమర్శిస్తున్నది. సమస్యలన్నింటికీ తెలంగాణ ఉద్యోగులు పరిష్కారాలను చూపుతున్నా సీమాంధ్ర అధికారులు కొర్రీలు పెడుతున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

భద్రాద్రిలో ఆగని దీక్షలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ ఈవో ఎం రఘునాథ్ మొండి వైఖరికి నిరసనగా దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు బుధవారం కూడా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. అర్చకులు, ఉద్యోగులపై ఈవో వేధింపులకు పాల్పడుతున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. ఉద్యోగులు, అర్చకులు చేపట్టిన దీక్షలకు లోకల్ ఫండ్ ఆడిట్ జిల్లా అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, నాగేశ్వర్‌రావు, రామదాసు, తెలంగాణ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్నయాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు జీ శ్రీనివాసరెడ్డి, ఏపీజీవీబీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం, ఉభయదాతలు బోనాల గోపాలకృష్ణ, స్వచ్ఛంద సంస్థ వికాస తరంగిణి నుంచి డాక్టర్ కమల, ఎల్‌ఐసీ ఏజెంట్ల యూనియన్, మాజీ ట్రస్ట్‌బోర్డు సభ్యులు బాబ్జీరావు దీక్షలకు మద్దతు తెలిపారు. 

khamam

దేవస్థానం సిబ్బంది దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారుల ఆదేశానుసారం హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఈవో విషయంపై చర్చిస్తున్నట్లు ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. దీక్షల్లో సుబ్బారావు, వెంకటేశ్వరర్‌రావు, శివ, సీతారామసింగ్, శ్రీనివాస్‌గౌడ్, నంబూద్రిచార్యులు, మదనగోపాలాచార్యులు, వెంకటేశ్వర్‌రావు, లక్ష్మణ్‌రావు, లక్ష్మి, ఖాసీంబాబు, నాగేశ్వర్‌రావు, రామభద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి