గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 05, 2014

తొలగిన అడ్డంకులు.. అభివృద్ధి పరుగులు!


అరవై ఏళ్ల కల ఫలించింది. సీమాంధ్ర పాలనకు తెరపడింది. ఇక అంతా మన సర్కారు..మన ప్రజాప్రతినిధులే.. ఇన్నేళ్లుగా కోల్పోయిన నగర వైభవానికి మళ్లీ మహర్దశ రాబోతున్నది. నిజాం కాలం నుంచే సంస్కృతి, భాష, భౌగోళికంగా అన్ని అనుకూలతలు ఉన్న నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలకు కేంద్రంగా మారింది. ప్రపంచ ఖ్యాతిని గడించింది. కేసీఆర్ సుస్థిర ప్రభుత్వంలో ఇది మరింత పుంజుకోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్టు తదితర కంపెనీల రాకతో రియల్ ఎస్టేట్‌కు మళ్లీ ఊపు వచ్చే అవకాశాలున్నాయి. 

మన నగరం దేశానికి దాదాపు మధ్యభాగంలో ఉంటుందనే విషయం తెలిసిందే. ఆకాశమార్గంలో దేశంలోని ఏ మారుమూల ప్రాంతాని వెళ్లాలన్నా రెండు గంటలు చాలు. జాతీయ భద్రతా దళాని(ఎన్‌ఎస్‌జీ)కి చెందిన ప్రధాన కార్యాలయాన్ని మన నగరంలో ఏర్పాటు చేయడానికి ఇదో ముఖ్యకారణంగా చెప్పవచ్చు. అంతేకాదు, వాతావరణ పరంగా చూసుకున్నా ఇది అన్నింటికీ అనువైన ప్రాంతం. సమశీతోష్ణస్థితి ఉండడంతో ఎంతోకాలం క్రితమే మన నగరం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది. అయితే మధ్యలో పరాయిపాలనకు వ్యతిరేకంగా భూమిపుత్రులు సాగించిన పోరాటం, దీనికి వ్యతిరేకంగా పాలకులు జరిపిన దమనకాండతో ఇక్కడ కొంత అనిశ్చితి ఏర్పడినా తాజాగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రాష్ట్ర ఆవిర్భావమే కాకుండా సుస్థిర ప్రభుత్వం కూడా దీనికి తోడుకావడంతో ఇక నగరం మళ్లీ అభివృద్ధి బాటన పరుగులు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తన మొదటి ప్రసంగంలోనే రియల్ ఎస్టేట్ రంగంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనందిస్తామని ప్రకటించడం విశేషం. 

అన్నింటికన్నా చౌక 
సామాన్యుడినుంచి పేదవాడివరకు ఎవ్వరైనా సౌకర్యవంతంగా జీవించే అవకాశాలు మన నగర సొంతం. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే మన నగరంలో ఇళ్ల ధరలు ఇప్పటికీ అతి చౌకగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లలో ఇప్పటికీ ఒక చదరపు అడుగు ధర మూడున్నర వేలనుంచి నాలుగువేలకు మించలేదు. అదే బెంగళూరులో సుమారు రూ. ఏడు వేలు, చెన్నయ్‌లో రూ. ఎనిమిది వేలు ఉండగా, ముంబైలో తక్కువలో తక్కువ ఒక ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 12వేల వరకూ ఉంది. దీనివల్ల ఇక్కడ అద్దెలు కూడా అన్ని వర్గాలకూ అందుబాటులో ఉన్నాయి. 


విస్తరణకు అవకాశం...
సముద్ర తీరప్రాంతం ఉండడం వల్ల ముంబై, చెన్నయ్, బెంగళూరు తదితర నగరాల విస్తరణకు పెద్దగా అవకాశం లేదు. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో విస్తరణకు పుష్కలమైన అవకాశాలున్నాయి. నగరం చుట్టూ వంద కిలోమీటర్ల వరకూ రవాణా, మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే విస్తరణకు ఢోకా లేదు. సముద్ర తీరప్రాంతం లేకపోవడం ఒక విధంగా ప్రతికూలాంశమే అయినా ఇది అనేక విధాలుగా అనుకూలాంశంగా కూడా మారినట్లు చెప్పుకోవచ్చు. ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం మనిషి జీవించడానికి అత్యంత అనుకూలమైనదిగా అనేక పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలోనే సమశీతోష్ణ స్థితిగల ప్రాంతాల్లో మనది ఒకటి కావడం గమనార్హం. 


భాష, సంస్కృతి కలిసొచ్చే అంశాలు...
నిజాం కాలంనుంచి మన నగరానికి దేశంలోని వివిధ ప్రాంతాలే కాకుండా పలు ఇతర దేశాలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయా దేశాలతో వర్తక, వాణిజ్యాలు కూడా కొనసాగాయి. దీంతో అనేక ప్రాంతాలవారి కలగలుపుగా ఇది మరో మినీ ఇండియాగా ప్రఖ్యాతి గాంచింది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు కేంద్రంగా మారింది. దీంతో స్వతహాగానే ఇక్కడి ప్రజలకు హిందీపై పట్టు ఉండడంతో ఇతర ప్రాంతాలవారికి అనుకూల నగరంగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ, భాష, కుల, మత పరమైన దురభిమానం ఉన్నప్పటికీ ఇక్కడ ఎప్పుడూ ఇటువంటి ఛాయలు కానరాలేదు. హిందూ, ముస్లింలు సహజీవనం సాగిస్తూ వస్తున్నారు. దీంతో అన్ని వర్గాలవారికీ ఇది అనుకూలమైన నగరంగా పేరుగాంచింది. 


ఆనాడే భారీగా పెట్టుబడులు
నగరం అన్నింటికీ అనుకూలమైంది కావడంతో ఎంతోకాలం క్రితమే ఇక్కడ భారీ పరిశ్రమలు స్థాపితమై అంతర్జాతీయస్థాయి నగరంగా ప్రఖ్యాతిగాంచింది. అనేక ప్రాంతాలవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. వర్తక, వాణిజ్యాలు కొనసాగించారు. నగరం చుట్టూ పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దీనివల్ల భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడడంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడకు వలసలు పెరిగాయి. చౌక నగరానికి తోడు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడంతో నగరం అందరికీ అనుకూలంగా మారింది. 


తొలగిన అడ్డంకులు..సుస్థిర సర్కారు
రాష్ట్రంలో సుస్థిర సర్కారు ఏర్పడడంతో మళ్లీ నగరం తన పూర్వవైభవాన్ని సంతరించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. పరాయి పాలకుల కుట్రలు, కుతంత్రాల కారణంగా నగర వైభవం మధ్యలో కొంత మసకబారినా ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో మళ్లీ పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి. దీనికితోడు సర్కారు కూడా పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ రంగానికి అభయం ఇవ్వడంతో ఇక నగరం అభివృద్ధిలో మరింత వేగంగా పరుగులు తీసే ఆస్కారం ఏర్పడింది. ఇప్పటికే దాదాపు 100కుపైగా భారీ అపార్ట్‌మెంట్లు, వెంచర్లకు గత నెలరోజుల్లో అనుమతులు మంజూరయ్యాయి. దీన్నిబట్టి రియల్ ఎస్టేట్ రంగం రానున్న రోజుల్లో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి