గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 15, 2014

ఈ ప్రభుత్వం కూడా పూనుకోకుంటే ఎస్సారెస్పీ.. ఎడారే!


-వట్టిపోతున్న ఉత్తర తెలంగాణ వరప్రదాయిని
-ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 82 టీఎంసీలే!
-నిర్మాణ సమయంలో సామర్థ్యం 112 టీఎంసీలు
-పూడికతో 30 ఏళ్లలో 30 టీఎంసీల సామర్థ్యం పతనం
-ప్రాజెక్టు అస్తిత్వం కోల్పోతున్నా పట్టించుకోని సీమాంధ్ర సర్కారు
-స్వరాష్ట్రంలో కొత్త ప్రభుత్వంపైనే ఎస్సారెస్పీ భవితవ్యం

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వట్టిపోతున్నది! నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నీళ్లు లేక నోరు తెరుస్తున్నది! గత పాలకుల పాపాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. 18 లక్షల ఎకరా ల మాగాణులను స్థిరీకరించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు.. ఇప్పుడు సామర్థ్యాన్ని కోల్పో యి నీరివ్వలేని దుఃస్థితికి చేరుతున్నది. ఈ ప్రమాదం ఎప్పటి నుంచో పొంచి ఉందని అధికారులు నెత్తీ నోరూ కొట్టుకున్నా సీమాంధ్ర పాలకులు పక్షపాతానికి ప్రాజెక్టు పరాకాష్ఠకు చేరింది. ఓవైపు గోదావరిపై మహారాష్ట్ర అక్రమప్రాజెక్టులతో తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కోనున్న ఎస్సారెస్పీ, పాలకుల పక్షపాతంతో మరింత దయనీయ పరిస్థితికి చేరువైంది. భావితరాలకు బాసటగా నిలిచే భారీ ప్రాజెక్టు ఇప్పుడు నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 82 టీఎంసీలకు తగ్గిపోయింది. 91 టీఎంసీల సామర్థ్యం ఉందంటూ గొప్పలు చెప్పుకున్న అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం.. ప్రస్తుత పరిస్థితి వస్తుందని తెలిసీ గాలికొదిలేసింది.
శ్రీరాంసాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టు రైతాంగానికి ఏవిధంగా భరోసా ఇస్తారోనని తెలపాల్సిన బాధ్యత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు ఒక వైపు, ఏటేటా పెరుగుతున్న పూడిక మరోవైపు ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఆరునెలల కిందట పూడికపై సర్వే చేపట్టిన అధికారుల బృందం నిల్వ సామర్థ్యం తగ్గిందనే కఠోర వాస్తవాన్ని ఇంకా కాగితాలపైనే నాన్చుతున్నది. నివేదికలను అప్పటి ఆంధ్రా ప్రభుత్వానికి ఇవ్వలేదని చెబుతున్నప్పటికీ, ఇచ్చినట్లుగానే తెలుస్తున్నది. సీమాంధ్ర ప్రభుత్వమే కావాలని నివేదికలు రాలేవంటూ తప్పుడు మాటలతో తప్పించుకుంది.
ఏటేటా తగ్గుతున్న నిల్వ సామర్థ్యం: 1983లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 42 వరద గేట్లను ఎత్తి తొలిసారిగా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక గేట్లను ఎత్తినప్పుడు నీటి సామర్థ్యం 112 టీఎంసీలు (1091 అడుగుల నీటిమట్టం)ఉండేది. మొన్నటికి మొన్న చేపట్టిన ఏపీఈఆర్‌ఎల్ సర్వేలో ప్రాజెక్టు సామర్థ్యం 82 టీఎంసీలేనని తేలింది.

గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు ఆదిలాబాద్ జిల్లా బాసర నుంచి పూడికపై సర్వే ప్రారంభించి 40 రోజులపాటు కొనసాగించారు. ఈ నివేదికలను అప్పటి సీమాంధ్ర ప్రభుత్వానికి అందించినా సర్వేపై ప్రకటన చేయకుండా దాటవేశారు. సర్వే బృందంలో చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమాదేవితోపాటు మరో ఆరుగురు ఇంజినీర్లు పాల్గొన్నారు. ఆలస్యంగా అయినా నివేదికలను వ్యక్తం చేయాల్సినప్పటికీ ఇంకా తమ వద్దే ఉన్నాయని జనవరి చివర్లోనూ సర్వే అధికారులు ముక్తాయించారు. 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరిగ్గా 30 ఏళ్లలో 30 టీఎంసీల సామర్థ్యాన్ని కోల్పోవడం భారీ నష్టాన్ని కలిగించనుంది. దీని ఫలితంగానే గత 30 ఏళ్లుగా ఏ ఒక్క సీజన్‌లోనూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టు స్థిరీకరణ జరుగకపోవడమే దీనికి ఉదాహరణ.

గతంలోనూ నత్తనడకనే సర్వేలువాస్తవానికి ఐదేళ్లకొకసారి పూడికతీతపై సర్వే జరపాలి. కానీ అధికారులు ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు. 1989లో కెనడా ఇంజినీర్లతో సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఎస్సారెస్పీ పూడికపై సర్వే నిర్వహించారు. అప్పటికే బాగా పేరుకుపోయిన పూడికను తీయడం సాధ్యం కాదని తేల్చారు. తర్వాత 1994లో సర్వే నిర్వహించారు. అప్పటికే 112 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టు 94 టీఎంసీలకు తగ్గిపోయింది. తిరిగి 2006లో చేపట్టిన సర్వేతో కేవలం 3 టీఎంసీల నిల్వ సామర్థ్యమే తగ్గిందని అప్పటి సర్వే బృందం నివేదిక ఇచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవమని అధికారులే కొట్టిపారేశారు. తర్వాత మళ్లీ సర్వే చేపట్టాలని అనేకమార్లు విజ్ఞప్తి చేయగా 2013 డిసెంబర్‌లో సర్వే చేపట్టారు.

ప్రభుత్వంపైనే ఎస్సారెస్పీ భవితవ్యంసుమారు 50 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సీమాంధ్ర పాలకుల పక్షపాతానికి నిలువుటద్దంగా నిలిచింది. దేశంలోని బహుళార్థసాధక ప్రాజెక్టుల్లో ఒకటైన ఎస్సారెస్పీ పూర్తి వివక్షకు గురైంది. కాల్వల ఆధునీకరణ మొదలుకొని ప్రాజెక్టు సామర్థ్యం, మరమ్మతులను పట్టించుకోకుండా గాలికొదిలేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సారెస్పీకి మళ్లీ ప్రాణం వస్తుందన్న భరోసా రైతుల్లో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వంపైనే ఎస్సారెస్పీ భవితవ్యం ఆధారపడి ఉంది. నీటిపారుదల రంగానికి అగ్ర తాంబూలం వేసిన ప్రభుత్వం, ఎస్సారెస్పీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారన్న ఆశ రైతుల్లో బలంగా ఉంది. వెంటనే ఎస్సారెస్పీ సామర్థ్యంపై వాస్తవ సర్వే చేపట్టి ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేలా ప్రణాళికలు రూపొందించాలని రైతులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి