గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 28, 2014

పదవులకే ఠీవి.. మన పీవీ

-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు
-అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
-దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ
-మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వాలు
-పరాయిపాలనలో తెలంగాణ బిడ్డల విస్మరణ
-ఇకపై ఆ దుస్థితి కొనసాగొద్దంటున్న సీఎం కేసీఆర్
-తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యేక గుర్తింపు
-పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
PV
పాములపర్తి వెంకట నరసింహారావు.. తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆ బిడ్డ ప్రజాజీవితంలో అంచెలంచెలుగా ఎదిగి క్లిష్ట సమయంలో భారతదేశ ప్రధానిగా ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగా తన ప్రత్యేకతను చాటిచూపిన నేత. మృదుస్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోం, విదేశాంగ, రక్షణ మంత్రిగా రాణించారు. పదవులకు వన్నె తెచ్చారు. తన రాజనీతిజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, అనంతరం ప్రధానిగా ఐదేండ్లు రాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో నిరాటంకంగా పరిపాలన కొనసాగించారు.

ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఈ తెలంగాణ గడ్డ. పోరు తెలంగాణ నుంచి ఎదిగి రాజకీయ సమరంలో విజయభేరి మోగించారు. 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న 83 ఏండ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. ఆయన 93వ జయంతి నేడు. అంతటి గొప్ప పదవులు నిర్వహించిన ఆ నేతను ఇంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సముచితరీతిలో గౌరవించలేదు. ఇక్కడ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇంతకాలం పరాయిపాలనలో విస్మరణకు గురయిన తెలంగాణ బిడ్డల జీవితాలను, చరిత్రలను సమాజానికి, ఈ తరానికి తెలియజేయాల్సిందేనని సంకల్పించింది. తెలంగాణ పోరాట వారసత్వ స్ఫూర్తితోనే పోరాడి గెలిచి తెలంగాణను సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం ఇప్పుడు పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. వివిధ రంగాల్లో రాణించిన తెలంగాణ బిడ్డల ఘనతను చాటిచెప్పే యత్నంలో ఇది తొలి అడుగు.

తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన పీవీ నరసింహారావు తెలుగు నేలపైనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం తన ప్రత్యేకతను చాటిచెప్పారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి, వందేమాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులై, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లో అడుగుపెట్టారాయన. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి, నూతన విధానాలకు నాంది పలికారు. భారతదేశంతో విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కృషి సలిపారు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఆయన జీవిత విశేషాలను గుర్తుచేసుకుందాం.

వరంగల్ జిల్లాలో పుట్టి.. కరీంనగర్ జిల్లాలో పెరిగి..

పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించారు. మూడేండ్ల వయసులో పీ రంగారావు, రత్నాబాయి దంపతులు దత్తత చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందేమాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పుణె ఫెర్గొసన్ కాలేజీలో బీఎస్సీ అంతరిక్ష పరిశోధన (ఆస్ట్రానమి), ఆ తర్వాత నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా పూర్తిచేశారు. ఎల్‌ఎల్‌బిలో ఆయన గోల్డ్‌మెడల్ సాధించారు. అనంతరం హిందీలో సాహిత్యరత్న చేశారు. నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పీవీ కీలక పాత్ర పోషించారు. 

రాజకీయాల్లో అంచెలంచెలుగా..

1940లో రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ తాను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొనసాగారు. స్వామి రామానందతీర్థ పీవికి రాజకీయ గురువు. రామానంద తీర్థకు ముగ్గురు ప్రియశిష్యులు. వారిలో పీవి మొదటివారు. మరో ఇద్దరు ఎస్‌బీ చవాన్, వీరేంద్రపాటిల్. ఈ ముగ్గురు కూడా ఆయా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా పనిచేయడం గమనార్హం. వీరిలో పీవిని ప్రధాని పదవి వరించింది. ఆయన ఐదేండ్లపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు.

1952లో పీవీ తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1984, 1989 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండతోపాటు మహరాష్ట్రలోని రాంటెక్ లోక్‌సభ స్థానాల నుంచి పీవీ పోటీచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

అప్పటికి పార్లమెంటు సభ్యుడిగా లేని పీవీ ప్రధాని పదవి చేపట్టిన అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉపఎన్నికలో లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో పీవీ మెజారిటీ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీగా రికార్డు సాధించింది. అప్పుడు పీవీ ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు పోటీ నుంచి వైదొలిగి సహకరించాయి. ఆ తరువాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాలతోపాటు ఒడిశాలోని బర్హంపూర్ స్థానాల నుంచి పోటీచేసిన పీవీ రెండుచోట్లా గెలుపొందారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బర్హంపూర్‌కు ప్రాతినిధ్యం వహించారు. 

మంత్రిగా జైళ్ల సంస్కరణల నుంచి..

రాజకీయాల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న పాములపర్తి వెంకట నరసింహారావు అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టి గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందారు. 1962లో నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టిన పీవీ రాష్ట్ర జైళ్ల శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

జైళ్ల సంస్కరణల్లో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే మొదటిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అక్కడ కూడా అనేక మార్పులు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించారు. అనంతరం విద్యాశాఖమంత్రిగా పనిచేసిన సమయంలో పీవీ ప్రవేశపెట్టిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయంటే అతియోశక్తి కాదు. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాదిన్నరపాటు పనిచేసిన పీవీ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలో తొలిసారిగా భూసంస్కరణలు తీసుకొచ్చారు.

పీవీ హయాంలో తెలంగాణ ఉద్యమంతోపాటు జై ఆంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో.. చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. భూసంస్కరణల చట్టం అమలు రుచించని సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దె దించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరిపోశారని కొందరంటుంటారు.

మైనారిటీలో ఉన్నా.. ఐదేండ్ల పాలన

ప్రధానమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. అయినా పీవీ తన వాక్‌చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో ఐదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపర్చారు. ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సంస్కరణల ద్వారా గట్టెక్కించి ప్రగతి పథంలో నడిపించారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు, ప్రజల మద్దతుతో అందర్ని కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు.

కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు.. ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దే బాటలు వేశారు. ప్రధానిగా పనిచేసిన ఐదేండ్లకాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప 1996లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శా రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గడచిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా.. ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే ఎజెండాతోనే పీవీ ముందుకు వెళ్ళేవారని ఆయన సన్నిహితులు, దగ్గరనుంచి చూసినవారు చెప్తుంటారు. 

పదవులకు దూరమై.. పార్టీలోనే కొనసాగి..

కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో పీవీ 1998లో లోక్‌సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటీచేయలేదు. ప్రధాని పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలపాటు పదవులకు దూరంగా ఉంటూ, సాహిత్య సేవచేస్తూ కాంగ్రెస్‌తోనే తన అనుబంధం కొనసాగించారు. బహుభాషా కోవిదుడిగా, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. 

జాతీయ రాజకీయాల్లో రాణింపు..

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన అనంతరం పీవీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1975లో తొలిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను హన్మకొండ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలబెట్టింది. 1980లో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో పీవీకి చోటు దక్కింది. అప్పట్లో ఆయన కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో కొంతకాలంపాటు కేంద్ర హోంశాఖ, తర్వాత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 1988లో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు.

కొత్త కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీని ప్రధాని పదవి వరించింది. అలా ఆ పదవి చేపట్టి తెలుగు రాష్ట్రం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా పీవీ రికార్డు సాధించారు. తన పాలనలో పీవీ అనేక సంస్కరణలు చేపట్టి కొత్త ఒరవడి, కొత్తదనాన్ని చూపించారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరుగాలని ఆయన కోరుకునేవారు.

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి