గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 30, 2013

అఖిల పక్ష సమావేశ మవసరమ్మె?!


అఖిలపక్షాలఁ బలుమారు లడుగఁ, దనదు
పార్టి వైఖరిఁ దెలిపిరి వాటి నేత; 
లవియ యనుసరించియుఁ గేంద్ర మాస్థతోడ 
మన "తెలంగాణ రాష్ట్ర మిత్తు" నని తెలిపె! (1) 

’కోర్’ కమిటి యొప్పుకొనె! ’నోటు’ కోరి వెలసె! 
కేంద్ర మంత్రి వర్గము పరీక్షించి యన్ని; 
తగిన యేర్పాటులను జేయఁ దగు నటంచుఁ 
గోరె సకలాభిమతముల క్షుణ్ణముగను! (2) 

కేంద్ర హోం శాఖ యిటఁ బరికించఁగాను, 
టాస్కు ఫోర్సు బృంద నియమితమ్ముఁ జేయఁ; 
గార్య వర్గ సమావేశ కారణములఁ 
జర్చ చేసి, ముందుకు పోవ సాఁగె నదియు! (3) 

ఇన్ని చేసిన కేంద్రమే, యిప్పు డిట్టి 
యఖిల పక్ష సమావేశ మవసర మని 
తెలుప, సందేహముల్ గల్గె! స్థిర మనమ్ము 
లల్ల కల్లోల మాయెను తల్లడిలుచు! (4) 

మన తెలంగాణ రాష్ట్ర తీర్మానమునకు 
హర్ష మందెను తెలగాణ మా దినమున! 
నేఁ డఖిల పక్ష మనఁగ సందేహ మొదవె 
“నేమి సేయుదురో తెలగాణ నిప్పు”డనుచు! (5) 

“రాష్ట్ర మేర్పాటు సేయంగ రా”దటంచుఁ 
బల్కు దుష్టుల కుట్రచే, బలి పశువుగ 
మా తెలంగాణ ప్రజల సన్మానసములఁ 
జేయు నేమొ యీ కేంద్రమ్ము శీఘ్ర గతిని? (6) 

విభజనమునందు భాగమా? వేచి, మేమె 
యఖిల పక్ష సమావేశ మాదరించి, 
స్వాగతింతుము! కానిచో, సకల జనుల 
మొక్కటై యుద్యమింతుము నిక్కముగను! (7) 

“అంత మన మంచికే”యని యనుకొనుచును,
వేచి యుండిరి తెలగాణ వీరు లిచట! 
ద్రోహ మేమైన జరిగెనా, తూర్ణముగను 
నుద్యమింతురు సాధనోన్ముఖులు నయ్యు! (8) 

ఇదియె సత్యాగ్రహమ్ము! సదీప్సిత మగు
మా తెలంగాణ, శీఘ్రమే మాకు నొసఁగి, 
మా మనమ్ములను బులకింపంగఁ జేయ, 
మా కృతజ్ఞతఁ దెలుపుదు మందఱ మిట! (9) 

అఖిల పక్షమ్ము తెలగాణ మవతరింపఁ 
జేయు రీతిని మెలఁగఁగాఁ జేతు మిదియ 
ప్రార్థనము కేంద్రమున కేము! రాజకీయ 
మేది యైన జరుగుచో, నిమేషమైన 
నోర్చుకొనక, చేపట్టెద ముద్యమమును! (10) 

జై తెలంగాణ!          జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 27, 2013

ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!


ఏకపక్ష సమైక్యాంధ్ర హెచ్చులకయి
సభలు నిర్వహించఁగ సమంజసము కాదు!
“నేను విడిపోదు”నను తమ్ముని బలిమిగను
కలిసి జీవించఁగా నాపు కార్య మిదియె? (1)

ఇట్టి సీమాంధ్రులును జేయునట్టి సభను

దెలిపెఁ “దెలగాణ వాణి” సతీశు గౌడు!
“జై తెలంగాణ” నినదమ్ము స్వేచ్ఛగాను
నొక్కఁ డయ్యును నెలుగెత్తె నొక్కసారి! (2)


ఓయు విద్యార్థి జేయేసి యొక్కటి యయి,
సభను నడ్దుకొనంగను సాఁగి వచ్చె!
వారె గడ్డము శ్రీరాము ప్రభృతు! లచట
“జై తెలంగాణ” నినదముల్ స్వేచ్ఛగాను
సలిపి, తెలగాణ కోరికఁ దెలిపినారు! (3)


విషపు సీమాంధ్ర వాక్కుల వినఁగ లేక,
రుద్రుఁడై శివతాండ వోగ్రుండు నగుచు
నడ్డ, నాకుల శ్రీనివాస్ రెడ్డి బూటు
విసరె వేదిక పయికి నుద్విగ్న హృదిని! (4)


ముప్పయొకవేయి వారలు; మువురు వీర;
లైన నేమాయెఁ దెలగాణ మానసమును
దెలిపి రయ్య వీరలు! మేటి ధీరు లయ్య!
ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!
మన తెలంగాణ వీరులు! మాన్యు లయ్య!! (5)


“అడుగఁ దలఁచు కొన్నా”నంచు నడిగి యడిగి,
యన్ని ప్రశ్నలు పసలేని వనియుఁ దెలిసి,
పలికి బొంకినవాఁ డటఁ బల్క, నవియ
యొప్పు లగునె? తప్పులు తప్పె గాని! (6)


సభకుఁ దరలి వచ్చెడునట్టి జనుల నాపి,
నిరసనముఁ దెల్పినారు, నిర్ణీతమైన
భాషణల కృత్యములతోడ వాంఛితమును!
వారు వరదన్నపేఁట్, రాయపర్తి ఘనులు!! (7)


అటులె యడ్డుకొన్నా రయ్య యా సభికుల,
బట్టుపల్లి, కడిపికొండ వాసులపుడు!
నిరసనముఁ దెల్పినను వారి నిర్ణయమును
మార్చుకొనరైరి కఠినులు! మానవులరె? (8)


ఎన్ని సభలను జేసియు, నెన్ని వాగి,
బీరములు వల్కి, బెదరించి, వెఱ్ఱులెత్తి,
యెన్ని తైతక్క లాడిన నేమి యైన,
మన తెలంగాణ రాష్ట్రమ్ము మాన్పఁ గలరె? (9)


ధర్మ మున్నది మనవైపు! దైవ కృపయు
నుండె మన పైన ! న్యాయమే యున్నదయ్య
మనను గాపాడఁగా నిట! మన యుసురులు
తప్పకుండఁగ దోపిడీ దారులకును
దాఁకు నో తెలంగాణ సోదర! నిజముగ
మన తెలంగాణ రాష్ట్రమ్ము మనకు దక్కు!! (10)


జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

గురువారం, అక్టోబర్ 24, 2013

బాగుపడి చూపుటయె నేతృ పరమ కృతము


"విభజనకు మేము వెనుకంజ వేయఁ బోము;
ఆఱు నూఱైనఁ "దెలగాణ, మాంధ్ర రాష్ట్ర
ము" లను, రెండు రాష్ట్రమ్ములు తెలుఁగు వారి
కేరుపాటు చేతు"మటంచుఁ గేంద్ర మనియె! (1)

విభజనము తప్పదని తెల్సి, పిడికి లెత్తి,
"యడ్డు పడె"దంచుఁ బల్కిన నాగునదియె?
"తెలుఁగు జాతి యొక్కటిగాను వెలిఁగి పోవఁ
గావలె"నటంచుఁ బైకి వల్కంగ; లోన
దుష్ట యోచనఁ జేయంగ, శిష్ట మగునె? (2)

కేంద్ర ప్రకటన రాఁగానె క్షేమ మెసఁగ
విభజనమునకు సమ్మతి వేగఁ దెలిపి
యున్నచో నింత కాలమ్ము సున్న యగునె?
ప్రజల కష్టాల పాల్జేయ వాంఛితమ్మె? (3)

కలుగుచున్నట్టి పరిణామ క్రమముఁ గాంచి,
మేలుకొన్నచో జరుగును మేలు! కాని,
"యింక నే కుట్రలను జేతు నిప్పు"డనిన,
మెచ్చ రెవ్వరు మిమ్మింక! కచ్చె హెచ్చు!! (4)

"విభజనము వ"ద్దనెడి మాట పెక్కుఱకును
బాధఁ గలిగించు! నవకాశ వాదుల కదె
సంతసముఁ గూర్చు! వ్యాపార సరణి కొఱకు
నందఱను నష్ట పఱుపంగ న్యాయ మగునె? (5)

కలసి యుండియుఁ బోట్లాటఁ గనుట కన్న;
మనము విడిపోయి, సుఖముగా మనుట మిన్న!
కలసి యుండిన సుఖములు కలుగు ననెడి
మాట ప్రాఁత వడిన మాట! నేఁటి మాట,
వేఱు పడినచో సుఖములు, ప్రేమ పెరుగు! (6)

కేంద్ర మంత్రి వర్గము నేఁడు కృత వినిశ్చ
యమ్ముతో నుండె విభజింప! నందు వలనఁ
గాక యున్నను, బ్రజల మేల్గనఁగ నెంచి,
వేఱు పడఁగాను మేలగుఁ; బ్రేమ లెసఁగు!! (7)

శీఘ్ర మభివృద్ధిఁ గోరిన, శీఘ్రముగను
రెండు రాష్ట్రమ్ము లిప్డు వేర్వేఱుగాను
ప్రభవ మందంగ వలె! గాన, భ్రాంతి విడచి,
వేగమే విడిపోయిన, వెతలు తొలఁగు! (8)

శ్రేయ మందఁగ జాప్యమ్ముఁ జేయ మాని,
ప్రజల కొనఁగూడు లాభమ్ము పఱగ నెంచి,
నవ్య రాష్ట్రోపయుక్త కాంక్షలను దెలిపి,
బాగుపడి చూపుటయె నేతృ పరమ కృతము! (9)

జై తెలంగాణ!    జై సీమాంధ్ర!

ఆదివారం, అక్టోబర్ 20, 2013

రండి! భావి జల దోపిడీకి అడ్డుకట్ట వేయండి!!


"తెలంగాణ రాష్ట్రం" ఏర్పడనున్న తరుణంలో, సీమాంధ్ర సర్కారు, జీవోఎంకు సమర్పించిన నీటి పంపకాల దొంగలెక్కల చిట్టా ప్రకారం, నీటి పంపకాలు జరిగితే, తెలంగాణా...నీటి హక్కులకోసం, మరో 37 ఏళ్ళవరకు, కనీసం పోరాటం జరిపే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత...జాగ్రత!! -      "ఏది సత్యం?" బ్లాగు సౌజన్యంతో...>చూడుడు: edisatyam.blogspot.in (dt.20-10-2013)


మన తెలంగాణమును మోసమందు ముంచఁ 
బూని, సీమాంధ్ర మంత్రులు వోయి వేగ 
కేంద్ర మంత్రి వర్గమ్మున కిచ్చినట్టి
నీటి వినియోగ వివరాలు “నీటి లెక్కె!” (1)


మన తెలంగాణమునఁ బాఱు మన నదీ జ 
లముల దొంగ కేటాయింపు లన్ని చూపి,
యింకఁ దెలగాణ వనరుల నెంత దోచు

కొనఁగఁ గోరిరో సీమాంధ్ర క్రూర ఘనులు? (2) 

మన నమాయకులను జేసి, మన వనరుల 
మనకుఁ గాకుండఁ జేయంగఁ, గనుచు, నోరు
మెదప కుండిన తెలగాణ మిన్నలైన

మంత్రి వర్యుల చర్యలు మంచి వగునె? (3) 


నోరు మెదపక యున్నచో నీరు వోయి, 
యచటి సీమాంధ్రఁ బాఱు; నిచట మనకుఁ
బంట లెండును; కడుపెండు; భవిత యెండుఁ;
బూర్తి తెలగాణ మెండును; పోరు మిగులు! (4)


నీర మనఁగాను జీవమ్ము! నీరు లేక
జీవన మ్మెట్లు నిలుచును? నీవు, నేను,
మనము, తెలగాణ రాష్ట్రంపు జనులు లేరు!
కాన, నీటికై పోరున కరుగ వలయు!! (5)


కండ్లు తెరువుండు తెలగాణ కార్యకర్త 
లార! రాఁబోవు గండమ్ము లన్ని కనుఁడు!
మేలుకొని, తగు చర్యలు కీలు కొలిపి,
ఘన తెలంగాణఁ గాపాడఁ గాను రండు!! (6)


జై తెలంగాణ!        జై జై తెలంగాణ!!

మంగళవారం, అక్టోబర్ 15, 2013

తెలంగాణ జాతిపితకు అశ్రునివాళి...


తేది: జూన్ 21, 2011 నాడు మన తెలంగాణ జాతిపిత, మన మార్గ ప్రదర్శకుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వర్గస్థుడైన వార్త వినగానే నాలో నుండి పెల్లుబికిన అశ్రునివాళి… 

ఉత్పలమాలిక: 

“ఓ తెలగాణ జాతిపిత! యో జయశంకర! యో గురూత్తమా!
మా తెలగాణ నేతలకు మార్గ ప్రదర్శనఁ జేసి, నిత్యమున్ 
జాతికిఁ జేతనమ్ము నిడి, చల్లని మాటల స్ఫూర్తి నిచ్చియున్, 
నీతి నిజాయితిన్ నిలిపి, నీ చిరకాల స్వరాష్ట్ర కాంక్షమై 
యీ తెలగాణ యుద్యమము నెంతయొ ముందుకుఁ బోవఁ జేసి, నీ 
చేఁతలతోన రాష్ట్ర మిట సిద్ధియు నొందక మున్న దైవమై 
మా తలరాత మార్చు వర మీయఁగ నెంచియు స్వర్గగామివై 
పోతివి దుఃఖవార్ధి మము మున్గఁగఁ జేసియు మమ్ము వీడియున్! 
యాతన మాకు శేష మయె; వ్యాకుల చిత్తుల మయ్యు మేమిటన్ 
జేతుము నీకు వందనము శీర్షము వంచి, మహోత్తమాశయా! 
చేతుము రాష్ట్ర సిద్ధి, ఘన చిత్తతతో నిఁక నుద్యమించి, యో 
యీ! తెలగాణమాత సుత! యీ తెలగాణము రాష్ట్ర మయ్యెడున్!” 


(నాటి నా మాట నేడు యథార్థము కాబోతున్నదనే ఆనందం…తెలంగాణ రాష్ట్రోదయాన్ని కన్నులారా తిలకించడానికి మా తెలంగాణ జాతిపిత లేడుకదా అనే విచారం…రెండు కలగలసిన ద్వైధీభావం నా మనస్సును ఆవరించింది. హే భగవాన్! మా మార్గదర్శి ఆత్మకు శాంతిని ప్రసాదించమని మాత్రమే నేను కోరగలను. అంతకు మించి ఏమి చేయగలను?)

జై తెలంగాణ!          జై జయశంకర్ జీ! 

ఆదివారం, అక్టోబర్ 13, 2013

మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా!

తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!


చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)

పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)

                        -:శుభం భూయాత్:-

బుధవారం, అక్టోబర్ 09, 2013

నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ!


*
"నాకుఁ దెలగాణ నిచ్చెడు, నాపెడు బల
మేమియును లేదు! మీ సెంటిమెంటు నేను
గౌరవింతు" నటంచును కమ్మఁగాను
బలికి, యిపుడిట్టి దీక్షఁ జేపట్టినట్టి
రెండు నాల్కల జగను దుర్నీతి తోడ,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (1)

*
"ఆత్మ బలిదాన మెంతయు నార్తి దాయ
కమ్ము! బాసచేసి, యనెదఁ గాంక్షతోడ,
నింక బలిదానములు వల, దిచ్చటఁ దెల
గాణమును బలయుక్తనుగా నొనర్తు!
సోదరుల్లార! తెలగాణ సువిదితమగు
కాంక్ష నెప్పుడు నే నెద గారవింతు"
ననియు శర్మిల యా నాఁడు నమ్మఁ బలికి,
నేఁడు దీనిఁ "బాకిస్తా" ననెడి విధమున,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (2)


*
పదవి కొఱకయి మామనే వంచనమున
పదవి వీడఁ జేసినయట్టి బాబు నాఁడు,
"బిల్లు పెట్ట, మద్దతు నిత్తు వేగ సభ" న
టంచుఁ బల్కి, తెలంగాణ వంచకుఁ డయి,
కేంద్ర మిడఁగా, విభేదించి, కీడు సలిపె!
సీటు కోసము చెప్పిన మాట తప్పి,
మోసగించంగఁ జూచెడు వేసగాఁడు;
రెండు కండ్ల సిద్ధాంత సుప్రీతుఁడైన
బాబు దీక్షల, మాటలఁ బరిగణించి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (3)

*
బ్రతుకు నిచ్చిన కాంగ్రెస్సు బాట నడ్డి,
సొంత లాభమ్ము కోసమై, సొంత జనులఁ
జింతలనుఁ ద్రోయఁగా సాహసించియుఁ, దెల
గాణమును తుంగలోనఁ ద్రొక్కఁగాను దలఁచి,
కుటిల కృతముల నుద్యమ నటకుఁడైన
నల్లికుట్టుల నల్లారి నయ విరహిత
చేష్టలను , వాక్కులను దెలిసి తెలిసి, యిఁక
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (4)

*
నీదు మార్గమ్ము తెలగాణ; నీతి, రీతి,
ఖ్యాతి తెలగాణ; మంత్రమ్ము, ఆశయమ్మ
దియ తెలంగాణ; ధర్మమ్ముఁ దిరుగ నీఁక,
న్యాయమునుఁ దప్పనీఁక;సహాయము నిడి,
సహనమునుఁ బూని, తెలగాణ సాధనమున
నెంద ఱడ్డము వచ్చిన; నెవరు నింద
సేసిన; విని, వినని వాని వేసముఁ గొని,
మన "తెలంగాణ రాష్ట్రమ్ము" మనకు దక్కు
దనుక, మోసకారుల బాస తలను నిడక,
యెల్ల వేళల నప్రమత్తోల్లమునను
రాష్ట్ర సాధనా లక్ష్యమ్ముఁ గ్రాలుచుండఁ,
గృత్యములఁ జేయఁగాను రాష్ట్రేప్సితమ్ము
త్వరితముగ నెఱవేఱు! నీ తపన తీరు!!
గాన, నిన్నిప్పు  డుడికించఁ గాను బూను
దుష్ట దుర్మార్గ దుర్నీత దుర్మదాంధ
భాషణము లెప్పుడును నీవు వలచి వలచి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (5)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 06, 2013

ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?!


కేంద్ర మిటు నోటుఁ బెట్టంగఁ, గ్రిందు సేయ
సీమ నాయకు లట దుష్ట చేష్టఁ బూని,
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు
చేయఁ బురికొల్పి రిదియేమి చిత్ర మయ్య? (1)

మా తెలంగాణమును దోచు మార్గ మిటుల
మూయఁ బడఁగానె, దోపిడీ మానసములు
మిన్న కుండునె? సీమాంధ్ర మీఱి హద్దు,
దోచుచుండిరి ప్రజల నాందోళన నిడి! (2)

అఱువ దేండ్ల దోపిడిని మే మందఱ మిట
నోర్చి, యుద్యమమును జేయ, నొక్కఁ డైన
“మీకు జరిగె నన్యాయమ్ము; చేకుఱు సుఖ
ము” లనియుఁ బల్కెనే? కర్కశులరుఁ గాదె! (3)

ఇచట నుద్యమ మందున నే యకృత్య
మేని జరిగెనే? యఱువది యేఁడుల నిర
సనము శాంతి యుతముగానె జరిగెఁ గాదె?
యఱువది దినాల సమ్మెలో నవియ యేమి
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు? (4)

ఈ నిరాహార దీక్షలు హేళనముకె!
వోట్లు, సీట్లు, కోట్ల కొఱకె పొండు పొండు!!
ఇటఁ దెలంగాణలో నుద్యమించ మీర
లిట్లు దీక్షలు సేసితిరే? దురాశ! (5)

"వేగఁ దెలగాణ బిల్లును బెట్టుఁ, డేము
మద్ద తిచ్చెద" మంచును మాటలాడి;
కేంద్ర మొప్పుకొనంగనే, కృతము మఱచి,
దీక్షలను జేయ నేమండ్రు తెలుఁగు జనులు? (6)

ఉద్యమము ముసుఁగునను దురూహఁ బూని,
దొంగ మూఁకలఁ జేర్చి, విదూషకులయి,
ప్రజల దోచి, ప్రభుత నష్ట పఱచి, కాల
మును గడపఁగను మీకేమి మోద మబ్బె? (7)

మీర లిఁకనైనఁ బ్రజల హింసింప మాని,
దొంగ వేషాలు వదలి, సంతోష మిడెడు
కృత్యములఁ జేయ, బాగుగాఁ బ్రీతి నంది,
ప్రజలు మిముఁ జేరి, నమ్మెద రయ్య నిజము! (8)

కేంద్రమునకు మీరిచ్చిన కృత ప్రతిజ్ఞ
చెల్లు బాటగు నట్టులఁ జేసి, మీరు
ఘనతఁ జాటుకొనిన వేగ గౌరవ యుత
స్థానములు దక్కునయ్య! మీ స్థాయి పెరుగు!! (9)

కాన యిఁకనైనఁ బ్రభుతకుఁ గాంక్షఁ దెలిపి,
రెండు రాష్ట్రాలు సాధించి, ప్రేమఁ గనుఁడు!
బడుగు బహుజన ప్రజల సంబరము నందుఁ
బాలుఁ గొనుఁడు! మీ ఖ్యాతి నిజాలు కనుఁడు!! (10) 

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

తెలంగాణ ప్రథమ విజయం!

నా తెలంగాణ సోదరులకు
శుభాకాంక్షలు!!


సిరులు తొలుకాడు తెలగాణ సీమ నేఁడు
సంతసమ్మునఁ దేలి, ప్రశాంత మాన
సాబ్జ యయ్యెఁ గేంద్రామోద సాక్ష్యమైన
ప్రకటనా పత్రమునుఁ జూచి వఱలి యిచట! (1)

అఱువదేండ్ల నిరీక్షణ హర్షపూర్ణ
మాయె నేఁడు కేంద్రమ్మిడె న్యాయమైన
తీర్పు! సీమాంధ్ర ఘటిత విదీర్ణ హృదయ
మీ దినమ్ము చికిత్సచే మోదమందె!! (2)

నా తెలంగాణ సోదరా! నవ్య రాష్ట్ర
మీ తెలంగాణ, వెలిఁగించు నీదు బ్రతుకు!
స్వేచ్ఛనందిన హృదయానఁ జేయుమయ్య
"జై తెలంగాణ" గానమ్ము సంతసమున!! (3)

కేంద్ర సంకల్ప సాధనా కీర్ణమైన
చర్య నీ దినమునఁ బ్రయోజన కరమని
పరవశమ్మునఁ బ్రజలంత స్వచ్ఛమైన
మనముతో స్వాగతించిరి ఘనముగాను!! (4)

అఱువదేఁడుల యాఁకలి యాఱునంచు
నాశతోఁ జూచు తెలగాణ నాయకులకుఁ
జేతు జేజేలు, నతులు విశేషముగను
నా తెలంగాణ రాష్ట్ర సంజనిత తుష్టి!! (5)

కేంద్ర ప్రకటన మాత్రాన గృహము నలికి,
పండుగను జేసికొనఁగాను వలదటంచు,
మనసు బోధించు చున్నది; మన స్వరాష్ట్ర
మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి,
యెదిరి కదలికల్ తెలివితో నెఱుఁగ వలయు;
దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!! (6)

జై తెలంగాణ!                           జై జై తెలంగాణ!!

మంగళవారం, అక్టోబర్ 01, 2013

విజయనామ సంవత్సర యుగాదినాటి సంఘటన...(గేయ కవిత)



శ్రీలు గురియు ఈ విజయ యుగాది
మాత అరువదేడుల క్రిందట జనె
ఆంధ్ర తెలగాణ లెటుల నున్నవో
చూచి వత్తమని కడు వేడుకతో!


పందొమ్మిది వందల యేబది మూ
డప్పటి మాటిది! విజయ యుగాది
మాత వెళ్ళెను ముందుగ ఆంధ్రకు!


ఆంధ్ర మాత కన్నీటితొ ఎదురై
“నా తనయులు మదరాసు రాష్ట్రమున
బానిస బతుకులు బతుకుచుండి”రని
బావురుమని “కాపాడు”మన్నది!



విజయ యుగాది మాత “కాతు”నని
అభయమిచ్చి, యిక తెలంగాణను
చూచిపోవుటకు రయమున వచ్చెను!


నాడు హైదరాబాదు రాష్ట్రమున
నిజాము పాలన అంతము కాగా
తెలంగాణమున ప్రజలందరును
యుగాది మాతకు స్వాగత మిడిరి!

సంతసమున తెలగాణ తల్లియును
“నా పిల్లల చల్లగ జూ” డన్నది!

“అటులే” యని యా యుగాది మాతయు
“ఆంధ్ర మాత కన్నీరు తుడువు” మని
కోరె తెలగాణ తల్లిని మరి మరి!


సోదరి బిడ్డల దీన స్థితి విని
జాలిపడిన తెలగాణ తల్లి, కప
టమ్మెది లేకయు మాట యిచ్చెను!



మాట తీసుకొని విజయ యుగాది
అరువదేండ్ల తరువాత ఆంధ్రలో
రెండువేల పదమూడు వత్సరము
లోన అడుగిడియును అంతట చూచెను;
ఎచట జూచినా కోలాహలమే,
జనుల మోమునను సంతోషమ్మే,
తెలంగాణమును దోచిన ఛాయలె!!
విజయ యుగాది యిది గమనించియు
తెలంగాణముకు పయనమాయెను!



తెలంగాణమున అడుగిడి యుగాది
మాత చూచె నొక చోట నొక్కతెను!
ఏడ్చి యేడ్చి కన్నీరు ఇంకగా
అరచి యరచి తన గొంతు బొంగురై

గుర్తుపట్ట రానట్టి యామెను
విజయ యుగాది చేరి యడిగెను;


"ఎవరమ్మా నువు? నే నెచ్చటనో
నిన్ను జూచిన జ్ఞాపకమున్నది!
తెలిసిన వారల పోలికలున్నవి!”


అనగానే ఆ వనిత భోరుమని
యేడ్చుచు “అమ్మా , యుగాది మాతా!
తెలంగాణ మాతను నేనమ్మా!
అరువదేడుల కిందట నీకు
మాట యిచ్చితిని జ్ఞాపకముందా!


ఆంధ్ర మాత కన్నీరు తుడువగను
వారల నా దరి జేరనిచ్చితిని!
ఇటెటు రమ్మంటె ఇల్లు నాదనిరి;
కృతజ్ఞత వీడి కృతఘ్నులైరి!


బానిస లిప్పుడు పాలకులయ్యిరి;
స్వతంత్రులను బానిసలను జేసిరి!
రమ్మనగానే పొమ్మనజొచ్చిరి!!
తెలంగాణ రాష్ట్రమ్ము కోసమై
ఎంత అడిగినను పెడచెవి బెట్టిరి!


వేయి వీరుల బలిదానమ్ములు
కర్కశులను కరిగించక పోయెను!
మాట యిత్తురు తప్పుచుందురు;
నరములేని నాలుక మాటాయెను!

తెలంగాణమున ఉద్యమమ్ములే
రాష్ట్ర సిద్ధికై జరుగుచుండెను!

బిడ్డల ఆశలు తీరే దెన్నడొ?
ఆనందమ్మే విరిసే దెన్నడొ?

నీ వైనా మరి దారి జూపి, మము
అమ్మా! కావుము” అనుచు వేడగా,
ఆంధ్రుల మోసము గమనించియు ఆ
యుగాది మాతయు కలవరమందుచు
అభయ మిచ్చెను “మరువత్సరమున
’యుగాది’ త్వదీయ రాష్ట్రములోనే!
తెలంగాణ మాగాణము వెలుగుల
జిమ్మి సంతసము నంతట పంచును!
నిజమిది! నిజమిది! నమ్ముము నన్న”ని
యుగాది మాత అంతర్ధానము
కాగా, వేకువ కోడి కూసెను!


మేలుకొన్న నే కలగంటినని
తెలిసికొంటి! నా కల నిజమౌటకు
విజయ యుగాది మాతను నేను
మనస్ఫూర్తిగా కోరితి శుభము!!


(రెండువేల పద్నాలుగులో వచ్చే యుగాదినాటికి మన తెలంగాణ రాష్ట్రములోనే యుగాది పండుగ జరుపుకోవడానికి మనమంతా వేచి వుందాం!!)

జై తెలంగాణ!                  జై జై తెలంగాణ!!