గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 04, 2014

హైదరాబాద్ బ్రాండ్ అంతర్జాతీయంగా మార్మ్రోగాలి...!

reivw

-విశ్వనగర రూపకల్పనకు సన్నద్ధంకండి
-ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు చేద్దాం
- ప్రణాళికలు వేయండి, నిధులిస్తా
-జీహెచ్‌ఎంసీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
- విజన్-2050కి అనుగుణంగా సదుపాయాలు 
- హైదరాబాద్ వాననీటి కష్టాలు పోవాలి
- డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాలి 
- యుద్ధప్రాతిపదికన డబుల్ బెడ్‌రూం ఇళ్లు
-విశ్వనగర విజన్‌ను ఆవిష్కరించిన సీఎం
- నగరాభివృద్ధిపై ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధప్రాతిపదికన రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున దానికి తగిన స్థాయిలో మౌలిక వసతుల కల్పన, రవాణా వ్యవస్థ ఏర్పాటు జరగాలన్నారు. నగరంలో పచ్చదనానికి, పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. రాజధాని హైదరాబాద్ అభివృద్ధిపై మంగళవారం జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి సమీక్షా సమావేశంలో కేసీఆర్ తన మదిలోని విశ్వనగర విజన్‌ను అధికారుల ముందు ఆవిష్కరించారు. 

తన విజన్‌కు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దడానికి ఏయే చర్యలు అవసరమో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకూ జనాభా పెరిగిపోతోందని పేర్కొంటూ ఇప్పటికే అది సుమారు 94లక్షలకు చేరుకుందని చెప్పారు. 2011జనాభా లెక్కల ప్రకారం దాదాపు 74లక్షలు ఉన్నప్పటికీ ఈ మధ్యలో విపరీతంగా పెరిగిందని చెప్పారు. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చివేయడం, శివారు జలాశయాల పునరుద్ధరణ , మూసీకి పూర్వ వైభవం, వర్షాలకు ట్రాఫిక్ అంతరాయాల నివారణ, మురికివాడల్లో డబుల్ బెడ్‌రూం గృహాల నిర్మాణం తదితర అంశాలన్నింటిపైనా ఆయన తన ప్రాధాన్యతలను అధికారులకు వివరించారు. నగరాభివృద్ధిపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేయాలని, ఎన్ని నిధులు అవసరమైనా సమకూర్చుతానని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన వద్ద ఉన్న సమాచారంతో పోల్చి అధికారులు అందించిన సమాచారంలోని లోపాలను గుర్తించారు. పూర్తిస్థాయి సమాచారంతో రావాలని వారికి సూచించారు. 

నిపుణులతో అధ్యయనం చేయిస్తాం...
రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు మంజూరైనందున దానిని అమలు చేయించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేలా రవాణా, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసే క్రమంలో నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని, అవసరమైతే విదేశాల్లో నగరాలను అధ్యయనం చేయిస్తామని చెప్పారు. 

వాననీటి కష్టాలు పోవాలి...
నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా కిలోమీటర్లమేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం, అనేక బస్తీలు నీట మునగడంపై ముఖ్యమంత్రి అధికారులనుంచి వివరాలు సేకరించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడా రోడ్లపై నీరు నిలవకుండా చూడాలని సూచించారు. వాననీటి కష్టాలనుంచి విముక్తి పొందాలంటే నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు వెంటనే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిధులకు ఎలాంటి కొరతా ఉండబోదని ...సమస్య పరిష్కారానికి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. నగరంలోని 94 లక్షల మందికి తాగునీటిని అందించే విధంగా నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న మంచినీటి చెరువుల స్థితిగతులను మెరుగు పరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

మురికివాడల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు...
నగరంలో మురికివాడల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సీఎం ఆదేశించారు. అరకొర సౌకర్యాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు టాయ్‌లెట్, కిచెన్‌తోకూడిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే నగరంలో ఏదో ఒక ప్రాంతంలో పైలెట్ ప్రాజక్టుకింద పనులు చేపట్టాలని ఆదేశించారు. పనుల సందర్భంగా ఎవ్వరికీ ఇబ్బంది కలుగని రీతిలో వ్యవహరించాలని, లబ్దిదారులు ఇష్టపూర్తిగా ముందుకొచ్చే ప్రాంతంలోనే పనులు చేపట్టాలని సూచించారు. దశలవారీగా మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని కోరారు. చెత్త డంపింగ్ కోసం నగర శివారుల్లో నివాసాలకు దూరంగా మరో 4లేదా 5 డంపింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ అధికారులు ఆదేశించారు.

మూసీకి పునర్‌వైభవం
కాలుష్యాన్ని నివారించి మూసీ నదికి పునర్‌వైభవం తీసుకురావాల్సిందేనని కేసీఆర్ అన్నారు. అందుకు అవసరమైన విధంగా స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో వారం రోజుల్లో నిర్వహించే సమావేశానికి రావాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీలో నెలకొన్న సమస్యలపై అధికారులు కేసీఆర్‌కు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీగా ఉన్న 265 ఇంజనీరింగ్ అధికారుల ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ కోసం ఎదురుచూడకుండా సమర్ధవంతమైన ఏజెన్సీల ద్వారా నియామకం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ , హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు.

కొత్తలెక్కలతో రండి..
ఏదైనా సమాచారం సరిగా లేనపుడు భేషజాలకు పోకుండా తెలుసుకోండి.. అంతేతప్ప అరకొర సమాచారంతో సర్దుబాటు చేసుకుందామనుకోవడం సరికాదు. గతంలో ఏం జరిగినా, ఎలా జరిగినా దానిని మరిచిపోండి. ఇప్పుడు సరైన విధానం పాటిద్దాం.. వాస్తవ సమాచారంతో మాట్లాడుదాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులనుద్దేశించి అన్నారు. హైదరాబాద్ అధికారులతో నిర్వహించిన మొదటి సమీక్షలో అధికారులు అందించిన సమాచారంలోని లోపాలను ఆయన వారికి తెలియపరిచారు. తన వద్ద ఉన్న వాస్తవ గణాంకాలను ఆయన చదివి వినిపించారు. సమాచారం లేనపుడు లేదని చెప్పవచ్చు.. సమస్య ఉంటే నిజాయితీగా చెప్పొచ్చు.. ఈసారి కొత్త లెక్కలతో రండి అన్నారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ నిర్మాణాల వివరాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల గురించి ఆయన అధికారులకు వివరించారు. నగరంలో మంచినీటిలో మురుగునీరు కలుస్తోందని చెప్పిన సీఎం, ఏయే ప్రాంతాలలో మురుగునీరు వస్తున్నది వారికి తెలియపరిచారు. ఇంటి నంబర్లతోసహా సమాచారం కూడా తనవద్ద ఉందని ఆయన చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి