“హైదరాబాదు తెలగాణదౌ” నటంచు
వచ్చిరే పది జిల్లాల ప్రజలు కదలి
యా నిజాం కళాశాల గ్రౌండ్స్ నందు నిండ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (1)
“పెట్టుఁడీ బిల్లు పార్లమెంట్ చట్ట సభను
“పెట్టుఁడీ బిల్లు పార్లమెంట్ చట్ట సభను
వేగమే” యంచుఁ దెలగాణ సాఁగి వచ్చి
నినద మెత్తెను గొంతెత్తి వినఁగ ఢిల్లి!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (2)
కడుపు మండిన వార లిక్కడను నుండ్రి;
“వేగఁ దెలగాణ రాష్ట్రమ్ము నీఁగదె”యని!
కడుపు నిండిన వార లక్కడను నుండ్రి;
“హైదరాబాదు దోఁచఁగా నద నిదె”యని!
మండు వారికి శత్రు లీ నిండు వారె!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (3)
ఆత్మ బలిదాన మిడిరి సహస్ర వీర
జనులు! కాంక్షమై తెలగాణ జనులు నిటను
వచ్చి రంజలి ఘటియింపఁ బరుగు లిడుచు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (4)
రాష్ట్ర మీయంగఁ బ్రకటించఁ బ్రభుత యచట;
దాని నడ్డుకొనిన యాంధ్ర దౌష్ట్య యుతుల
చేష్ట ఖండింపఁగాఁ బ్రజల్ చేరి రిచట!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (5)
“మా తెలంగాణ నాయక మాన్యుల నవ
మాన పఱుపంగఁ దగ”దని, మానహీను
లైన సీమాంధ్రులకుఁ దెల్పఁగా, నిచటికిఁ
దరలి వచ్చిరి తెలగాణ వర జనులును!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (6)
“ఆ దినేశుని దౌష్ట్యమ్ము లాగడములు
సాఁగ”వను తీర్పు వినియు, విచార మెడల
సంతసమ్మున గొంతెత్తి వంత పాడఁ
బరుగులెత్తి వచ్చిరి జనుల్ ప్రబలు రయ్యు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (7)
“మా తెలంగాణ రాష్ట్రమ్ము మా కిడుఁ”డన,
మూర్ఖ బుద్ధియౌ కిరణుండు ముఖ్యమంత్రి
పదవి నడ్డము పెట్టియు వదరుచుండఁ,
ద్రిప్పి కొట్టంగ వచ్చిరి యిప్పు డిటకు
పది జిలాల ప్రజలు వేగ పడుచు మిగుల!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (8)
ఆంధ్రలోఁ గొన్ని వర్గమ్ము లడ్డుపడఁగ;
బడుగు బహుజన వర్గాల ప్రజలు ప్రబల
ముగను, తెలగాణ రాష్ట్ర మీయఁగను గోర,
వారి నణచు క్రూరుల పని పట్ట నెంచి,
యిటకుఁ దరలి వచ్చిరి జను లీ విధముగ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (9)
“మా తెలంగాణ రాష్ట్రమ్ము మా బలమున
సత్వరమ్ముగ నేర్పడున్! సకల జనులు
సంతసింతురు! జేజేల సంతస నిన
దమ్ములు తెలగాణ జనులు తఱచి తఱచి
చేతు”రని తెలుపఁగను వచ్చిరయ యిటకు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (10)