గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 19, 2014

ఏపీకి పీపీఏ షాక్

-ఒప్పందాల రద్దు చెల్లదు.. కేంద్ర ఇంధనశాఖ స్పష్టీకరణ
-తెలంగాణకు యథాతథంగా కరెంటు
-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
-కయ్యానికి కాలుదువ్విన ఆంధ్రా సర్కార్‌కు చెంపపెట్టు
-ఏపీ చర్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష
-కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శికి నివేదన
-కార్యాలయం నుంచి అధికారిక లేఖ
-సీఎస్, ఇంధనశాఖల నుంచీ రెండు లేఖలు
-వెనువెంటనే స్పందించిన కేంద్రం
-పీపీఏల రద్దుచెల్లదని స్పష్టీకరణ

-పీపీఏల రద్దు ప్రతిపాదన పిల్ల చేష్ట
-హుందాగా వ్యవహరిద్దామన్న ముఖ్యమంత్రి కేసీఆర్
-ఇట్లనన్నా వైఖరి బట్టబయలైందని వ్యాఖ్య
-విద్యుత్‌లోటు లేకుండా చూద్దామని భరోసా
-ఆంధ్రా సర్కారు తీరుపై మండిపడిన విపక్షాలు, టీఆర్‌ఎస్ నేతలు


తెలంగాణను ఇబ్బందిపెట్టాలని తొందరపడి.. కయ్యానికి కాలుదువ్విన ఆంధ్రప్రదేశ్ సర్కారుకు తగిన పాఠం! నియమాలకు విరుద్ధంగా.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి బొక్క బోర్లా పడింది. కనీస హుందాతనం లేకుండా, ప్రజల అవసరాల కోణం ఏమాత్రం పట్టించుకోకుండా విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను ఏకపక్షంగా రద్దుచేసుకోవాలన్న ప్రయత్నం తిప్పికొట్టింది. పీపీఏలపై కేంద్ర ఇంధనశాఖ షాకిచ్చింది. ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈఆర్సీకి లేఖ రాయడాన్ని తప్పుపడుతూ రద్దు కుదరదని స్పష్టం చేసింది. తెలంగాణకు యథాతథంగా కరెంటు సరఫరా అవుతుందని వివరించింది. అంతకుముందు ఆంధ్రా సర్కార్ ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై కేంద్రంతో మాట్లాడదామని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శితో మాట్లాడి లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ కార్యదర్శి కూడా అదే విధంగా మాట్లాడి లేఖలను ఫ్యాక్స్ చేశారు. దాంతో వెనువెంటనే కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రత్యుత్తరమిచ్చింది. ఇప్పటికి కథ సుఖాంతమేగానీ.. ఆంధ్రా సర్కారు కుటిల యత్నాలకు ఇంతటితోనే ముగింపు పలుకుతుందని ఆశించలేం. విద్యుత్‌పైనేకాదు.. విద్యుత్ ఉత్పత్తికి ఆధారమైన బొగ్గుపైనా ఆంధ్రా సర్కార్ కన్నేసింది.

electricity



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకటి విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను రద్దుచేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణకు కరెంటు యథాతథంగా సరఫరా అవుతుందని తెలిపింది. తెలంగాణను ఇబ్బందిపెట్టాలనుకున్న ఏపీకి ఈ విధంగా ఊహించనిరీతిలో కేంద్ర ప్రభుత్వం నుంచి షాక్ తగిలింది. పీపీఏల అంశంపై మంగళవారం హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, బుధవారం మీడియాలో వచ్చిన వార్తలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. తాము ఆదేశించేంతవరకు తెలంగాణ విద్యుత్ కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేయరాదని బుధవారం సాయంత్రం కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ బెంగళూరులోని సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ)ని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో విద్యుత్, గ్యాస్, ఆయిల్ అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చింది. బుధవారం సాయంత్రానికి ఆ మేరకు విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ అందింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోసోకో) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఆర్ రఘురాం పంపించిన ఆ లేఖలో 2014 మార్చి 28వ తేదీన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు (మినిట్స్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17వ తేదీన రాసిన లేఖ, ప్రభుత్వ జీవో నంబర్ 53, 20లను ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు లోబడి జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన షెడ్యూలును యథావిధిగా కొనసాగించాలని నిర్దేశించారు.

కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంతవరకు గ్రిడ్ ఆపరేషన్ అవాంతరాలు ఎదురుకాకుండా చూడాలని ఎస్‌ఎల్‌డీసీని ఆదేశించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దుచేయాలనుకున్న ఆంధ్రా సర్కారు నిర్ణయంపై తొందరపాటు చర్యలకు పాల్పడరాదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈఆర్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, టీజెన్‌కో చైర్మన్ డీ ప్రభాకరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తలెత్తే పరిణామాలు, నెలకొనే విద్యుత్‌లోటు అంశాలపై కూలంకషంగా చర్చించారు.

ఆంధ్రా సర్కార్ దూకుడు వైఖరికి అడ్డుకట్ట వేయాలని, సింగరేణి బొగ్గు సీమాంధ్రకు సరఫరా కాకుండా నియంత్రించాలంటూ వ్యక్తమైన అభిప్రాయాలతో ముఖ్యమంత్రి విభేదించారు. పీపీఏల రద్దు ప్రతిపాదన పిల్లచేష్ట అని, వాళ్ళు(ఆంధ్రా) మనకు అన్యాయం చేస్తే కూడా పట్టించుకోవద్దని చెప్పారు. ఇలాంటి సమయంలో చిల్లరగా వ్యవహరించకుండా హుందాగా ప్రవర్తిద్దామని, మున్ముందు ప్రజలే అర్థం చేసుకుంటారని అన్నారు. వాస్తవానికి ఆచరణలో పీపీఏలు రద్దు అయ్యే అవకాశం లేదని, ఒకవేళ రద్దు అయితే 461.8 మెగావాట్ల (రోజుకు 11 మిలియన్ యూనిట్లు) తెలంగాణ చేజారిపోతుందని, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుందామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమంటూ భరోసా కల్పించారు.

సమీక్ష సందర్భంగా ఓ దశలో.. ఇట్లనన్నా చంద్రబాబు వైఖరి ఏమిటో బహిర్గతమయితంది అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆంధ్రా సర్కార్ పీపీఏల రద్దు నిర్ణయాన్ని సీరియస్‌గా కేంద్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్ళాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడతానని స్పష్టంచేశారు. వెంటనే స్వయంగా కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శితో టెలిఫోన్‌లో మాట్లాడారు. 

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారికంగా ఒక లేఖను రూపొందించి కేంద్ర ఇంధన శాఖకు ఫ్యాక్స్ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ కూడా మరోదఫా కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శితో టెలిఫోన్‌లో మాట్లాడి సీఎస్ పేరిట మరొక లేఖను పంపించారు. అదే సమయంలో సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) నుంచి ఎవ్వరికీ కేటాయించని విద్యుత్ కోటాను తెలంగాణ రాష్ర్టానికి ఇవ్వాలని, జజ్జర్ నుంచి 325మెగావాట్ల విద్యుత్తును అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందాను సీఎం ఆదేశించారు. దాంతో వెంటనే సురేష్‌చందా ఆ మేరకు కేంద్రానికి లేఖ పంపించారు. తెలంగాణ వ్యవసాయ, పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

***

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మీ సెక్రటేరియట్, మీ అసెంబ్లీ ఇక్కడి నుంచే పనిచేయాలి. మీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, అధికారులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. మీ ఇళ్లకు, కార్యాలయాలకు కరెంటు అవసరం లేదా? చంద్రబాబు ఒకటి చేస్తే మేం పది చేయాల్సి వస్తుంది. తెలుగు ప్రజలంతా ఒకటేనంటూ మాట్లాడేబాబు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుని తెలంగాణకు కరెంటు రానివ్వకుండా చేయాలని చూడటం సమంజసంకాదు.



పీపీఏల రద్దుకు ప్రయత్నించడం బాధ్యతా రహితమైన, కవ్వింపు చర్య. రాజ్యాంగం, రెండు రాష్ర్టాల మధ్య జరిగిన విభజన బిల్లు స్ఫూర్తికి ఇది విరుద్ధం. చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఇంకా వందలాది ఒప్పందాలు రెండు రాష్ర్టాల మధ్య ఉన్నాయి. ఈ విధంగా ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకుంటే తెలుగు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది.



విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తొందరపాటు చర్య. ఇప్పటికే.. విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల రెండు రాష్ర్టాల మధ్య మరిన్ని సమస్యలు వస్తాయి. బొగ్గు, విద్యుత్, నీటి పంపిణీ విషయాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలి. 



తెలంగాణకు ఇసుమంత కూడా నష్టాన్ని జరుగనీయబోం.. ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 53.89 శాతం విభజన చట్టంలో కేటాయించారు. తెలంగాణలో మెజార్టీ వ్యవసాయం బోరుబావులపై ఆధారపడి ఉన్నది. ఇక్కడ విద్యుత్ లేక పోతే వ్యవసాయం నడువదు. వాస్తవ వినియోగం ఆధారంగానే విద్యుత్ విభజన జరిగింది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దష్టికి తీసుకు వెళతాం. పీపీఏలు రద్దు కాకుండా చూస్తాం. 



పీపీఏ రద్దు నిర్ణయంపై ఆగ్రహజ్వాలలు

పవర్ పర్చేస్ అగ్రిమెంట్(పీపీఏ)లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం, ఈఆర్సీకి లేఖ రాయడంపై పార్టీలకతీతంగా తెలంగాణనేతలు మండిపడ్డారు. పీపీఏ నిర్ణయాన్ని రద్దు చేయొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేయకముందు తెలంగాణ నేతలు బాబు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే: జానారెడ్డి

పీపీఏలను రద్దు చేయాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలిసి బుధవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీపీఏలను రద్దు చేయాలని ఈఆర్సీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరటం సమంజసం కాదన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు. 

కవ్వింపు చర్యే: పొన్నాల

చంద్రబాబు నిర్ణయం కవ్వింపు చర్యేనని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. విభజన బిల్లు స్ఫూర్తికి ఇది విరుద్దమని ఆయన ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ విద్యుత్ వినియోగం ఆధారంగా ఒప్పందం జరిగిందని, దాన్ని రెండు ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఆందోళనకరమైన వాతావరణం నెలకొందన్నారు. 

చట్టవిరుద్ధం: మంత్రి జగదీశ్‌రెడ్డి

తిరుమలగిరి: పీపీఏలను రద్దు చేయడం చట్టవిరుద్ధమని, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడానికి కుట్ర పన్నుతున్నాడని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అన్ని విద్యుత్ ప్రాజెక్టులను సీమాంధ్రలో నిర్మించి తెలంగాణపై వివక్ష చూపిన అక్కడి పాలకులు ఇప్పుడు బరితెగించి వారి రాక్షసతత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

ఏపీ ప్రభుత్వ వాదనలు సరికాదు: గుత్తా

విద్యుత్ పంపిణీ అంశంలో ఉభయ రాష్ర్టాలు పీపీఏ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదన సరికాదన్నారు. 

పీపీఏలు రద్దు కాకుండా చూస్తాం: ఎర్రబెల్లి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పీపీఏలు రద్దు కాకుండా చూస్తామని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణకు ఇసుమంత కూడా నష్టాన్ని జరగనీయమన్నారు. పీపీఏలు రద్దు కాకుండా చూసే బాధ్యత తమదేనన్నారు. 

తొందరపాటు చర్య: బీజేపీ కిషన్‌రెడ్డి

పీపీఏలను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం తొందరపాటు చర్య అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి అన్నారు. బాబు నిర్ణయంతో తెలంగాణ మరింత ఇబ్బందులు ఎదుర్కుంటుందన్నారు. బొగ్గు, విద్యుత్, నీటి పంపిణీ విషయాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 

రెచ్చగొట్టే నిర్ణయాలు కూడదు: సీపీఎం తమ్మినేని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. ఈ నిర్ణయం తెలంగాణను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. ఇటువంటి నిర్ణయాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పీపీఏను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని సీపీఐ శాసనసభా పక్షనేత రవీందర్ కుమార్‌నాయక్ అన్నారు. ఇప్పటికే విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పీపీఏల రద్దుతోరెండు రాష్ర్టాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఏపీ సీఎం బాబు ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. నిర్ణయం మార్చుకోకపోతే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

harish-secreta
మీ ఇండ్లకు కరెంటు వద్ద్దా?

- పీపీఏ రద్దుపై హరీశ్‌రావు ఆగ్రహం
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)ను రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడుతుందని, తద్వారా సంభవించే కష్టనష్టాలకు సీమాంధ్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు
పీపీఏల రద్దుపై విద్యుత్ అధికారులతో కలిసి రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కరెంట్ రానివ్వకుండా చేసే వారి కార్యాలయాలు తమ రాష్ట్రంలో ఎలా నడుపుతారని ప్రశ్నించారు. 

మీ ఇళ్లకు కరెంట్ వద్దా అని తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరబాద్‌లో సీమాంధ్ర అసెంబ్లీ, సచివాలయం, డీజీపీ కార్యాలయంతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులు అధికారులు ప్రజాప్రతినిధులు తెలంగాణలోనే నివాసముంటున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని, రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడవడమేనని ఆయన మండిపడ్డారు. బాబు ఒకటి చేస్తే తాము పదిచేయాల్సివస్తుందని, కాని అది సరియైన సంప్రదాయం కాదన్నారు.

తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనంటూ మాట్లాడే బాబు అర్దరాత్రి నిర్ణయం తీసుకుని తెలంగాణకు కరెంటురానివ్వకుండా చేయాలనుకోవడం ఏవిధంగా సమర్థనీయమన్నారు. చంద్రబాబు చెప్తున్న సమన్యాయం ఇదేనా?అని ప్రశ్నించారు. పీపీఎ రద్దు నిర్ణయం ఏకపక్షమని దాన్ని అమలు జరగనివ్వమని స్పష్టం చేశారు. పీపీఏ రద్దు ద్వారా తెలంగాణ కు రావాల్సిన 460 మొగావాట్ల విద్యుత్‌ను కోల్పోవాల్సి వస్తుందని హరీశ్‌రావు తెలిపారు. ఇదే విషయమై విద్యుత్‌శాఖ అధికారులతో సీఎం చర్చించారన్నారు. కాగా రాష్ర్టానికి ఎటువంటి కరెంటు లోటు రాకుండా చూస్తామని కేంద్రం భరోసా ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు.

బాబు మా కొంపముంచుతాడేమో?

- పీపీఏల రద్దుతో భయాందోళనలో టీ టీడీపీ నేతలు
అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రం. ఉన్న పార్టీని ఎలా బతికించుకోవాలా అని ఆరాటపడుతుంటే పీపీఏల రద్దు మా మెడకు ఉరితాడులా మారింది ఇదీ టీడీపీ తెలంగాణ నేతలు ఆందోళన. పీపీఏలను రద్దు చేయొద్దంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేయకముందు చంద్రబాబు తీరుపై టీ టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందారు. సమన్యాయం అంటూ సూక్తులు చెప్పే చంద్రబాబు తెలంగాణను తీవ్ర విద్యుత్ సంక్షోభంలోకి నెట్టే విధంగా పీపీఏలను రద్దు చేయాలన్న నిర్ణయంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టీ టీడీపీ నేతలు అంటున్నారు. 

రచ్చబండ వద్ద జరిగే చర్చలు, టీవీలల్లో జరిగే చర్చల కన్నా ప్రమాదకరమని, ఈ చర్చలు చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని, దీంతో పార్టీకి తెలంగాణలో కోలుకోలేని విధంగా నష్టం జరుగుతున్నదని వారు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించిన తమ అధినేత చంద్రబాబు తెలంగాణ విషయంలో విభజన చట్టంలోని అంశాల జోలికి వెళ్లకపోతేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉందని, ఏ చిన్న అంశం దొరికినా పార్టీ భూ స్థాపితం చేయాలని చూస్తుందని అంటున్నారు. పోలవరం షాక్ నుంచి కోలుకోకముందే పీపీఏ రద్దు తమ మెడకు చుట్టుకుందని వాపోతున్నారు. 

ఏపీ జెన్‌కో పీపీఏలను రద్దు చేస్తే 518 మెగావాట్ల విద్యుత్ లోటు తెలంగాణకు ఏర్పడుతుందని, పోలవరం ఆర్డినెన్స్ మూలంగా ఇప్పటికే 450 మెగావాట్ల సీలేరును కోల్పోతున్నామని, తెలంగాణలో ఏర్పడే విద్యుత్ కోతలకు పార్టీనే బాధ్యత వహించే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. తమ నాయకుడు చంద్రబాబు సీమాంధ్ర సీఎంగా తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో పార్టీ కొంపముంచేలా కనిపిస్తున్నాయని ద్వితీయస్థాయినేతలు అంటున్నారు. పార్టీ 2019లో అధికారంలోకి వచ్చే మాట దేవుడెరుగు కానీ కనీసం తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే ఈ ఐదేళ్లు చంద్రబాబు తెలంగాణకు నష్టం జరుగకుండా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి