గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 09, 2014

గవర్నర్ పాలనలో తెలంగాణకు అన్యాయం

గవర్నర్ పాలనలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించింది. గవర్నర్ పాలనలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై ప్రత్యేకమైన సమీక్ష జరగాలి. తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా సర్దుబాటు చర్యలు తీసుకోవాలి. 

తెలంగాణ రాష్ట్ర బిల్లు చట్ట రూపం దాల్చాక, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పేరుకు రాష్ట్రపతి పాలన ఉన్నా, పాలన కొనసాగించింది మాత్రం సీమాంధ్ర అధికారులే. ఈ కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించడంతో పాటు, దీర్ఘకాలిక సమస్యలు తెచ్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ రంగంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణకు వేలకోట్ల రూపాయల నష్టం కలించడంతో పాటు, తెలంగాణకు లభించాల్సిన విలువైన విద్యుత్ నష్టపోయే పరిస్థితులు కలిగించాయి. వీటిపై స్పందించాల్సిందిగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టుగా తయారయ్యింది.

గవర్నర్ పాలనలో తీసుకున్న తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు:
1.అనంతపూర్ కర్నూలు విద్యుత్ వాటా: ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా కోసం నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో ఉన్నవి-సెంట్రల్ పవర్, నార్తర్న్ పవర్ కంపెనీలు. సీమాంధ్రలో-సదరన్ పవర్, ఈస్టర్న్ పవర్ కంపెనీలు. అయితే సెంట్రల్ కంపెనీలో సీమాంధ్రకు చెందిన అనంతపూర్, కర్నూల్ జిల్లాలు అదనంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్తును, 2008 సంవత్సరంలో వివిధ సరఫరా కంపెనీలకు, 2005 నుంచి 2007 వరకు జిల్లాల వారీగా లెక్కించిన వినియోగం ఆధారంగా ఈ క్రింది నిష్పత్తిలో పంచారు. 

రాష్ట్ర విభజనతో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపూర్, కర్నూల్ జిల్లాలను సీమాంధ్ర పరిధిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో (ఎస్పీడీసీఎల్) కలపడం జరిగింది. దీంతో ఈరెండు జిల్లాల విద్యుత్ వినియోగాన్ని లెక్క గట్టి, ఎస్పీడీసీఎల్‍కు బదిలీ చేయాలి. ఈ బదిలీలో అధికారులు చేసిన తప్పిదాలవల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. గతంలో విద్యుత్తు వాటాను నిర్ణయించిన ప్రాతిపదిక కాకుండా ఇప్పుడు కొత్త ప్రాతిపదికను ప్రభుత్వం అనుసరించింది. ఈసారి 2005 నుంచి 2007 వరకు జిల్లాల వినియోగం కాకుండా, 2013కు ముందు ఐదు సంవత్సరాల సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా అనంతపూర్, కర్నూల్ జిల్లాల విద్యుత్ వినియోగాన్ని లెక్కించారు. ఈపద్ధతిలో అనంతపూర్, కర్నూల్ జిల్లాల వినియోగం, సీపీడీసీయల్ వినియోగంలో 17.45 శాతం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం 08-05-2014 నాడు జీవో 20ను జారీ చేసింది. నిజానికి ఏ ప్రాతిపదికపై గతంలో విద్యుత్ వాటాలను లెక్కించారో అదే ప్రాతిపదికను వాడాలి. 2005 నుంచి 2007 మధ్య కాలంలో ఈ రెండు జిల్లాల సగటు విద్యుత్ వినియోగం 12.83 శాతం. అంటే సెంట్రల్ పవర్ నుంచి 4.63 శాతం విద్యుత్ వాటా అధికంగా సీమాంధ్రకు కేటాయించారు. మొత్తం రాష్ట్ర వినియోగంతో చూస్తే, ఇది 2.14 శాతం. తెలంగాణకు జరిగిన నష్టం అంచనా: ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ వినియోగం ఏటా సుమారు 90000 మిలియన్ యూనిట్లు. ఇందులో 2.14 శాతం అంటే 1926 మిలియన్ యూనిట్లు. ప్రస్తుత మార్కెట్ విలువ యూనిట్‌కు సుమారు 5.50 రూపాయలు. అంటే తెలంగాణ ప్రాంతం ఏటా నష్టపోయే మొత్తం విద్యుత్ విలువ సుమారు 1060 కోట్లు. ఈ విద్యుత్తుతో తెలంగాణలోని ఒక జిల్లాకు ఆరు నెలలకు పైగా విద్యుత్తు అవసరాలు తీర్చవచ్చు. ప్రభుత్వం చేసిన చర్య...2008 తరువాత సీమాంధ్ర ప్రభుత్వాలు సీపీడీసీఏల్ పరిధిలోని తెలంగాణ జిల్లాల విద్యుత్ వాటా నుంచి అక్రమంగా అనంతపూర్, కర్నూల్‌లకు తరలించిన విద్యుత్తును క్రమబద్ధీకరించినట్టు అవుతుంది. కాబట్టి ఈ తప్పును సరిచేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి.

2. సంప్రదాయేతర ఇంధన వనరుల (ఎన్.సీ.ఈ) ప్రాజెక్టుల ఒప్పందాలు: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంగా ఉన్నది. అనంతపూర్, కర్నూల్ జిల్లాలు విభజనకు ముందు తెలంగాణ పరిధిలోని సెంట్రల్ కంపెనీలో ఉండేవి. ఈ రెండు జిల్లాలలో ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల (ఎన్.సీ.ఈ) ప్రాజెక్టులతో సెంట్రల్ పవర్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకొన్నది. అంటే ఈ రెండు జిల్లాలు సీమాంధ్రలో కలిసిన తరువాత కూడా, ఈ జిల్లాలలోని ఎన్.సీ.ఈ. ప్రాజెక్టుల ఒప్పందాలు సెంట్రల్ కంపెనీతోనే కొనసాగాలి. అయితే దీనికి భిన్నంగా, ఈ రెండు జిల్లాలలోని ఎన్.సీ.ఈ. ప్రాజెక్టుల విద్యుత్తును సీమాంధ్రకు చెందిన దక్షిణ కంపెనీ విద్యుత్తుగా ప్రస్తుతం ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ రకంగా చేయడం విభజన చట్టానికి విరుద్ధం. ఇవి కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం 500 మెగావాట్లకుపైగానే ఉంటుంది. అంటే మొత్తం 1000 మెగావాట్లకు పైగా విద్యుత్తును తెలంగాణ నష్టపోతుంది. అంతే కాకుండా 2003 విద్యుత్ చట్టం ప్రకారం ప్రతీ సంవత్సరం ఎన్.సీ.ఈ. ప్రాజెక్టుల నుంచి కనీసం 5శాతం విద్యుత్తును తప్పనిసరిగా మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ విద్యుత్తు సీమాంధ్రకు అక్రమంగా కేటాయించడంతో ఈ నిబంధనను మనం పాటించలేము. ఈ మేరకు ఖరీదైన రెనివబుల్ ఎనర్జీ సర్టిఫికేట్లను (ఆర్.ఈ.సీ) తెలంగాణ కొనుగోలు చేయాల్సి వస్తుంది. విద్యుత్తును కోల్పోవడంతో పాటు, ఖర్చులూ పెరుగుతాయి.

3. అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టులు సీమాంధ్రకు: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రం ఆవల ఉన్న ఆస్తులు రెండు ప్రాంతాలకు జనాభా నిష్పత్తిలో చెందుతాయి. అయితే ప్రభుత్వం 29-05-2014 నాడు విడుదల చేసిన జీవో 25 ప్రకారం, అంతర్-రాష్ట్ర ప్రాజెక్టులైన 84 మెగావాట్ల మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ (ఒడిశా),60 మెగావాట్ల బలిమెల ప్రాజెక్ట్(ఒడిశా),57 మెగావాట్ల తుంగభద్ర ప్రాజెక్టు (కర్నాటక)ల ఆస్తులన్నీ సీమాంధ్రకే చెందుతాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం. దీన్ని తక్షణం సరిచేయాలి.

4. నువగాఁవ్-తెలిషాహి బొగ్గు బ్లాకు కేటాయింపులు: 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సామర్థ్యం కల నువగాఁవ్-తెలిషాహి బొగ్గు బ్లాకు ఒడిశాలో ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఈ బొగ్గు బ్లాకులోని నిల్వలను రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. విభజన చట్టంలో విద్యుత్ పంపకాలు వినియోగం ఆధారంగా జరిగాయి. బొగ్గు కేటాయింపులు కూడా ఇదే ప్రాతిపదిక మీద జరగడం సమంజసం. దురదృష్టవశాత్తు, ఈ బొగ్గు బ్లాకులోని నిల్వలను ప్రభుత్వం జనాభా ప్రాతిపదిక ఆధారంగా తెలంగాణకు 41.68 శాతం సీమాంధ్రకు 58.32 శాతం కేటాయించింది. ప్రస్తుతం, భవిష్యత్తు విద్యుత్తు అవసరాల దృష్ట్యా తెలంగాణకు కనీసం 53.89 శాతం బొగ్గు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో తెలంగాణ సుమారు 54 మిలియన్ టన్నుల బొగ్గును నష్టపోయింది. ఒక 500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు జీవిత కాలం సరిపోయే బొగ్గు తెలంగాణ నష్టపోయింది.

5. ఈ.ఆర్.పీ. లైసెన్సులు: విలువైన ఎంటర్‌ప్రైస్ రిసోర్స్ ప్లానింగ్ (ఈ.ఆర్.పీ)లైసెన్సులు విభజనకు ముందు ఏ.పీ. పేరు మీద ఉండేవి. ఏ.పీ. పేరు మీద ఉన్న లైసెన్సులను మార్చడం కుదరదన్న సాకుతో, ఈ లైసెన్సులన్నీ విభజన తరువాత కూడా ఏ.పీ.కే కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 25 విడుదల చేసింది. ఇలా పరిగణించడం విభజన చట్టానికి విరుద్ధం. విభజన చట్టంలో స్పష్టంగా సెక్షన్ 60 ప్రకారం అన్ని కాంట్రాక్టులూ రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు తెలంగాణ వాటా తెలంగాణకే దక్కేలా చర్యలు తీసుకోవాలి.

6. ట్రాన్స్‌కో ఉద్యోగుల పంపిణీ: విద్యుత్ సౌధలోని ట్రాన్స్‌కో ఉద్యోగుల తాత్కాలిక పంపిణీ అశాస్త్రీయంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో, యాక్టివిటీ ఆధారంగా పనిచేసే సంస్థలలో జనాభా ప్రాతిపదిక కాకుండా మరే ఇతర శాస్త్రీయమైన అంశాన్ని ఆధారం చేసుకోని ఉద్యోగుల విభజన చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్పత్తి సంస్థ అయిన జెన్‍కోలో ప్రాజెక్టుల సామర్థ్యాన్ని ఆధారం చేసుకొని ఉద్యోగుల విభజన చేశారు. కానీ ట్రాన్స్ కో ‍లో కేవలం జనాభా ప్రాతిపదిక మీదనే ఉద్యోగుల విభజన జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం, లైన్ల పొడవు, సబ్‌స్టేషన్ల సంఖ్య, విద్యుత్ డిమాండు లాంటి అంశాలన్నింటిలోనూ తెలంగాణ వాటా 50 శాతం పైగానే ఉంది. జనాభా ప్రాతిపదికపై ఉద్యోగుల విభజన చేయడానికి ఎలాంటి ఆధారం గానీ, శాస్త్రీయత కానీ లేదు. జనాభా ప్రాతిపదిక పై ఉద్యోగుల కేటాయింపులు జరగడంతో, పై స్థాయిల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న సీమాంధ్రులను తెలంగాణకు కేటాయించారు. అలాగే తెలంగాణలో అధికంగా ఉన్న చిన్న స్థాయి ఉద్యోగులను సీమాంధ్రకు కేటాయించారు. దీంతో విభజన తరువాత కూడా సీమాంధ్రుల ఆధిపత్యం రెండు రాష్ట్రాలలోనూ కొనసాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు అనేక కీలక స్థానాల్లో తెలంగాణలో ఖాళీలు ఏర్పడి వ్యవస్థ స్తంభించే ప్రమాదం కూడా ఏర్పడింది. 

7. హెడ్-క్వార్టర్స్ ఆస్తుల విభజన: ఏ.పీ. విభజన చట్టంలో కార్పోరేషన్ల హెడ్‌క్వార్టర్లకు సంబంధించి ఆస్తులను జనాభా నిష్పత్తిలో పంచాలని ఉంది. అయితే చట్టంలో హెడ్‌క్వార్టర్‌ను ఎక్కడా నిర్వచించలేదు. దీంతో విద్యుత్ సౌధలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగులతో పాటు,హెడ్‌క్వార్టర్స్‌తో సంబంధంలేని క్యాంటీన్లను, ఆడిటోరియాలను, గెస్ట్ హౌసులను, టెన్నిస్-కోర్టులను, డిస్పెన్సరీలను రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తిలో విభజించారు. ఇంతేకాకుండా, హెడ్-క్వార్టర్‌కు పది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎర్రగడ్డలోని జెన్ కో బిల్డింగును కూడా హెడ్-క్వార్టర్‌గా పరిగణించి రెండు రాష్ట్రాల మధ్య విభజించారు. అశాస్త్రీయంగా జరిగిన ఈ విభజన వల్ల తెలంగాణ నష్టపోయింది. గవర్నర్ పాలనలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరించింది. గవర్నర్ పాలనలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై ప్రత్యేకమైన సమీక్ష జరగాలి. తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకున్న అనేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా సర్దుబాటు చర్యలు తీసుకోవాలి. 

-కె.రఘు
కో-ఆర్డినేటర్,తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి