గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 14, 2014

కలిసి నడుద్దాం.. బంగారు తెలంగాణ నిర్మిద్దాం...

-బంగారం కుదువబెట్టిన రుణాలకూ..మాఫీ ఖాయం
-రైతు రుణాలన్నీ మాఫీనే.. రూ. 19 వేల కోట్ల ఆర్థిక భారం
-పాత ప్రభుత్వాల జీవోలు పాటించబోం
-కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడి రావాలి
-బడ్జెట్ సమావేశాల్లో పథకాలన్నింటికీ కాలపరిమితి ప్రకటిస్తాం
-కేజీ టు పీజీ కార్యాచరణకు రెండేళ్లు
-బాబ్లీపై బస్తీమే సవాల్ ఉండదు
-పొరుగురాష్ర్టాలతో సత్సంబంధాలుంటాయి
-మూడేళ్లలో విద్యుత్ మిగులు సాధిస్తాం
-గిరిజన, మైనార్టీలకు రిజర్వేషన్ల అమలుకు అఖిలపక్షం
-సీమాంధ్ర మీడియా అవహేళనలు భరించేది లేదు
-అవసరమైతే కేబుల్ చట్టం తీసుకువస్తాం
-తెలంగాణ ప్రభుత్వం సెటిల్ కావొద్దని కుట్రలు చేస్తున్నరు
-శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు
రెండున్నర గంటల అనర్గళ ప్రసంగం.. ఎక్కడా తడబాటు లేదు. తొట్రు బాటు లేదు. ధనుస్సు వదిలిన బాణం సూటిగా లక్ష్యం తాకినట్టు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలు, మార్గాలు, సాధ్యాసాధ్యాలు అన్నీ అరటిపండు వలిచినట్టు.. అన్ని రంగాలు ఔపోసన పట్టినట్టు.. సకల జనుల కష్టసుఖాలు తడిమి చూసినట్టు.. అభివృద్ధిని కళ్లముందు సాక్షాత్కరించినట్టు..! ఇదీ శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. నూతన రాష్ట్రంలో వివిధ రంగాలపై సర్కారు విజన్ ఆయన భాషణంలో ఆవిష్కరించారు. సకల జనులంతా కలిసికట్టుగా సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునే క్రమంలో అందరి భాగస్వామ్యాన్ని ఆహ్వానించారు. ఏకపక్షంగా కాకుండా అందరం కలిసికట్టుగా సాగుదామని పిలుపునిచ్చారు. కొత్త ఒరవడితో సాగుదామని, కొత్త తెలంగాణ సృష్టించుకుందామని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై విపక్షాల సందేహాలు, సమీక్షలు, సలహాలకు ముఖ్యమంత్రి సవివరంగా జవాబిచ్చారు. తమ ప్రభుత్వ విధానాలను స్పష్టంగా ప్రకటించారు. కొత్త రాష్ట్రంలో పాత ప్రభుత్వాల జీవోలకు మనుగడ లేదని ప్రకటించారు. బంగారం తాకట్టు రుణాలు కూడా మాఫీ చేస్తామని ప్రకటించి రైతు రుణమాఫీపై చెలరేగిన వివాదానికి తెరదించారు. ఒకటి రెండు నెలల్లో వృద్ధులు, వితంతువుల పింఛన్లు, బీడీ కార్మికులకు భృతి అమలు చేస్తామని స్పష్టపరిచారు. బలహీనవర్గాల ఇండ్లకోసం అవసరమైతే భూములు కొనుగోలు చేస్తామని చెప్పారు.
విద్యుత్ కష్టాలు ఏడాదిపాటు ఉంటాయని, మూడేళ్లలో మిగులు సాధిస్తామన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రారంభానికి రెండేళ్ల వ్యవధి కావాలన్నారు. బాబ్లీతో సహా వివిధ అంశాల్లో ఇరుగుపొరుగుతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉంటామన్నారు. నదీ జలాల అంశంలో ట్రిబ్యూనల్ ముందు అవసరమైతే తాను కూడా వాదిస్తానని చెప్పారు. ప్రభుత్వం తలపెట్టిన వివిధ ప్రాజెక్టుల వివరాలను, సాధ్యాసాధ్యాలను సభ ముందుంచారు. రాజకీయ అవినీతిని నిర్మూలన చేస్తామన్నారు. మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్ విషయంలో కమిషన్లు, అధ్యయనాలతో పకడ్బందీగా ముందుకు పోతామన్నారు. మలి దశ ఉద్యమానికి తాను సృష్టికర్తను మాత్రమేనని అన్ని వర్గాల కృషి వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. కోటి ఆశలతో ప్రజలు ఎదురు చూస్తున్నారన్న సోయి తమకు ఉందని చెప్పారు. సీమాంధ్ర మీడియా అవహేళనలపై కేసీఆర్ చండ్ర నిప్పులు చెరిగారు. వారిని వదిలే ప్రసక్తేలేదని, అవసరమైతే కేబుల్ చట్టం తెస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తాను ఎన్నో తుఫాన్లు చూసిన వాడినని, మీడియా దుష్ప్రచారాలకు బెదిరేది లేదన్నారు. 

chandra

రైతులు తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను ఆంక్షలు లేకుండా మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. లక్షలోపు పంటరుణాలతోపాటు బంగారం కుదువపెట్టి తీసుకున్న పంట రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, గిరిజన, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల అమలుపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ముందుగా మాట ఇచ్చిన ప్రకారం బలహీనవర్గాలవారికి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీటి వాటాను సాధించుకుంటామని, చెరువులు కుంటలు నింపి తెలంగాణను సస్యశామలం చేస్తామని ఆయన ప్రకటించారు. విద్యుత్ సమస్యలను మూడేళ్లలో అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కలిపే తెలంగాణ ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ శనివారం శాసనసభలో తీర్మానం చేద్దామని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ రెండేళ్లలో పూర్తవుతుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనసభలో ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. తమ హామీలు, ప్రభుత్వ కార్యాచరణ గురించి వివరించారు.

వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

బంగారు తాకట్ల రుణాలు కూడా మాఫీ..

రైతు రుణమాఫీ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించరాదు. లక్ష లోపు రుణాలతో మొత్తం సుమారు 19,000 కోట్ల రూపాయల వరకు ఆర్థిక భారం పడనుంది. దీనిద్వారా రాష్ట్రంలోని 26 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దాదాపు 99 శాతం రైతులకు రుణవిముక్తి కలుగుతుంది. లక్ష లోపు రుణాలలో కొన్ని రకాల రుణాలపై ఇంకా చర్చిస్తాం. అన్ని రకాల రుణాల నుంచి రైతులకు విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తాం. ఆర్థిక శాఖ నుంచి వివరాలు తీసుకున్న వెంటనే అమలు చేస్తాం. విత్తనాలను రైతులకు సకాలంలో అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసినం. విత్తనాలను జిల్లాలవారీగా అన్నిచోట్ల పంపిణీ కోసం సిద్ధం చేసినం. సోయాబీన్ విత్తనాలపై ఉన్న ఆంక్షలను తొలగించి రైతులకు అందిస్తాం. సోయాబీన్‌కు తెలంగాణలో డిమాండ్ చాలా ఉంది. నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వరి విత్తనాలపై చెల్లించే 33శాతం సబ్సిడీని కేంద్రం ఉపసంహరించుకుంది. మా ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుంది. 
బీడీ కార్మికులకూ భతి

త్వరలోనే బీడీ కార్మికులకు కూడా భృతి ఇస్తాం. అసహాయులైన వృద్ధులు, వితంతువులతోబాటు వికలాంగులకు, బీడీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పింఛన్లను అందజేసే కార్యక్రమాన్ని అమలుపరుస్తుంది. లబ్ధిదారుల వివరాలను సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. మరో పది పదిహేను రోజుల్లో పాలసీ రూపకల్పన చేస్తాం. వికలాంగులకు నెలకు రూ.1500, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున అందజేస్తాం.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షం

విద్యారంగంలో పదేళ్లపాటు ఉమ్మడి అడ్మిషన్లు కొనసాగనున్నందున సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్షంలో నిర్ణయిద్దాం. వారికి ఫీజులు చెల్లిస్తే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగదా?.. వాట్ టు డు?.. తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లిద్దాం. దీనిపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేద్దాం. 
రేషన్‌కార్డుల బాగోతం బయటపెడతాం

తెలంగాణలో 84లక్షల 20వేల 662 గృహాలున్నాయి. కానీ 91లక్షల 94వేల 880 తెల్లరేషన్ కార్డులు మంజూరు చేశారు. గులాబిరంగు కార్డులు 17లక్షల ఏడువేల చిల్లర మంజూరయ్యాయి. ఈ లెక్కల ప్రకారం 22లక్షల కార్డులు అదనంగా పంపిణీ ఐనయి. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తాం. 
గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై అఖిలపక్షం

గవర్నర్ ప్రసంగంలో చెప్పిన విధంగా గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతం. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ప్రస్తుతం బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించకుండా మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతాం. ప్రస్తుతం రాష్ట్రంలో గిరిజనులు 10.8 శాతం మంది ఉన్నారు. వాల్మీకులు, బోయలను కలిపితే 11.6 శాతానికి చేరుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85శాతం మంది బలహీనవర్గాలవారే ఉన్నారు. అగ్రకులాలవారు 15 శాతం ఉన్నారు. ఈ మేరకు ఎస్టీలు, మైనార్టీలు ఎంత శాతం ఉన్నారనే అంశంపై కమిషన్ వేసి అధ్యయనం చేయించాలి. అందుకు త్వరలో అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహిస్తాం. అనంతరం కమిషన్ ఏర్పాటుచేసి అధ్యయన నివేదిక ఆధారంగా రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.
అఖిల పక్ష పార్టీలతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం. సాధారణంగా రిజర్వేషన్లు 50శాతానికి మించరాదు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై తమిళనాడులోని కొంత మంది నేతలు ఉద్యమం చేశారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంలో తమిళనాడుతో మొదట పుట్టింది ద్రవిడ కజగం. ఆ పార్టీని అన్నా దొరై ప్రారంభించారు. కర్నాటక ప్రభుత్వం కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పిస్తోంది. వారు కల్పించినప్పుడు మనకు ఎందుకు సాధ్యం కాదు? అయితే రిజర్వేషన్ల విధానం శాస్త్రీయ అధ్యయన నివేదిక కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పడు కేంద్రం పరిశీలించి 9వ షెడ్యూల్‌లో చేరుస్తుందని, తర్వాత రిజర్వేషన్లు కల్పించవచ్చని కేసిఆర్ వివరించారు. 
సొంత ఇళ్లు కట్టిస్తాం.. ఆత్మగౌరవం నిలబెడతాం..

బలహీనవర్గాల గృహ నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసి అవినీతికి పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తాం. తిన్న సొమ్మును కక్కిస్తాం. 125 గజాల స్థలంలో రెండు పడక గదులు, ఒక హాల్, ఓ వంటగదితో కూడిన ఇంటిని నిర్మిస్తాం. ప్రత్యేక బాత్‌రూం, లావెట్రీని ఏర్పాటు చేస్తాం. మూడు లక్షల రూపాయల ఖర్చుతో వీటిని నిర్మిస్తాం. వీథిదీపాలు, మురుగునీటి వ్యవస్థ, మంచినీటి వసతులతో సమగ్రమైన కాలనీలను నిర్మిస్తాం. అందుకు అవసరమైన భూములను కొంటాం. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఫ్లాట్లను నిర్మిస్తాం. 1983 నుంచి నేటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 42 లక్షల ఇండ్లను నిర్మించారు. మరో 5 లక్షలు నిర్మాణ దశలో ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం తెలంగాణలో 84 లక్షల 21 వేల కుటుంబాలున్నాయి. ఇందులో సగం మందికి ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇచ్చినట్లు లెక్కలు చూపుతున్నయి. మరి అవెక్కడికి పోయినయి?.. అక్రమార్కులెవరో కనిపెడతాం. ఈ లెక్కలన్ని తీసి వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం. రాబోయే కొద్దిరోజుల్లోనే విచారణ జరిపిస్తాం. 
వినూత్న విశ్వనగరం హైదరాబాద్

హైదరాబాద్ నగర సంస్కృతి ఎంతో వినూత్నమైనది.. ఈ నగరాన్ని మురికివాడలులేని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ చెప్పారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు పడక గదులతో కూడిన అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పారసీ తదితర భిన్న మతాల ప్రజలు సహజీవనం చేస్తున్న హైదరాబాద్ వినూత్నమైన సంస్కృతి సంప్రదాయాల నగరమని, ఇక్కడ కాస్మోపాలిటన్ సంస్కృతి ఉందన్నారు. ఇక్కడి వాతావరణం, సమశీతోష్ణస్థితి ఎక్కడెక్కడివారినో ఆకట్టుకుంటుందన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో అలైన్‌మెంటు పూర్తి అశాస్త్రీయంగా ఉందని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. చారిత్రక నిర్మాణాలపై నుంచి వెళ్ళడం అభ్యంతరకరమవుతుందన్నారు. అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ మార్గానికి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఇప్పటికే దీనిపై ఎల్ అండ్ టీ అధికారులకు ఆదేశాలిచ్చానని, వారు అలైన్‌మెంటు మార్పుకు అంగీకరించారని తెలిపారు. 
కొత్త ఒరవడిలో తెలంగాణ పాలన

తమ ప్రభుత్వపాలనలో కొత్త ఒరవడి ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా సభ్యులు జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్, బాజిరెడ్డి గోవర్ధన్, సున్నం రాజయ్య, పాయం వెంకటేశ్వర్లు, రవీంద్రకుమార్‌నాయక్ లేవనెత్తిన అంశాలకు సీఎం కేసీఆర్ సమాధానమిస్తూ.. పాత ప్రభుత్వాల ఉత్తర్వులను మనం (తెలంగాణ ప్రభుత్వం) పాటించబోమని స్పష్టంచేశారు. ప్రభుత్వం తనకుతానుగా ఏ ఒక్క నిర్ణయం తీసుకోదని, ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలన్నీ అఖిలపక్షంలో చర్చించిన తర్వాతే జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం సాధ్యంకాదని సీఎం స్పష్టం చేశారు. 
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ అనుబంధంగా ఉన్న విద్యార్థి విభాగంలోనే పది లక్షల మంది విద్యార్థులున్నారని తెలిపారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ వేతన స్కేళ్లు అమలుచేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తామెప్పుడు చెప్పలేదని సీఎం స్పష్టం చేశారు. రైతుల రుణాల మాఫీ అంశంపై గురువారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వీ నాగిరెడ్డితో చర్చించానని, దానికి సంబంధించిన విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఒక రూపం వస్తుందని, కొత్త రుణాలకు ఇబ్బందులు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 
తెలంగాణను సస్యశ్యామలం చేద్దాం..

సాగునీటి రంగం కథ రాసుకుంటె రామాయణమంత వింటె భారతమంత. తెలంగాణ నీటి బాధలు సమైక్య రాష్ట్రంలో చెప్పలేనంత. గోదావరి, కృష్ణా జలాల నీళ్లను తెలంగాణకు మళ్లించి ఆకుపచ్చ, పసుపుపచ్చ తెలంగాణగా మారుస్తాం. సమైక్యరాష్ట్రంలో నీటిపారుదల రంగం ధ్వంసమైంది. తెలంగాణ రెండు బేసిన్ల కింద ఉంది. గోదావరి బేసిన్ కింద మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలున్నాయి. కృష్ణా బేసిన్ కింద హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లున్నాయి. వరంగల్, ఖమ్మం జిల్లాలు రెండు బేసిన్ల కింద ఉన్నాయి. ఏ బేసిన్ కింద ఉన్న ప్రాంతాలకు ఆ నదీ జలాల వినియోగంపై సంపూర్ణ హక్కు ఉంటుంది. మన వాటా కృష్ణా నికర జలాల్లో 377 టీఎంసీలు, గోదావరిలో తొమ్మిది వందల టీఎంసీలు. రెండు బేసినల్లో కలిపితే 1277 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఈ మొత్తం నీరు దక్కితే కోటి 30లక్షల ఎకరాలు పారి తెలంగాణ సస్యశామలమవుతుంది. 
కృష్ణా నుంచి వందశాతం తాగునీరు హైదరాబాద్‌కు రావాల్సిందే. గోదావరి నుంచి నీరు రావాలంటే 160 కిలోమీటర్లు పంప్ చేయాల్సి ఉంది. దీనికోసం మనమందరం పోరాటం చేయాలి. పూర్తి వాటా కోసం ట్రిబ్యునల్ ముందు వాదించాలి. అవసరమైతే నేనే వాదిస్తా. గ్రావిటీ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు నీరు రావాలంటే జూరాల నుంచి 25 కిలోమీటర్ల లిఫ్ట్‌తో కోయిల్‌సాగర్.. అటునుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీరు చేరిస్తే నెత్తిమీద కుండ పెట్టుకున్నట్లే. అక్కడినుంచి తాండూరు, పరిగి, చేవెళ్లకు నల్లగొండ మునుగోడు, దేవరకొండకు నీళ్లందిచండంతోపాటు అదే గ్రావిటీ ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొస్తాం. అవసరమైతే భీమా ప్రాజెక్ట్‌కు కేటాయించిన నీటిని కూడా ఇటువైపే మలిపి మొత్తంగా 14లక్షల ఎకరాలకు నీరందిస్తాం. గోదావరి నది నీటిని తెలంగాణకు ఇవ్వడంలో సీమాంధ్ర పాలకులు అన్యాయం చేశారు. ఎస్సారెస్పీ తప్పితే గోదావరిపై ప్రాజెక్ట్‌లేవి?.. ఎస్సారెస్పీ దిగువన ప్రాణహిత జీవనది కలిసేచోట కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించుకోవాలి. 
అసెంబ్లీ సమావేశాలు ముగిసినవెంటనే మూడురోజులపాటు అఖిలపక్షం ఏర్పాటుచేసి నీటిపారుదల, వైద్యం, విద్య, విద్యుత్ అంశాలపై చర్చిద్దాం. కాంతనపల్లి, దేవాదుల ప్రాజెక్ట్‌లను పూర్తివినియోగంలోకి తెద్దాం. కడెంపైన రెండు మూడు ప్రాజెక్ట్‌లు నిర్మించాల్సి ఉంది. లోయర్ పెనుగంగ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పూర్తిచేయాలి. పెనుగంగ వరదతో అక్కడి పంటలు కొట్టుకుపోతున్నాయి. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల పెనుగంగ పూర్తికాలేదని మహారాష్ట్ర సర్కార్ పలుసార్లు చెప్పింది. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ అతి ప్రమాదకరంగా మారింది. ఎస్‌ఎల్‌బీసీ ఆఘమేఘాల మీద పూర్తిచేస్తాం. ఎంత ఖర్చయినా భరిస్తాం. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ తరిమేందుకు కృష్ణాజలాలతో ప్రక్షాళన చేస్తా. తెలంగాణ అనగానే ఆంధ్ర పాలకులు లిఫ్ట్ అనే పాట పాడేది. ఇకపై అది సాగదు. గ్రావిటీ ద్వారానే నీరందిస్తాం. జూరాల నుంచి పాకాలకు కాలువలు తవ్వుతాం. ఛిన్నాభిన్నమైన చిన్న నీటిపారుదలను మెరుగుపరుస్తాం. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తాం. పోలవరం ప్రాజెక్ట్‌లో కలిపే తెలంగాణ ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ శనివారం శాసనసభలో తీర్మానం చేద్దాం.
ఢిల్లీకి అఖిలపక్షంగా కలిసి పోదాం.

-ఈ విజయం ఏ ఒక్కరి సొంతం కాదు
-నేను ఈ దఫా ఉద్యమ సృష్టికర్తను మాత్రమే
తెలంగాణ రాష్ట్ర సాధన విజయం ఏ ఒక్కరి విజయమో కాదు. నేను కేవలం ఈ దఫా ఉద్యమ సృష్టికర్తను మాత్రమే. నాకంటే ముందు చాలా మంది పోరాటం చేశారు. జనసభ పేరుతో ఉద్యమాలు నడిచాయి. ఇంద్రారెడ్డిలాంటివారు పోరాటం చేశారు. 60ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉద్యమంలో అన్ని వర్గాలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నా. విపక్షసభ్యులు లేవనెత్తినట్లుగా తెలంగాణ వస్తే బాగుపడతామని ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేయం. అందరి ఆకాంక్షలు నెరవేరుస్తాం. అందులో భాగంగానే తెలంగాణ తన సొంత నీటి వాటాలను ఖరారు చేసుకోనుంది. కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటాం. తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం. బడ్జెట్ సమావేశాలలోపు అభివృద్ధి కార్యక్రమాలపై కాలపరిమితిపై స్పష్టతతో కూడిన నివేదిక రూపుదిద్దుకుంటుంది. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలోనే జనగామలో ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో సోనియాగాంధీకి కృతజ్ఞత చెప్పాం. సోనియాగాంధీతో పాటు తెలంగాణ ఏర్పాటుకు యూపీఏప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన 33 పార్టీల నేతలకు కృతజ్ఞతలు.
ప్రతిపక్షాల సూచనలు సహదయంతో స్వీకరిస్తాం

విపక్షాలు చేసే ప్రతి సూచనను సహృదయంతో స్వీకరిస్తాం. పరస్పరం విమర్శలు చేసుకోకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో సహకరిస్తామని ప్రకటించిన విపక్షనేత జానారెడ్డికి కృతజ్ఞతలు. మా ప్రభుత్వం ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోదు. అన్ని రాజకీయ పార్టీలు, విపక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని అంశాలపై దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

విద్యుత్ లోటును మూడేళ్లలో అధిగమిస్తాం

వచ్చే మూడేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌లోటును అధిగమిస్తుంది. విద్యుత్ అంశంపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిదాకా కరెంటు సమస్యలు తప్పవు. నార్త్-సౌత్ పవర్ కారిడార్‌లో ఇంకా 300 మెగావాట్ల విద్యుత్తును ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా కారిడార్ బుకింగ్‌కు చర్యలు తీసుకుంటున్నం. ఇప్పటికిప్పుడు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న మిగులు విద్యుత్తును కొనుగోలు చేసి తెలంగాణకు తీసుకురావాలంటే ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటుచేయడానికి కనీసం పదకొండు నెలలు పడుతుంది. 
సీమాంధ్ర మీడియా దురహంకారం

తెలంగాణ నూతన ప్రభుత్వం, శాసనసభపై సీమాంధ్ర మీడియా అహంకార పూరిత ధోరణితో వార్తా కథనాలను ప్రసారం చేయటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణపై విషం కక్కేలా టీవీ 9, ఆంధ్రజ్యోతి ప్రసారం చేస్తున్న, ప్రచురిస్తున్న వార్తా కథనాలను సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై ఆంధ్రా వలసవాదుల దాడితో కూసున్న కాన్నే ఏడ్సినం. గుడ్ల నీల్లు కుక్కుకున్నం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా పెత్తనం ఆగడాలు ఆగలేదు అని అన్నారు. టీవీ 9 చానల్‌లో తెలంగాణ శాసన వ్యవస్థను కించపరుస్తూ ప్రసారం చేసిన వార్తా కథనమే ఇందుకు నిదర్శనమన్నారు. టూరింగ్ థియేటర్‌లో కూర్చునే వారిని మల్టీప్లెక్స్ ధియేటర్‌లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో తెలంగాణ ఎమ్మెల్యేల వ్యవహారం అలాగే ఉంది అంటూ హేయమైన వ్యాఖ్యానాలు చేయటంపై కేసీఆర్ మండిపడ్డారు. అధ్యక్షా.. టీవీ 9 చానల్ శాసనసభ్యులందరినీ కించపరిచింది. 

ఎమ్మెల్యేలకు ఐ పాడ్‌లను ఇస్తే...ఎవరికో ఏదో ఇస్తే ఎక్కడనో పెట్టుకున్నట్లు...అని విమర్శిస్తరా.? తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగిన మొహాలతో పోలుస్తరా.? చొప్పదండి ఎమ్మెల్యే గొడిగె శోభ ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు తడబడితే పొద్దుందాక హేళన చేస్తూ చూపిస్తరా? ఇంత అహంకారమా? ఈ విషయం పొద్దున్నే నా దృష్టికి వచ్చింది. అందుకు సంబంధించిన సీడీ నా దగ్గర ఉన్నది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటేనే కొన్ని పేపర్లు, చానళ్లు విషం కక్కుతున్నయని మండిపడ్డారు. ఇందులో ఆంధ్రజ్యోతి అనే పత్రిక ప్రతిరోజూ విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. మంత్రులతో సమావేశం సందర్భంగా తాను కొన్ని సూచనలు చేశానని, మీడియా ముందు అనవసరంగా కామెంట్లు చేయవద్దని కొన్ని జాగ్రత్తలు చెపితే మొఖం చాటేసిన మంత్రులు అంటూ వార్తా కథనాలు రాయడం ఎంతవరకు సబబన్నారు. ఆంధ్రా నుంచి ఇసుక రవాణా బంద్ అని పేర్కొంటూ ఏపీ నుంచా..? వేసేయ్ పన్ను అంటూ రెచ్చగొట్టే విధంగా రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ నుంచి వచ్చే ఇసుకకు ఏ అధికారి పన్ను అదనంగా విధించాడో ఆధారాలు చూపాలని సవాలు చేశారు. 
నెంబర్ ప్లేట్ల మార్పుకు రూ.500 కోట్ల భారం పడుతుందని రాయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాటయిన సందర్భంగా ఇటువంటి మార్పులు చేర్పులు సహజమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నెగెటివ్‌గా చూపటానికి సీమాంధ్ర మీడియా ప్రయత్నిస్తున్నదని, ప్రభుత్వం కుదురుకోవద్దని డ్రామాలు ఆడుతూ అస్థిరపరిచేందుకు అహంకారంతో వ్యవహరిస్తున్న ఇటువంటి చానళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే తమిళనాడు తరహాలో కేబుల్ టీవీ వ్యవస్థను ఇటువంటి దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సీమాంధ్ర మీడియా పిట్ట బెదిరింపులకు.. లంగా ప్రచారాలకు బెదరం ఘాటుగా హెచ్చరించారు. 
టీఆర్‌ఎస్ కరపత్రంలా ఉండటమే కరెక్టు

గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ కరపత్రం చదివినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు.. టీఆర్‌ఎస్ కరపత్రంలా లేకుంటే ఆశ్చర్యపడాలి.. ఉంటే ఎందుకు? అని కేసీఆర్ విపక్షాలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. నేనూ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా. ఒక పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన పనులను చేస్తామని చెప్పిన తర్వాత వాటిని అమలు చేయాల్సిందే అని హెగెల్, ప్లేటో, బెంథామ్ తత్వవేత్తలు సైతం చెప్పారు. మేం కూడా అదే చేశాం.
సిమెంట్ ధరల నియంత్రణ మా చేతుల్లోలేదు

సిమెంటు ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో లేదని, ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలకు లోబడి ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కార్పస్‌ఫండ్‌కే పరిమితం కాదని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదాలకు వెళ్లకుండా సహృద్భావ వాతావరణంతో మెలుగుతుందని చెప్పారు. ఇక్కడ మనం ఇచ్చంపల్లి, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులు కట్టితీరుతాం, బస్తీమే సవాల్ అంటే సరిపోదు, గతంలో మాదిరిగా తెలంగాణలో దందాలుండవు, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దెబ్బతినకుండా సంయమనం పాటిస్తామని తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ ఇద్దరు బిడ్డల గురించి శనివారం అసెంబ్లీ ఒక తీర్మానం చేస్తుందని, వారికి నగదు పురస్కారం ప్రకటిస్తామని సీఎం తెలిపారు 

కేజీ టు పీజీ.. రెండేళ్లలో కార్యాచరణ

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్యను అమలుచేస్తాం. ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఇందుకు ఒక ప్రత్యేక శాశ్వత వ్యవస్థను రూపొందించాల్సి ఉంది. ప్రత్యేక క్యాంపస్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్ వంటి వత్తివిద్యా కోర్సులను చదివించాల్సి ఉంటుంది. దీనికోసం సమగ్రమైన కార్యాచరణను రూపొందించి వచ్చే రెండేళ్లలో ప్రారంభిస్తాం.రాజకీయ అవినీతిరహిత పాలన అందిస్తాం. రాజకీయ అవినీతికి దూరంగా ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యాలయాలు సక్రమంగా పనిచేస్తాయి. 
ముందలి నాగలి ఎట్లపోతే ఎన్క నాగలి అట్లొస్తది. రాజకీయ అవినీతికి దూరంగా ఉంటా. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేం చేయబోం. ఇందుకు సహకరిస్తామని ప్రతిపక్షనేత జానారెడ్డి ప్రకటించటాన్ని స్వాగతిస్తున్నాను. అమరవీరుల కుటుంబాలకు ఎంత ఆర్థికసాయం చేసినా వారి రుణం తీర్చుకోలేం. వారి ప్రాణాలు తీసుకురాలేం. ఆర్థిక సహాయంతోపాటు ఇళ్లు కట్టిస్తాం. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలతోపాటు 1969 ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబాలను సైతం ఆదుకుంటాం. 1969 అమరుల కుటుంబాల వివరాలు నా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నా.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి