తెలంగాణలోని కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యం నిర్వహణ కోసం కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గండికొట్టింది. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు నిర్వహణకు, పెద్దపులుల రక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గత ఏడాది మే నెలలో రూ.52లక్షలను విడుదల చేసింది. అప్పటికీ రాష్ట్ర విభజన అధికారికంగా జరగకపోవడంతో అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఖాతాలో జమఅయ్యాయి. కొత్తగా నోటిఫై అయిన ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు కేంద్రం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం కిందప్రత్యేకంగా రూ.52.48వేల లక్షలను విడుదల చేసింది. ఆ నిధులను పులుల సంరక్షణ, పునరావాసం వంటి కార్యక్రమాలకు ఉపయోగించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేరిన టైగర్ ప్రాజెక్ట్ నిధులను తెలంగాణ ట్రెజరీకి మళ్లించాలని తెలంగాణ అటవీశాఖ అధికారులతోపాటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు పలుమార్లు ఆంధ్రప్రదేశ్ అధికారులకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ వైభవ్ సీ మాథూర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీశాఖ ముఖ్యకార్యదర్శికి గత అక్టోబర్ 13న లేఖ రాశారు. తెలంగాణ ప్రిన్సిపల్ కన్జర్వేటర్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పలుసార్లు లేఖలు రాసినా ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పందించలేదు. అసలు ఆ నిధులేమయ్యాయి..? ఇతర అవసరాలకు మళ్లించారా..? అనే విషయంపై ఇప్పటి వరకు ఆంధ్రా అధికారుల నుంచి సమాచారం లేదు. ఈలోపు ఖర్చు చేయడానికి ఇచ్చిన గడువు దాటిపోయింది. ఇప్పుడు నిధులను మళ్లించినా ఖర్చు చేయడానికి వీలు లేదు. మళ్లీ కేంద్రానికి పంపాల్సిందే.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి