-గురుకుల్ కూల్చివేతలు ఆపే ముచ్చటే లేదు
-మధ్యతరగతివారుంటే మరో రకంగా ఆదుకుంటాం
-త్వరలోనే రాష్ట్ర వ్యాప్త భూముల రీసర్వే
-నిబంధనలు పాటించని కట్టడాలపై చర్యలు తప్పవు
-టీ మీడియాతో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
రాష్ట్రంలో వక్ఫ్ భూముల స్వాధీనానికి త్వరలోనే కార్యాచరణ ప్రారంభమవుతుందని ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములు దురాక్రమణకు గురయ్యాయని, ఆక్రమణదారుల భరతం పట్టక తప్పదని ఆయన అన్నారు. చట్ట ప్రకారం వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం రెండూ నేరమేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను తిరిగి వక్ఫ్‌కు అప్పగించడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చిన సందర్భంగా ఆయన టీమీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -మధ్యతరగతివారుంటే మరో రకంగా ఆదుకుంటాం
-త్వరలోనే రాష్ట్ర వ్యాప్త భూముల రీసర్వే
-నిబంధనలు పాటించని కట్టడాలపై చర్యలు తప్పవు
-టీ మీడియాతో డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
ప్రశ్న : వక్ఫ్ భూములపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?
జవాబు : వక్ఫ్ భూములు అనేవి ముస్లిం మైనారిటీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉద్దేశించి ఇచ్చినవి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇవి దురాక్రమణకు గురయ్యాయి. ప్రభుత్వం వీటిపై త్వరలోనే దృష్టి సారిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూములు వక్ఫ్ బోర్డుకు మాత్రమే చెందాలన్నది ప్రభుత్వ విధానం. అందువల్ల ఎక్కడెక్కడ ఎలాంటి దురాక్రమణలు జరిగాయి.. ఈ భూములతో ఎలాంటి క్రయ విక్రయాలు జరిగాయి ముందు తేలాలి. అలాగే ఇపుడు ఈ భూములు ఎవరెవరి అధీనంలో ఉన్నాయి వీటి పరిస్థితి ఏమిటన్నదీ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ సమీక్ష తర్వాత ప్రభుత్వం వీటిని ఎలా తిరిగి స్వాధీనం చేసుకుని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలో నిర్ణయించిన తగు కార్యాచరణ రూపొందిస్తుంది.
లాంకో హిల్స్ వక్ఫ్ భూముల్లోనే వెలిసినట్లు ఆరోపణలు..!
వక్ఫ్ భూములను కొనడానికి, అమ్మడానికి ఎవరికీ అధికారం లేదు. హైదరాబాద్‌లోని లాంకో హిల్స్ భవనాలను సుమారు 1650 ఎకరాల వక్ఫ్ భూముల్లో కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజం కూడా. అయితే ఈ భూములు ఎలా అమ్ముడయ్యాయి? అమ్మిందెవరు? కొన్నదెవరు లాంటి వివరాలన్నింటిపై ఆరా తీస్తాం. నేరంఎవరు చేసినా నేరమే. ఈ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన సంస్థల ప్రతినిధులతో ముందు మాట్లాడతాం. వారి అభిప్రాయాలను తెలుసుకుంటాం. ఆ తర్వాత చర్యల గురించి నిర్ణయిస్తాం. తొలుత ఆ భూములను తిరిగి వక్ఫ్‌కు అప్పగించేలా చూస్తాం. లేదంటే ఆ భూమికి మరో చోట భూమిని ఇచ్చేలా నష్టపరిహారపు చర్యలపై ఆలోచిస్తాం. ఈ అంశం లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేదానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.
గురుకుల్ ట్రస్ట్ విషయంలో..
గురుకుల్ ట్రస్ట్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆహ్వానించదగినవే. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఊరుకోదు. చట్టవిరుద్ధంగా ఇష్టారాజ్యంగా భవనాలు, కట్టడాలు వెలుస్తూ ఉంటే చేతులు ముడుచుకోలేం. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో భవనాల కూల్చివేతపై విమర్శలు సరికాదు. ఇంకా ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన భవనాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టబోదు. దిగువ మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులుంటే ప్రభుత్వం స్పందిస్తుంది. వారికి ఏ విధమైన సహాయం కావాలో చేయడానికి ముందుకు వస్తుంది. అంతే కానీ నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భవనాల కూల్చివేత మాత్రం ఆపబోము.
నగరంలోని భూముల రిజిస్ట్రేషన్లపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి గదా!
హైదరాబాద్ నగరంలో ఒకే భూమి పలువురి పేర్ల మీద రిజిస్టర్ అయినట్లు ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. వీటి వివరాలను రాబట్టడానికి భారీ కసరత్తు చేయాల్సి ఉంది. గత కొంత కాలంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రియల్ మాఫియా ఘనకార్యమిది. భూములను అనేక పేర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు. వీటి సంగతి తేల్చాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టక తప్పదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు లాండ్ రీ సర్వే జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రీ సర్వేలో అక్రమాలన్నీ బయటకు వస్తాయి. దాన్ని బట్టి ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత సీలింగ్ లాంటి చర్యలు ఏ మేరకు ఉంటాయన్నదానిపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుంది.
లాండ్ రీ సర్వే అవసరం ఇప్పుడే ఎందుకు?
నైజాం కాలంలో 1935 ప్రాంతంలో జరిగిన భూముల సర్వేనే చివరిది. ఆ తర్వాత మళ్ళీ సర్వేలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా నిజాం కాలం నాటి సర్వేపైనే ఆధారపడి లావాదేవీలు జరిగాయి. 80 సంవత్సరాలుగా పాత సర్వే రిపోర్టులే ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. కాబట్టి మరోమారు సర్వే జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 600 కోట్ల ఖర్చుతో పాటు సమయం కూడా బాగానే పట్టే అవకాశం ఉంది. భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలు, లోపాలు తదితరాలన్నీ అంచనాకు అందితే దానికి తగిన విధంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే చేయాలనుకుంటున్నాం. కేంద్రం నుంచి కూడా ఆర్థిక సాయం కోరాం. వస్తుందని ఆశిస్తున్నాం. త్వరలోనే రీ సర్వే జరగనుంది.
ఢిల్లీలో జరిగిన భూసేకరణ చట్టంపై సమావేశాల్లో తెలంగాణ వైఖరి ఏమిటి?
గత యుపీఏ హయాంలో ఈ భూ సేకరణ చట్టం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని సమీక్షించడంతో పాటు వివిధ ప్రాజెక్టులకు అవసరమైన స్థల సేకరణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నది. అందుకే ఈ సమావేశాలు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను కేంద్రానికి స్పష్టం చేశాం. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాం. అదే సమయంలో రైతుల సాగుభూముల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. వాటి జోలికి వెళ్ళవద్దనే అనుకుంటోంది. ప్రభుత్వ లేదా అసైన్డ్ భూమి విషయంలో నిర్ణయం తీసుకుంటుందిగానీ, రైతుల సాగుభూములు, వారికి జీవనాధారమైన వ్యవసాయం విషయంలో మాత్రం ప్రజల జీవనాధారానికే తొలి ప్రాధాన్యతనిస్తుంది. ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశాం. ఇక స్థల సేకరణ విషయంలో ప్రభుత్వం నిర్ణయించే ధరకు ప్రామాణికం ఏంటనేదానికి సంబంధించి లాండ్ రీ సర్వే జరుగుతుంది కాబట్టి తదనుగుణంగా ధర నిర్ణయించబడుతుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి