గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 30, 2014

పదవీ విరమణ వయస్సును 60 ఏండ్లకు పెంచాలి

-ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
-టీ ఉద్యమంలో ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి
-ప్రభుత్వానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి
-టీఎన్జీవో కేంద్ర కార్యవర్గం భేటీ.. ఉద్యోగ సమస్యలపై చర్చ
-అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసి సమావేశ తీర్మానాలు అందజేత
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకొని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగ భవన్‌లో దేవీప్రసాద్ అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది.

employee
ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లు, ప్రభుత్వ ఇచ్చిన హామీల అమలుపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు సమావేశ వివరాలను దేవీప్రసాద్ విలేకరులకు వెల్లడించారు.

-రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఉన్నత  స్థాయి అధికారుల వరకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉందని, ఇదే  విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని,
-ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలని,
-10వ పీఆర్సీతోపాటు 70 శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేయాలని,
-తెలంగాణ ఉద్యమంలో భాగంగా 42 రోజులపాటు నిర్వహించిన సకలజనుల  సమ్మెను విధుల్లో ఉన్నట్లుగా పరిగణించాలని,
-తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులపై నమోదుచేసిన కేసులను వెంటనే  ఉపసంహరించుకోవాలని,
-ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు మంజురు చేయాలని,
-తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని 

విజ్ఞప్తి చేశారు. కార్యవర్గ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కే రవీంద్రరెడ్డి, కార్యవర్గ సభ్యులు బండారు రేచల్, బుచ్చిరెడ్డి, రామినేని శ్రీనివాసరావు, మంగళగిరి హరిబాబు, నగరశాఖ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులతోపాటు పలు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

దేవీప్రసాద్ నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసిన నేతలు దాదాపు రెండున్నర గంటలపాటు ఉద్యోగ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ఉద్యోగులుగా కాకుండా శ్రామికులుగా పని చేస్తామని, అన్ని వేళలా ప్రభుత్వానికి అండగా ఉంటామని దేవీప్రసాద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. సీఎం కలిసిన వారిలో టీఎన్జీవో నేతలు కే రవీంద్రరెడ్డి, కార్యవర్గ సభ్యులు బండారు రేచల్, బుచ్చిరెడ్డి, రామినేని శ్రీనివాసరావు, మంగళగిరి హరిబాబు తదితరులు ఉన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి