గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 24, 2014

గురుకుల్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేయండి ...! -సీఎం కేసీఆర్‍ ఆదేశం

- ఇక ఒక్క అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదు
- నగరంలో భూఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం
- గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను సహించొద్దు
- అనుమతిలేని భవన నిర్మాణాలపై కొరడా ఝళిపించండి
- రెగ్యులరైజ్ చేసుకోకుంటే సీలింగ్ భూములూ స్వాధీనం
- అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి..
- సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇటువంటి అక్రమాలపై ఏమాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని ఆదేశించారు. ట్రస్ట్ భూములపై 2008లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి చర్యలు తీసుకోవాలని సూచించారు.

gurukul2ట్రస్ట్ భూముల్లో ఒక్క అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల అక్రమాలపై ముఖ్యమంత్రి సోమవారం సచివాలయంలో మంత్రులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల జీహెచ్‌ఎంసీ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అనుమతిలేని అక్రమ లేఅవుట్‌లకు విద్యుత్, తాగునీటి సరఫరా కనెక్షన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా గురుకుల్ ట్రస్ట్ భూముల వివరాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

నగరంలో గురుకుల్ ట్రస్ట్‌కు 2008లో 627 ఎకరాలను కేటాయించినట్లు, వీటిలో 70 ఎకరాలు అయ్యప్ప సొసైటీకి అప్పగించినట్లు తెలిపారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చామని, నిర్మాణాలను కూల్చివేశామని అధికారులు వివరించారు. అధికారుల వివరణపై సీఎం కేసీఆర్ అసంతప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆదేశించారు. భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అన్యాక్రాంతమైన గురుకుల్ ట్రస్ట్ భూములను కాపాడటానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

గత ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించడం వల్ల విలువైన గురుకుల్ ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై ఉదాసీన వైఖరిని విడనాడి ప్రభుత్వ భూములను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ట్రస్ట్ భూములను కాపాడటానికి పోలీస్‌లతో పికెట్‌లు ఏర్పాటు చేయాలని సీఎం డీజీపీ, నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను సహించకూడదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టిన భవన నిర్మాణాలపై కొరడా ఝళిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇప్పటికే అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలు స్పందించనందున నోటీసులు లేకుండానే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ అనుమతికి విరుద్ధంగా భవనాలను నిర్మించిన యజమానులకు నోటీసులివ్వాలని చెప్పారు. నోటీసులకు స్పందించి క్రమబద్ధీకరించుకోకుంటే వాటిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీలింగ్ భూములను కలిగి ఉన్న యజమానులు వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి