గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 31, 2014

ఆగని పోలీస్ సెటిల్‌మెంట్లు...

-సర్కార్ ఆశయానికి నిలువునా తూట్లు
-సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్న అధికారులు
-కరీంనగర్ జిల్లా డీఎస్పీ, ఎస్సైపై ఫిర్యాదు.. విచారణకు ఐజీ ఆదేశం
-అవినీతి అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న డీజీపీ అనురాగ్ శర్మ

స్వరాష్ట్రంలో అవినీతికి చెక్ పెట్టి మంచి పాలన అందించాలని ప్రభుత్వం ఒకవైపు తీవ్రంగా కృషి చేస్తుంటే పోలీస్ శాఖ మాత్రం అవినీతిలో కూరుకుపోతున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని భావిస్తుంటే.. సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో చేసినట్లుగా సెటిల్‌మెంట్ దందా సాగిస్తూ వివాదాస్పదంగా మారుతున్నారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ భావిస్తున్నట్లు తెలిసింది. తాజాగా కరీంనగర్ జిల్లా డీఎస్పీ, ఎస్సైపై ఇలాంటి ఆరోపణలే రావడంతో తక్షణ చర్యలకు వరంగల్ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. 
ఐపీఎస్‌ల నుంచి ఎస్సై వరకు..

సెటిల్‌మెంట్ల వ్యవహారం పోలీస్‌శాఖలో ఎస్సైల స్థాయినుంచి ఐపీఎస్‌ల వరకూ వేళ్లూనుకుంది. కొందరు ఐపీఎస్ అధికారులు శృతిమించి వ్యవహరిస్తున్న తీరు పోలీస్ శాఖకు తలవంపులుగా మారింది. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీసీపీలు సెటిల్‌మెంట్ల దందాలో ఆరితేరారని డీజీపీ కార్యాలయం గుసగుసలాడుకుంటున్నది. కీలక ప్రాంతానికి డీసీపీగా ఉన్న అధికారి ఇటీవలే విదేశీటూరుకు వెళ్లిరావడం.. సివిల్ పంచాయితీకి తాజా ఉదాహరణ అని తెలిసింది. ఓ రెండున్నరెకరాల భూమి సెటిల్‌మెంట్ చేసినందుకు నజరాగానే ఈ డీసీపీ విదేశాలకు వెళ్లివచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఇదే కమిషనరేట్‌లో పనిచేస్తున్న మరో డీసీపీ ఏకంగా ఎర్రచందనం మాఫియాతో సంబంధాలు పెట్టుకొని ఉన్నతాధికారులకే చుక్కలు చూపించారు. ఏసీపీలతో కలిసి తన కార్యాలయంలోనే దందాలు చేసిన మరో డీసీపీ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లింది.

క్యాడర్ అలాట్‌మెంట్‌లో ఏ అధికారి ఎటు వెళ్తారో తెలియక ఉన్నతాధికారులు ఎవరిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. వరంగల్ రేంజ్‌లో పనిచేస్తున్న ఓ డీఐజీ అవినీతి లీలలు పెచ్చుమీరడంతో ఇటీవలే డీజీపీ పిలిచి తీవ్రంగా చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అయినా, సదరు అధికారి తీరులో మార్పులేదు. ఇటీవలే తన ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు ఒక్కో ఇన్‌స్పెక్టర్ అరతులం బంగారం సమర్పించుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సివిల్ వివాదాలు, అక్రమ కేసులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ అనురాగ్ శర్మ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులోభాగంగా అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రతి జిల్లా ఎస్పీకార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి టీ మీడియాకు తెలిపారు.

పెద్దపల్లి డీఎస్పీ, గంగాధర ఎస్సైపై ఫిర్యాదు

సివిల్ వివాదంలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డీఎస్పీతోపాటు గంగాధర మండలం ఎస్సై రాజేంద్రప్రసాద్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు శనివారం నార్త్‌జోన్ ఐజీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదాల్లో డీఎస్పీతోపాటు ఎస్సై జోక్యం చేసుకొని ఇబ్బందులుకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని చంపుతానంటూ ఎస్సై బెదిరిస్తున్నాడని ఫోన్‌కాల్ రికార్డులు సైతం వినిపించారు. ఫిర్యాదుపై స్పందించిన ఐజీ రవిగుప్తా.. తక్షణమే విచారణ జరుపాలని కరీంనగర్ జిల్లా ఎస్పీ శివకుమార్‌కు ఆదేశించారు. సోమవారంలోగా రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఆగస్టు 30, 2014

నవ తెలంగాణలో ఉపాధి...

స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో గత అర్ధశతాబ్ద వలస పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేయడానికి కేసీఆర్ నూతన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఇది చెప్పినంత సులువైనదేమీ కాదు. కానీ పాలకుల చిత్తశుద్దీ, ప్రజల సహకారం తోడైతే అసాధ్యం కూడా కాదు. తెలంగాణ వేరుపడిందన్న అక్కసుతో ఉన్న సీమాంధ్ర పాలకవర్గాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులు, చేనేత కార్మికులు, అసంఘటిత రంగాల్లోని వారు, ఆటోడ్రైవర్లు, గిరిజనులు, దళితులు మొదలైన వారి సమస్యలను చర్చించి పరిష్కారాలను త్వరితగతిన అమలు చేస్తున్నది. అలాగే రాజధానిలో, తెలంగాణ తొమ్మిది జిల్లాల్లో జరిగిన భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే తరహా పనివిధానంతో ముందుకు పోతే అక్రమార్కుల కోరలు విరిచివేయవచ్చు.

ఇప్పుడు మేధావులు,విద్యావంతులు ఆలోచించవలసిన అంశాలు ఉపాధి, విద్యా రంగాలు. ఉపాధి రంగంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఉన్నది. తక్షణ కార్యక్రమంగా తీసుకుని వీరందరికీ ఉద్యోగాలు కల్పించాలి.అలాగే ప్రస్తుతం పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. విద్యావిధానంలోనూ సమూల మార్పులు చేయాలి. ఇప్పుడు అనుసరిస్తున్న విద్యావిధానం ఏమాత్రం ఉపాధి కల్పనకు అక్కరకు రాని చదువును అందిస్తున్నది. విదేశాల్లోని విద్యావిధానం చూస్తే..ఆయా దేశాల్లో మాండలికాలు, స్థానిక భాషలు ఎన్ని ఉన్నా ఆదేశంలో ప్రధానంగా 80 శాతం మంది ఒకే భాషను మాట్లాడుతారు. అందుకే ఆ ప్రధాన భాషలో విద్యా బోధన చేస్తారు. వారి బోధన శాస్త్రీయంగా నిత్యజీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ విషయంలో మన దేశం చాలా భిన్నంగా ఉన్నది.

ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒకభాష మాట్లాడుతారు. అందులో కూడా ప్రాంతీయ మాండలికాలున్నాయి. ఈ పరిస్థితిలో ప్రాథమిక స్థాయిలో ఒకే మాధ్యమంలో విద్యాబోధన ఉండాలని కోరుకోవడం అసమంజసంగా ఉంటున్నది. ఇది కాదని ప్రపంచ భాష ఇంగ్లిష్ అని కోరుకుంటే మాతృభాష రాని దౌర్భాగ్య స్థితి ఉంటున్నది. ప్రఖ్యాత విద్యా శాస్త్రవేత్తలు చెబుతున్నదేమంటే విద్యార్థులకు చెబుతున్న, చదువుతున్న చదువుతో జ్ఞానం పెరగాలంటే మాతృభాషలో పట్టు ఉండాలి. అలాగే భాషలు నేర్చుకోవడంలో చిన్నప్పుడు ఉన్న నైపుణ్యం పదకొండేళ్ల తర్వాత తగ్గుతూ వస్తుంది. అందుకే మన విద్యార్థులు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివినా ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం రావడం లేదు.

నిజానికి ఇతర యూరోపియన్, ఇండియన్ భాషల కన్నా ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకోవచ్చు. ఇంగ్లిష్ రాదని బాధపడే విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉంటున్నదని చెప్పి ఇంగ్లిష్ మీడియంలోనే చదవడం పరిష్కారం కాదు. నేడున్న విద్యావిధానంతో విద్యార్థికి ఏ భాషా సరిగారాని పరిస్థితి ఉన్నది. ఇలాంటి అసంబద్ధ విద్యావిధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తిపలకాలి. కాలానుగుణంగా విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి.

దీనిలో భాగంగా మన పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్థాయిలో మరో పరాయి భాష బోధించాల్సిన అవసరం లేదు. అలాగే సామాన్య,సాంఘిక శాస్త్రాలు, నీతిశాస్త్రాలు బోధించాల్సిన పనిలేదు. ఐదవ తరగతి దాకా ఏదో ఒక మాధ్యమం అనిగాక మూడు ప్రధాన భాషలు నేర్పాలి. 5వ తరగతి తర్వాత విద్యార్థి భాషా ప్రావీణ్యాన్ని బట్టి మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. పదేళ్లలోపు పిల్లలు ఎన్ని భాషలైనా సులభంగా నేర్చుకో గలుగుతారని మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భాష అనేది వినడం, గమనించడం, అనుకరించడం, మననం చేయడం, స్థిరీకరించుకోవడం అనే ఐదు సహజమైన క్రియల ద్వారా నేర్చుకుంటారు. భాషను నేర్పే ఉపాధ్యాయులు భాషా ప్రవీణులై శాస్త్రీయ పద్ధతిలో బోధిస్తే పిల్లలు సులభంగా నేర్చుకుంటారు. బోధనలో నైపుణ్యాలు లేకనే పిల్లలకు భాషపై పట్టురాదు. ఆ తరువాత 6వ తరగతి నుంచి 10 వ తరగతి దాకా ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న భాషా నైపుణ్యాల పునాదిపై మిగతా శాస్త్రాలను, గణితాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు. జ్ఞానాన్ని పొందుతారు.

కానీ సీబీఎస్సీ విధానంలో 4వ తరగతి దాకా రెండు భాషలు, 5నుంచి 8 దాకా మూడు భాషలు, 9, 10 తరగతుల్లో రెండు భాషలు చదవాలి. ఈ పుస్తకాలలోని భాష,విజ్ఞాన శాస్త్రాలలోని భాష వ్యక్తీకరణ కఠినంగా, హై స్టాండర్డ్స్ లో ఉంటుంది. 6 నుంచి సీబీఎస్సీ విధానం అమలు చేయాలన్నా విద్యార్థులకు ఈ మూడు భాషల్లో ముఖ్యంగా ఇంగ్లిష్‌లో మంచి భాషా పరిజ్ఞానం ఉండాలి. దీనితో పాటు అన్ని స్థాయిల్లో, అన్ని పాఠశాలల్లో విద్యతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విధిగా ఉండాలి.

వ్యాసరచన, ఉపన్యాస పోటీల వంటి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి. నృత్యం, చిత్రలేఖనం, సంగీతంతో పాటు లలితకళలన్నింటినీ విద్యార్థులకు నేర్పించాలి. ఇవన్నీ ఆశించిన స్థాయిలో అమలు కావాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా మొదట ఉపాధ్యాయులు మంచి ప్రవీణులై ఉండాలి. చిత్తశుద్ధితో పనిచేసే, నిబద్ధత కలిగిన వారై ఉండాలి.

డిగ్రీ స్థాయి వచ్చేసరికి ఇంగ్లిష్ భాషా నైపుణ్యం బాగా ఉంటే ఇతర దేశాల్లోలాగా డిగ్రీ రెండేళ్లు ఇంగ్లిష్ ఫర్ స్పెసిఫిక్ పర్పసెస్ (ఇఎస్‌పీ) కోర్సులు ప్రవేశపెట్టి బోధించవచ్చు.అంటే ఏ ఫీల్డు వారికి ఆయా సబ్జెక్టులు ఉంటాయి. దీంతో విద్యార్థులు ఒక స్పష్టమైన ఆలోచనా దృక్పథంతో పాటు తాము చేయదల్చుకున్న పని, ఉద్యోగం, లేదా తాము ఎంచుకున్న రంగం పట్ల అవసరమైన నైపుణ్యాలతో బయటకు వస్తారు. అలాంటి వారికి ఉపాధి దొరకక పోవడం అనే సమస్యే ఉండదు. ఇక చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే యువత కోసం హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల్లో స్కిల్ ట్రేనింగ్ సెంటర్లు స్థాపించాలి.

వీటిలో గ్లోబల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ ఇవ్వాలి. ఈ మధ్య చేసిన ఒక అధ్యయనంలో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థుల్లో 83 శాతం మందికి, జనరల్ డిగ్రీ చేసిన వారిలో 93 శాతం మందికి కనీస నైపుణ్యాలు లేవని తేలింది. అంటే విద్యార్థులు చదువుతున్న చదువులతో వారి జీవనానికి, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితిలోనే విద్యార్థులు ఉద్యోగాలు దొరకక సతమతమవుతూ ఉంటే.. అటు పలు సంస్థలు సరియైన నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి అసంబద్ధ విధానం పోవాలంటే.. విద్యార్థులకు సకల నైపుణ్యాలు అందించే విద్యావిధానం అందుబాటులో ఉండాలి. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ప్రయత్నిస్తే.. బంగారు తెలంగాణ దిశగా నడక ప్రారంభమైనట్లే. 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఆగస్టు 29, 2014

కమలనాథన్ కమిటీ క్యాట్‌వాక్!

-బిల్డప్‌లే తప్ప ఒరిగిందేమీ లేదు
-56 వేల ఉద్యోగుల విభజనకు ఆరుమాసాలు
-అయినా జాడలేని మార్గదర్శకాలు
-ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులపై కూడా రాని స్పష్టత
-సాగదీసేయత్నమని టీ సంఘాల మండిపాటు
ఉద్యోగుల విభజన ఫైనల్ మార్గదర్శకాలను రూపొందించడంలో జరుగుతున్న ఆలస్యం మీద పలువురు మండిపడుతున్నాయి. కమలనాథన్ కమిటీ ఉద్ధేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నదని తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 56వేల మంది ఉద్యోగులను విభజించడానికి ఆరుమాసాల వ్యవధి చాలకపోతే, పూర్తి 5 లక్షల మంది ఉద్యోగులను విభజించడానికి ఇంకెంత కాలం పడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
kamalఫైనల్ మార్గదర్శకాలు ఇదిగో అదిగో అంటూ ఆగస్టు13 నుండి ఊరించడమే తప్ప అడుగు ముందుకు పడలేదని వారు విమర్శిస్తున్నారు. ఏదో రకంగా విభజనను మార్చివరకు సాగదీయాలనే ఉద్దేశం కనిపిస్తున్నదని వారంటున్నారు. టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యోగుల వేదిక, టీ.నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం, టీఎన్జీవో సెక్రటేరియట్ విభాగం తదితర సంఘాల నాయకులు విభజనలో జరుగుతున్న అనవసరజాప్యంపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మార్చినుంచి ఇదే తంతు.. కమల్‌నాథన్ కమిటీ మార్చిలో విభజన ప్రక్రియ ప్రారంభించింది. ఆగస్టు నెల చివరివరకు వచ్చినా ఇంతవరకూ చేసిందేమీ లేదు. చివరికి నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణ వారికి తెలంగాణకు, సీమాంధ్ర వారికి సీమాంధ్రకు బట్వాడా చేస్తామని ప్రకటించి పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ అంశంపైన స్పష్టతను ఇవ్వలేదని ఉద్యోగసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

ఉద్యోగుల విభజనకు ఏడు దశలు ఉంటాయని కమలనాథన్ కమిటీ చేసిన ప్రకటననను దృష్టిలో పెట్టుకొని నాలుగోతరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగుల బట్వాడాకు కూడా సప్తసముద్రాలు దాటాల్సిన అవసరం ఉన్నదా? అంటూ తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జానేశ్వర్ మండిపడ్డారు. నాలుగోతరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగుల పదవీవిరమణ 60 సంవత్సరాల వరకు ఉంటుందని, వీరిని ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికి బట్వాడా చేయడం వల్ల విధాన నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండవని ఉద్యోగసంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఇంత సులభమైన ప్రక్రియను కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

క్యాడర్‌స్ట్రెంత్ ఓ తలనొప్పి..

కమలనాథన్ కమిటీ ప్రకటించిన క్యాడర్‌స్ట్రెంత్‌పై చాలా దుమారమే రేగింది. జిల్లా స్థాయి పోస్టులను రాష్ట్రస్థాయి పోస్టులుగా, రాష్ట్రస్థాయి పోస్టులు జిల్లా పోస్టులుగా తారుమారు చేశారని టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి విమర్శించారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ పోస్టులలో 40వేల స్థానాలలో సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారని టీజీవో అధ్యక్షులు,శాసనసభ్యులు వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ గ్రీవెన్సెస్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కమలనాథన్ కమిటీకి అందచేసినా కమిటీ ఎటూ తేల్చలేదని వ్యాఖ్యానించారు.

సీమాంధ్రప్రాంతంలో ఇమడలేక స్వచ్ఛందంగా తెలంగాణకు వస్తామని తెలంగాణ ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నా వాటిపైన ఎందుకు మాట్లాడటం లేదని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు ఎం చంద్రశేఖర్‌గౌడ్ ప్రశ్నించారు. అక్టోబర్ చివరి నాటికి మొత్తం ఉద్యోగుల విభజనను పూర్తిచేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘాలు మొత్తుకుంటున్నా కమిటీ మాత్రం కుంటినడకలు నడుస్తున్నదని వారంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శ్రీశైలంలోనే కృష్ణమ్మ బందీ!

- ఇన్‌ఫ్లో కొనసాగుతున్నా నీటి విడుదల శూన్యం
- పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలింపు?
- విద్యుదుత్పత్తికి వినియోగించిన నీరే సాగర్‌కు..
ఎగువ రాష్ర్టాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా.. ఆ ఆ ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు మాత్రం నీటి విడుదల జరగడం లేదు. ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు రోజుకు కనీసం లక్ష క్యూసెక్కులకుపైనే ఇన్‌ఫ్లో వస్తున్నది. ఫలితంగా ప్రాజెక్టు నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.30 అడుగులమేర నీరుంది. నిబంధనల ప్రకారం నీటిమట్టం 834 అడుగులు దాటగానే దిగువన ఉన్న నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయాలి.
SRISAILAMకానీ ఇప్పటికీ సాగర్‌కు నీటివిడుదల జరగడం లేదు. నీటిని ప్రాజెక్టులోనే నిల్వ ఉంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమకు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీశైలంలో 841 అడుగులమేర నీరు చేరితే కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా తరలిపోయేందుకు వీలుగా మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజమార్గం వేశారు. దీంతో నాగార్జునసాగర్‌కు రావలసిన నీటిలో గండిపడుతున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేవలం శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం వదులుతున్న నీరే సాగర్‌కు వస్తున్నది.

బుధవారం ఒక్కరోజే శ్రీశైలానికి 1,53,581 క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే, సాగర్‌కు కేవలం 45,190 క్యూసెక్కులు మాత్రమే వదిలారు. ఇది కూడా విద్యుదుత్పత్తికి వినియోగించిందే కావడం గమనార్హం. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుతం 546.70 అడుగులు మాత్రమే నీరుంది. సాగర్‌కు 33,321 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తుండగా, ప్రాజెక్టు నుంచి 28,312 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మరో ఏడు అడుగుల నీరు చేరితే శ్రీశైలం పూర్తిగా నిండనుండగా, నాగార్జునసాగర్ నిండాలంటే మాత్రం మరో 44 అడుగుల మేర నీరుచేరాలి.

SRISAILAM2

ట్రాన్స్‌కోలో గ్లోబల్ టెండర్లకు కుట్ర!


బ్లాగువీక్షకులకు, మిత్రులకు, తెలంగాణ ప్రజలకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

- విద్యుత్ సబ్‌స్టేషన్లపై అజమాయిషీకి సీమాంధ్రుల ప్రయత్నం
- రోడ్డున పడనున్న తెలంగాణ కాంట్రాక్టర్లు, కార్మికులు 
transco

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) లోని సీమాంధ్ర అధికారులు మరో కుట్రకు తెరలేపారు. ఒకేసారి 150కి పైగా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట గొట్టడమే కాకుండా అడ్డదారుల్లో దాదాపుగా రూ.10-15 కోట ్లఅవినీతికి పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్‌స్టేషన్ల నిర్వహణకు గ్లోబల్ టెండర్లు నిర్వహించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు కొత్త కుట్రకు తెరలేపారు. ఈ కొత్త విధానంలో ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా చేసి కనీసం రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లకే వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

సీమాంధ్రకు చెందిన కొంతమంది ఉన్నతాధికారులే తెరవెనుక ఉండి ఈ కథ నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లు ఎవరికీ రూ.5కోట్ల టర్నోవర్ లేదు. ఈ విధానం అమల్లోకి వస్తే తెలంగాణకు చెందిన విద్యుత్ కాంట్రాక్టర్లు ఎవరూ అర్హులు కాకుండాపోతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఇంకా తమ ఆధిపత్యమే కొనసాగాలని భావిస్తున్న సీమాంధ్రులు కుట్రపూరితంగా ఈ నిబంధనలు రూపొందించారనే విమర్శలున్నాయి. 

తెలంగాణ కాంట్రాక్టర్లకు మొండిచేయి..: తెలంగాణ పది జిల్లాల్లో 132/33 కేవీ సబ్‌స్టేషన్లు నూటడ్బ్బైమూడు , 220/33 కేవీ సబ్‌స్టేషన్లు యాభైనాలుగు, 400 కేవీ సబ్‌స్టేషన్లు ఆరు ఉన్నాయి. ఇవి కాక ట్రాన్స్‌మిషన్ లైన్‌ల తనిఖీ, నిర్వహణకు రాష్ట్రంలోని పదిజిల్లాల పరిధిలో 43 గ్యాంగ్‌లు ఉన్నాయి. వీటన్నింటి నిర్వహణ ప్రస్తుతం 150 మంది చిన్న కాంట్రాక్టర్ల ద్వారా జరుగుతున్నది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనల మేరకు 10 నుంచి 14 మంది అర్హులైన కార్మికులను జౌట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించుకుని నిర్వహణ బాధ్యతలు చూస్తారు. కొందరు రెండు, మరి కొంతమంది మూడు సబ్‌స్టేషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వీరు నిబంధనలకు విరుద్ధంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారినే కార్మికులుగా నియమించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో ఇకపై సీమాంధ్ర కాంట్రాక్టర్ల ఆటలు సాగవని గుర్తించిన సీమాంధ్ర ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సబ్‌స్టేషన్ల నిర్వహణకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్న కొత్త కుట్రకు తెరలేపారు. తెలంగాణ కాంట్రాక్టర్లను పక్కన పెట్టే ఎత్తుగడలో భాగంగా రూ.5కోట్ల టర్నోవర్ నిబంధనను తెరపైకి తెచ్చారు. గతంలో ట్రాన్స్‌కో సీఎండీగా ఉన్న సురేష్ చందా ద్వారా ఈ విధానాన్ని అమల్లోకి తేవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. ఆయన బదిలీ కావడంతో ఈ విధానం అమలయ్యేలా చూడాలని ప్రస్తుతం జేఎండీగా ఉన్న కార్తికేయ మిశ్రాపై సీమాంధ్రులు తీవ్ర స్థాయలో ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. 

ఆ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి

- ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కొనసాగించేందుకు సీమాంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్లకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మింట్‌కంపౌండ్‌లో బుధవారం తెలంగాణ ట్రాన్స్ కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి పది జిల్లాలకు చెందిన ట్రాన్స్‌కో కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల నిర్వహణ బాధ్యతలను గంపగుత్తగా సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించేందుకే రూ. 5కోట్ల టర్నోవర్ నిబంధన సీమాంధ్ర అధికారులు తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గ్లోబల్ టెండర్ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే ఆం దోళనకు దిగుతామని హెచ్చరించారు. 

సమావేశం అనంతరం సీఎం కేసీఆర్, ఇంధనశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీకి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్రప్రతినిధులు పిచ్చయ్య, శ్రీను, బుచ్చిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, పండరినాథ్, శివకుమార్, రామసుబ్బారెడ్డి, శంకర్, బాలరాజు, లక్ష్మణచారి, ఖయ్యూం, మునీరుద్దీన్, ప్రవీణ్‌కుమార్, నర్సింహారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు తెలంగాణ పదిజిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 
telangana-sustations

గురువారం, ఆగస్టు 28, 2014

తెలుగు వర్సిటీ.. ఆంధ్రామయం!

- కీలక పోస్టులన్నింటిలో సీమాంధ్రులే
- తెలంగాణ ఉద్యోగులపై తీవ్ర వివక్ష
- 27 ఏండ్లుగా ఇదే తంతు
- తెలంగాణ వచ్చినా తొలగని ఆధిపత్యం
- జోక్యం చేసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు టీ ప్రొఫెసర్ల విజ్ఞప్తి

ఉమ్మడి రాష్ట్రంలో 27 ఏండ్ల కిందట ఏర్పాటైన తెలుగు యూనివర్సిటీ..ఆంధ్రోళ్ళ ఆధిపత్యానికి వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఇప్పటికీ వర్సిటీలో సీమాంధ్ర అధ్యాపకుల పెత్తనం కొనసాగుతూనే ఉంది. తెలుగు యూనివర్సిటీ అకడమిక్, పరిపాలన విభాగాలకు సంబంధించిన అన్ని కీలక పదవుల్లోనూ వారే తిష్ఠ వేశారు.వర్సిటీ ఉన్నత పదవుల్లో తెలంగాణ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిపాలన సిబ్బంది మచ్చుకు కూడా కనిపించరంటే అతిశయోక్తి కాదు. కీలక పోస్టుల్లో నూటికి 80 శాతం సీమాంధ్ర ఉద్యోగులు పాతుకుపోయారు.

సీమాంధ్రలో వర్సిటీ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పనిచేస్తున్న వారంతా డిప్యూటేషన్ పేరుతో క్రమంగా విశ్వవిద్యాలయంలో పాగా వేశారు. ఆంధ్రా రాజకీయ నేతల అండదండలతో వారు వర్సిటీలోకి చొరబడ్డారు. వర్సిటీ ఏర్పాటుచేసిన నాటినుంచి ఇందే తంతు కొనసాగుతున్నది. పరిపాలన విభాగంలోని కీలక పదవుల్లో ఏడుగురు సీమాంధ్రులు ఉన్నారు. వారిలో జీ వెంకటరామయ్య, ప్రొఫెసర్ పీ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ మృణాళిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఆర్ శ్యామల, ప్రొఫెసర్ కే సంజీవ్‌రావు, పబ్లికేషన్ డైరెక్టర్ వీ నిరీక్షణబాబు, రిజిస్ట్రార్ పీఏ డీవీడీ లక్ష్మీ కూడా సీమాంధ్రులే. వీరు దాదాపు 20 ఏండ్లుగా కొనసాగుతున్నారు. ఇక వర్సిటీలో ఫ్యాకల్టీగా 48 మంది పనిచేస్తుంటే వారిలో 22 మంది తెలంగాణ వారు, 26 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు. నాన్‌టీచింగ్ సిబ్బందిలో మొత్తం 35 మంది పనిచేస్తుంటే వారిలో తెలంగాణ సిబ్బంది 13 మంది, సీమాంధ్ర వారు 22 మంది ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల్లో ప్రొఫెసర్ పీ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ జీ వెంకటరామయ్య శ్రీశైలం నుంచి బదిలీపై హైదరాబాద్‌కు వచ్చి.. తొమ్మది ఏండ్లుగా వర్సిటీలో కొనసాగుతున్నారు. ఆడిట్ వ్యవహారంలో ప్రొఫెసర్ వెంకటరామయ్యపై ఫిర్యాదులు సైతం వచ్చాయి. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు వర్సిటీని నియంత్రిస్తూ.. చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలో కనీస విధులు కూడా నిర్వహించకుండా.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల వరకు జీతాలు పొందుతున్నారని ఉద్యోగులు చెప్తున్నారు.

ప్రొఫెసర్ వెంకటరామయ్య స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా, స్టూడెంట్ ఫిర్యాదుల విభాగానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సమాచార హక్కు చట్టం విభాగానికి లైజనింగ్ ఆఫీసర్‌గా, డైరెక్టర్ ఆఫ్ మ్యూజియంగా ఆయనే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇన్ని పదవులు చాలదన్నట్టు.. ఆయన గత తొమ్మది ఏండ్లుగా కొనుగోలు కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగడం వర్సిటీలో ఆంద్రోళ్ళ పెత్తనం నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రొఫెసర్ చెన్నారెడ్డి కూడా అనేక పదవులు నిర్వహిస్తున్నారు. ఆయన పాలన అధికారిగా, అకడమిక్ ఎఫైర్స్ డీన్‌గా, వర్సిటీ బాచుపల్లి క్యాంపస్ ఇన్‌చార్జ్‌గా, సంస్కృతి, ప్రాంతాల అధ్యయనం విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు. ఇక వర్సిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉన్న ఒకాయన రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు.

బాచుపల్లి క్యాంపస్ నిర్మాణ సమయంలో వచ్చిన ఆయన.. క్యాంపస్ నిర్మాణం పూర్తయినా.. ఇంకా బాచుపల్లిలో ఇంజినీర్‌గానే నేటికి కొనసాగుతున్నారు. మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కూడా తెలుగు వర్సిటీకి అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో సీమాంధ్ర ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండానే స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా తిష్ఠవేశారు. మరో సీమాంధ్రుడు సూపరింటెండెంట్ రిజిస్ట్రార్ పేషీలో 20 ఏండ్లుగా కొనసాగడం విమర్శలకు తావిస్తున్నది. ఇలా సీనియర్ ఉద్యోగుల స్థానాల్లో సీమాంధ్రులు తిష్ఠ వేశారు. బదిలీపై రావడమే తప్ప తిరిగివెళ్ళడం లేదు. దీనికితోడు పదవీ విరమణ చేసిన ముగ్గురు సీమాంధ్రులు సైతం నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెంట్లుగా 8 ఏండ్లుగా కొనసాగుతున్నారు.

యూజీసీ సెల్‌లోనూ అదే తంతుతెలుగు వర్సిటీ విభాగాలలో యూజీసీ సెల్ కీలకమైనది. యూజీసీ కేటాయించిన నిధులు నిర్వహణ చూసుకునే ఈ విభాగంలోనూ సీమాంధ్ర అధ్యాపకులే కొనసాగుతున్నారని, తెలంగాణ అధ్యాపకులకు అసలు స్థానమే లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం యూజీసీ కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ మృణాళిని కొనసాగుతున్నారని, ఆమె ద్వారా నిధులు ఆయా విభాగాలు వెళుతుంటాయని తెలిసింది. ఇక గత కొంతకాలంగా వర్సిటీలోని ఫోక్ విభాగంలో తెలంగాణ అధ్యాపకులకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌గా వైఆర్ శ్యామలను నియమించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ తెలుగు వర్సిటీ నుంచి సీమాంధ్ర పెత్తనం పోవడం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే జోక్యం చేసుకొని.. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలని వర్సిటీ తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.


బుధవారం, ఆగస్టు 27, 2014

ఉన్నత విద్యాశాఖలో ఓ ఐఎఫ్‌ఎస్ లీలలు!

- ఇంజినీరింగ్ కాలేజీల అనుమతుల్లో కీలక పాత్ర
- డిప్యూటేషన్ ముగిసినా ప్రభుత్వ పరిపాలన శాఖలోనే 
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యాశాఖలో తిష్ఠవేసి.. ఇంజినీరింగ్ కళాశాలలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి తెలంగాణ రాష్ట్రంలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిన్నమొన్నటివరకు అఖిల భారత సర్వీసు అధికారుల విభజన జరుగకపోవడంతో తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆయనను తాజాగా తెలంగాణ రాష్ర్టానికి కేటాయించారు. దీంతో తెలంగాణలోనూ తిరిగి విద్యాశాఖలోనే కొనసాగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (ఐఏఎస్) అధికారి కాకపోయినా ఆయన డిప్యూటేషన్‌పై వచ్చి విద్యాశాఖలో 8 ఏండ్లుగా కొనసాగారు. ఐదు సంవత్సరాల డిప్యూటేషన్ పూర్తయిన తర్వాత సొంతశాఖ అయిన ఫారెస్టు డిపార్టుమెంటులోకి వెళ్లాల్సి ఉన్నా, ప్రభుత్వ పెద్దల అండతో తిష్ఠవేశారు.

2006లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఉన్నత విద్యాశాఖలోకి సదరు ఐఎఫ్‌ఎస్ అధికారి డిప్యూటేషన్‌పై వచ్చారు. సాంకేతిక విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీగా టెక్నికల్, ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారాలను చూసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అదేశాఖలో జాయింట్, స్పెషల్ సెక్రటరీ కార్యదర్శి హోదాలను నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బడిముబ్బడిగా కొత్త ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది ఆయన హయాంలోనే. ప్రభుత్వం ఐఎఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులను సైతం రెండు, మూడేళ్లకు మించే ఒకే శాఖలో కొనసాగనివ్వరు. కానీ ఆయన మాత్రం అప్రతిహతంగా ఉన్నత విద్యాశాఖలో కొనసాగుతూనే ఉన్నారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనతో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. దీంతో ఆయన స్థానంలో కూర్చునే ప్రయత్నాలు ఆ ఐఎఫ్‌ఎస్ అధికారి మొదలు పెట్టారు. ఇటీవల జేఎన్టీయూ అనుమతి రద్దు చేసిన 174 ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఒకటై ఆ అధికారిని తిరిగి విద్యాశాఖకు తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

చేతులు కలిపి చెమ్మాచెక్క...ఇండ్లల్లో దొంగాట...

- గృహయజ్ఞానికి పెద్దలూ పురోహితులే
- ప్రాథమిక దర్యాప్తులోనే దిమ్మతిరిగే వాస్తవాలు
- రూ.10 లక్షలనుంచి రూ.90 లక్షల దాకా గల్లంతు
- రాష్ట్రం మొత్తంమీద వందల కోట్లకు పైమాటే
ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ ప్రాథమిక దర్యాప్తులోనే దిమ్మతిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో రెండేసి నియోజకవర్గాలకు చెందిన 36 గ్రామాల్లో సీఐడీ జరిపిన దర్యాప్తులోనే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడింది. ఇక రాష్ట్రం మొత్తం దర్యాప్తు జరిపితే వందల కోట్ల దుర్వినియోగం బయటపడే అవకాశముందని భావిస్తున్నారు. సీఐడీ బృందాలు ఆయా గ్రామాల్లో నేరుగా లబ్దిదారుల వద్దకు వెళ్లి జరిపిన దర్యాప్తులో దాదాపు ప్రతి గ్రామంలో కనిష్టంగా రూ.10 లక్షల దాకా దుర్వినియోగం జరిగిందని వెల్లడైంది. గరిష్టంగా రూ. 90 లక్షల నిధులు మింగేసిన గ్రామం కూడా ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ సీనియర్ మంత్రుల నియోజకవర్గాల్లో కూడా నిధుల దుర్వినియోగం భారీగానే జరిగింది. ఈ కుంభకోణంలో కిందిస్థాయి ఉద్యోగులనుంచి బడాబాబులదాకా అందరి పాత్రా ఉందని సీఐ డీ గుర్తించింది. ఉద్యోగులు, నాయకులు అన్యోన్యంగా కలిసిమెలిసి కోట్ల రూపాయలు పంచేసుకున్నారు. కట్టిన ఇండ్లకన్నా కొల్లగొట్టిన సొమ్మే అధికంగా ఉంది. 
ఇది శాంపిల్ సర్వేనే..

indirammaతెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఇంటిపార్టీ అధికారం చేపట్టగానే ఈ కుంభకోణంపై దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ ఇండ్ల స్కాంపై సీఐడీ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఇండ్ల స్కాంపై అన్ని గ్రామాల్లో ఒకేసారి దర్యాప్తు జరపడం సాధ్యంకాదు కాబట్టి సీఐడీ ముందుగా ప్రాథమిక దర్యాప్తును చేపట్టింది. తొమ్మిది జిల్లాల్లో శాంపిల్ సర్వే పేరిట దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ప్రతి జిల్లాలో ఒక్కో కేసు నమోదు చేసి జిల్లాకో బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇలా తొమ్మిది కేసులు, తొమ్మిది బృందాలను నియమించి గ్రామస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. ఇండ్ల స్కాంలో ఉన్న అన్ని గ్రామాలను తిరగడం కష్టసాధ్యం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా నారాయణ్‌ఖేడ్, ఆందోల్, డోర్నకల్, భూపాలపల్లి, పాలేరు, అశ్వరావుపేట, ఎల్లారెడ్డి, బోధన్, మంథని, హుజురాబాద్, నాగార్జునసాగర్, దేవరకొండ, ఖానాపూర్, ఆసిఫాబాద్, కొడంగల్, అలంపూర్, తాండూర్, పరిగి నియోజకవర్గాలను సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఎంపిక చేసుకుంది. అందులో రెండేసి గ్రామాల్లో దర్యాప్తు ప్రారంభించింది.

మాజీ మంత్రుల ఇలాఖాలో...

శాంపిల్ దర్యాప్తులో భాగంగా ఎంచుకున్న 36 గ్రామాల్లోనే గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు, నాయకులు కోట్లాది రూపాయలు దిగమింగారని సీఐడీ నివేదికలో స్పష్టంచేసింది. కొన్ని గ్రామాల్లో రూ.35 లక్షల నుంచి 90 లక్షల వరకు దుర్వినియోగం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభిస్తే కొన్ని వందల కోట్ల దుర్వినియోగం తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని సీఐడీలోని ఓ ఉన్నతాధికారి టీ మీడియాకు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో 5 లక్షల నుంచి పది లక్షల వరకు నిధులు దుర్వినియోగమయ్యాయి.

భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం అయిన నియోజకవర్గాలు గతంలో అమాత్యులుగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లవి కావడం సంచలనం కలిగిస్తున్నది. మాజీ డిప్యూటీ సీఎం నియోజకవర్గం అందోల్‌లోని ఒక గ్రామంలో రూ.37 లక్షలు దుర్వినియోగమైతే, మాజీమంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గంలో 20 లక్షలకు పైగా దుర్వినియోగమయ్యాయి. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి ఇలాఖాలోనూ ఇదే పరిస్థితి. మాజీ చీఫ్ విప్ గండ్ర నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో రూ.37లక్షలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే మింగేశారు.

ఖమ్మం జిల్లా పాలేరు, అశ్వరావుపేట, నిజమాబాద్‌జిల్లా బోధన్, ఎల్లారెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, దేవరకొండ, కరీంనగర్ జిల్లా మంథని, హుజురాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, అలంపూర్, రంగారెడ్డి జిల్లా తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో ప్రతి రెండు గ్రామాల్లో రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు దుర్వినియోగం అయినట్టు సీఐడీ పోలీసులు తేల్చారు. దర్యాప్తులో భాగంగా నిధుల దుర్వినియోగంలో పాలుపంచుకున్న వారిని ఎంప్లాయిస్, నాన్ ఎంప్లాయిస్ విభాగాలుగా విభజించినట్టు సీఐడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఎంప్లాయిస్ విభాగంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి ఎంఆర్‌వో, ఎంపీడీవోల వరకు బాధ్యులు ఉంటారని, అలాగే నాన్ ఎంప్లాయిస్‌లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీలను చేరుస్తున్నట్టు తెలిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చిన గత ప్రభుత్వంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్‌పీటీలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను సైతం బాధ్యులుగా చేసే అవకాశం లేకపోలేదని ఉన్నతాధికారి స్పష్టంచేశారు. అర్హులకు అందాల్సిన నిధులను దోచుకున్న ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగాచర్యలకు సిద్ధమవుతామని ఆయన స్పష్టంచేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, ఆగస్టు 26, 2014

సింగపూర్ స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం!

- చిన్న దేశమైనా ఎంతో అభివృద్ధి
- ప్రజాప్రతినిధులను పర్యటనకు పంపిస్తా
- తెలంగాణ గురించి వారికి వివరించా
- మన పారిశ్రామిక విధానానికి ప్రశంసలు
- మీడియాతో సీఎం కేసీఆర్
వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమవుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైశాల్యం, జనాభాలో అతి చిన్న దేశమైన సింగపూర్ అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఐదురోజులపాటు సింగపూర్, మలేషియా దేశాల పర్యటనను ముగించుకొని వచ్చిన కేసీఆర్ సోమవారం తన అనుభవాలను, అనుభూతులను మీడియాతో పంచుకున్నారు.
kcr-singapur2సింగపూర్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కేసీఆర్ అన్నా రు. మంచినీళ్ల నుంచి ప్రతి చిన్న వస్తువు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన సింగపూర్ అర్థిక ప్రగతిలో ఇప్పు డు అగ్ర రాజ్యమైన అమెరికా సరసన చేరిందని శ్లాఘించారు. కేవలం 53 లక్షల జనాభా, కోటి 75 లక్షల ఎకరాల భూభాగం మాత్రమే ఉన్న సింగపూర్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అన్నిరంగాల్లో ముందడుగు వేయడం ఆ దేశ ప్రజల సంఘటిత కృషికి నిదర్శమని అన్నారు. సింగపూర్‌లో స్థిరపడిన ఇతర దేశాల పౌరులు కూడా తాము ఆ దేశ పౌరులమేనని గర్వంగా చెప్పుకోవడం తనను ఎంతో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చెప్పారు.

పరిశుభ్రతకు మారుపేరు..

సింగపూర్ దేశమంతా పచ్చిక బయళ్లతో ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని, రోడ్లపై ఎక్కడా చిన్న కాగితం ముక్కకూడా కనిపించదని కేసీఆర్ చెప్పారు. ఆ దేశ వైశాల్యం ఒకప్పుడు 640 చదరపు కిలోమీటర్లు ఉండేదని, ఇప్పుడు 700 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని ఇది ఆ దేశం సాధించిన విజయాలలో ఒకటని కేసీఆర్ అన్నారు. ఏమీలేని దీనస్థితి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి సింగపూర్ చేరుకుందంటే దానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు, ప్రజల భాగస్వామ్యమే కారణమని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్ దేశం డాలర్ మారకం విలువ భారతదేశ కరెన్సీతో రూ.50 ఉందని, తలసరి ఆదాయం 50 మిలియన్ డాలర్లు అని సింగపూర్ ఆర్థిక వ్యవస్థ స్థాయిని కేసీఆర్ వివరించారు.

మనమెందుకు వెనకబడ్డాం..?

తక్కువ భూభాగం, తక్కువ వనరులు వున్న సింగపూర్ అంతగా అభివృద్ధి చెందినప్పుడు, విశాల భూభాగం, అపార వనరులు వున్న మన దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదనే బాధ కలుగుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్ ఒకప్పుడు వెనుకబడ్డ దేశాల సరసన ఉన్న మూడవ ప్రపంచ దేశమని, ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశమని అయన అన్నారు. సింగపూర్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఆ దేశ మొదటి ప్రధాని లీ క్వాన్ యుకే దక్కుతుందని అన్నారు. లీ క్వాన్ యు రాసిన సింగపూర్ ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టు ఫస్ట్ అనే పుస్తకాన్ని 1995లోనే చదివానని ఆయన చెప్పారు.

ఇప్పుడు ఆ దేశాన్ని స్వయంగా చూసే అవకాశం వచ్చిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతోనే తాను జన్మభూమి పథకాన్ని రూపకల్పన చేసినట్లు చంద్రశేఖర్ రావు వెల్లడించారు. లీ క్వాన్ యు రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించాలనుకుంటున్నట్లు చెప్పిన సీఎం, దీని వల్ల ప్రపంచంలోని తెలుగు వారికి ఒకనాటి సింగపూర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని తెలుస్తుందని అన్నారు. అభివృద్ధిని కోరుకునే దేశాలకు, పౌరులకు అది అవసరమైన పాఠం అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భూమి కొరత సహజ వనరుల కొరత ఉన్నా చైనా, ఇండియా, డచ్,బ్రిటీష్ దేశాల నుంచి వచ్చిన వారు సింగపూర్‌ను ఓ అద్భుతమైన దేశంగా ఎలా తీర్చిదిద్దారో ఈ పుస్తకంలో ఉంటుందని సీఎం చెప్పారు.

ప్రజాప్రతినిధులందరినీ పంపిస్తా...

సింగపూర్ పర్యటనతో తాను ఎంతో నేర్చుకున్నానని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను కూడా సింగపూర్ పంపుతానని కేసీఆర్ తెలిపారు. వారికి శిక్షణ ఇవ్వాలని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌ను కోరారని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్‌తో పాటు పక్కనే ఉన్న మలేషియా కూడా గొప్పగా అభివృద్ధి చెందిందని, రెండు దేశాల మధ్య ఉన్న వారథిపై కారులో ప్రయాణం చేయడం వల్ల అక్కడి పరిశ్రమలు, వాతావరణం, ఇతర జనావాసాలను స్వయంగా చూసే అవకాశం కలిగిందన్నారు. మలేషియా ప్రతి సంవత్సరం 2.7 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు.

తెలంగాణ గురించి చెప్పా...

సింగపూర్ పర్యటనలో తెలంగాణను అక్కడి వారికి పరిచయం చేశానని కేసీఆర్ చెప్పారు. వివిధ సమావేశాలు, గ్రూప్ మీటింగ్‌లలో తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందని, అనుమతుల కోసం సింగిల్ విండో, చేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో అక్కడి వారు ఎంతో అభినందించారని ముఖ్యమంత్రి అన్నారు. సింగపూర్‌లో జరిపిన పర్యటనలో అనేక రంగాల అభివృద్ధిపై స్వయంగా అధ్యయనం చేశానని, ఇది తెలంగాణ పునర్నిర్మానానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మావి మాకే.. మీవీ మాకే!

- పాలిటెక్నిక్ సీట్లలో ఏపీ అధికారుల ఫీట్లు
- ముంపుగ్రామాలతోపాటు ఏపీకి తరలిపోయిన తెలంగాణ పాలీరెసిడెన్షియల్ కాలేజీ
పాలిటెక్నిక్ సీట్లలో తెలంగాణకు ధోఖా చేసేందుకు ఏపీ రాష్ట్ర అధికారులు కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో మూడు ప్రాంతాల్లో గిరిజన రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో ఎస్టీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీని భద్రాచలంలో, ఆంధ్ర ప్రాంతంలో పాడేరులో, రాయలసీమలోని శ్రీశైలంలో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఏపీలో కలపడంతో తెలంగాణకు సంబంధించిన ఎస్టీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీ ఏపీలో కలిసిపోయింది. దీంతో అసలు తెలంగాణలో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీయే లేకుండా పోయింది. మరోవైపు హైదరాబాద్‌లోని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఆంధ్ర విద్యార్థులకు కౌన్సిలింగ్‌లో సీట్లు ఇచ్చేందుకు పాలీసెట్ 2014 ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సాకుతో 52శాతం సీట్లు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థలనే రెండురాష్ర్టాలు పంచుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లోని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు విభజన బిల్లులోని పదో షెడ్యూల్‌లో లేనందున కాలేజీలపై అధికారం పూర్తిగా తెలంగాణదేనంటున్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏపీకి చెందిన విద్యార్థులకు సీట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు రాజనరేందర్‌రెడ్డి, తారాసింగ్, మల్లికార్జున్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఇక సమగ్ర భూ సర్వే!

-సర్కార్ మరో చారిత్రక నిర్ణయం
-రూ.వెయ్యి కోట్లతో అమలుకు శ్రీకారం
- క్షేత్ర ఉపరితల విధానాలతో సర్వే
- డీజీపీఎస్, ఈటీఎస్ వంటి సాంకేతికత వినియోగం
- ఎన్‌ఐసీ, ప్లానింగ్, ల్యాండ్ రిసోర్సెస్ భాగస్వామ్యం
- ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు?
- తెలంగాణ భూభాగం 1.06 లక్షల చదరపు కిలోమీటర్లు
- సర్వే చేపట్టేది 79500 చ.కి.మీ. పరిధి
- 25శాతం అటవీ భూములకు మినహాయింపు
- మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ర్టాల్లో అధ్యయనం
- టెండర్ల ద్వారానే సంస్థలకు సర్వే బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది. సుమారు 82 ఏండ్ల్ల తర్వాత తొలిసారి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడుతున్నది. రాష్ట్ర భూభాగాన్ని గజం గజం సర్వే చేసి పక్కా లెక్కలతో భూ రికార్డులు రూపొందించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో వాస్తవ జనాభా వారి సమస్త సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు సంబంధించి పక్కా సమాచారం సిద్ధంచేసుకున్న ప్రభుత్వం ఇపుడు భూ సర్వే మీద దృష్టి పెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక వాస్తవ పరిస్థితులు వెలికి వచ్చే అవకాశముంది. ఏ భూములెవరివి? ఎవరి ఆధీనంలో ఎంతెంత భూమి? అలాగే వివిధ రకాల నేలలు, వాటి స్వభావాలు, వాస్తవ సాగు విస్తీర్ణం, బావులు, చెరువులు, కుంటలు, జల వనరులు, సాగుయోగ్యమైన భూమి, అనుకూలం కాని భూమి, మైదానాలు, గుట్టలు,లోయలు ఇలా సమస్త సమాచారం ఈ భూ సర్వేలో చోటుచేసుకోనుంది. 
tgland2రాష్ట్రంలో 1932లో నిజాం కాలంలో భూ సర్వే జరిగింది. అది సమగ్ర సర్వే కాదు. తాత్కాలిక భూ సర్వే మాత్రమే. ఉమ్మడి రాష్ట్రం కొనసాగిన 60 ఏండ్ల కాలంలో సీమాంధ్రపాలకులు భూమి సర్వేకు సాహసించలేక పోయారు. ఫలితంగా అనేక భూ వివాదాలు దశాబ్దాల తరబడి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. మరోవైపు లక్షల ఎకరాల సర్కారు భూములకు లెక్కా పత్రం లేకుండా పోయింది. నోరు బలం ఉన్న వాళ్లు వందల ఎకరాలు కబ్జాలు పెట్టి రికార్డులను మాయామశ్చీంద్ర చేశారు. ఉన్న రికార్డులే అన్నిటికీ ప్రామాణికం కావడంతో అందులో నెలకొని ఉన్న అవకతవకలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సమగ్ర భూ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది.

వెయ్యి కోట్ల ఖర్చు..

సమగ్ర భూ సర్వే పనులు మరో రెండు నెలల్లో మొదలు కానున్నాయని అధికారులు చెప్పారు. ఈ సర్వే నిర్వహించేందుకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చవుతుందని సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూ వనరుల శాఖకు రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెవెన్యూ మంత్రుల సదస్సులో కేంద్రం భూ సర్వే చేపట్టేందుకు 50 శాతం నిధులను అందజేస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిధులను కేంద్రమే మంజూరు చేయాలని కోరుతున్నది. వచ్చే వారం ఢిల్లీలో జరుగనున్న సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 15 లోగానే జరిగే బడ్జెట్ సమావేశంలో సర్వే కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది.

ఖర్చు భరించేదెవరు?

నేషనల్ ల్యాండ్ రికార్డు మోడరనైజేషన్ ప్రోగ్రాం(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద నిధులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి సమైక్య రాష్ట్రంలోనూ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఎన్టీఆర్ హయాంలో ఆలోచన చేసినా ఆచరణకు నోచుకోలేదు. సర్వేలు చేపట్టే రాష్ర్టాలకు కేంద్రం చ.కి.మీ.కు రూ.16,500 చొప్పున ఇస్తోంది. ఐతే ప్రస్తుత లెక్కల ప్రకారం చ.కి.మీ.కు రూ.45 వేలు వ్యయం అవుతున్నదని సర్వే లాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల విభాగం అంచనా వేసింది. ఈ లెక్కన టైటిల్ వర్క్‌తో కలుపుకొని రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి నివేదికను సమర్పించింది. దీనిపై కేంద్రం, రాష్ట్రం 50ః50 వాటాగా నిర్ణయించారు.

కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై భారం పడకుండా పూర్తిగా కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర భూ వనరుల శాఖను అభ్యర్థించింది. ఇదే సమయంలో సర్వే ఆలస్యం కాకుండా మొదటి దశగా రూ.180 కోట్లు విడుదల చేయించాలని కూడా కోరింది. అధికారికంగా నిధులను సమకూర్చుకునేందుకు సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డుల శాఖ కృషి చేస్తోంది. దానికి తోడు సీఎం కే చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్‌అలీలు కూడా రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మూడు, నాలుగు ఏళ్ల వ్యవధిలో సర్వేను పూర్తి చేయగలమని సర్వే ల్యాండ్ రికార్డుల కమిషనర్ కే హర్షవర్ధన్ టీ మీడియాకు వివరించారు.

ఆధునిక సాంకేతిక నైపుణ్యం..

సర్వే అంటే గొలుసు పట్టుకొని కొలతలేసే విధానం పాత తరం నాటి మాట. తెలంగాణలో చేపట్టబోయే సర్వేలో ఎయిర్‌క్రాఫ్ట్స్‌లను సైతం వినియోగించనున్నారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ సిస్టం(ఈటీఎస్), డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) వంటి పద్ధతులను అనుసరించనున్నారు. రాళ్లు, గుట్టలు ఉంటే ఒక విధానం, సమాంతరంగా ఉంటే మరో విధానాన్ని అవలంభిస్తారు. ఈటీఎస్ సిస్టంలో జియో రెఫరెన్స్ పాయింట్స్‌ను గుర్తిస్తారు. మొదట షీట్లు రూపొందిస్తారు. వాటి ఆధారంగా హద్దు రాళ్లను పాతేస్తారు. ఎన్‌ఐసీ, ప్లానింగ్, ల్యాండ్ రీసోర్సెస్ వంటి అనేక శాఖల భాగస్వామ్యం తీసుకుంటారు.

వివిధ రాష్ర్టాల్లో అధ్యయనం..

దేశంలో అనేక రాష్ర్టాలు నేషనల్ ల్యాండ్ రికార్డు మోడరనైజేషన్ ప్రోగ్రాం కింద భూ సర్వేను చేపట్టాయి. అందులో గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఆయా రాష్ర్టాల్లో ఈటీఎస్, డీజీపీఎస్ విధానాలతో సర్వే చేపట్టారు. గుజరాత్‌లోనే మూడు, నాలుగేళ్లల్లో 12 జిల్లాల్లో సర్వే పూర్తి చేశారు. మన అధికారులు ఆ రాష్ర్టాల్లో అధ్యయనం చేశారు. తాజాగా బీహార్‌లో జరుగుతోన్న సర్వేను కూడా అధ్యయనం చేసేందుకు వెళ్లాలని కమిషనర్ హర్షవర్ధన్ నిర్ణయించారు. తెలంగాణలోనూ సర్వే 100 శాతం పక్కాగా ఉండే విధానాలను నిర్ణయించేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. సర్వేను మూడు దశలుగా చేపట్టనున్నారు. మొదటి దశలో వివాదాలు అధికంగా ఉన్న మండలాల్లోనే చేపడుతారు.

అనుమానాలొద్దు..

గతేడాది హైదరాబాద్ జిల్లా పరిధిలో జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం) విధానం ద్వారా అన్ని స్థలాల వివరాలను సేకరించారు. ఈ ప్రక్రియ ఓ ప్రైవేటు సంస్థ అందించిన సాంకేతిక నైపుణ్యం ఆధారంగా నిర్వహించారు. ఐతే నిషేధిత రిజిస్ట్రేషన్ స్థలాలను గుర్తించే లక్ష్యంగా సాగిన ఈ సర్వేలో అనేక లోపాలు బయట పడ్డాయి. ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌లో అనేక ప్రైవేటు స్థలాలను చేర్చారు. దాంతో యజమానులు లబోదిబోమంటూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేలల్లో ఫిర్యాదులు రావడంతో ఈ విధానంతో రూపొందించిన పీఓబీని నిలిపివేశారు. 1968 నుంచి 1976 వరకు హైదరాబాద్‌లో జరిపిన టౌన్ సర్వే కూడా లోపభూయిష్టంగా ఉంది.

ఇలాంటివి తమ సర్వేలో ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూభారతి పథకం కింద నిజామాబాద్ జిల్లాలో రూ.33.85 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం, రికార్డు కంక్లూజివ్ టైటిల్ ఆఫ్ ఆల్ ల్యాండ్‌హోల్డర్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రాఫికల్ డైమెన్షన్లు, యాజమాన్యపు పత్రాలు, భూ వినియోగం వంటి అనేకాంశాలతో కూడిన డాటాను రూపొందించారు. జిల్లాలో 922 గ్రామాల్లోని వ్యవసాయ భూములను సర్వే చేశారు. 8.73 లక్షల రైతులు, పట్టాదారులు ఉన్నారు. 2005 నుంచి చేపట్టిన కార్యక్రమం 2012 వరకు కొనసాగింది. ఇందులో ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రీమోట్ సెన్సింగ్ సెంటర్) సంస్థ 15 శాతం ఈటీఎస్, 85 శాతం డీజీపీఎస్ విధానాన్ని వినియోగించింది.

సిబ్బంది లేమి సమస్య కాదు..

తెలంగాణలో సర్వే చేపట్టేందుకు సర్వేయర్లు ఎక్కడున్నారు? వందలాది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో సమగ్ర భూ సర్వే ఎలా సాధ్యం? అంటూ ఉద్యోగ వర్గాల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఐతే ఈ సర్వే బాధ్యతలను టెండర్ పద్ధతిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు అప్పగించనున్నారు. వారి పనులను పర్యవేక్షించేందుకు నాలుగు కమిటీలు పని చేస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8 సంస్థలు భూ సర్వే చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటిలో ఆరు సంస్థలు హైదరాబాద్‌కు చెందినవే కావడం విశేషం.

సర్వే ఎందుకు..?

తెలంగాణ రెవెన్యూ విభాగంలో ఉన్నంత పదజాలం మరెక్కడా లేదు. ఇక్కడున్నన్ని భూమి రకాలు మరోచోట కనిపించవు. సర్ఫేఖాజ్, ఖరీజ్‌ఖాతా, లాపత్తా, ఎనిమీ ప్రాపర్టీస్, యూఎల్సీ, కాందీశీకులు, సర్కారు, ఆబాదీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కో రకమైన పదాలతో భూములను పిలుస్తారు. దానికి తోడు ప్రభుత్వం కూడా వాటికి వేల సంఖ్యలో ప్రత్యేకమైన చట్టాలు, నిబంధనలను రూపొందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 1932లో నిజాం కాలంలో చేపట్టిన సర్వేలో కామన్ ప్రాపర్టీస్ (చెరువులు, కుంటలు, గ్రామ కంఠాలు వంటివి)ను ప్రామాణికంగా తీసుకోలేదు. కేవలం శిస్తు కట్టే వారి భూములనే సర్వే చేసి హద్దు రాళ్లను పాతించారు. చాలా రాష్ర్టాల్లో భూ సర్వేలను పూర్తి చేసుకొని వివాదాలను పరిష్కరించు కుంటున్నారు.

ఆంధ్రాలో మద్రాస్ విధానంతో పక్కాగా చేసిన సర్వే వల్ల రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఇక్కడ అలాంటి వ్యవస్థలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ భూభాగంలోని 1.06 లక్షల చ.కి.మీ.లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 30 శాతం వరకు ప్రభుత్వ భూములు, వక్ఫ్, ఎండోమెంట్ భూములు ఉన్నాయి. సరైన లెక్కలు ప్రభుత్వం వద్ద లేకపోవడం ఆసరాగా చేసుకొని ఎక్కడికక్కడ కబ్జాలు చేశారు. అందుకే పక్కా సర్వేతో రైతాంగానికి మేలు కలిగించాలన్న సదాశయంతో భూ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

కొత్త రాష్ట్రంలో సర్వే తప్పనిసరి

ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. బ్రిటిష్ పాలనలో ఆంధ్రాలో భూ సర్వేకు ఆధునిక విధానాలను వినియోగించారు. నిజాం కాలంలో చేపట్టిన ఇక్కడ జరిపిన సర్వే లోపభూయిష్టంగా ఉంది. దాంతో అక్రమాలు, కబ్జాలకు అంతు లేకుండా పోయింది. వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. గత నెల 19న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో భూ సర్వే చేపట్టేందుకు రూ.1000 కోట్లు కావాలని అడుగగానే అధికారులంతా ఆశ్చర్యపోయారు. రాష్ట్రం ఏర్పడగానే సర్వే చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలంగాణ పట్ల జరిగిన వివక్షను వివరించిన తర్వాత సర్వే అనివార్యతను గుర్తించారు. తెలంగాణకు మహాత్తరమైన చరిత్ర ఉంది. ప్రభుత్వ భూములే 30 శాతం, అటవీ భూములు 25 శాతం వరకు ఉన్న రాష్ట్రం మరొకటి లేదు.

ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖల భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. చెరువులు, కుంటలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ అంశాలను కేంద్రానికి వివరించాను. దాంతో సర్వేకు అంగీకరించారు. కొత్త రాష్ర్టానికి సర్వే భారాన్ని వేయొద్దని కోరాం. పూర్తి ఖర్చులను భరించాలని విజ్ఞప్తి చేశాం. వచ్చే నెల మరో సమావేశం ఉంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 
- కే హర్షవర్థన్, కమిషనర్, సర్వే ల్యాండ్ సెటిల్‌మెంట్స్ అండ్ రికార్డులు 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మానవ వికాసమే నిజమైన అభివృద్ధి!

-జీడీపీ వృద్ధిరేటు అభివృద్ధికి సూచిక కాదు
-ప్రేమానుబంధాలు పెంచే ప్రగతిపై దృష్టి పెట్టాలి
- తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ హరగోపాల్
- ప్రభుత్వం మంచిపనులు చేస్తే సహకరించాలి
- నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
జీడీపీ వృద్ధి రేటు సూచికలను అభివృద్ధి నమూనాలుగా స్వీకరించే పద్ధతులకు స్వస్తి చెప్పాలని, మానవ వికాస అభివృద్ధే నిజమైన ప్రగతి కావాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. పాలకులు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రభుత్వాలకు మానవ వికాసమే లక్ష్యం కావాలని, ఆ పద్ధతిలోనే పాలకుల కార్యాచరణ ఉండాలని ఆయన సూచించారు. 
TVSమానవ సంబంధాలను మెరుగుపరిచి, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను పెంపొందించే ప్రగతే నిజమైన అభివృద్ధిగా గుర్తించాలన్నారు. వ్యత్యాసాలు లేని సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయాణంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో పౌరహక్కులను ఉక్కుపాదంతో అణచివేశారని విమర్శించారు.

తెలంగాణ ప్రాంత నాయకులే హోం మంత్రులుగా ఉన్నప్పటికీ పౌరహక్కులకు మాత్రం దిక్కుఉండేది కాదన్నారు. రాజ్యహింస పరాకాష్టకు చేరినందునే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తామని హామీ ఇస్తూ ఆవిర్భవిస్తున్న తెలంగాణ వికాస సమితి ప్రజల సర్వతోముఖ వికాసానికి మార్గదర్శనం చేయాలని కోరారు. తెలంగాణ పునర్నిర్మాణంలో వికాస సమితి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సహకరించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిరసించాలని చెప్పారు. పాలకపక్షాన్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోరాదని, అలాగని ఏం జరిగినా ఊరుకోరాదని సూచించారు.

TELANGAN-VIKASA-SAMITIతెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులంతా నిశబ్ధంగా మారారని, ప్రభుత్వానికి సరండర్ అయ్యారని కొంతమంది చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అనేక కష్టనష్టాలకోర్చి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నప్పటికీ, రాష్ట్రంపైన కుట్రల ప్రమాదాలు ఇంకా పొంచి ఉన్నాయని హెచ్చరించారు. రాష్ర్టాన్ని సాధించుకున్నామన్న సంతోషాన్ని కూడా తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంపై గవర్నర్ అధికారాలను పెంచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

GANTA-CHAKRAPANIఉద్యోగ సంఘాల నేత సీ విఠల్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సంపూర్ణ తెలంగాణ ఏర్పడలేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలనే సంకల్పంతోనే తెలంగాణ వికాస సమితి ఏర్పడిందనీ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. వికాస సమతి సలహాసంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలను, సలహాలను సమతి స్వీకరిస్తుందనీ, సలహా సంఘం ఈ బాధ్యతలను నిర్వహిస్తుందని తెలిపారు. సమావేశంలో ప్రొఫెసర్ సీతారామారావు, అండమ్మ, సదానందం, అయాచితం శ్రీధర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వీరన్న నాయక్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అడ్వకేట్ భరత్‌కుమార్, బీ ఐలయ్య పాల్గొన్నారు.

తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడిగా దేశపతి ఏకగ్రీవ ఎన్నిక

కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడిగా దేశపతి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ వికాస సమితి ఆవిర్భావ సభ జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సమితి ఉపాధ్యక్షులుగా జీ వెంకటేశ్వర్లు (నల్లగొండ), సతీశ్ (వరంగల్), కోటమురళి(కరీంనగర్), వెంకటరమణి (వరంగల్)నియమితులయ్యారు. కార్యదర్శులుగా పీ వెంకన్న, నర్రా భగవాన్‌రెడ్డి, హెచ్ రవీందర్, విజయభాస్కర్, కే విమల, సీ సుధాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు.

ఇక సమితి కార్యవర్గ సభ్యులుగా రాచర్ల వెంకన్న, రవీందర్‌రెడ్డి, సైదిరెడ్డి,డా సురేందర్, జీ రమేశ్, గజ్జల రమేశ్, ఆయాచితం శ్రీధర్, యశపాల్, సంపత్, రాజేశ్, బిక్షపతి నాయక్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ 15 రోజుల్లో సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతిలో తెలంగాణ వికాస సమితితో కలిసి భాగస్వాములు కావాలని, శ్రమించాలని భావిస్తున్న వారంతా తమకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో కార్యవర్గాన్ని విస్తరిస్తామని, ప్రతి జిల్లాలోనూ కమిటీలు ఏర్పాటు చేస్తామని దేశపతి తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఆగస్టు 25, 2014

బీ క్యాటగిరీ సీట్ల భర్తీలో...అక్రమాలు!

-వెబ్‌పోర్టల్‌లో నకిలీ దరఖాస్తులు
-అక్రమ మార్గంలో అడ్మిషన్లకు కాలేజీల యత్నం
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 30 శాతం యాజమాన్య (బీ) కోటా సీట్ల భర్తీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పారదర్శకత కోసం ఉన్నత విద్యా మండలి వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినప్పటికీ.. యాజమాన్యాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. వెబ్‌పోర్టల్‌లో నకిలీ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎంసెట్‌లో టాప్‌ర్యాంకర్లు వంటి విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు సేకరిస్తూ ఆయా అభ్యర్థులకు తెలియకుండా యాజమాన్య సీట్ల భర్తీ వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులను అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. 
కార్పొరేట్ విద్యా సంస్థలతో లాలూచీ పడి టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను సేకరించి వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత టాప్ ర్యాంకర్లంతా మంచి కాలేజీలకు వెళ్లిపోయారంటూ ఖాళీలను చూపిస్తూ తిరిగి భర్తీ చేసుకుంటున్నారు. ఇప్పుడా ప్రభావం నేరుగా ప్రతిభావంతులపై పడింది. ప్రస్తుతం రెండు రాష్ర్టాలలోని బడా కాలేజీలలో కూడా ఈ విధంగా నకిలీ దరఖాస్తులను వెబ్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత దశాబ్దకాలంగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీతో పాటు బీ కోటా సీట్ల భర్తీలోనూ అనేక అక్రమాలు వెలుగు చూశాయి.

గతంలో ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ సీట్లు భర్తీచేశారు. దీని వల్ల రిజర్వేషన్ల విధానంలో లొసుగులు ఉన్న విషయం వెలుగుచూసింది. దానికి విరుగుడుగా వెబ్‌బేస్డ్ ఆన్‌లైన్ విధానాన్ని పరిచయం చేశారు. ఇందులో కూడా లోపాలు ఉన్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కూడా సరి చేసుకున్న సాంకేతిక విద్యాశాఖ రిజర్వేషన్ల విధానం, లోకల్, నాన్‌లోకల్ కోటాలో సీట్లను పక్కాగా భర్తీ చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు చెప్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థి పాస్‌వర్డును దొంగతనం చేసి, తమ కాలేజీలలో సదరు విద్యార్థికి సీట్లు వచ్చే  ఆప్షన్ ఎంపిక చేసుకున్నట్లు పోలీస్ విచారణలో వెలుగు చూసింది. దీనికి కొనసాగింపుగా బీ సీట్ల భర్తీలోనూ యాజమాన్యాలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

30 శాతం కోటా సీట్లు నేరుగా భర్తీ చేసుకోవడానికి కాలేజీలకు అవకాశం ఉంటుంది. ఆ మేరకు బడా కాలేజీలలో బీ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో ఎక్కువ డొనేషన్లు చెల్లించిన వారికి సీట్లు ఇచ్చే సంప్రదాయం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఈ క్రమంలో మెరిట్ పద్ధతిలో బీ క్యాటగిరీ సీట్లు భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆ విధానానికి చెక్ పెట్టాలని విద్యా మండలి అధికారులు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. ఈ క్రమంలో బీ క్యాటగిరీ సీట్లు కూడా కన్వీనర్ సీట్ల మాదిరిగా ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేయాలని గత ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

దానికనుగుణంగానే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే బీ సీట్ల భర్తీకి శ్రీకారం చుట్టింది. అయినా ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అక్రమ పద్ధతుల విధానాలను కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నకిలీ దరఖాస్తులను అడ్డుకోవాలని విద్యా వేత్తలు, విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. నకిలీ దరఖాస్తుల విధానాన్ని అరికట్టి ప్రతిభ గల విద్యార్థులకు న్యాయం చేసే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం పీ మధుసూధన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు.

డొనేషన్లు తిరిగి చెల్లిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలుప్రస్తుత విద్యా సంవత్సరంలో బీ సీట్ల భర్తీ కోసం వసూలు చేసిన డొనేషన్లు తిరిగి విద్యార్థులకు చెల్లించడానికి ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ముందుకు వస్తున్నాయి. యూనివర్సిటీల నుంచి గుర్తింపు పొందిన 141 కాలేజీలు, గుర్తింపులేని 174 కాలేజీలకు సంబంధించిన కొన్ని కాలేజీ యాజమాన్యాలు బీ క్యాటగిరీ అడ్మిషన్ల నోటిఫికేషన్ కంటే ముందే విద్యార్థుల నుంచి డొనేషన్ల రూపంలో ఫీజులు వసూలు చేశాయి. కాని ఇప్పుడు ఆయా కాలేజీలలో దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థులు నేరుగా కాలేజీలకు కాకుండా ఉన్నత విద్యా మండలికి దరఖాస్తుల చేసుకోవాలని సూచించారు.

అందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఆ వెబ్ పోర్టల్‌లో తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని అధికారులు స్పష్టంచేశారు. దీంతో విద్యార్థులంతా చెల్లించిన డొనేషన్లు తిరిగి ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు చాలా కాలేజీలు ముందుకు వచ్చినట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

స్థానికత పేరిట నిధులకు గండి...!

-ఆంధ్రాకు రూ.234 కోట్లు.. తెలంగాణకు రూ.29 లక్షలు
-ఖనిజాభివృద్ధి శాఖలో ఆంధ్రాయిజం
-డీమెర్జర్‍లోనూ అంతులేని వివక్ష

ఉద్యోగుల పంపిణీలో స్థానికత వద్దే వద్దు.. ఆప్షన్లు ఇచ్చి ఇష్టమైన స్థానాల్లో కూర్చోబెట్టాలని ఆందోళనలు చేసిన ఆంధ్రా అధికారులు.. నిధుల విషయానికి వచ్చేసరికి మాత్రం స్థానికత ఆధారంగానే చేపట్టాలంటూ వింత వాదన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డీ మెర్జర్ ప్లాన్‌లో స్థానికత అంటూ నిధులకు గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 


తెలంగాణ రెవెన్యూ అత్యధికంగా ఉన్న ఏపీఐఐసీలో రెండు రాష్ర్టాలకు జనాభా ప్రాతిపదికన నిధులను పంచారు. ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ 70 శాతం పైమాటే. దానిని కూడా జనాభా ప్రాతిపదికన పంచేశారు. ఈ సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు మాత్రం వర్తించదంటూ కొర్రీలు వేస్తున్నారు. తెలంగాణ నిధులతో ఆంధ్రాలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులపై తెలంగాణకు హక్కులు కోల్పేయేలా కుట్రలు చేస్తున్నారు.

తెలంగాణకు చేసిందేమిటి..?
తెలంగాణలో సహజ వనరులు, ఖనిజాలు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నా సమైక్య రాష్ట్రంలో ఖనిజాభివృద్ధి శాఖ తెలంగాణలో నెలకొల్పిన ప్రాజెక్టులు అతి తక్కువ. 1961 ఫిబ్రవరి 24న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమైక్య రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టులెన్ని? ఇందులో తెలంగాణకు ఇచ్చినవెన్ని..? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే.. వివక్ష, నిర్లక్ష్యమే సమాధానాలుగా వస్తాయి. 13 జిల్లాల్లో ఏడు మెగా ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలోని పది జిల్లాలకు ఏర్పాటు చేసింది.. ఒక్కటంటే ఒక్కటే. 


అంటే తెలంగాణలో ఖనిజ నిల్వలు లేవా..? ఇక్కడ ప్రాజెక్టు నెలకొల్పడానికి సరైన వసతులు లేవా..? అన్న అన్న సందేహం కలుగవచ్చు. కానీ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు మాత్రం తెలంగాణ నిండా వివిధ ఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నాయి. మరి తెలంగాణ ప్రాజెక్టులు ఏర్పాటుచేయకపోవడానికి అసలు కారణం ప్రాంతీయ వివక్షే. ఖనిజాలు ఇక్కడ ఉన్నా దుర్భుద్ధితో ప్రాజెక్టులను అక్రమంగా సీమాంధ్రకు తరలించారు. ఖనిజాలు పుష్కలంగా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం జరిగింది.

తెలంగాణకు రూ.29 లక్షలు.. ఆంధ్రకు రూ.234 కోట్లు
ప్రాజెక్టులు, ఇతర అంశాలను స్థానికత ఆధారంగా పంపిణీ చేయడం సబబే. కానీ, టెక్నాలజి అప్‌గ్రేడేషన్ ఫండ్‌ను కూడా దాని ఆధారంగానే పంపిణీ చేయడం పూర్తిగా అన్యాయం. తెలంగాణలోనూ ఈ నిధిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన జరిగి ఉండేది. స్థానికత ఆధారంగా అంటూ ఎంతటి వివక్ష చూపించారో.. తెలంగాణకు కేటాయించిన నిధిని చూస్తే స్పష్టమవుతోంది. తెలంగాణకు కేవలం 29 లక్షలు కేటాయిస్తే.. ఆంధ్రకు ఏకంగా 234 కోట్లు కేటాయించేశారు. కార్పొరేషన్‌లో ఆంధ్రా పెత్తనం కొనసాగుతుండటంతో తెలంగాణకు చెందిన జనరల్ మేనేజర్లు సైతం అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం చేయడం లేదు. తమ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని.. గతంలో కొందరు అధికారులపై వివక్ష ప్రదర్శించిన ఘటనలను గుర్తు చేస్తున్నారు. 

నియామకం మీద నియామకం
2013, జూన్ 30న జీఓ నెం.2893 ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న టీఆర్‌కే రావును ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు అధికారంలో వచ్చాక దానిని రద్దు చేయకుండానే 2014, జూన్ 6వతేదీన జీఓ నెం.2366 జారీ చేస్తూ.. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శాలినీ మిశ్రాకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వ రంగ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కేవలం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గానే వ్యవహరించాలి. కానీ ఇక్కడ జేఏండీకి బదులుగా ఎండీగా ఉత్తర్వులు చేయడంతో బాధ్యతలు స్వీకరించిన శాలినీమిశ్రా తాను సీనియర్ ఐఏఎస్‌నంటూ కన్ఫర్డ్ ఐఏఎస్ అయిన టీఆర్‌కే రావుపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విభజన ప్రక్రియను సక్రమంగా పూర్తికాకుండా అడ్డుకుంటున్నారని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. డీ మెర్జర్ ప్లాన్ సీమాంధ్ర పక్షపాతంగా కొనసాగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే టీఎండీసీ మనుగడ సాధించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఆగస్టు 24, 2014

ఆయనొక చోట.. ఆమె ఒక చోట!

-సర్వీసు అధికారుల కేటాయింపులో సిత్రాలు
-తెలంగాణ వ్యతిరేకులు ఇక్కడకు
-తెలంగాణ అనుకూలురు అక్కడకు
-కేటాయింపులపై మార్పులుండేనా?
-ఐఏఎస్, ఐపీఎస్‌లలో జోరుగా చర్చ
-సీఎంల దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌లకు వినతులు
అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో పలు చిత్రాలు చోటుచేసుకున్నాయి. సర్వీసు అధికారుల్లో పలువురు భార్యాభర్తలు కూడా ఉన్నారు. అయితే.. వీరిలో భర్త ఒక రాష్ర్టానికి ఎలాట్ అయితే.. భార్య మరో రాష్ర్టానికి ఎలాట్ అయ్యారు. అంతేకాదు.. తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రపడిన కొందరు అధికారులు తెలంగాణకు వస్తుంటే.. తెలంగాణపై అభిమానంతో, తెలంగాణకోసం అంకిత భావంతో పనిచేసిన మరికొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెళుతున్నారు. ఈ లోటుపాట్లపై సర్దుబాటు ఉంటుందా? అధికారులు కోరుకుంటే మార్పులు ఉంటాయా? లేక రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుంటే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అసలు అందుకు కేంద్రం అంగీకరిస్తుందా? అనే చర్చ ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. 
వారం వ్యవధిలో తమ అభ్యంతరాలను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. వారి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను రూపొందించేలోగా ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే కొన్ని మార్పులు సాధ్యమేనని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు తమకు కేటాయించిన రాష్ర్టాల్లో పనిచేసేందుకు ఆసక్తి లేనివారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రులను సంప్రదిస్తే, ఈ మేరకు ఇరు రాష్ర్టాల సీఎంలు అంగీకరిస్తే మార్పు సాధ్యం కావచ్చునని అంటున్నారు. భార్యభర్తలిద్దరు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఉంటే వారిద్దరూ ఒకే రాష్ర్టానికి ఆప్షన్ కోరుకుంటే ఈ విషయాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

తెలంగాణ క్యాడర్‌కు సీనియర్ ఐఎఎస్ అధికారి బీపీ ఆచార్యను కేటాయించారు. అయితే ఆయన సతీమణి రంజీవ్ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అజయ్‌సహానీని ఏపీకి కేటాయించగా ఆయన భార్య నీలం సహానీని తెలంగాణకు కేటాయించారు. ఇతర సీనియర్ అధికారులు రెడ్డి సుబ్రమణ్యం, ఆయన భార్య పుష్ప సుబ్రమణ్యం, ఆర్‌ఆర్ మిశ్రా, ఆయన భార్య వసుధ మిశ్రాలు కూడా రెండు రాష్ర్టాలకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్ర క్యాడర్‌కు చెందిన యోగితారాణా, మాణిక్‌రాజ్ దంపతులను కూడా వేర్వేరు రాష్ర్టాలకు కేటాయించారు. అయితే ప్రస్తుతం వారిద్దరు డిప్యూటేషన్‌పై జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఉన్నారు. దంపతులిద్దరూ ఒకే రాష్ట్రంలో పనిచేయాలని భావిస్తే ఈ మేరకు వెసులుబాటు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పీవీ రమేశ్ పరిస్థితేంటి?
ఉద్యోగుల విభజనకు సంబంధించి కీలక భూమిక నిర్వహించిన ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ విషయంలో ఐఏఎస్ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతున్నది. ఆయన తెలంగాణ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే తెలంగాణ ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే విమర్శలు చేశాయి. అయితే ఆయన ఇతరత్రా ప్రత్యామ్నాయాలను ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తున్నది. డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం, లేదా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లడం ఆయన ముందున్న మార్గాలని భావిస్తున్నారు. కాదూ కూడదని తెలంగాణలోనే పని చేస్తానంటే ఆయనకు ప్రాధాన్యం కలిగిన పోస్టు లభించకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేక పరిస్థితి నెలకొంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో అత్యంత చొరవ తీసుకుని పనిచేశారు. కమిషనర్‌గా తన బాధ్యత నిర్వహించినప్పటికీ ఆయన తెలంగాణ కార్యక్రమాలపట్ల ఆసక్తి కనబరిచారని సీమాంధ్ర వర్గాలు భావిస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్ కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులో వెళ్లనున్నారు. వారు చీఫ్ సెక్రటరీని సంప్రదించి తెలంగాణలో కొనసాగేలా ప్రయత్నిస్తే అది ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఐపీఎస్ అధికారుల్లోనూ సీమాంధ్రకు చెందిన పలువురు హైదరాబాద్‌లో చదువుకున్న రికార్డుతో తెలంగాణ క్యాడర్‌కు వచ్చారు.

మార్పులు చేర్పులు జరిగిన తరువాత తుది జాబితా విడుదల అవుతుందని భావిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 10వ తేదీలోగా తెలంగాణకు అధికారులందరినీ కేటాయిస్తే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారందరూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశాలుంటాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఉమ్మడి ప్రభుత్వంలో అక్రమార్కుల భూ మాయ..!

-జవహర్‌నగర్‌లో గల్లంతైన సర్కారు భూములు
-వివాదాల్లో 1500, కబ్జాలో 600 ఎకరాలు
-అధికారికంగా తేల్చిన హెచ్‌ఎండీఏ
-సమైక్య పాలనలో వేల ఎకరాలు అన్యాక్రాంతం
-నిజాం భూనిధి హారతి కర్పూరం
ఇద్దరు వ్యక్తులు ఓ భూమి విషయమై కోర్టు కెక్కారు. తీర్పు ఒకరికి అనుకూలంగా వచ్చింది. బయటకు వచ్చాక ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుకున్నారు. డబ్బులు చేతులు మార్చుకున్నారు. తర్వాత ఆ భూమిని అమ్మేసుకున్నారు. ఇంతకీ ఆ భూమి వారిద్దరిదీ కాదు. సర్కారుది.. ఆ సర్కారు సీమాంధ్ర పాలకులది.. ఆ భూమి తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ శివారులోనిది..! సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ భూముల దుస్థితి ఇది!
HMDA-land
సమైక్యపాలనలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని వేలాది ఎకరాల సర్కారు భూములు హారతి కర్పూరమైపోయాయి. పాలకులే దళారుల్లాగా వేలం పాటలు పెట్టి మరీ అమ్మేశారు. మిగిలిన భూములు వారి కనుసన్నల్లో ఉండేవారు దొరికినవాడు దొరికినట్టు ఆక్రమించుకుని కోట్లు కూడబెట్టుకున్నారు. తమ భూదాహాన్ని తీర్చుకోవడానికి పాలకులు హెచ్‌ఎండీఏ వంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు.

వివిధ సంస్థలు, శాఖల ఆధ్వర్యంలోని భూములన్నింటినీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చి వారి దోపిడీకి రాజమార్గం వేసుకున్నారు. వారి భూదాహానికి నిజాం రాజు ఏర్పరిచిన భూనిధి సైతం గల్లంతైంది. ఫలితంగా హెచ్‌ఎండీఏ దగ్గర ఉండాల్సిన మిగులు భూములు 4,142.53 ఎకరాల్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని కబ్జాల పాలయ్యాయోకూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల జరిపిన సర్వేలో ఒక్క రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోనే హెచ్‌ఎండీఏకు చెందిన 1500 ఎకరాలు న్యాయ వివాదాల్లో, 610 ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు తేలింది.

ఇవాళ స్వరాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని భూముల కబ్జాపై కొరడా ఝళిపిస్తున్నది. కోట్ల విలువైన భూములు తన అధీనంలోకి తెచ్చుకున్న హెచ్‌ఎండీఏ నిర్వాకం వల్ల ఇవాళ ఈ సంస్థకు తన అధీనంలో క్షేత్ర స్థాయిలో వివాద రహితంగా ఎన్ని భూములు ఉన్నాయో, కబ్జాలో ఎన్ని భూములున్నాయో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. వీటిని కాపాడడంలో హెచ్‌ఎండీఏ పూర్తిగా విఫలమైంది.

జవహర్‌నగర్‌లో కోట్ల భూములు అన్యాక్రాంతం...

గత ఏడాది అధికారులు నిర్వహించిన సర్వేలో హెచ్‌ఎండీఏ ఆధీనంలోని ప్రభుత్వ భూముల్లో 143.37 ఎకరాల మేర మాత్రం కబ్జాకు గురైనట్లు అధికారులు తేల్చారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని బొమ్రుకొద్వాల గ్రామ పరిధిలోని సర్వేనంబరు 42లో 6.32 ఎకరాలు, షేక్‌పేటలోని హకీంపేటలో సర్వేనంబరు 102/1లో 2.05 ఎకరాలు, బండ్లగూడలో సర్వేనంబరు 261లో 1.20 ఎకరాలు, నాంపల్లి మండల పరిధిలోని డైరా, నారాయణగూడలో టీఎస్ నంబరు 1, 2, 47ల్లో మూడు గుంటల భూమి కబ్జా చెరలో ఉన్నట్లు గుర్తించారు. కానీ నేటి వరకు ఆక్రమణల తొలగింపుపై దృష్టిసారించలేదు.

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌లో 133 ఎకరాలకు పైగా భూములు పరాధీనమైందనేది అధికారిక నిర్ధారణ. అయితే ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో వేల ఎకరాలు కబ్జా పాలైనట్టు తేలింది. ప్రత్యేకంగా జవహర్‌నగర్ భూములపై చేపట్టిన సర్వేలో హెచ్‌ఎండీఏ ఆధీనంలోని 1500 ఎకరాల భూములపై న్యాయ వివాదాలు ఉండగా, ఇందులోనూ 610 ఎకరాలకు పైగా భూములు ప్రస్తుతం కబ్జాదారుల చెరలో ఉన్నట్లు తేలింది.

ఇక్కడ ఎకరం కనిష్ఠంగా రూ.40 లక్షల ధర పలుకుతుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏకు చెందిన రూ.600 కోట్లకు పైగా విలువైన భూములు పరాధీనంలో ఉన్నాయి. వాస్తవంగా జవహర్‌నగర్‌లోని పలు సర్వేనంబర్లలో (262 నంబర్లు) సుమారు 2350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవిన్యూ శాఖకు చెందిన ఈ భూమిని గత ప్రభుత్వాలు హెచ్‌ఎండీఏకు బదలాయించాయి. ఈ సంస్థ అధికారులు వీటినుంచి 300 ఎకరాలు రాజీవ్ స్వగృహ, సచివాలయం ఉద్యోగులకు, బిట్స్ పిలానీ, ట్రాన్స్‌కో వంటి పలు శాఖలకు కేటాయించారు. ఇవన్నీ పోగా మిగిలిన భూమి మొత్తం హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉండాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

-62 సర్వేనంబర్లలోని 263.23 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇందులో ఎలాంటి ఆక్రమణలు లేవు. నేరుగా ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనువుగా ఉంది.
-29 సర్వేనంబర్లలోని 146.35 ఎకరాల భూమి కూడా ఖాళీగానే ఉంది. ఆక్రమణలు జరగలేదు గానీ ఈ భూములపై న్యాయ స్థానాల్లో పలువురు ప్రైవేటు వ్యక్తులు కేసులు వేశారు. ప్రభుత్వ రికార్డుల్లో అవి సర్కారు భూములుగా ఉన్నా ప్రస్తుతం అవి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి.
-మరో 51 సర్వేనంబర్లలోని 220.34 ఎకరాల భూమి పూర్తిగా వివిధ వ్యక్తుల చేతుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో వాటిలో గదుల నిర్మాణం చేపట్టారు. మరికొందరు కబ్జా చేసి, తోటలు వేసుకున్నారు. ఈ భూములపై న్యాయ వివాదాలు లేవు. ప్రభుత్వ భూమి అయినప్పటికీ బహిరంగంగానే కబ్జాదారులు పొజిషన్‌లో ఉన్నారు.
-72 సర్వేనంబర్లలోని 1299.19 ఎకరాల భూములు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం కోర్టులో కేసులు ఉన్నాయి. ఇందులో 390.38 ఎకరాల మేర భూముల్లో ఆక్రమణదారులు వివిధ నిర్మాణాలు కూడా చేపట్టారు. మరికొందరు తోటలు వేసుకోగా ఇంకొందరు ఏకంగా క్రషర్ మిల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
-ఇలా స్వయానా అధికారుల క్షేత్రస్థాయి సర్వేలోనే ప్రభుత్వ భూముల పరిస్థితి ఇలా ఉందని తేలినా నేటికీ సెంటు భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోలేదు.

రూ.400 కోట్ల విలువైన భూములపై డ్రామా..

ఎకరం కోట్లు పలికే మియాపూర్ ప్రాంతంలోని భూములను కూడా హెచ్‌ఎండీఏ పరిరక్షించుకోలేకపోయింది. ఈ కబ్జాల వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో అధికారులు వారికి వత్తాసు పలికి రూ.వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారు. మియాపూర్‌లోని సర్వేనంబరు 159లో 120.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అడంగల్ పహాణీలోనూ ఇది గాయెరాన్ సర్కారీ భూమిగానే వస్తుంది. ఇది రెవిన్యూ శాఖ ఆధీనంలో ఉండగా కొన్ని సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇందులో 21.26 ఎకరాలను ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయిస్తే ఆ సంస్థ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది.

అదిపోగా మిగిలిన భూములను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. వీటిని పరిరక్షించాల్సిన అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. వాస్తవంగా ఇది ప్రభుత్వ భూమి. కానీ రెండు ప్రైవేటు సంస్థలు తెలివిగా సర్వేనంబరు 159లోని 41.26 ఎకరాల భూమి ఒకరికొకరు తమదంటూ కోర్టుకెక్కారు. అధికారులు, ప్రభుత్వాన్ని పార్టీగా పెట్టలేదు. దీంతో వాళ్ల వద్ద ఉన్న ఆధారాలను బట్టి కోర్టు కష్టజీవుల సంఘానిదే ఆ భూమి అంటూ తీర్పునిచ్చింది.

దీనిని అడ్డం పెట్టుకొని సదరు సంఘం ప్రతినిధి భూమి కబ్జా పెట్టాడు. అయినా హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించి ఇది ప్రభుత్వ భూమి అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. అయితే దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశంతో 2010లో అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ విచారణ నిర్వహించారు. రెండు ప్రైవేటు సంస్థలు కోర్టుకెక్కి తెలివిగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే విషయాన్ని గుర్తించి, కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకొని, భూమిని స్వాధీనం చేసుకోవాలని హెచ్‌ఎండీఏకు కలెక్టర్ సూచించారు. ఆ సర్వేనంబరులో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. అయితే హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కష్టజీవుల సంఘం ప్రతినిధి ఇండ్లులేని నిరుపేదలనుంచి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేసి, ప్లాట్లు అమ్ముకుంటున్నారు. కలెక్టర్ నిషేధం ఉండడం వల్ల నోటరీ ద్వారా వాటిని అమ్ముకుంటున్నాడే గానీ ప్లాట్లు మాత్రం చూపించ లేదు.

ఒక వ్యక్తి ఎంతకీ తనకు ప్లాటు చూపకపోవడంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసు విచారించిన ఫోరం అది ప్రభుత్వ భూమిగా గుర్తించి వడ్డీతో సహా బాధితుడికి మొత్తాన్ని చెల్లించాలని కష్టజీవుల సంఘాన్ని ఆదేశించింది. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఎకరం కనీసంగా రూ.10 కోట్ల విలువ చేసే ఈ ప్రాంతంలోని రూ.400 కోట్లకు పైగా విలువైన భూమిని తమ ఆధీనంలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గందరగోళంగా మారిన భూనిధి...

హెచ్‌ఎండీఏ చేతిలో మొదట్లో కొద్దిపాటి భూమి మాత్రమే ఉండేది. పాలకుల భూదాహానికి ఆ మాత్రం సరిపోక వివిధ శాఖలకు చెందిన భూములన్నింటీనీ ఈ సంస్థకు బదలాయించారు. ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించక పోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. అధికారులు బదలాయింపులో నిర్లక్ష్యం వహించడం, న్యాయపరమైన కేసులను సమర్థంగా ఎదుర్కోకపోవడంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూ నిధి గందరగోళంగా తయారైంది.

గత ఏడాది హెచ్‌ఎండీఏ అధికారికంగా వెల్లడించిన వివరాలు ప్రకారం హెచ్‌ఎండీఏకు 4290.11 ఎకరాల భూములున్నాయి. అదనంగా ప్రభుత్వం రెవిన్యూ, ఇతర శాఖల నుంచి 4,548.06 ఎకరాలను బదలాయించింది. దీంతో మొత్తం 8838.17 భూములు హెచ్‌ఎండీఏకు చెందినవిగా రికార్డుల్లో నమోదైంది. ఇందులో వివిధ అవసరాలకు భూములు కేటాయించారు. 2495.04 ఎకరాల భూములను లేఅవుట్లుగా మార్చి అమ్మారు. మరో 181.10 ఎకరాలను వేలం ద్వారా నేరుగా యధాతథంగా ఎకరాల విస్తీర్ణంలో విక్రయించారు. ఇలా ప్రభుత్వానికి రూ. 2500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అవిపోగా హెచ్‌ఎండీఏ దగ్గర 4,142.53 ఎకరాల భూములు మిగిలి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కచ్చితంగా ఎంత భూమి అందుబాటులో ఉంది? అనేది ఇవాళ అధికారులకే తెలియదు.

కబ్జాలు.. న్యాయ వివాదాలు..

ఇక హెచ్‌ఎండీఏ నిర్వాకం వల్ల ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే వేలాది ఎకరాల భూములు పరాధీనమయ్యాయి. కొన్ని న్యాయ వివాదాల్లో చిక్కుకోగా... మరికొన్ని కళ్లముందు కబ్జాదారులు అనుభవిస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదు.ఈ జిల్లాలో గూడులేని నిరుపేదలకు నీడ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా సెంటు భూమి కూడా అందుబాటులోని లేని పరిస్థితి. అలాగే ప్రజా శ్రేయస్సు కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఈ భూములను వినియోగించాలనుకున్నా న్యాయ వివాదాలతో ముందడుగు వేయలేని స్థితి ఉంది.

ధర్మకర్త బాధ్యత మరిచిన పాలకులు..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గతంలో చెప్పినట్లు నిజాం నవాబు నుంచి వారసత్వంగా తెలంగాణకు లక్షల ఎకరాల భూములు వచ్చాయి. నిజాం వ్యక్తిగత ఆస్తులన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక ధర్మకర్తలా వ్యవహరించాల్సిన సమైక్య ప్రభుత్వాలు దళారుల పాత్ర వహించాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను తెగనమ్మాయి. కొన్ని ప్లాట్లుగా మార్చి వేలం పెడితే మరికొన్ని ఎకరాల లెక్కల్లో విక్రయాలు చేశాయి. హెచ్‌ఎండీఏ ద్వారా వచ్చిన ఆదాయమే సుమారు రూ.2500 కోట్లకు పైగా ఉంటుంది. వచ్చిన మొత్తాన్ని న్యాయంగా ఇక్కడే వినియోగించాలి. కానీ సీమాంధ్ర పాలకులు ఇటు హైదరాబాద్, అటు తెలంగాణ బాగు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఆ మొత్తాన్ని ఇడుపులపాయకు నాలుగు లేన్ల రహదారి,సీమాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు స్వయానా కాగ్ నివేదికలే బట్టబయలు చేశాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కాలేజీల గుర్తింపు రద్దు సబబే...!

-బోధనా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయి
-గ్రాడ్యుయేట్లే గ్రాడ్యుయేట్లకు బోధిస్తున్నారు
-హైకోర్టులో జేఎన్టీయూ వాదనలు.. విచారణ నేటికి వాయిదా
బోధనా ప్రమాణాలు పాటించని 174 ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దుచేయటం సబబేనని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టీయూ) పేర్కొంది. గుర్తింపును నిరాకరించటాన్ని వ్యతిరేకిస్తూ ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘవాదనలు జరిగాయి. జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కాలేజీల పిటిషన్‌పై ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించింది.
JNTUకాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, డీవీ సీతారాంమూర్తి, రవిచంద్ర, రఘనందన్, నిరంజన్‌రెడ్డి, సురేశ్‌కుమార్, వినయ్ తదితరులు ఐదు గంటలపాటు వాదనలు వినిపించారు. జెఎన్టీయూ అధికారులు ఏకపక్షంగా, రాత్రికి రాత్రే కాలేజీల గుర్తింపును రద్దు చేశారని, బోధనా, మౌలికవసతుల లేమిపై ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గుర్తింపు రద్దు చేయటం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ జాబితాలో తమ కళాశాలలను చేర్చేలా జెఎన్టీయూకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. కాలేజీల తరపు న్యాయవాదులకు ధీటుగా జెఎన్‌టీయూ తరపున అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. గ్రాడ్యుయేట్లకు గ్రాడ్యుయేట్లే పాఠాలు బోధిస్తున్నారని, ఒక్కో బోధకుడు ఐదేసి కాలేజీల్లో బోధిస్తున్నట్లుగా జేఎన్టీయూ నియమించిన నిజనిర్ధారణ కమిటీ గుర్తించిందని తెలిపారు.

ఏఐసీటీఈ అనుమతి ఇచ్చాక యూనివర్శిటీ గుర్తింపును నిరాకరించటం చెల్లదంటూ కాలేజీలు చేస్తున్న వాదన అర్ధరహితమన్నారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చాక విశ్వవిద్యాలయం గుర్తింపు అవసరం లేకుంటే గుర్తింపు నిరాకరించడంపై ఇంతగా బాధ ఎందుకని నిలదీశారు. వాదనలు వినిపించేందుకు మరో ఐదు గంటల సమయం కావాలని ఆయన కోరటంతో విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది.

ఈ విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందని 174 ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల వివరాలుః
1. ఎ.ఎం.ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మవ్వాల, ఆదిలాబాద్,
2.ఎఎఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల - బండ్లగూడ, హైదరాబాద్,
3. ఆరుషి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ - గ్రాః పున్నెల, వర్థన్నపేట,వరంగల్
4. అబ్డుల్ కలామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కొత్తగూడెం, ఖమ్మం,
5. ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల - పాల్వంచ, ఖమ్మం,
6. అడుసుమిల్లి విజయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్- బీబీనగర్, నల్లగొండ.
7. అడుసుమిల్లి విజయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్-బొమ్మలరామారం, నల్లగొండ.
8.ఆజీజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - మంచిర్యాల, ఆదిలాబాద్,
9. అమీనా ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ - గౌస్‌నగర్, షామీర్ పేట, రంగారెడ్డి,
10. అనసూయా దేవీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్- గూడూరు, బీబీనగర్, నల్లగొండ.
11. అనుబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - పాల్వంచ, ఖమ్మం
12. అన్వర్ ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - వికారాబాద్, రంగారెడ్డి.
13. అపెక్స్ ఇంజినీరింగ్ కళాశాల - గీసుగొండ,వరంగల్,
14.అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - హయత్‌నగర్, రంగారెడ్డి,
15. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -బోధన్, నిజామాబాద్,
16. అరవిందాక్ష ఎడ్యూకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్- సూర్యాపేట, నల్లగొండ,
17. ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి
18. అశోక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, చౌటుప్పల్, నల్లగొండ
19. అసిఫీయా కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
20. అరబిందో కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
21. అరోరా టెక్నాలజీకల్ ఇన్ స్టిట్యూట్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
22. అరోరా సీతయ్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ పటాన్‌చెరువు, మెదక్
23. అరోరా టెక్నాలజీకల్ అండ్ మేనేజ్‌మెంట్ అకాడమి, ఘట్‌కేసర్, రంగారెడ్డి
24. అవంతి సైంటిఫిక్ టెక్నాలజీస్ అండ్ రీసెర్చ్ అకాడమి, ఫిల్మ్‌సిటి, రంగారెడ్డి
25. అజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
26. ఆజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మెయినాబాద్, రంగారెడ్డి.
27. బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్, నరసంపేట, వరంగల్
28. బండారి శ్రీనివాస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గొల్లపల్లి గ్రామం
29. భారత్ ఇంజినీరింగ్ కాలేజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
30. భారత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
31. భాస్కర ఇంజినీరింగ్ కాలేజీ, మెయినాబాద్, రంగారెడ్డి
32. బొమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం
33. బ్రలియంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి
34. చిలుకూరి బాలజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
35. సిటి ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడ, హైదరాబాద్
36. సివిఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ శామీర్‌పేట, రంగారెడ్డి
37. సైబరాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షాద్‌నగర్.
38. దారిపల్లి అనందరాములు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం
39. ధ్రువ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చౌటుప్పల్, నల్లగొండ
40. డాక్టర్ వీఆర్‌కె కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జగిత్యాల, కరీంనగర్
41. డాక్టర్ వీఆర్‌కె ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
42. డాక్టర్ పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కాలేజీ భద్రాచలం, ఖమ్మం
43. డీఆర్‌కే కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మియాపూర్, రంగారెడ్డి
44. డీఆర్‌కే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
45. ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీ, సిద్దిపేట, మెదక్
46. ఈవీఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, బొమ్మలరామారం, నల్లగొండ
47. గాంధీ అకాడమి ఆఫ్ టెక్నాకల్ ఎడ్యుకేషన్, చిల్కూరు, నల్లగొండ
48. గాయత్రి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రాజంపేట
49. గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, బటాసీనగర్ విలేజ్
50. జ్ఞాన సరస్వతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డిచ్‌పల్లి, నిజామాబాద్
51. గ్రీన్‌ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, చాంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్, హైదరాబాద్
52. హర్షిత గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి
53. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
54. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
55. ఐపాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిలుకూర్, రంగారెడ్డి జిల్లా
56. హొలిమేరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోగారం, రంగారెడ్డి జిల్లా
57. జేజే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫార్‌మేషన అండ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
58. జవఙర్‌లాల్ నెహ్రు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంగులురు, రంగారెడ్డి జిల్లా
59. కామక్షి కాలేజ్ ఇంజనీరింగ్, చివెమ్ల, నల్గొండ జిల్లా
60. కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, పగడిపల్లి, నల్గొండ జిల్లా
61. ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, దేవరకొండ, నల్గొండ జిల్లా
62. కైట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
63. కేఎల్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పాల్వంచ, ఖమ్మం జిల్లా
64. కోదడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కోదడా, నల్గొండ జిల్లా
65. కొమ్మిడి ప్రతాప్‌రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
66. కృష్ణామూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
67. లుంబిని గ్రూఫ్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ అనంతరాం, నల్గొండ జిల్లా
68. మధురా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, చిలుకూర్, నల్గొండ జిల్లా
69. మహేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
70. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, సూరరం, రంగారెడ్డి జిల్లా
71. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా
72. మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొండపాక, మెదక్ జిల్లా
73. మేదా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బీబీనగర్, నల్గొండ జిల్లా
74. మేధా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, పెద్దతాండ, ఖమ్మం జిల్లా
75. మెగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, ఎదులాబాద్, రంగారెడ్డి జిల్లా
76. మీనా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
77. ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్‌జిల్లా
78. మొఘల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్గ్, బండ్లగూడ, హైదరాబాద్
79. మహమదీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ హైవే, ఖమ్మం
80. మోన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గొల్లగూడ, నల్గొండ జిల్లా
81. ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మలక్‌పేట, హైదరాబాద్
82. మూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంకిరెడ్డిపల్లి, రంగారరెడ్డి జిల్లా
83. నాగార్జున ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
84. నాగోల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుంట్లూర్, రంగారెడ్డిజిల్లా
85. నల్గొండ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెర్లపల్లి, నల్గొండ జిల్లా
86. నారాయణ ఇంజనీరింగ్ క్యాంపస్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
87. నవాబ్‌షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, న్యూమలక్‌పేట, హైదరాబాద్
88. నేతాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తూప్రాన్ పేట, నల్గొండ జిల్లా
89. న్యూ ఇండియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గొల్లపల్లి, రంగారెడ్డి జిల్లా
90. నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లేమూర్, రంగారెడ్డి జిల్లా
91. నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
92. నోబుల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, నాదర్‌గుల్, రంగారెడ్డి జిల్లా
93. నూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా
94. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డిజిల్లా
95. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డి
96. ఎన్‌ఆర్‌ఐ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీశైలం హైవే
97. పీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
98. పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, చెవెళ్ల, రంగారెడ్డిజిల్లా
99. పద్మశ్రీ డాక్టర్ బీవీ రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్, మెదక్ జిల్లా
100. ఫతీఫిందర్ ఇంజనీరింగ్ కాలేజీ, హన్మకొండ, వరంగల్‌జిల్లా
101. ప్రజ్ఞభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
102. ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ, జనగాం, వరంగల్ జిల్లా
103. ప్రిన్సిటన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్
104. ప్రియదర్శిని ఇన్ స్టిట్యూట్ఆఫ్ సైన్‌స అండ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
105. ప్రొగెసివ్ ఇంజనీరింగ్ కాలేజ్, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
106. పూజ్య శ్రీ మాదవన్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కర్మన్‌ఘాట్, హైదరాబాద్
107. పులిపాటి ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అమ్మలపాలెం, ఖమ్మం
108. పుల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌరారం, మెదక్‌జిల్లా
109. రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
110. రామానందతీర్ధ ఇంజనీరింగ్ కాలేజ్, చెర్ల గౌరారం, నల్గొండ జిల్లా
111. రిషి ఎం.ఎస్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కూకట్‌పల్లి, హైదరాబాద్
112. రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
113. ఎస్.వీ.ఎస్ గ్రూపు ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమారం
114. ఎస్‌పీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
115. ఎస్.ఎస్.ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుత్బూల్లాపూర్, రంగారెడ్డి జిల్లా
116. ఎస్.ఎస్.జె.ఇంజనీరింగ్ కాలేజ్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
117. సాగర్ గ్రూప్ ఆప్ ఇన్ స్టిట్యూట్, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
118. సహజ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్.సైన్స్ ఫర్ ఉమెన్, రేకుర్తి, కరీంనగర్ జిల్లా
119. సహరా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, వరంగల్ జిల్లా
120. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
121. సాన ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ, నల్గొండ జిల్లా
122. శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రఘునాధపాలెం, ఖమ్మం జిల్లా
123. సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డిజిల్లా
124. షాఙజ్ కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
125. షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హిమాయత్‌సాగర్, హైదరాబాద్
126. సాదన్ ఉమెన్స్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్
127. షాహజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
128. సిద్దార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
129. సింధూర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా
130. ఎస్‌ఎల్‌సిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా
131. ఎస్‌ఆర్ ఇంటర్‌నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
132. శ్రీచైతన్య కాలేజ ఆఫ్ ఇంజనీరింగ్, తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా
133. శ్రీచైతన్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్ సైన్స్, తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా
134. శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
135. శ్రీరామ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుప్పెనకుంట్ల, ఖమ్మం జిల్లా
136. శ్రీవాన్మయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
137. శ్రీకవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
138. శ్రీచైతన్య టెక్నికల్ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
139. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, రామాపూరం, నల్గొండ జిల్లా
140. శ్రీ శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనంతారం, నల్గొండ జిల్లా
141, శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
142. శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
143. శ్రీ కేఎస్‌రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కనకమామిడి, రంగారెడ్డిజిల్లా
144. ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
145. సెయింట్ మెరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
146. సెయింట్ మెరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
147. సుధీర్‌రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కేషాపూర్, నిజామాబాద్ జిల్లా
148. సుజల భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్
149. సుప్రభాత్ గ్రూప్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్, నోములా, రంగారెడ్డి జిల్లా
150. సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెమలిగొండ, వరంగల్ జిల్లా
151. స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూషన్స్, సికింద్రాబాద్
152. స్వర్ణభారతి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్, మదిలపల్లి, ఖమ్మం జిల్లా
153. సయ్యద్ హషీమ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రజ్జపూర్, మెదక్‌జిల్లా
154. సిమ్ బయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శామీర్‌పేట, రంగారెడ్డిజిల్లా
155. తిరుమల కాలేజ్ ఆఫ్ పార్మసీ, బర్దిపూర్, నిజామాబాద్ జిల్లా
156. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్
157. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, పెద్దపల్లి, కరీంనగర్
158. తూడి నర్సింహారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
159. తూడి రాంరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
160. టర్బో మిషనర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్‌జిల్లా
161. వరదారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతసాగర్, వరంగల్ జిల్లా
162. వాత్సాలయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతరాం, నల్గొండ జిల్లా
163. విద్యా వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
164. విద్యా వికాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
165. వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
166. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
167. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
168. విజయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, మక్లూర్, నిజామాబాద్ జిల్లా
169. విజయకృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్మాకులా, రంగారెడ్డి జిల్లా
170. విష్ణుశ్రీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
171. విశ్వభారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాదర్‌గుల్, రంగారెడ్డి
172. వివేకానంద గ్రూఫ్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
173. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, బోగారం, రంగారెడ్డి జిల్లా
174. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఫరూఖ్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!