గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 29, 2014

మళ్లీ సీమాంధ్ర సర్కారు కరెంటు కుట్రలు...!

-ఈసారి ఈఆర్సీ ఆమోదించలేదనే సాకు
-కేంద్రానికి లేఖ రాసిన ఆంధ్రా సీఎస్
-సోలార్, విండ్ పీపీఏలపై పేచీ..700 మెగావాట్లకు ఎసరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ అంశంపై రోజుకో పేచీ పెడుతున్నది. ఎదురుదెబ్బలు తాకినా పట్టించుకోకుండా కుట్రలకు పాల్పడుతున్నది. పీపీఏలను ఏపీఈఆర్సీ ఆమోదించలేదనే సాకుతో మా ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి మాకే అంటూ వివాదానికి తెరతీసింది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల(సీజీఎస్) విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు కేటాయించిన వాటా నుంచి 1.77శాతం అంటే 65మెగావాట్లు(15లక్షల యూనిట్లు) కాజేసింది. ఈసారి కొత్తగా మరో వివాదానికి తెరతీసింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సైతం లాక్కునేందుకు జులుం చేస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(గతంలో సీపీడీసీఎల్) వద్ద ఉన్న ఈ పీపీఏల ఫైళ్ళను తక్షణమే తమకు ఒత్తిడి తీసుకువస్తున్నది. అనంతపురం, కర్నూలు జిల్లాలను భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో చేర్చినందున ఆ రెండు జిల్లాల్లోని దాదాపు 700 మెగావాట్ల సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుందనేది వాదన.

అయితే ఈ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తెలంగాణ డిస్కమ్(సీపీడీసీఎల్) ప్రతిపాదించడం, వాటిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆమోదించడం వల్ల అవి తెలంగాణ రాష్ర్టానికే చెందుతాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాదిస్తున్నది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కష్ణారావు ఈనెల 11వ తేదీన కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హాకు అధికారికంగా లేఖ(నెం.1786) రాయడం గమనార్హం. భౌగోళికంగా ఆ రెండు జిల్లాల పరిధిలో ఉన్న నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ(ఎన్‌సీఈ) ప్రాజెక్టుల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)లను 2008లో జారీచేసిన ఉత్తర్వులు(జీవో నెం.53) ప్రకారం తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆ లేఖలో పేర్కొనడం విశేషం.

ఆరెండు జిల్లాల లెక్కల్లో తప్పులు

రాష్ట్ర విభజనలో భాగంగా సీమాంధ్రలోకి చేరిన అనంతపురం, కర్నూలు జిల్లాల లెక్కల్లో తప్పులున్నట్లు విభజనకు ముందు, ఆ తర్వాత తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఆ రెండు జిల్లాల విద్యుత్ వినియోగం పరంగా 8.03 శాతంగా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఐదేళ్ళ విద్యుత్ వినియోగాన్ని బట్టి కోటాలను నిర్ధారించడం వల్ల తెలంగాణకు రూ.1,060కోట్ల మేరకు ఆర్ధికనష్టం వాటిల్లుతుందనేది తెలంగాణ విద్యుత్ నిపుణుల అభిప్రాయం. తప్పుడు విధానాలను అనుసరించి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విద్యుత్ వినియోగం 17.42 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. వాస్తవానికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్‌పవర్ డిస్కమ్ విద్యుత్‌కోటా46.06 శాతంగా ఉండగా, వాటిల్లో కర్నూలు, అనంతపురం జిల్లాల వాటా కేవలం 5.9 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని కోటాలను నిర్దేశించడం వల్ల సెంట్రల్ పవర్ డిస్కమ్ (సీపీడీసీఎల్)కు 2.14 శాతం విద్యుత్ కోటా నష్టం వాటిల్లుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డిస్కమ్ విద్యుత్‌కోటా 46.06 శాతంలో కర్నూలు, అనంతపురం జిల్లాల వాటాగా 8.03 శాతం ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు(జీవోనెం.20) తక్షణమే రద్దుచేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.

లోయర్ సీలేరు లేని నష్టం వేల కోట్లు

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో తెలంగాణకు ఖమ్మం జిల్లా చింతూరు మండలంలోని 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన లోయర్ సీలేరు హైడెల్ జనరేషన్ ప్రాజెక్టు తెలంగాణకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏటా 1,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ కోల్పోవాల్సి వస్తున్నది.

మల్టీఇయర్ టారీఫ్‌తో ఎంతో మేలు

రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలకు(మల్టీఇయర్ టారీఫ్) సంబంధించిన ట్రాన్స్‌మిషన్ టారిఫ్, డిస్ట్రిబ్యూషన్ టారిఫ్, ఎస్‌ఎల్‌డీసీ టారిఫ్‌లను రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఖరారుచేస్తూ ఈఆర్సీ గత మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2014-15) నుంచి 2018-19 సంవత్సరం వరకు టారిఫ్ అమలులో ఉంటుంది. విద్యుత్‌ఉత్పత్తి సంస్థల నుంచి ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పంపిణీ అయ్యే విద్యుత్తుకు టారిఫ్‌ను నిర్ధారించడంతో పాటు ట్రాన్స్‌మిషన్ నష్టాలను సైతం ఈఆర్సీ నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారంగా సౌరవిద్యుత్తు, పవన విద్యుత్తు, మినీ హైడెల్ వంటి సాంప్రదాయేతర ఇంధనవనరులకు ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఈఆర్సీ స్పష్టంచేసింది. దీంతో ఈఆర్సీ ఆమోదించిన సాంప్రదాయేతర ఇంధన వనరుల విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణకు ఎంతో మేలు చేకూరుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి