గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 19, 2014

హైదరాబాద్.‍..కాబోయే "వైఫై సిటీ..."!


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు నగరాన్ని వై-ఫై హబ్‌గా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. నగర చారిత్రక వైభవానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రానున్న రోజుల్లో వైఫై ఆధారిత నగరంగా మారనుంది. ఐటీ రంగంలో దూసుకెళ్తున్న సిటీ ఇక నూతన సాంకేతిక శోభను సంతరించుకోనుంది. మహానగరాభివద్ధిలో భాగంగా సర్కారు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నగరవాసులు, ఇక్కడికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే పర్యాటకులు, వ్యాపారులకు వై-ఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటే చాలు...మొబైల్ డేటా నెట్‌వర్క్ లేకున్నా, వై-ఫై కనెక్టివిటి ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజింగ్ చేసేందుకు, అవసరమైన సమాచారం వీలు కలుగుతుంది. ఈ-మెయిల్స్ చదువుకుని, అవసరమైన మెయిల్స్ పంపుకోవచ్చు.

హెచ్‌ఎండీఏ పరిధిలో...హెచ్‌ఎండీఏ పరిధి మొత్తాన్ని వైఫై ఆధారితంగా మార్చాలని నిర్ణయించారు. ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఈ ప్రాజెక్టును కీలకంగా భావిస్తున్నారు. ప్రాజెక్టు అమలుకు సంబంధించిన విధి విధానాలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఐటీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో వారు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇలా వై-ఫై ఆధారిత నగరం ప్రాజెక్టును విడతలవారీగా అమలు చేయనుంది. తొలివిడత కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అక్కడ ఎదురయ్యే సవాళ్లను, పరిష్కార మార్గాలను పరిశీలిస్తారు. వై-ఫై కింద ఎలాంటి సర్వీసులు అందించాలి? అసాంఘిక వెబ్‌సైట్లను నిరోధించడం, సంఘ విద్రోహశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఎంత సామర్థ్యం వరకు ఇవ్వవచ్చు అన్న విషయాలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఉచితంగా ఇస్తే దానిని కేవలం సమాచారం వరకు మాత్రమే పరిమితం చేయాలని, వీడియో, ఆడియో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్‌ను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారు. 

4 జీ సేవలు ఉంటేనే...ప్రస్తుతం రాష్ట్రంలో 3జీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు నాటికి రిలయన్స్ 4జీ నెట్‌వర్క్ ఏర్పాట్లు పూర్తవుతాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ సంస్థలు కూడా 4జీ సేవలపై ఆసక్తి చూపుతున్నాయి. 4జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టును సర్కారు అమలు చేయనుంది. 4జీ ద్వారా వేగమైన డేటా ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. పైలెట్ ప్రాజెక్టు కింద ఐటీ సంస్థలు ఉన్న ప్రదేశాల్లో వై-ఫై టవర్లు ఏర్పాటు చేస్తారు. 

పూర్తి స్థాయి వై-ఫైహైదరాబాద్‌లోని ప్రతి గల్లీలో ఉచిత వై-ఫై సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఐటీ ఉన్నతాధికారులు, ఐటీ రంగ నిపుణులతో చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే వాటి విధివిధానాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నారు. అయితే నగరంలో మాత్రం అన్ని ప్రాంతాల్లో సేవలు అందేలా చూడాలని నిర్ణయించినట్లు సమాచారం. అనుకున్నట్లుగా ప్రణాళిక పూర్తయితే దేశంలోనే ఐటీ రంగంలో ఒక ముందడుగు అవుతుంది. 

బెంగళూరులో ఉచితం...బెంగళూరు ఐదునెలల క్రితం వైఫై ఆధారిత నగరంగా మారింది. బెంగళూరులోని ఎంజీ రోడ్‌తో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఉచిత వైఫై పాయింట్లు ఏర్పాటు చేశారు. దేశంలో ఇలా ఉచిత వై-ఫై ఏర్పాట్లున్న తొలి నగరంగా దానికి పేరు దక్కింది. ప్రజలు రోజుకు మూడు గంటల పాటు 50 ఎంబీ డేటా వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అక్కడి ఐటీ శాఖ సర్వీసు ప్రొవైడర్‌ను నియమించి ఈ ప్రాజెక్టు అమలు చేసింది. వై-ఫై టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సైబర్ రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ...ముందస్తు జాగ్రత్తగా వీధులు, ప్రధాన ప్రాంతాల్లో హెచ్‌డీ కెమెరాలు ఏర్పాటు చేసింది. 

ఉపయోగాలు ఇవి ...- వినియోగదారులు తమ మొబైల్ నెంబరు, ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- వివరాలు నమోదు చేసిన వెంటనే మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. ఈ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావచ్చు.- వైఫై ఆధారిత మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉన్నవారు ఉచిత వైఫై పాయింట్లలో ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు.
- కచ్చితమైన డేటాలోని ఐఎంఈఐ నెంబర్లున్న మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. - రోజుకు మూడు గంటల చొప్పున 50 ఎంబీ డేటా వరకు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. ఒక రోజులో మూడు గంటల సమయం దాటితే వైఫై కనెక్టివిటీ ఉండదు. 
- మరో సిమ్‌కార్డు వేసినా, పరికరం ఐఎంఈఐ నెంబరు అప్పటికే నమోదై ఉండటంతో సమయం ముగిసిన తరువాత మరోసారి లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉండదు. - ఇలా చేయకుంటే సర్వర్‌పై భారం పెరిగి అక్కడ వైఫై సౌకర్యం కుప్పకూలుతుంది. పైగా స్థానిక వ్యాపారులు అపరిమితంగా వాడుకుని దుర్వినియోగం చేసే అవకాశముంది.
- కొన్ని దేశాల్లో ప్రతి అరగంటకు ఒకసారి లాగిన్ కావాల్సి ఉంటుంది. అక్కడ పరిమితి లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ సౌకర్యం కేవలం సమాచార సేకరణకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా వెబ్‌సైట్లు, అప్లికేషన్లు తెరుచుకోవు.- బెంగళూరులో సామాజిక, ప్రభుత్వ, పర్యాటక, సమాచార విషయాలకు సంబంధించి వెబ్‌సైట్లు, అప్లికేషన్‌లు మాత్రమే తెరుచుకుంటాయి. అధీకత వీడియోలను చూసేందుకు అవకాశమిచ్చారు. అసాంఘిక, అశ్లీల వెబ్‌సైట్ల వీక్షణకు తావుండదు.
- చాలా దేశాలు అక్కడి పర్యటన, వాణిజ్య, అవసరాల మేరకు ప్రధాన మార్కెట్లు, ప్రదేశాల్లో ఉచిత వైఫై సౌకర్యం ఇస్తున్నాయి.
బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది 
ప్రస్తుతం మన నగరం ఐటీ ఇండస్ట్రీకి అవసరమైన అన్ని సౌకర్యాలు, వనరులను కలిగి ఉంది. ప్రపంచంలో ఈ తరహా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగి ఉన్న నగరాలు చాలా అరుదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలతో వైఫై కలిస్తే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రెట్టింపవుతుంది. ఇది నగరానికి మరో చారిత్రాత్మక ఘట్టంగా మిగులుతుంది. 
-సందీప్ మక్తల, టీఐటీఏ అధ్యక్షుడు

ఐటీ ఇండస్ట్రీకి ఉపయోగం 
ఐటీ సంస్థలకు వైఫై సిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగులు ఆ సదుపాయాలను అందిపుచ్చుకుని మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. సర్వర్ డౌన్ అయినప్పుడు, ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వైఫై ఐటీ ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 
-చింతల నవీన్ కుమార్, టీఐటీఏ ప్రధాన కార్యదర్శి

అధిక సమయం అందించాలి 
బెంగళూరులో ఎంజీ రోడ్ ఇప్పటికే వైఫై సిటీగా కనెక్ట్ చేయబడింది. మూడు గంటల వ్యవధి, 50ఎంబీ డేటా డౌన్‌లోడ్ సదుపాయాలను కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో అంతకు మించి వైఫై కనెక్టివిటీ పెంచాలి. అప్పుడే నగర పౌరులతోపాటు ఉద్యోగులందరికీ మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించే అవకాశం ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వం దష్టి సారించి త్వరిత గతిన ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. 
-లక్ష్మీభార్గవి, ఐటీ ఉద్యోగిని

మరిన్ని ఐటీ కంపెనీలను నగరం ఆకర్షిస్తుంది 
ప్రస్తుతం హైదరాబాద్ ఐటీకి నిలయంగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక జాతీయ, బహుళ జాతీయ కార్పొరేట్ సంస్థలు నగరంలో విస్తరించాయి. వైఫై కనెక్టివిటీ నగరానికి అందుబాటులోకి తెస్తే ఐటీ ఇండస్ట్రీ కొత్త శోభను సంతరించుకోవడమే కాకుండా మరిన్ని ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా నగరం రికార్డు సష్టిస్తుంది. 
-మధురవాణి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి