గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 09, 2014

ఆరు నూరైనా అమలుచేస్తాం

-భయం అవసరంలేదని రైతులకు సీఎం కేసీఆర్ భరోసా
-ఎంతటి ఆర్థిక భారమైనా వెనుకకుపోమని స్పష్టీకరణ
-మంత్రి పొరపాటు వ్యాఖ్యలతో రైతుల్లో అనుమానాలు
-అవకాశవాదంతో పార్టీలు, మీడియా అనైతిక ప్రచారం
-రైతుల ఋణమాఫీకి మరో పదివేల కోట్లయినా వెనుకాడం
-బ్యాంకుల నుంచి కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయి
-అవన్నీ కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుంది
-ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
రైతుల రుణమాఫీపై ఎన్ని ఇబ్బందులున్నా ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలుచేసే తీరుతాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. ఎలాంటి అనుమానాలు అవసరం లేదు...ఇది కేసీఆర్ మాట...అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు గోతికాడ గుంటనక్కల్లాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాచుకుని కూర్చున్నాయని, రైతుల ఋణమాఫీ విషయంలో తెలిసో తెలియకో ఒక బాధ్యతాయుతమైన మంత్రి చేసిన పొరపాటు వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని రైతుల్లో గందరగోళం సృష్టించాయని ఆయన తప్పుబట్టారు. ఆర్థిక అంశంతో సంబంధం లేకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అక్షరాన్ని ఆచరణలో పెడతామని స్పష్టం చేశారు. రైతులు రాజకీయ పార్టీల అవకాశవాద కుట్రలో పడరాదని, ఆరునూరైనా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని తేల్చిచెప్పారు.
sheker
రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ మాట ఇస్తే వెనుకకు పోదని, రైతుల ఋణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా కూడా ఉద్దేశపూర్వకంగానే రైతుల్లో గందరగోళం సృష్టించిందని అన్నారు. ఇలాంటి వార్తలను ప్రసారం చేయడం ద్వారా ఆ మీడియా సంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, మెజారిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీడియా హుందాగా వ్యవహరించాలని కోరారు. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం వెనుక ఏ రాజకీయ పార్టీల కుట్ర ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం కాబట్టి ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలంటూ ఇప్పటికే తాను స్పష్టం చేశానని చెప్పారు. ఒక మంత్రి సమన్వయలోపంతో చేసిన వ్యాఖ్యపై నానాయాగి చేశారని, మీడియా గందరగోళం సృష్టించిందని అన్నారు. రైతులు ఎలాంటి గందరగోళానికి, ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

రైతుల ఋణమాఫీ పథకం అమలు కాదేమోనన్న అనుమానంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తల గురించి ప్రస్తావిస్తూ- ఆ ఇద్దరు రైతులు ఎందుకు చనిపోయారు, వారి మృతికి అసలైన కారణాలేమిటో ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వారం కూడా కాకముందే కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు వాటి అసహన బుద్ధిని, పక్షపాత ధోరణిని ప్రదర్శించాయని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌పై బురద చల్లాలనుకునే రాజకీయ పార్టీలు, మీడియా బండారం బైటపెట్టాలనే ఉద్దేశంతోనే తాను మౌనం పాటించానని, నాలుగు రోజుల్లోనే వాటి స్వభావం ప్రజల్లోకి వెళ్ళిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీల నైజం అర్థమైందని, మీడియా ఎలా గోరంతల్ని కొండంతలు చేసిందో అర్థం చేసుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ టీఆర్‌ఎస్ తన వాగ్దానానికి కట్టుబడే ఉందని అన్నారు. రైతుల ఋణమాఫీ అమలులోకి రావడానికి పది లేదా పదిహేను రోజుల సమయం పడుతుందని చెప్పారు. బ్యాంకుల నుంచి కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అవన్నీ కొలిక్కి రావడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని అన్నారు.

రైతుల ఋణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో ఇప్పటికే సమావేశం జరిగిందని, అయితే ఏ రైతులు ఏ బ్యాంకు నుంచి ఎంత ఋణం తీసుకున్నారు, ఆ విధంగా ఎన్ని బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకున్నారు తదితర గణాంకాల వివరాలేవీ ఈ బ్యాంకర్ల సమావేశంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందలేదని, ఈ వివరాలన్నీ సేకరించుకోడానికి బ్యాంకర్లకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. జాతీయ బ్యాంకులతో సహా సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు.. ఇలా అనేక బ్యాంకుల నుంచి రైతులు ఋణాలు తీసుకున్నారని, వీటి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం పరిశీలించి ఆర్థిక శాఖకు పంపి, అక్కడి నుంచి రిజర్వు బ్యాంకుకు పంపుతుందని, అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఋణమాఫీ అమలులోకి వస్తుందని కేసీఆర్ తెలిపారు. రిజర్వు బ్యాంకు నుంచి అనుమతి లేకుండా ఋణమాఫీ పథకం అమలులోకి రాదని, అందువల్ల ఈ పనులన్నీ పూర్తికావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఈ ఋణ మాఫీకి సంబంధించిన ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు భరిస్తుంది, ఆర్థిక వెసులుబాటు ఎలా ఉండాలి, రిజర్వు బ్యాంకు ఎలాంటి సూచనలు ఇస్తుంది తదితరాలన్నింటిపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. దీనికి తోడు ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ప్రధాన కార్యదర్శి, వివిధ మంత్రుల శాఖల కార్యాలయాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదని, చాలా కార్యాలయాల్లో ఐఏఎస్ అధికారులు మొదలు పూర్తిస్థాయిలో సిబ్బంది విధుల్లో లేరని, విభజన ప్రక్రియ పూర్తికానందువల్ల అనేక పనులపై దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపారు.

బ్యాంకర్ల సమావేశం ద్వారా పూర్తిస్థాయిలో గణాంక వివరాలు వచ్చిన తర్వాత రిజర్వు బ్యాంకు వరకూ వెళ్ళి తిరిగి రావడానికి కనీసంగా పది లేదా పదిహేను రోజులు పడుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహనంతో ఉండాలని కోరారు. కేసీఆర్‌పై ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదని, కేసీఆర్ ఒకసారి మాట ఇస్తే దాన్నుంచి వెనుకకుపోడన్న విషయాన్ని రైతులు గుర్తెరగాలని అన్నారు. రైతుల ఋణమాఫీకి సుమారు రూ. 8,000 కోట్ల నుంచి రూ. 12,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, అయితే ఇంకా అదనంగా 10,000 కోట్ల ఖర్చయినా ఈ పథకం అమలయ్యే తీరుతుందని స్పష్టం చేశారు. రెండు వారాల్లోగా ఈ పథకానికి సంబంధించి తుది ఉత్తర్వులు వెలువడతాయని అన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో లేనందువల్ల పనుల్లో జాప్యం జరుగుతున్నదని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీకి కూడా స్పష్టం చేశానని, ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ వివరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి