గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 28, 2014

నాగార్జున "ఎన్ కన్వెన్షన్ సెంటర్‌"కు నోటీసులు...!

-నేడు తంగడికుంట చెరువులో అధికారుల సర్వే
-అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల సీజ్
-గురుకుల్ ఖాళీ భూముల్లో సూచిక బోర్డులు
గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని తంగడికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌టీఎల్(ఫుల్‌ట్యాంక్ లెవల్)మార్కు చేసిన చెరువు పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు ఇతర నిర్మాణాలన్నింటిని అవసరమైతే కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇక నిబంధనలను అతిక్రమించినట్టు తేలితే ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా ఇప్పటి వరకు 300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేసినట్లు తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ భూముల సర్వేను శనివారం చేపట్టనున్నట్టు శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు కేటాయించిన స్థలం, ఎఫ్‌టీఎల్ ఆక్రమణ విషయాలను సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. 
center


అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా

గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్నవాటిని కూల్చివేసిన అధికారులు తాజాగా అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనం ద్, విద్యుత్ శాఖ సీఎండీ రిజ్వీ, వాటర్ వర్క్స్ ఎండీ జగదీష్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, రాజేంద్రనగర్ ఆర్‌డీవో సురేష్‌ల పర్యవేక్షణ లో అయ్యప్ప సొసైటీలోని 11 అక్రమ నిర్మాణాలను శుక్రవారం సీజ్ చేశారు. షణ్ముగ శ్రీనివాస్ (ప్లాట్ నంబర్ 83), చంద్రశేఖర్‌రెడ్డి (ప్లాట్ నంబర్ 535), వర్మ (ప్లాట్ నంబర్ 1214), రాధాకృష్ణ (1209), లక్ష్మీనారాయణ (800)లకు చెందిన భవనాలతోపాటు 1157, 525, 531, 536,817 నంబర్లు గల ప్లాట్లలోని నిర్మాణాలను, ఖానామెట్‌లోని గుట్ట కన్వెన్షన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. 

అయ్యప్ప సొసైటీలో నివాసం ఉండని అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ యాక్ట్ 461/ఎ సెక్షన్ ప్రకారం సీజ్ చేస్తున్నామని, నివాసం ఉంటున్న ఇళ్లను మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఖాళీ చేయించి వాటిని కూడా సీజ్ చేయిస్తామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఎర్ర రంగుతో మార్క్ చేసి ఎవరూ అమ్మడానికి, కొనడానికి వీలు లేకుండా చేస్తామన్నారు. భవనాలను సీజ్ చేసే సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశామని మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా మాట్లాడుతూ తెలిపారు. అయ్యప్ప సొసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ తాము సదరు భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదన్నారు. 

సూచిక బోర్డుల ఏర్పాటు

ఖాళీగా ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూముల్లో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్‌డీవో సురేష్, వాటర్ వర్క్స్ ఎండీ జగదీష్, శేరిలింగంపల్లి తహసీల్దార్ విద్యాసాగర్‌లు మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూములను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది సదరు భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందినవిగా సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఖానామెట్ అవధాన సరస్వతీ పీఠం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో, మీనాక్షి టవర్స్ ఎదుట, పక్కన, జయభేరి క్లబ్‌కు వెళ్లే దారిలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి