గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 22, 2014

డీజీపీ ఆఫీసులో సీమాంధ్ర కుట్రలు


-ఆంధ్రాకు తెలంగాణ సెక్షన్ అధికారులు
-డిప్యూటేషన్‌పై తెలంగాణకు ఆంధ్ర ఉద్యోగులు 
-వివాదాస్పద ఏవో నియామకంపై ఆందోళన
-తుంగలో కలిసిన విభజన మార్గదర్శకాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా డీజీపీ ఆఫీసులో సీమాంధ్ర కుట్రలు తగ్గడం లేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన అనేకమంది ఉద్యోగులకు అన్యాయంగా ఆంధ్రాకు బదిలీ చేసి.. అక్కడి ఉద్యోగులను అక్రమ పద్ధతుల్లో తెలంగాణకు రప్పించారు. ఫలితంగా డీజీపీ కార్యాలయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న పన్నాగాలకు తెర తీశారని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పోలీసు శాఖలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 58 : 42 ప్రకారం ఉద్యోగులు కేటాయింపులు జరిపారు. 

పోలీసు శాఖలో మరీ ముఖ్యంగా డీజీపీ ప్రధాన కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సెక్షన్ అధికారులు 65శాతం మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం చూస్తే 58 : 42 ప్రకారంగానే సెక్షన్ అధికారుల కేటాయింపు జరగాలి. అలాకాకుండా జూనియర్లందరినీ తెలంగాణ పోలీస్ శాఖకు అప్పగించి, సీనియర్లందరినీ ఆంధ్రాకు కేటాయించారు. వీరిలో తెలంగాణ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఆంధ్రకు వెళ్లిపోయారు. ఇది పూర్తిగా కక్షపూరితమేనని తెలంగాణ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. 

49మంది ఆంధ్రకు కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడగానే అన్ని విభాగాల్లోలాగానే పోలీస్ శాఖలోనూ మినిస్టీరియల్ స్టాఫ్ విభజనకు అప్పటి డీజీపీ ప్రసాదరావు 14మంది ఉద్యోగులతో ఓ కమిటీ వేశారు. ఇందులో ఓ ఆంధ్రా ఏవో విభజన మార్గదర్శకాలను తుంగలో తొక్కి సీమాంధ్ర పైత్యం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ఉద్యోగులను అన్యాయంగా ఆంధ్రాకు బదిలీ చేయడంతోపాటు రాష్ట్రపతి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణకు డిప్యూటేషన్‌పై రప్పించినట్లు విమర్శలు వస్తున్నాయి. కాగా, డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బందిలో సీనియర్లు అయిన ముగ్గురు సూపరింటెండెంట్లు, 10 మంది సీనియర్ అసిస్టెంట్లు, 15 మంది జూనియర్ అసిస్టెంట్లు, 21 మంది ఆఫీస్ సబార్డినేట్లను విభజనలో భాగంగా ఆంధ్రాకు కేటాయించారు. ఇలా మొత్తం 49 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు బదిలీ చేశారు. సీనియర్ ఉద్యోగులెవరూ లేకపోవడంతో తెలంగాణ పోలీసు శాఖ అనేక అవస్థలు పడాల్సి వస్తున్నది. తెలంగాణకు కేటాయించిన వారిలో 85శాతం మంది జూనియర్లే కావడంతో ఏ విభాగంలోనూ ఒక్క ఫైలు ముందుకు సాగడంలేదు. 

ఆదినుంచి వివాదాస్పదుడే..
విభజన కమిటీలో చక్రం తిప్పినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఆంధ్రా ఏవోపై గతంలోనూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్వయంగా డీజీపీలే చర్యలకు సిఫారసు చేసినా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేసిన ఈ అధికారి 11 మంది పోలీస్ కానిస్టేబుళ్ల ఒరిజినల్ సర్టిఫికెట్లు పోగొట్టడంతో వారు ఎస్‌ఐ ఉద్యోగాలకు దూరమయ్యారు. అంతేకాకుండా మరో 26మంది పోలీస్ సిబ్బందిని లంచాల కోసం వేధించడం, వారి సర్వీస్ విషయాల్లో నిర్లక్ష్యంగా రికార్డులు రూపొందించారన్న ఆరోపణలపై ఇతడిపై చార్జిమెమోలతోపాటు, కఠిన చర్యలు తీసుకోవాలని సైతం నాటి డీజీపీ ప్రసాదరావు ఆదేశించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో పలువురు పోలీసు పెద్దలు ఇతడిని ఆ ప్రమాదం నుండి తప్పించారు. అంతటితో ఆగకుండా ఈ ఏవో ఇప్పుడు తెలంగాణ పోలీస్ శాఖలో పాగా వేశారు. పైగా కీలకమైన విభాగానికి అధిపతిగా కూర్చున్నారు. ఫలితంగానే తెలంగాణ ఉద్యోగులు అన్యాయంగా ఆంధ్రాకు బదిలీ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన డీజీపీ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ బీఎన్ దుర్గాప్రసాద్‌ను ఆంధ్రాకు కేటాయించడంలోనూ సదరు ఏవో పాత్ర ఉందనే విమర్శలు ఉన్నాయి. 

డీజీపీ అనురాగ్ శర్మకు వినతి...
తెలంగాణ ఉద్యోగులైన తమను ఆంధ్రాకు కేటాయించడం అన్యాయమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ డీజీపీ కార్యాలయం సిబ్బంది అనురాగ్ శర్మకు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రకు వెళ్లిన తమను వెనక్కి తీసుకువచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణ పోలీస్ రీ ఆర్గనైజేషన్ సెల్ ద్వారా తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆంధ్ర ఏవోపై కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలో డీజీపీ ప్రసాదరావు ఆదేశించిన చర్యలను అమలు చేయాలని, ఏవోను ఆంధ్రకు పంపాలని డిమాండ్ చేశారు. 

డిప్యూటేషన్‍పై ఆరుగురు తెలంగాణకు..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఆంధ్రకు కేటాయించడంలో కీలక పాత్ర పోషించిన సదరు ఏవో రాష్ట్రపతి నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులైన ఆరుగురు ఆంధ్రా సెక్షన్ అధికారులను డీజీపీ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై తీసుకువచ్చారు. కేవలం జోన్లలో పనిచేయాల్సిన ఈ అధికారులను రాష్ట్ర క్యాడర్ పోస్టుల్లో డిప్యూటేషన్‌పై తీసుకురావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య వైరం పెట్టేలా ఈ ఆరుగురిని ఏవో నియమించారని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సీనియర్ అధికారుల అవసరం ఉన్నప్పుడు.. ఆంధ్రకు కేటాయించిన తెలంగాణ సీనియర్ సెక్షన్ అధికారులను వెనక్కి తెచ్చుకుంటే సరిపోతుంది. కానీ, నిబంధనలకు విరుద్ధంగా సదరు ఏవో బయటి జిల్లాల నుంచి ఆంధ్రా సెక్షన్ అధికారులను డీజీపీ కార్యాలయానికి తెప్పించారు. ఇలాంటి కుట్రపూరితుడైన ఆంధ్రా ఏవో వ్యవహారంపై సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి