గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 30, 2014

పక్కా గోల్‌మాల్...!

-ఇండ్లు మాయ.. 
-కోట్లు మాయం.. 
-లెక్కతేలని లక్షల ఇండ్ల కథ
-కోట్లు ఖర్చయినా పేదలకు దక్కని ఇండ్లు
-అక్రమార్కుల జేబుల్లోకి రూ.3800 కోట్లు 
-593 గ్రామాల్లోనే రూ.236 కోట్ల అవినీతి
-ప్రభుత్వ విచారణలో బయటపడ్డ నిజాలు
-సోషల్ ఆడిట్‌లోనూ వెల్లడైన అవినీతి
-అక్రమాలను అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం కేసీఆర్

-రాష్ట్రంలో 84.20 లక్షల కుటుంబాలు
-పక్కా ఇండ్లున్న కుటుంబాలు 57లక్షలు
-శిధిలావస్థలో ఉన్నవి 3.37 లక్షలు
-సర్కారు కట్టింది 55 లక్షలు
-కట్టాల్సినవి మరో 10 లక్షలు
-పిలిస్తే.. మరో 25 లక్షల దరఖాస్తులు రెడీ

-నిజమైన లబ్ధిదారులకే ఇండ్లు చేరాలి
-లబ్ధిదారుల ఎంపికకు కఠిన నిబంధనలు తేవాలి
-అసలైన పేదలకే ఇండ్లు దక్కాలి
-తెలంగాణ ప్రజల ఆకాంక్ష
Indiramma-House


రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల ఇండ్ల నిర్మాణ పథకం కరిమింగిన వెలగపండైంది. అధికారులు, రాజకీయనాయకులు అందినకాడికి దోచుకుని నిరుపేదను గాలికీ, ధూళికీ వదిలేశారు. కాగితాల మీదే ఇండ్లు కట్టి, పాత ఇండ్లకు రంగులు వేసి, ఉన్న వాళ్లే మళ్లీ మంజూరు చేయించుకుని అక్షరాలా రూ. 3,800 కోట్ల పేదల సొమ్ము దోచుకున్నారు. గూడు కావాలనుకున్న పేదలను అపహాస్యం చేశారు. మళ్లీ మంజూరు చేసే ఇండ్ల కోసం అర్రులు చాస్తున్నారు. ఈ తరుణంలో స్వరాష్ట్రంలో సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న అసలైన నిరుపేదలకు లబ్ధి చేకూరాలంటే ప్రభుత్వం అప్రమత్తం కావాల్సి ఉంది.. సర్కారు సొమ్ము ప్రతి పైసా అర్హులైన పేదలకు చేరాలంటే ఎంపిక విధానాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది.

ఏ ఒక్క నిరుపేదా అన్యాయానికి గురికాకుండా చూడడంతోపాటు ఎట్టి పరిస్థితిలోనూ అనర్హులకు లబ్ధి చేకూరకుండా వెయ్యికండ్లతో కనిపెట్టాల్సి ఉంది. దేశమంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్ఠాత్మక రెండు పడక గదుల ఇండ్ల పథకం చేపట్టబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంతోపాటు అర్హులైన.. అసలైన పేదలకే అందించిన ఖ్యాతిని సైతం ఆర్జించాలన్నదే సకల తెలంగాణ జనుల ఆకాంక్ష!
పేదల ఇండ్ల నిర్మాణంలో అవినీతి ఏరులై పారి దాదాపు రూ. 3,800 కోట్ల పేదల సొమ్ము అడ్డదారుల్లో అవినీతిపరుల చేతుల్లోకి చేరింది. ప్రభుత్వం అక్కడక్కడా నిర్వహించిన విచారణలోనే రూ.236.90 కోట్ల అవినీతి బయటపడింది. ఈ అవినీతిని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. దీనిని అరికట్టడానికి కలిసికట్టుగా ముందుగా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్మించిన 55 లక్షల ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు చేరి ఉంటే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలే ఉండేవారు కాదని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై పేదలకు చేరాల్సిన పథకాలను మధ్యలోనే బొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గహనిర్మాణ శాఖ ర్యాండమ్‌గా చేపట్టిన అంతర్గత విచారణలో వెలుగుచూసిన వాస్తవాలను ఆయన ప్రస్తావించారు. ఆ విచారణ నివేదిక నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది. అందులో పేర్కొన్న వివరాలు..

అంతా మాయ..: ఇండ్ల నిర్మాణ పథకం అమలులోకి వచ్చిన రెండున్నర దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో 55 లక్షల ఇండ్లు నిర్మించారు. ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు చేరిఉంటే రాష్ట్రంలో ఇండ్లులేని పేదలే ఉండకూడదు. కానీ అంతా తలకిందుల కథ! ఇండ్లు కావాలని కోరుతూ 10.08 లక్షల మంది పేదలు పెట్టుకున్న దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సొంత ఇండ్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తే కనీసం 25 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో చూసినా రాష్ట్రంలోని ఇప్పటికీ ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో ఇండ్లు లేని పేదలు భారీ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాద్ నగరపు మురికివాడల్లో సొంత ఇండ్లు లేక మగ్గుతున్న వారు భారీగా ఉన్నారు. మరోవైపు 2011 జనాభా లెక్కలను పరిశీలిస్తే రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. జనాభా లెక్కల హౌజ్ హోల్డ్ సర్వేలో రాష్ట్రంలో మొత్తం 84,20,662 కుటుంబాలున్నాయి.

ఇందులో మంచి ఇండ్లు ఉండి ప్రభుత్వ ఇండ్లు అవసరం లేని కుటుంబాలు 57,05,102 లక్షల దాకా ఉన్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా నివాసానికి అనుకూలంగానే ఉన్న ఇండ్లు మరో 23,77,962 ఉన్నాయి. కేవలం 3,37,598 ఇళ్లు మాత్రమే శిధిలావస్థలో ఉన్నాయి. ఇది వాస్తవం కాగా ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం 55 లక్షల ఇళ్లను నిర్మించింది. ఒక అంచనా ప్రకారం పాతకాలంలో నిర్మించిన 10 లక్షల సెమి ఇళ్లను మళ్లీ నిర్మించారని అనుకున్నా ప్రభుత్వం కొత్తగా నిర్మించిన ఇండ్ల సంఖ్య 45 లక్షలు. 

ఇప్పటికే ఉన్నవాటికి ప్రభుత్వం నిర్మించినవి కలిపితే రాష్ట్రంలో ఇండ్లు లేని వారే ఉండకూడదు. కానీ ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద 10.08 లక్షల కొత్త ఇండ్లు మంజూరై ఉన్నాయి. వాటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు దరఖాస్తులు పిలిస్తే మళ్లీ పది లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా. అంటే లక్షలకు లక్షల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఇండ్లు లేని వారు తగ్గడం లేదు. మరి నిర్మించిన పక్కానిర్మాణాలు ఎటుపోతున్నాయి. ఆ నిధులన్నీ ఏమయ్యాయన్నదే అసలు ప్రశ్న..

విచారణలో బయటపడ్డ రూ. 235.90 కోట్ల అవినీతి..

రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణంపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో వివిధ జిల్లాలో 593 గ్రామాలలో విచారణ జరిపారు. అక్కడక్కడా శాంపిల్‌గా ఎంపిక చేసిన 593 గ్రామాలలో జరిగిన విచారణలో రూ.236.90 కోట్ల అవినీతి జరిగిందని బయటపడింది. పై నుంచి కింది వరకు అన్ని స్థాయిల అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్పష్టమైంది. ఈ 593 గ్రామాలలో 90,123 ఇండ్లను నిర్మించకుండానే నిర్మించామని చెప్పి డబ్బులు డ్రా చేశారని, 1.04,601 ఇండ్లను అనర్హులకు ఇచ్చారని విచారణలో తేలింది.

ఈ ఇళ్ల నిర్మాణంలో రూ.235.90 కోట్లు అవినీతి జరిందని నిర్థారించి రికవరీ చట్టం కింద వసూలు చేయాలని నోటిస్ ఇచ్చారు. ఇందులో రూ.2.87 కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు చూపించారు. ఈ అవినీతిలో కార్పొరేషన్ రెగ్యులర్ అధికారులు 371, ఎంహెచ్‌ఓ, ఎంపీడీఓ, ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఎఇలతో పాటు ఇతర అధికారులు 43 మంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 94 మంది ఉన్నారు. వీరు కాకుండా రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు 294 మంది తేలారు. ఈ మొత్తం వ్యవహారంలో 179 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో 85 మంది అధికారులు, 94 మంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లున్నారు. 

ప్రభుత్వం 150 మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 68 మంది మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ రకమైన విచారణ అన్ని గ్రామాలలో జరపాలని భావించినా అప్పటి సర్కారు ఒత్తిళ్లకు తలొగ్గి విచారణను నిలిపి వేసింది. దీంతో అనేక మంది అక్రమార్కులు తప్పించుకు తిరుగుతున్నారు. కేవలం 593 గ్రామాలలో విచారణ జరిపితేనే రూ.237 కోట్ల అవినీతి జరిగినట్లు తేలితే మొత్తం రాష్ట్రంలోని 9 వేల గ్రామ పంచాయతీలో విచారణ జరిపితే కనీసం రూ.3800 కోట్ల మేర అవినీతి బయటకు వచ్చి ఉండేదని ఒక సీనియర్ అధికారి అన్నారు. 

సోషల్ ఆడిట్‌లోనూ బట్టబయలైన అవినీతి

వరంగల్ జిల్లాలో పరకాల మండలం వర్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సామాజిక సర్వే రిపోర్టును పరిశీలిస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ కోరిక మేరకు సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబులిటీ అండ్ ట్రాన్సఫరెన్సీ(ఎస్‌ఎస్‌ఏఏటి) బందం 2013 డిసెంబర్ 9 నుంచి 15 వ తేదీ వరకు గ్రామంలో సోషల్ ఆడిట్ నిర్వహించింది. హౌసింగ్ కార్పొరేషన్ 952 పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రుణం, సబ్సిడీ రూపంలో 2006-07లో రూ.3,09,37,874 మంజూరు చేసింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణం చేశారు.

దీనిని పరిశీలించిన సొషల్ అడిట్ బందం రూ.1,32,48,123 అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఈ గ్రామంలో 952 పక్కా ఇండ్లు నిర్మిస్తే 500 ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. 105 పాత ఇండ్లకు రూ.42,02,406లు చెల్లించారు. 69 ఇండ్లు అసలు ఉనికిలోనే లేవు. వాటికి రూ.22,20,035 చెల్లించారు. 

regప్రభుత్వం లేదా రాజకీయ నాయకుల మద్దతుతో ఐదు ఇండ్ల లబ్దిదారులకు రూ.22,500 అక్రమంగా చెల్లించారు. 9 ఇండ్ల లబ్దిదారులకు పూర్తి స్థాయిలో 1,20,607 రూపాయలు చెల్లించినా నయాపైసా కూడా నిజమైన లబ్దిదారుల చేతికి చేరలేదు. 13 మంది లబ్దిదారులకు పూర్తి స్థాయిలో రూ.3,25,700 చెల్లించినా వారు కనీసం పునాది కూడా తీయలేదు. 89 ఇళ్లకు పూర్తి మొత్తం రూ.21,03,756 చెల్లిస్తే సగం మాత్రమే నిర్మాణం చేశారు.

నాలుగు ఇళ్లకు రూ.21,760 ఇచ్చినా సిమెంట్, మెటీరియల్ ఇవ్వలేదు. 106 మంది లబ్దిదారులకు రూ.30,90,839 నిధులు పూర్తి స్థాయిలో చెల్లించారు. కానీ రేషన్ కార్డులు ఎక్కడా మ్యాచ్ కాలేదు. రూ.8,71,670లు ఇంటి నిర్మాణం కోసం సర్కారు నుంచి నిధులు తీసుకున్న 40 మంది లబ్దిదారులను పరిశీలిస్తే ఒకే రేషన్ కార్డు మీద ఎక్కువ ఇండ్లు తీసుకున్న వారున్నారు.

45 ఇండ్లకు టాయ్‌లెట్ల పేరిట రూ.1,55,980 ఇస్తే ఒక్క టాయ్‌లెట్ కూడా నిర్మించలేదు. 11 మంది లబ్దిదారులకు సొంత ఇండ్లు ఉన్నా ప్రభుత్వ నిధులతో మళ్లీ ఇండ్లు నిర్మించుకొని వాటిని అద్దెకిచ్చుకున్నారు. ఇందిరమ్మ నిధులు రూ.1,12,870 లతో ఇండ్లు నిర్మించుకున్న నలుగురు లబ్దిదారులు వాటిని అమ్ముకున్నారు. కొన్ని ఇండ్లు నిజమైన లబ్దిదారులకు చేరలేదు. ఇండ్ల మంజూరు తతంగంలో రాజకీయ నాయకులు, పైరవీ కారులు భారీగా సంపాదించుకున్నారని ఈ సోషల్ సర్వేలో బయటపడింది.
people
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి