గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 04, 2014

రవాణాశాఖలో తెలంగాణ ఉద్యోగులపై కుట్రలు

తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయంలో సీమాంధ్రుల కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంత కాలం తెలంగాణ ఉద్యోగులపై, తెలంగాణ వాదులపై కొనసాగించిన ఆధిపత్యాన్ని కోల్పోతున్నామనే అక్కసుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రవాణాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆవిర్భావ దినోత్సవ సంబరాలను నిర్వహించిన అనంతరం సీమాంధ్రకు కేటాయించిన వారు విధులకు హాజరు కావడానికి వెళ్లడంతో అసలు లొల్లి ప్రారంభమైంది. రిజిస్టర్‌లో సంతకం చేయడానికి తెలంగాణకు చెందిన ఉదయ్‌కుమార్ వెళ్లగా సీమాంధ్రకు చెందిన రాంమోహన్‌రావు రిజిష్టర్‌ను తీసి ఉదయ్‌కుమార్ ముఖంపైకి విసిరేయడంతో అతనికి స్వల్ప గాయమైంది. ఈ విషయమై అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇది జరుగుతుండగానే తెలంగాణ ఉత్సవాలను చూసి తట్టుకోలేని సీమాంధ్ర అధికారిణి ప్రమీల తెలంగాణకు చెందిన బుల్లెమ్మపై విరుచుకపడ్డారు. అనవసరంగా బుల్లెమ్మను తిట్టడంతో తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీమాంధ్రకు కేటాయించిన తమకు అక్కడ పని చేయడానికి రక్షణ లేదని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

రవాణాశాఖలో ఉద్యోగుల విభజననే కుట్ర పూరితంగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగులను అడిషనల్ టీసీ, కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పని చేయాలని నిర్ణయం చేస్తూ తప్పుడు నివేదికలను తయారు చేశారని ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాకుండా, సకల జనుల సమ్మె సమయంలో విధులకు హాజరై గొడవకు కారకులైన మణికుమార్ అనే ఉద్యోగిని తెలంగాణకు కేటాయించి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రవీందర్ అనే ఉద్యోగిని ఆంధ్రప్రాంతానికి తరలించారు. ఈ విషయం ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే మణికుమార్ తెలంగాణకు చెందిన వాడని, అతని చదువు హైదరాబాద్‌లో సాగిందని తెలిపారు. మణికుమార్ సీమాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన విషయం రవాణాశాఖ ఉన్నతాధికారులకు తెలిపినప్పటికీ అతన్ని తెలంగాణకు వేసి, తెలంగాణ వారిని సీమాంధ్రకు వేయడంలో మతలబేమిటని తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను తెలంగాణకు పంపిస్తూ, జూనియర్లను సీమాంధ్రలో ఉంచుతున్నామని అధికారులు చెబుతుండడం శోచనీయం.

అయితే ముందు నుంచి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిగా ముద్రపడ్డ సీమాంధ్ర ఉన్నతాధికారి కక్ష పూరితంగానే రవీందర్‌ను సీమాంధ్ర ప్రభుత్వానికి పంపించారనే విమర్శలు ఉన్నాయి. గతంలో అతనిపై చర్యలకు ఉపక్రమించిన సమయంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం ప్రతినిధులు అడ్డుకోవడంతో అధికారులు వెనుకడుగు వేశారు. అయితే సీమాంధ్ర ప్రభుత్వంలో అతనిపై ఏ చర్యలు తీసుకున్నా ప్రశ్నించడానికి ప్రజా ప్రతినిధులుగానీ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉండరని, ఉద్యమంలో పాల్గొన్నందులకు అతన్ని వేధించాలనే ఉద్దేశంతోనే తెలంగాణకు చెందిన రవీందర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి పంపించారు. తెలంగాణ ఏర్పడిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే కావాలని సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇలా ప్రవర్తిస్తే తాము పని చేయలేమని తేల్చి చెబుతున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి