గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 06, 2014

ఆర్డినెన్స్ రద్దు చేయాల్సిందే...

-ముంపును తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్
-కూనవరంలో కొనసాగుతున్న ఆమరణ దీక్షలు
-7న ముంపు మండలాల సరిహద్దుల దిగ్బంధం
-పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ హెచ్చరిక
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమయ్యారు. ముంపు మండలాలను తెలంగాణలో కొనసాగిస్తామని ప్రకటన చేసేవరకు ఉద్యమాలు కొనసాగుతాయని స్థానిక అఖిలపక్ష నేతలు, ప్రజాసంఘాలు, ఆదివాసీలు తేల్చిచెబుతున్నాయి. కూనవరంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నా యి. ఈనెల 7న ముంపు ప్రాంతాల సరిహద్దుల దిగ్బంధం చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ నాయకులు గుండు శరత్, ముర్ల రమేశ్, వట్టం నారాయణలు హెచ్చరించారు. ఈ పోరాటం కడదాకా ఉంటేనే ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆదివాసీల ఉనికిని కాపాడే బాధ్యత అన్ని ప్రభుత్వాలకు ఉందని, ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ordinence
పోలవరం పేరుతో తమను ముంచవద్దని, ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలుచోట్ల ఆదివాసీలు ఆందోళనలు నిర్వహించారు. కూనవరం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీలు, ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలో పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.

టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొట్టాబత్తుల శ్రీనివాస్, రైతు నాయకుడు కొవ్వూరి శివయాదవ్ ఈ దీక్ష తలపెట్టగా పలువురు నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు తిప్పన సిద్దులు మాట్లాడుతూ ముంపు మండలాలను తెలంగాణలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చి ముంపు ప్రభావాన్ని తగ్గించాలని కోరారు. మద్దతుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు నర్సింహమూర్తి, రిటైర్డ్ ఉద్యోగి జలీన్ శిబిరంలో దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో సూర్యచందర్‌రావు, సీతారామయ్య, సాయిబాబు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి