గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 28, 2014

ల్యాంకోహిల్స్‌ భూములపై సుప్రీంకు..

-గత ప్రభుత్వ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటాం..
-వక్ఫ్ ఆస్తుల రక్షణకు కఠిన చర్యలు
-కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాలె..
-ఏపీ వక్ఫ్‌బోర్డును తెలంగాణ వక్ఫ్ యాక్ట్‌గా మార్పు
-వక్ఫ్ భూముల రక్షణ బాధ్యత తహసీల్దార్లకు..
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
-వక్ఫ్ భూములపై మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష
హైదరాబాద్ శివారు ప్రాంతం మణికొండలోని వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో హిల్స్‌కు కేటాయించటంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వక్ఫ్ భూములను ఇతరులకు విక్రయించటం చట్టవిరుద్ధమని, ఆ భూములు ల్యాంకో సంస్థకు ఇవ్వకూడదని రాష్ట్ర హైకోర్టు అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ అక్రమంగా దోచిపెట్టారని విమర్శించారు. కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రభుత్వమే దళారిగా మారి అవి వక్ఫ్ భూములు కావంటూ సుప్రీంకోర్టులో కేసు వేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం ల్యాంకో హిల్స్‌కు అప్పగించిందన్నారు. గత ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన కేసును టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, లాంకోహిల్స్‌కు ఇచ్చినవి వక్ఫ్ భూములేనని మరో కేసు వేస్తామని వెల్లడించారు.

hariraoశుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి వక్ఫ్ భూములపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌తో పాటు, 46 మండలాల తహసీల్దార్లు, మైనార్టీ మత పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. గురుకుల్ ట్రస్ట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూములను గజం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న వక్ఫ్ భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని, భూములు ఆక్రమించిన వారు ఎంతటి వారైన వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల జోలికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టాలని, మరొకరు తప్పు చేయకుండా ఉండాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. కబ్జాదారులు ఇంటిదొంగలైనా, ఇతరులైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు.

80శాతం వక్ఫ్ భూములు ఆక్రమణలోనే..

రాష్ట్రంలో వేల ఎకరాల వక్ఫ్ భూములున్నప్పటికీ వాటి ద్వారా ముస్లింలకు ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 77వేల ఎకరాలకు పైగా వక్ఫ్ భూములుండగా, మెదక్ జిల్లాలోనే అత్యధికంగా 35వేల ఎకరాల భూమి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ఇందులో 80 శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని, కొన్ని చోట్ల వక్ఫ్ భూముల్లో భారీ నిర్మాణాలు కూడా వెలిశాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వక్ఫ్ భూములను అమ్మడం, కొనడం కుదరదని, అయినప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అన్నారు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డును తెలంగాణ వక్ఫ్‌యాక్ట్‌గా మార్చనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ఈ యాక్ట్‌లో రాష్ట్ర శాసనసభ ఆమోదంలో పలు సవరణలు చేస్తామని చెప్పారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ తహసీల్దార్లకు..

వక్ఫ్ ఆస్తులను ప్రస్తుతం ముతవలీలు పరిరక్షిస్తున్నారని, చట్టంలో సవరణ ద్వారా దేవాదాయ, రెవెన్యూ భూములను పరిరక్షిస్తున్న తహసీల్దార్లకే వక్ఫ్ భూముల పరిరక్షణ బాధ్యత కూడా అప్పగిస్తామని హరీశ్‌రావు తెలిపారు. భూములను కంప్యూటరీకరణ చేయటంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల విద్య, వైద్యం, ఇతర అభివృద్ధి కోసమే వినియోగిస్తామన్నారు. వక్ఫ్ భూముల రక్షణపై గత ప్రభుత్వాలు కనీసం అధికారులతో సమావేశం నిర్వహించిన దాఖలాలు కూడా లేవన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుం కట్టిందని, మెదక్ జిల్లా నుంచే అందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రెవెన్యూ అధికారులకు పోలీసుశాఖ వెన్నంటే ఉంటుందని, అధికారులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. భూముల స్వాధీనంపై ప్రతినెలా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ చర్యలు హర్షణీయం: వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్ హమీద్

వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనది వాస్తవమేనని వక్ఫ్‌బోర్డు సీఈవో అబ్దుల్ హమీద్ తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా భూముల ఆక్రమణను అడ్డుకోలేకపోతున్నామని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ముందుకు రావటం హర్షణీయమని, ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రికార్డుల్లో ఉన్న భూములను పరిశీలించి, ఆక్రమణకు గురైనట్లు తేలితే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్, ఆర్డీవోలు, తహసీల్దార్ల కోరారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పర్యటనలో భాగంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి