గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 27, 2014

కబ్జా రాయుళ్ళ దాహానికి చెరువులు కూడా గాయబ్!

-ఒకప్పుడు వెయ్యి చెరువులతో కళ కళలాడిన రాజధాని..
-వ్యవసాయానికి నీరందించిన పట్నం నీటి వనరులు
-మచ్చుకైనా కనిపించని నాటి వైభవం.. ప్రతి చెరువూ కబ్జా ..
-పేరుకే మిగిలిన బతుకమ్మకుంట, నాగమయ్య కుంట..
-పాతాళానికి భూగర్భ జలాలు.. నదీ జలాలే దిక్కు..
-పునర్నిర్మాణంతోనే నగరానికి తప్పనున్న ముప్పు
చార్‌సౌ సాల్ కా షహర్ హైదరాబాద్.. ఒకప్పుడు తాగునీటి కోసం అల్లాడలేదు! అలనాడు భాగ్యనగరం వేయి సరస్సులకు నిలయం. తాగడానికి నీళ్లుకాదు.. పంట పొలాలకు నీళ్లిచ్చిందీ తెలంగాణ గుండెకాయ! హుస్సేన్‌సాగర్‌లో పడవలు తిరిగాయి..కానీ ఇప్పడు నదీంకాలనీ బోటింగ్ స్పాట్‌గా మారింది! ఇప్పటిలా వానొస్తే రోడ్లన్నీ నదులను తలపించలేదు! బండిపై పోతున్న మహిళ ఉన్నట్టుండి మ్యాన్‌హోల్‌లో పడి మతిచెందిన దాఖలాలు ఒకప్పడు లేవు! నాలుగు వందల ఏళ్ల కిందటే నిజాం పాలకులు రాజధానిని పద్ధతి ప్రకారం అభివద్ధి చేశారు. హైదరాబాద్ దినదినాభివద్ధి చెందుతుందన్న ముందుచూపుతో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. కనీస సౌకర్యమైన తాగునీటికి ఇబ్బందు లు రావొద్దనే ఉద్దేశంతో నగరం చుట్టూ సరస్సులు తవ్వించారు.

madhapur
ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెరువులు, కుంటలతో మంచి నీటివసతి కల్పించడమే కాకుండా, వ్యవసాయానికి కూడా నీరందించారు. నిజాంకాలంలో నగరం చుట్టూ దాదాపు నాలుగు వేల చెరువులు, కుంటలుండేవి. ఆనాడు నగరంలో ఉన్న వేలాది నీటి వనరులు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఫలితంగానే వానొస్తే వణుకు! లోతట్టు ప్రాంతాలు జలమయం! ఎండాకాలమైతే గింత గాలి రాదు. చెట్టు చేమా మాయమైంది. అభివద్ధి ముసుగులో చెరువులను కబ్జాచేసి కోట్లు కూడబెట్టుకున్న వలస పాలకుల ఉక్కుపాదాల కింద నగరం అస్తిత్వాన్ని కోల్పోయింది. సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో చెరువు లు, కుంటలు పునరుద్ధరిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తునా ప్రస్తుతం నాటి చెరువుల ఆనవాళ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు!

గతమెంతో ఘనం

ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో 1996లో పరిశీలించగా రాజధానిలో 1004 చెరువులు, కుంటలు ఉన్నట్లు తేలింది. 2000 సంవత్సరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 169 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చా రు. నగరం నడిబొడ్డున ఉన్న నాగమయ్య, పటేల్, బతుకమ్మకుంటలు బస్తీలుగా మారాయి. లింగంపల్లి చెరువు సుందరయ్య పార్కుగా మారింది. యూసుఫ్‌గూడ చెరువు కబ్జాకు గురై కాలనీలుగా, కొంత కష్ణకాంత్ పార్కుగా మారింది. ఎల్లారెడ్డిగూడ చెరువుకు ఆనవాళ్లు కూడా లేవు. శివార్లల్లోనూ అదే దుస్థితి. దాదాపు రెండు వేల చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

అల్వాల్‌లోని కొత్తచెరువు, చిన్నరాయుని చెరువు, బోయిన చెరువు, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మియాపూర్, కాప్రా చెరువు, నల్లచెరువు, పెద్ద చెరువు, రంగదామిని చెరువు, కూకట్‌పల్లిలోని మైసమ్మచెరువు, అంబర్ చెరువు, పటేల్ చెరువు, గోపిచెరువు, దుర్గం చెరువు.. ఇలా వం దల సంఖ్యలో అక్రమార్కుల కబంధహస్తాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మియాపూర్‌లోని గంగారం చెరువులో సినిమా థియేటర్లే ఏర్పాటయ్యాయన్న ఆరోపణలున్నా యి. కాప్రా చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేసుకున్నారు. సమైక్యరాష్ట్రంలో నగరం చుట్టు ఉన్న విలువైన చెరువులు, కుంటలను కబ్జాలు చేసి కబ్జాదారులు కోట్లు గడిస్తే, వాటిని నమ్ముకుని బతికిన రైతులు చిరునామా లేకుండాపోయారు.

పేరుకే కుంటలు..

ఉన్నవన్నీ ఇళ్లే: నగరంలో వందల్లో ఉన్న చెరువులు సగానికిపైగా ఉనికి కోల్పోయాయి.రూపురేఖల్లేకుండా బడా బాబులు రాజకీయ అండదండలతో కబ్జాచేసినా పట్టించుకోవడం లేదనడానికి అధికారుల లెక్కలే నిదర్శనం. హైదరాబాద్ జిల్లా పరిధిలో చెరువులను కబ్జా చేస్తున్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తర్వాత సర్వే చేసి అన్యాక్రాంతమయ్యాయంటూ చర్యలకు పూనుకున్నారు. అప్పటికే కబ్జాకోరులు, బడాబాబులు కోర్టుకెక్కి స్టే తెచ్చుకున్నారు. ఆక్రమిత స్థలాలు చెరువు పరిధిలోనిదేనని తెలిసినా కోర్టుకెళ్లి కాలయాపన చేస్తున్నారని రెవెన్యూ యంత్రాం గం అంటోంది. ఇప్పటికైనా అధికారులు ఉదాసీనంగా వ్యవహ రిస్తే కబ్జాకోరుల సొంతమవడం ఖాయం. అన్యాక్రాంతమైన చెరు వు విస్తీర్ణం వందల ఎకరాల్లోనే ఉంటుందని అంచనా. బతుక మ్మకుంట ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు, చెరువు, కుంట ఏదీ కనిపించదు.

list
ఇప్పుడక్కడ ఉన్నవన్నీ ఇళ్ల్లే. అఫ్జల్‌సాగర్, ఖాదర్‌బాగ్‌కుంట, సూరారం చెరువు, శల్కంచెరువు, ఎర్రకుంట, అంబర్‌చెరువుల పరిస్థితి అంతే! ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ఈ చెరువులపై ఏళ్ల క్రితమే పెద్దల అండదండలున్న వ్యక్తులు కబ్జాచేశారు. నగరంలో చెరువులు ఉంటేనే భూగర్భ జలాలు సమద్ధిగా లభిస్తాయి. మహానగరంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. సరూర్‌నగర్ చెరువు విస్తీర్ణం 1229.36 ఎకరాలు. దానికి రెండు కిలోమీటర్ల దూరంలోని నిర్మలానగర్‌లో 540 అడుగుల లోతుకు బోరు వేస్తేగానీ తడి కనిపించలేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. చెరువులను కాపాడుకుంటేనే భవిష్యత్‌లో కనీసం నీళ్లు దొరుకుతాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల మాదిరిగానే చెరువు అక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుని తిరిగి సరస్సులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకుంటే బోరుబావులను మరిచిపోవాల్సిందే. కష్ణా, గోదావరి నీటిపైనే నగరం మొత్తం ఆధారపడితే పదిహేనురోజులకోసారి పది బిందెలు కూడా దక్కే పరిస్థితి ఉం డదు. ఐటీఐఆర్ ఏర్పాటుతో వచ్చే పాతికేళ్లలో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోతుంది. ప్రపంచ చిత్ర పటంలో రాష్ట్ర రాజధాని ప్రముఖస్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ ఆ గొప్ప వెంటనే భయంకరమైన నీటికొరత ప్రమాదం పొంచి ఉంది.

అడుగడుగునా కబ్జాలే:

వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన భాగ్యనరగంలో బతుకులకు భరోసా లేకుండా పోయింది. ము మ్మాటికీ చెరువులను కబ్జా చేసిన ఫలితమే ఇది. వర్షమొస్తే కాలు బయట పెట్టలేనిదుస్థితి. ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగొచ్చే వరకు నమ్మకం లేదు. కాస్త వర్షానికే జలమయమయ్యే రోడ్లు, పొంగిపొర్లే నాలాలు. అంతుచిక్కని మ్యాన్‌హోళ్లు.. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు మాయమవడంతో నీరు పోయే దారిలేకే ఈ తిప్పలు. చెరువులు లేక ఆలస్యంగానైనా మురికి కాల్వల గుండా నీరంతా వెళ్లిపోతోంది. దీంతో వర్షం కురిసినా భూగ ర్భ జలాలు వద్ధి చెందే అవకాశమే లేకుండా పోతోంది. అవినీతి అధికారులు, రాజకీయ అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆడిన నాటకానికి సహజ వనరులన్నీ విధ్వంసానికి గురయ్యాయి. వందల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. పాలకులు రూపొందించిన నిబంధనలను, ఉత్తర్వులను, చట్టాలను తుంగలో తొక్కేశారు. సహజవనరులను కాపాడాలన్న కనీస స్పహ లేని స్వార్థపరుల చేతుల్లో గ్రేటర్ హైదరాబాద్ చిక్కి శల్యమైంది. నగర వాసులకు కష్ణా, గోదావరి జలాలే శరణ్యమయ్యా యి. కానీ ఒకప్పటి గండిపేట నీళ్లు ఏమయ్యాయి? జంట జలాశయాలుగా పేరున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ఎందుకు సరిపాడా తాగునీటిని అందించలేకపోతున్నాయి. వందల ఏళ్ల పాటు జనాన్ని కాపాడిన ఆ నీటివనరులు ఎవరి స్వార్థం వల్ల బలైంది? ఇలాంటి సందేహాలకు సమాధానం అవినీతి, అక్రమా లే! నగరం, నగరం చుట్టూ ఉన్న ఏ చెరువైనా కబ్జాకాకుండా ఉందేమో చెప్పండని ఎవరినైనా అడిగితే సమాధానం ఉండదు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ రికార్డుల్లో మాత్రమే చెరువులు, వాటి విస్తీర్ణాలు పకడ్బందీగా కనిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో ఒక్కచెరువు కూడా కబ్జాకు అతీతంగా లేదు. నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు ప్రస్తుతం స్విమ్మింగ్ ఫూల్స్‌గా దర్శనమిస్తున్నాయి. పెద్దోళ్లు కబ్జాచేసి ప్లాట్లు చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. దాంతో కాలనీలు, బస్తీలు ఏర్పడ్డాయి. కొన్ని చెరువులైతే రికార్డులకే పరిమితమయ్యాయి. శివార్లల్లో కొందరు ఎమ్మెల్యేలు, వారి వారసులతో సహా కబ్జాకోరుల జాబితాలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చెరువులను రక్షించాలని, భూగర్భజలాలను కాపాడాలంటూ లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలు, కోర్టులకెక్కి హక్కులను సాధించాయి. వాటిని అమలుచేసేందుకే అధికార యం త్రాంగం సిద్ధంగా లేదన్న విమర్శలున్నాయి. శేరిలింగంపల్లి మండలంలో అప్రతిహాతంగా సాగే కబ్జాల పర్వాల్లో పలుమార్లు లోకాయుక్త రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు మొట్టికాయలు వేసింది. కానీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ మాదాపూర్ సమీపంలోని దుర్గం చెరువు అనేక కబ్జాలకు గురై నీటి మడుగులా మారింది.

ఏవీ నివేదికలు..

ఏక్కడ అమలు?: ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయో, ఎన్ని నాలాలు ఆక్రమణకు గురయ్యా యో అధికారికంగా సమర్పించిన నివేదికలు భయోత్పాన్ని కలిగిస్తున్నాయి. పరిష్కారాలను వెతికాల్సిన అధికారులు మౌనం వహిస్తున్నారు. 2000లో వచ్చిన విపత్తును దష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కిర్లోస్కర్ కన్సల్టెన్సీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నగరంలో 1500 నాలాలు కబ్జాకు గురయ్యాయని, నాలాలు కుచించుకుపోయాయని, లోతు బాగా తగ్గిందని, చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయని తేల్చింది. పుష్కరకాలం గడిచినా చర్యల్లేవ్! ఉప్పల్ మండలం బండ్లగూడ చెరువులోనే కొందరికి పట్టాలు జారీచేశారు. అక్కడ ఇండ్లు కట్టుకున్న బడుగులకు వర్షాకాలంలో రోజుకో యుగంగా కనిపిస్తుంది. చాలాచోట్ల నీటి వనరులు, ఎఫ్‌టీఎల్ పరిధిలోనే పట్టాలిచ్చిన ఉదంతాలున్నాయి. నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించిన పాలకులే ఈ దాష్టీకానికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి