గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
గేయ తెలంగాణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గేయ తెలంగాణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, అక్టోబర్ 14, 2015

ఏపీఎస్‍ఎఫ్‍సీ విభజన ప్రకటనలో... ఆంధ్రా డైరెక్టర్ల కుట్రలు...!



ఏపీఎస్‍ఎఫ్‍సీలో
ఉద్యోగుల విభజనమ్ము
ఆంధ్రాప్రాంతమునకె లాభము
కలిగించేలా ఉన్నది!


తెలగాణకు అన్యాయము
జరుగునట్లు విభజనమ్ము
చేయుదురని  తెలుపుచుండ్రి
తెలంగాణ ఉద్యోగులు!


ఐక్యకార్యాచరణ స
మితి ప్రకటన పూర్తిగాను
అవాస్తవ సహితమనుచు
తెలుపుచుండ్రి ఉద్యోగులు!


బోర్డువారి మీటింగ్‍లో
విజయవాడ, గుంటూర్లలొ
భవనపు నిర్మాణములకు
ఇరవై కోట్లను కేటా
యించుటయే నిజము కాదె?


ఈ పాలక వర్గమందు
బోర్డాఫ్ డైరెక్టరులుగ
తెలగాణులు సమపాళ్ళలొ
లేకుండుట నిజము కాదె?


తెలంగాణ ప్రాతినిధ్య
మే లేకుండగ విభజన
ప్రణాళికల ఆమోదం
పొందుటయే నిజము కాదె?


న్యాయమ్మింతయు లేకయె
అక్రమముగ నిర్ణయములు
ప్రతిపాదనలను చేయుట
మీ యిష్టమ? మీ రాజ్యమ??


చట్టప్రకారమ్ముగాను
తెలంగాణ ఉద్యోగుల
తెలంగాణ వాటాలను
సక్రమముగ విభజనమ్ము
చేయవలెను! చేయవలెను!!


జాయింట్ డైరెక్టర్ టూర్‍లో
ఉండగానె బోర్డ్ మీటింగ్
ఏర్పాటును చేయుటేల?
తప్పుచేయు కొఱకె కదా!!


ఇకనైనా కుటిల బుద్ధి
ప్రదర్శించుటను మానియు
చట్ట ప్రకారమ్ముగాను
వర్తించుడు! వర్తించుడు!!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




బుధవారం, మే 13, 2015

ఇవి మరోచోటికి తరలిపోతే ఎవరికి నష్టం?

"అభివృద్ధి"యె అవకాశం!
మార్పుతెచ్చు చోదకం!
ఎట్టి పనియు మొదలైనా,
వెనుకనె అభివృద్ధి యుండు!!

సెక్రెటేరియట్‍ను ఎర్ర
గడ్డలోన పెడుదమన్న,
సాగరు ప్రక్షాళనన్న
హైదరబా దెమ్మెల్యే
లడ్డుపడుదురే? ఇంక
గగ్గోలులె? కోపాలే?

అంతర్జాతీయకళా
క్షేత్రం కడదామంటే,
కుంటి, గ్రుడ్డి సాకులేల?
అడ్డగింప జూడనేల?

"ఎర్రగడ్డ" సచివాలయ
మే "పికెట్‍"కు తరలినచో,
నష్టమెవ్వరికి జరుగును?
ఎర్రగడ్డ ప్రజలకె గద!
అభివృద్ధియె తొలగుకదా!!

ఎన్‍టీఆర్ స్టేడియమున
కళాభారతిని కట్టుట
నెమ్మెల్యేలడ్డుకొనిన
నష్టమెవ్వరికి జరుగును?
లోయర్ ట్యాంక్‍బండ్‍ నివాసు
లకె జరుగును యోచింపుడు!!

ప్రభుత్వమ్ము నిర్ణయించు
ప్రదేశములలొ నిర్మించిన
ఆ ప్రదేశములె వృద్ధిని
పొంది వెలిగిపోవును గద!

కళాభారతి నశోక్‍నగర్
విడచిన వేరొక చోటకు
పద్మరావొ, తలసానో
సంతసాన కొనిపోదురు!!

తరువాతను అశోక్ నగర్
పరిస్థితియు నెటకుపోవు?
ఏ వృద్ధియు లేకుండా
చరిత్రలో నిలిచిపోవు!!

ఎమ్మెల్యే లైదేండ్లే!
ప్రజలో? స్థిరనివాసులే!!
అశాశ్వతులె అడ్డుపడిన
శాశ్వతులకె నష్టమ్మగు!!
యోచింపుడు ప్రజలారా
ఏమి చేయవలెనొ యిపుడు!!!


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
(సవాల్ రెడ్డిగారి వ్యాసంకోసం ఇక్కడ క్లిక్ చేయండి)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, మే 11, 2015

పరాన్నభుక్కులు ఇలా కాక ఎలా ఉంటారు?

tdpimg


(ఏపీకి ప్రత్యేక హోదాకై తయారుచేసిన మెమొరాండంపై టీటీడీపీ నేతల సంతకాలు)


***        ***        ***        ***


నేతిబీరలోన నేయి
ఎంత ఉండునో, అట్టిదె
తెలంగాణ టీడీపీ
నేతలలో చిత్తశుద్ధి!!


నిద్రలేచినది మొదలుగ
టీఆరెస్‍పై నిప్పులు
గ్రక్కెడి చేతలె వారికి!
నోట మంచిమాట రాదు!!


చెప్పెడివియు నీతులు మఱి
దూరెడివింకేమొ సూక్తి
యట్టుల వ్యవహరించెదరు!
ఎఱ్ఱని గురివిందలుగద!!


తెలంగాణ మేలు కోరి
యెన్నడు మాటాడబోరు!
ఏపీ మేలుకు మఱిమఱి
మునుముందుకు బోవుచుంద్రు!!


ఉట్టికెక్కలేనమ్మయె
స్వర్గమ్మున కెగిరినట్లు,
తెలంగాణ బాగడుగరు!
ఏపీకై అడుగుచుంద్రు!!


ఏపీ రాష్ట్రపు విభజన
అన్యాయముగా జరిగిం
దని వాపోవుచు, అదియే
ఆర్థికముగ వెనుకబడెను
ప్రత్యేకపు హోద నీయు
మని కేంద్రమ్మును కోరెడి
మెమోరాండమున సంతక
ములను తెలంగాణపు టీ
డీపీ నేతలు పెట్టుట
నేమనవలెనయ చెప్పుడు!!


సరె, ఏపీ ప్రత్యేకపు
హోదానడుగుడు! అటులనె
తెలంగాణలో నెనిమిది
జిల్లాల్ వెనుకబడి లేవె?


వాటిని చూసైనా ఈ
టీటీడీపీ నేతలు
తెలగాణకు ప్రత్యేకపు
హోదానెందుకు అడుగరు?


పొరుగు రాష్ట్ర అభివృద్ధికి
పాటుపడెడు వీరలకును
స్వంత రాష్ట్ర అభివృద్ధియె
పట్టదెందుకో తెలియదు!!


చంద్రబాబు మోచేతిని
కారు నీరు త్రాగునట్టి
వారల కీ సంగతెటుల
పట్టునోయి? రామ రామ!!


సీమాంధ్రుల కూడిగమును
చేయునట్టివారలకును,
తెలగాణకు మేలుచేయు
నట్టి బుద్ధి యెట్లు పుట్టు?


"ఏపీకిని ప్రత్యేకపు
హోదనిడిన, తెలగాణకు
కూడ నీయవలె" ననియెడి
’మొయిలి’కున్న బుద్ధి యేది?


ఈ మాత్రపు జ్ఞానమైన
టీటీడీపీ నేతల
కుండినచో, తెలగాణకు
మేలుచేయువారగుదురు!!


బానిస బుద్ధులు మారవె?
స్వేచ్ఛాతెలగాణ బుద్ధి
కొంచెమైన చూపబోరు
గద! పరాన్నభుక్కులైరి!!


***        ***        ***        ***


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
(వార్తకై దీనిపై క్లిక్ చేయండి)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!






శుక్రవారం, మే 08, 2015

నిజంగా ఇది తుగ్లక్ కమిటీయే!!!

- కమల్‌నాథన్ విభజన తీరుపై దుమారం
- తెలంగాణ రిజిస్ట్రేషన్‌శాఖ ఆంధ్రాకు అంకితం
- ఏపీ అధికారులను నింపేస్తూ కేటాయింపులు
- ఆంధ్రాకు పోతామన్నవారికీ తెలంగాణలో పోస్టింగ్
- భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం
- మళ్లీ ఉద్యమం తప్పదంటున్న ఉద్యోగులు


కమలనాథనుని కమిటీ
తెలంగాణపైన పగను
బూనినట్టి చేష్టలు గన
తుగ్లక్ చేష్టలె కనబడె!

తెలంగాణ రిజిస్ట్రేష
నుల శాఖను సీమాంధ్రుల
తో నింపుట కిది సీమాం
ధ్రులరాజ్యమ? తెలగాణమ?

తెలగాణకు ఆదాయము
నిడు శాఖలొ సీమాంధ్రుల
నియమించినచో తెలగా
ణకు నష్టమె! అనర్థమే!!

తెలంగాణ ఉద్యోగుల
ఆప్షన్లను చెత్తబుట్ట
పాలుజేసి ఈ కమిటీ
ఆంధ్ర కొమ్ము గాచె నిటుల!!

సీమాంధ్రా ఉద్యోగుల
కే మెరిటులు లేకున్నా,
తెలంగాణలోన నియా
మకము జేయ, మతలబేమి?

తెలంగాణ పోస్టులలో
ఏపీకిని చెందినట్టి
వారలనే కుట్రపూరి
తమ్ముగ నియమించుటేల?

ఆంధ్రాకయి ఆప్షనిడిన
ఆంధ్రవారి నాంధ్రాకే
పంపకుండ, తెలగాణకె
కేటాయించుట కుట్రే!!

తెలంగాణ కార్యాలయ
మందు ఆంధ్ర అధికారుల
నియమించుట న్యాయమా?
పరిపాలన మెటులుండును??

ఆంధ్రవారికింద తెలం
గాణులు పని చేయుటయే
పునరావృతమయ్యెను గద!
న్యాయమెటుల జరుగునయ్య?

సమైక్యాంధ్ర నినాదాలు
చేసినట్టి వారలనే
తెలగాణలొ నియమించుట
గొడవలు సృష్టించుటకే!!

ఆంధ్రవారి నాంధ్రాకే
తెలగాణుల తెలగాణకె
కేటాయింపగ వలెనయ!
లేకుంటే ఉద్యమమే!!

అరువదేండ్లపాటు జరిగి
తెలంగాణ ఉద్యమమ్ము
ఈ దుఃస్థితి పొందుటకా?
మోసగింపబడుటకా??

మా ఉద్యోగాల్ దోచుకొనియు,
మమ్ముల పాలించి, మమ్ము
బానిసలను చేసినారు!
మరల వారె పాలింతురె?

త్వరగా సరిచేయనిచో
మరల ఉద్యమమ్మె జరుగు!
అప్పుడు ఈ దోపిడీల
అంతుచూడవలసియుండు!!

***       ***       ***

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)





సోమవారం, మే 04, 2015

ఆర్కే స్వగతం...?!


కనులు మూసిన కనులు తెఱచిన

కేసియారే మెదలుచుండెను
వామనుండని తలచినందుకు
విశ్వరూపుడయెన్!

ఇక తెలంగాణమ్ము రాదని
హాయిగా కనుమూసియుండగ
కేంద్రమిచ్చెను తెలంగాణము
కలయె చెదరెనుగా!

ముఖ్యమంత్రిగ కేసియారే
యేలుచున్ పదకొండు నెలలయె
నేమి చేసితి నింతవరకును
వెంట్రుకైనను కదలదే?

ఆంధ్రజ్యోతిలొ నేను రాసితి
తప్పు రాతలు తప్పు కూతలు
అట్టి రాతలవేమి చేసెను?
చెఱుపగలిగినవా?

గెలిచె టీయారెస్సు ప్రజలను
మనములందున నిలిచిపోయెను
గొప్పపనులను చేయుచుండెను
ఏమి చేతును నే?

మనసు నందున నిట్టి యూహలు
ముసరుచున్నవి, నిదుర రాదే!
పెఱుకుటకు అది చిన్న మొక్కయె?
వృక్షమాయెనుగా!

చిత్రమందున కథానాయకు
నకును దెబ్బయె తాకినప్పుడు
గతము గుర్తుకు వచ్చినట్టుల
నాకు జరిగె గదా!

ఈ టియారెస్ దెబ్బ తగిలియు
గతము మఱచిన నాకు నిప్పుడు
అన్ని జ్ఞప్తికి వచ్చుచున్నవి
ఒక్కటొక్కటిగా!

ఎదుటివారల తప్పులెన్నితి
నాదు తప్పుల నెఱుగకుంటిని
మంచివాడనొ చెడ్డవాడనొ
యెఱుగకుంటినిగా!

ఏదొ చెప్పగబోయి తప్పునె
చెప్పినాడను ఒడలు మఱచియు
పెద్ద వ్యాసమె వ్రాసితినను నా
గర్వమే తొలగెన్!

ఉద్యమము బలపడినయప్పుడు
ఉద్యమమ్మే చల్లబడెనని
మాయమాటలు పలికినాడను
ద్రోహబుద్ధిని ఐ!

కేసియారే దీక్షబూనగ
ఉద్యమమ్మే యెగసిపడగా
నీళ్ళుచల్లగ దలచితిని నే
దుష్ట యోచనతో!

ప్రజలు నాయకులందఱొకటై
"జై తెలంగాణా"యటంచును
ఉద్యమించగ నీళ్ళు చల్లితి
తప్పువ్రాతలతో!

నీళ్ళు చల్లినకొద్ది యెగసెను
ఉద్యమజ్వాలలు మఱింతగ
మాట మూగగ, కనులు గ్రుడ్డిగ
నాకు అనిపించెన్!

ఈ టియారెస్ ప్రజలలోపల
పాతుకొనె  వృక్షమ్ము మాదిరి
నా వశమ్మే కూల్చివేయగ
ననక యత్నిస్తిన్!

ఈ టియారెస్‍పైన నాకును
ఎందుకో కలిగేను ద్వేషము
మందమతినై తిట్టుచుంటిని
కేసియారును నే!

బీజెపీ కాంగ్రెస్సువారలు
పదవికమ్ముడు పోదురంచును
చవకబారు విమర్శచేసితి
నోటి దూలకు నే!

కేసియారుతొ పడకనే కో
దండరామే వెడలిపోయె న
నెడి పుకారును సృష్టిచేసితి!
నమ్మలేదెవరున్!!

పోటిచేయుట కిష్టపడకయె
మిన్నకుండిన అతని చేతను
నేను ఉపయోగింపజూచితి
నమ్మలేదెవరున్!

కేసియారుకు జేయెసీకిని
మనః స్పర్థలు వచ్చెనంచును
కుటిల వచనములెన్నొ పలికితి
కల్లలాయెనుగా!

గతమునందలి నాయకులకును
కేసియారుకు పోలికెక్కడ?
గొప్పమాటలు, గొప్పచేతలు!
ఎటుల పొగడెద నే?

పథకములనన్నింటి నెపుడును
తప్పుపట్టితి, దెప్పిపొడిచితి!
కేంద్రమే మెచ్చుకొని భేషనె
కేసియారెదుటన్!!

అట్టి మెప్పుకు నోరు పెగలదె!
కనులు మండుచు నుండె కాదే!
ఒంటిపై జెర్రులే పాకెను!
ఏమి రాతును నే?

కేసియారు నియంత కాడని
ప్రజకు వ్యతిరేకియును కాడని
నాకు తెలిసియు కుళ్ళుచుంటిని
వ్యర్థ యత్నముచే!

రాజకీయము బాగ తెలిసియు
భవిష్యత్తుకు బాటవేసియు
ప్రజల నమ్మకములను పొందియు
కేసియార్ గెలిచెన్!

కేసియార్ ఏ మంచి చేసిన
చెడు కనంబడె నాదు కండ్లకు!
వెఱ్ఱికూతల వలన నష్టము
కేసియార్ కగునే?

మహోత్తుంగ సముద్రమందున
కాకి రెట్టను వేయగా ఇక
గొప్పతనముకు భంగమగునే?
నాకు తెలియదయెన్!

మహోదధియే కేసియారయె!
కాకి రెట్టయె నాదు చేతలు!
నా కుచేష్టలు కేసియారును
తక్కువెటు చేయున్?

నాకు జ్ఞానోదయమ్మెప్పుడు
కలుగునో యని వేచియుంటిని!
కేసియార్‍పై ఈర్ష్య యెప్పుడు
నాకు తగ్గెడినో?



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


ఆదివారం, మే 03, 2015

ఇప్పుడుకూడా ఏపీ ఉద్యోగులను తెలంగాణకే కేటాయిస్తారా???

TNGOleaders

ఏపీ రాష్ట్రముకు చెందు
ఉద్యోగుల తెలగాణకు
కేటాయించగ వలదయ!
వారలు ఆ రాష్ట్రముకే!!

అరువది సంవత్సరముల
ఉద్యోగపు దోపిడీయె
తెలంగాణ రాష్ట్రముకై
మము పురికొల్పినదయ్యా!

రాష్ట్రము వచ్చిన తదుపరి
ఇంకా వారలు ఎందుకు?
మా రాష్ట్రము మా వారలు!
అన్యాయము సరిచేయుడు!!

డీవోటీపీ ఇచ్చిన
మార్గదర్శకములన్నీ
విభజన కమిటీ ఉల్లం
ఘించినదయ్యా చూడుడు!!

కమలనాథనుని కమిటీ
వాటిని సవరించవలెను!
తెలంగాణ ఉద్యోగాల్
తెలగాణకె దక్కవలెను!!

ఏ శాఖలొ ఏ విధముగ
అన్యాయము జరిగినదో
దయతోడుత మీరలిపుడు
తప్పక పరిశీలింపుడు!
న్యాయమ్మును జరిపింపుడు!!

తెలంగాణలో పుట్టిన
తెలగాణులనే కేటా
యింపవలెను గద! స్థానిక
నిబంధనల మంటగలిపి
ఆంధ్రవారి కెటులిత్తురు?

తెలగాణకు జరుగునట్టి,
తెలగాణకు జరిగినట్టి
అన్యాయమ్ముల కేంద్రము
తప్పక సరిచేయవలెను!

తెలగాణలొ పనిచేయగ
ఇష్టపడెడి ఆంధ్రవారు
తెలంగాణ స్థానికులా?
దయతో పరిశీలింపుడు!

గతంలోని అన్యాయాల్
సరిచేయగవలెను గాని,
క్లిష్టతరము చేసి మాకు
అన్యాయము చేయదగునె?

తెలగాణుల కుద్వేగాల్
కలిగించగ వలదయ్యా!
శాంతితోడ జీవించే
బాటనిపుడు చూపుడయా!!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జూన్ 02, 2014

తెలంగాణ రాష్ట్రోదయ వికాస శుభ గీతిక!

తెలంగాణ ప్రజలందరికీ
తెలంగాణ రాష్ట్రావతరణ ప్రప్రథమ దినోత్సవ 
శుభాకాంక్షలు!


తెలంగాణ ప్రజలారా,
శుభాకాంక్షలందుకొనుడు!
స్వేచ్ఛావాయువులందరు
హాయిగాను పీల్చుకొనుడు!!

తెలంగాణ ద్రోహులంత
కలసికట్టుగా వ్యతిరే
కించగాను, ఎగసి ఎగసి
జయమునందె తెలంగాణ!

సీమాంధ్రులు సృష్టించిన
ఆటంకము లధిగమించి,
తెలంగాణ లక్ష్యముగా
విజయము సాధించెనుగా!

ఇది అమరుల త్యాగఫలము!
సకల జనుల దీక్షఫలము,
ప్రతి హృదయము కదిలించిన
ఉద్యమ జయ కేతనమ్ము!

అరువదేండ్ల నిరీక్షణము
పూర్ణముగ ఫలించెనేడు!
అధర్మమ్ముపై ధర్మము
సాధించిన ఘనవిజయము!!

ఎదఎదలో వికసించిన
నవకోమలతర సుమమ్ము!
పరిమళాలు విరజిమ్మెడు
విశ్వవ్యాప్త మారుతమ్ము!!

మన కలలే ఫలియించెను!
మన ఆశలె చిగురించెను!
మనకు బానిసత్వమ్మిక
త్రెంచెను ఈ శుభదినమ్ము!!

కష్టాలే కడతేరెను!
దోపిడులే దూరమాయె!
తెలంగాణ కడ్డొచ్చిన
ఆటంకాల్ తొలగిపోయె!!

రాదు అనిన తెలంగాణ
నడయాడుచు వచ్చెనహో!
రాదు అనిన తెలంగాణ
నర్తించుచు వచ్చెనహో!!

ఉత్సాహము నినదించిన
తెలంగాణ రాగమిదే!
వ్యక్తి వ్యక్తి శక్తియైన
తెలంగాణ స్వప్నమిదే!!

నేడే మన తెలగాణకు
నిజముగ స్వాతంత్ర్యమబ్బె!
బానిస సంకెళ్ళు తొలగి,
తెలగాణుల మేనులుబ్బె!!

ఆటుపోట్లు తట్టుకొనియు,
ఈసడింపులను పొందియు,
అవమానాలెదుర్కొనియు
సాధించిన తెలంగాణ!

దోపిడీల రూపుమాపి,
దౌష్ట్యమ్ముల నుగ్గుసేసి,
అక్రమాలనాపుచేసి,
సాధించిన తెలంగాణ!

మనిషి మనిషిలోన ప్రేమ
పుష్పాలను పూయించియు,
సౌభ్రాత్రపు బంధనమును
వెలయించిన తెలంగాణ!

తరతరాల కడగండ్లను
రూపుమాపు తెలంగాణ!
మన పాలన, మన యోచన
వెలిగించెడి తెలంగాణ!!

స్వేచ్ఛాకాశమ్ములోన
హృదయము తేలుచునున్నది!
మానస మానందముతో
పరవశించిపోతున్నది!!

ఇదియె సకల తెలగాణులు
ఎత్తిన జయ కేతనమ్ము!
ఇదియె అధర్మమ్ము పైన
ధర్మ విజయమే సుమ్ము!!

ఇది అఖండవిజయమ్మయ!
ఉద్యమాల ఫలితమ్మయ!
సకల జనులు కోరినట్టి
స్వేచ్ఛాయుత తెలగాణయ!!

తెలంగాణ ప్రజలారా,
శుభాకాంక్షలందుకొనుడు!
స్వేచ్ఛావాయువులందరు
హాయిగాను పీల్చుకొనుడు!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, మే 31, 2014

ఇది జలయజ్ఞం కాదు...జలప్రళయయజ్ఞం...భూ, వన, ఖనిజ, విద్యుత్, ధన, ప్రాణాపహరణయజ్ఞం!

గతంలో దివి: 27-03-2914 నాడు ప్రకటించిన ఈ టపాను ఈ సందర్భంలో మళ్ళీ ప్రకటించడం జరుగుతున్నది.

"పోలవరం నిర్మాణం
అన్ని అనుమతులను పొంది
పూర్తి అగుట అసాధ్యమ్ము"
అనుచుండిరి మేధావులు!

వివాదాలు కోర్టులోన
పెండింగ్‍లో ఉండగాను,
నిర్మించెదమని పలుకుట
మోసపూరితము కాదా?

అన్ని అనుమతుల కొరకయి
అబద్ధంపు లెక్కలతో
మోసగించు వ్యాఖ్యలతో
పోలవరం కట్టలేరు!

కోర్టుల కేసులనుండియు
బయటపడుట తేలికయా?
ముంపు గ్రామ ప్రజ లెన్నిక
బహిష్కరణ లసత్యమా?

నాలుగు లక్షల ప్రజలను
నిర్వాసితులను జేసెడి
పోలవరము నిర్మాణం
అసాధ్యమ్మె...అసాధ్యమ్మె!

కేంద్రపు మోసపు మాటల,
చేతల నమ్మినవారలు,
పప్పులోన కాలువేతు
రనుటె చెడని సత్యమయ్య!

తెలగాణను ముంచునట్టి
పోలవరపు నిర్మాణము
వివాదాలలో జిక్కియు
బయలు వెడలకున్నదయ్య!

పోలవరం పేరుచెప్పి
ప్రభుత్వమ్ము కోట్లు కోట్లు
ఖర్చుచేసినట్టి లెక్క
అబద్ధాల చిట్టలోదె!

గుత్తెదార్లు, నాయకులును
కుమ్మక్కై చేసినట్టి
ప్రభుత్వంపు ధనలూటీ
ప్రణాళికే పోలవరము!

ఆచరణకు సాధ్యమవని
ప్రాజెక్టును చూపించియు
కోట్ల ధనము కొల్లగొట్టు
ప్రణాళికే పోలవరము!

పర్యావరణమును ముంపు
నకు గురిచేయంగ బూను
అక్రమార్కులే వేసిన
ప్రణాళికే పోలవరము!

నిర్వాసితులను జూపియు,
జలయజ్ఞమటంచు జెప్పి,
ధనయజ్ఞము చేయునట్టి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ బిల్లులోన
లేని ఏడు ముంపు మండ
లాల నాంధ్రలోన కలుపు
ప్రణాళికే పోలవరము!

బతికి బట్టకట్టలేని
ప్రాజెక్టుకు జాతీయపు
హోదనిడెడి ఎలక్షన్ల
ప్రణాళికే పోలవరము!

చెట్టుపేరు చెప్పి కాయ
లమ్ముకొనగనెంచినట్టి
స్వార్థపరులు పన్నినట్టి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ, సీమాంధ్రుల
చెవిని పువ్వు పెట్టి కోట్లు
దండుకొనెడి అక్రమార్క
ప్రణాళికే పోలవరము!

వ్యవసాయము పదిశాతము
వ్యాపారము తొంబదిశా
తము కొరకుపయోగించెడి
ప్రణాళికే పోలవరము!

పేదల పేదలుగ నుంచి,
ధనికుల నింకా ధనికుల
జేయగ నుపయోగించెడి
ప్రణాళికే పోలవరము!

కొంతమంది స్వార్థపరుల
కును మేలును జేయునట్టి
భూ, వన, ఖనిజాపహరణ
ప్రణాళికే పోలవరము!

తెలగాణకు విద్యుత్తును
సమకూర్చెడి మార్గమ్మును
కొల్లగొనగ నెంచినట్టి
ప్రణాళికే పోలవరము!

గిరిజనులను, తీరజనుల
ముంపుకు గురిచేసి, ధనిక
వర్గమునకు ధనము నిడెడి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ నైసర్గిక
రూపమ్మును మార్పుచేసి,
ఇకిలింపగ బూనినట్టి
ప్రణాళికే పోలవరము!

ఈ ప్రాజెక్ట్ లేకున్నను
తొంబదైదు శాత జలము
ఇప్పటికే అందుచుండ
ప్రాజెక్టును కట్టనేల?

అక్రమార్క స్వార్థ నేతృ
కుతంత్రాల బట్టబయలు
చేసి, ప్రజాధనము నిపుడు
కాపాడగవలెనయ్యా!

అట్టి స్వార్థపరుల కుట్ర
లన్ని బట్టబయలు చేసి,
వారందర కిపుడు తగిన
శిక్షవేయవలెనయ్యా!

***     ***     ***     ***

ఇంకా మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రికవారి సౌజన్యంతో...)



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మమ్మల్ని మా జన్మభూమినుండి వేరు చేయకండి!

ఈ టపాకూడా దివి: ఫిబ్రవరి 12, 2014 నాడు ప్రచురింపబడిందే. ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి మరల ప్రచురిస్తున్నాను.


శ్లో||
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే,
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి||

చం.
కనకపు లంకయైన మఱి కాంచను నేను రుచించ లక్ష్మణా!
జననియు జన్మభూమియును స్వర్గముకన్నను మిన్నయౌ సుమా!!

రావణ వధానంతరం లక్ష్మణుడు శ్రీరాముని లంకకు అధిపతియై రాజ్యమేలుమనగా, అంగీకరింపక రాముడు "లక్ష్మణా! ఇది బంగారు లంకయినా నేను ఇష్టపడను! ఎందుకంటే, జననీ, జన్మభూమీ స్వర్గంకన్నా ఎక్కువగదా! కాబట్టి మనం మన జన్మభూమియైన అయోధ్యకే వెళదాం!" అన్నాడు.

ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. నాగరికులైనా... గిరిజనులైనా...! వాళ్ళను ముంచడానికి...వాళ్ళను వాళ్ళ జన్మభూమినుండి వేరు చేయడానికి ఎవరికీ హక్కులేదు! మానవ...అదీగాక గిరిజన హక్కుల్ని కాలరాయడానికి ప్రభుత్వం పూనుకొనడం అమానుష చర్య! ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు! ఇక్కడి ప్రజలు మనుషులు కారా? సీమాంధ్రులే మనుషులా? ఎవరినైనా వారి జన్మభూమినుంచి వేరుచేస్తామనడం భావ్యమా? ఇది ప్రభుత్వం తేల్చుకోవలసిన అంశం. ఏది న్యాయమో తక్షణమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుంది.


మానవత్వము లేని కేంద్రము
పోలవర ప్రజలకును అన్యా
యమ్ము జేయగ నిశ్చయించుట
తగని పనియయ్యా!

ముంపునకు గురియయెడు గ్రామ
మ్ములను సీమాంధ్రులకు నిడుటయె
మానవత్వము లేని పనియయ!
తగనిపనియయ్యా!

జననియును మఱి జన్మభూమియు
స్వర్గమున కన్నను విశిష్టత
గలవి యంచును తెలిసి తెలిసియు
నిట్లు చేయుదురా?

భద్రగిరిలో మునిగిపోయెడు
గ్రామముల నివసించు జనులకు
జన్మభూమిని ముంపునకు గురి
చేయ న్యాయమ్మా?

జన్మభూమిని వీడుమనుటయె
మానవత్వము లేని చేతయ!
మీరు మీ జన్మస్థలమ్మును
వీడిపోయెదరా?

కేంద్రమిట్టుల చేయుచో మా
తెలంగాణ నిసర్గ రూపము
మార్పుచెందును గాన మేమిది
యొప్పుకొనమయ్యా!

పోలవరపు డిజైను మార్చిన
నెట్టి నష్టము లుండబోవయ!
సులభమైన యుపాయముండగ
నష్టపరిచెదరా?

పోలవరప్రాజెక్టు నిర్మా
ణమ్ము జేసిన కలుగునెన్నో
నష్టములు, గ్రహియించి వెంటనె
ఆపుడోయయ్యా!

ప్రజాభీష్టమ్ము కనుగొంటిరె?
వారు తెలగాణమ్ము నందున
నుండ గోరిరి! వారి కోరిక
కూలద్రోయుదురా?

బ్రతుకు దెరువిచ్చటనె యున్నది!
ప్రాణములు వారికిట నున్నవి!
తల్లి నేలను వీడలేరయ!
ఒప్పుకొనరయ్యా!!

సీమకును న్యాయమ్ము కొరకయి
వీరి కన్యాయమ్ము చేతురె?
వీరి నోటను మట్టి గొట్టగ
చేతులెటులొచ్చెన్?

ప్రజల హక్కును కాలరాయుట
ప్రజాస్వామ్యము కాలరాయుటె!
ప్రజాపాలకులైన మీరలు
ప్రజల నణచెదరా?

వీరు ప్రజలుగ కనంబడరే?
తెలంగాణులు ప్రజలు కారే?
ప్రజలు సీమాంధ్రులే యగుదురె?
పక్షపాతమిదే!

మార్చుకొనుడయ యభిప్రాయము!
పోలవరపు డిజైను మార్చుడు!
సకల జనులకు న్యాయమును మీ
రిపుడు చేయుడయా!!

మార్పు చేయక యున్నచో తెల
గాణమందున నుద్యమమ్ములు
తీవ్రతరమై నింగికెగయును!
మీకు సమ్మతమా?

ప్రభువులైనటువంటి మీరలు
ప్రజాభీష్టమ్ములను దెలిసియు
మసలుకొనుటే న్యాయమగునయ;
మారుడోయయ్యా!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!