గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 15, 2014

ముంచుడొద్దు...

-పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం
-ఆర్డినెన్స్‌పై విరుచుకుపడ్డ సభ
-తక్షణమే విరమించాలని ఏకగ్రీవ తీర్మానం
-సీఎంపై విమర్శలకు దిగిన టీడీపీ
-కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీశ్‌రావు
-డిజైన్ మారని పోలవరం ప్రాజెక్టును
-ఒప్పుకోబోమన్నముఖ్యమంత్రి
-అమరులను స్మరించుకున్న శాసనసభ
-స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో స్తూపం
-ఎవరెస్టు విజేతలకు రూ. 25 లక్షల చొప్పున పురస్కారం
-హిమాచల్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
-ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం సమావేశమైన శాసనసభ ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన భూభాగాలను ఆర్డినెన్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపివేయడాన్ని సభ తీవ్రంగా తప్పుపట్టింది. లక్షలాది మంది గిరిజనులను ముంచివేసే ఈ ఆర్డినెన్సును ఉపసంహరించాలని కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించిన సభ్యులు కేంద్రం చర్యను వ్యతిరేకించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ మరో 10 తీర్మానాలను చర్చించి ఆమోదించింది.

chandra


అందులో హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థులకు సంతాపం, ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లకు అభినందన, టీవీ 9పై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు అప్పగించే తీర్మానంతో పాటు పోలవరం ఆర్డినెన్సు ఉపసంహరణ, తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానాలు ఉన్నాయి.

పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాల్సిందే...

ఖమ్మం జిల్లా భూభాగాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడంపై శాసనసభ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే చర్చ సందర్భంగా అధికార విపక్షాలు వాదోపవాదాలకు దిగాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. తెలుగుదేశం సభ్యులు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రిపై విమర్శలకు దిగారు. మంత్రి హరీశ్‌రావు విపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టును తొలినుంచీ వ్యతిరేకించామని ఆయన చెప్పారు. ఆ సమస్యపై తాము నిరంతర పోరాటం చేస్తున్నామన్నారు.

చర్చను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ గిరిజనుల జీవించే హక్కును కాలరాసే పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా రాష్ర్టానికి చెందిన ఏడు మండలాలను సీమాంధ్రకు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు వ్యతిరేకమన్నారు. ఆర్డినెన్స్ వల్ల అరుదైన గిరిజన తెగలు అంతరించిపోతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన లక్షలాది మంది గిరిజనులు నష్టపోతారన్నారు. సీలేరు ప్రాజెక్టు ద్వారా లభ్యమయ్యే విద్యుత్‌ను తెలంగాణ నష్టపోతుందని, ఇంద్రకరణ్ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డిజైన్ మార్చని పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు.

అమర వీరులకు నివాళి తీర్మానం..

తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెండు నిమిషాల మౌనం పాటించింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుదశాబ్దాల పాటు జరిగిన అలుపెరుగని పోరాటంలో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. 1969లో స్వరాష్ట్ర నినాదంతో ఉద్యమించిన తెలంగాణ బిడ్డలను అప్పటి ప్రభుత్వం అత్యంత పాశవికంగా కాల్చివేసింది. ఆనాడు 369 మంది పోలీసు తూటాలకు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో వందలాది మంది విద్యార్ధులు పరాయి పాలనలో బతకలేక, స్వయం పాలన కావాలని కోరుకుంటూ అమూల్యమైన తమ ప్రాణాలను వదిలారు.

తెలంగాణ వస్తే తప్ప ఇక్కడి ప్రజల బతుకులు బాగుపడవని, తమ చావుద్వారానైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యేక తెలంగాణ ఇస్తుందనే ఆశతో వారి ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టిన త్యాగధనుల అమరత్వం అజరామరం. వారి త్యాగనిరతిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. వారి త్యాగఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం అని ఈ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తుంది. తెలంగాణ ప్రజల బతుకు బాగుపడటం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, వారి త్యాగనిరతికి ఈ సభ జోహార్లు పలుకుతోంది. అన్నారు. ఈ సందర్భంగా ప్రొ. జయశంకర్‌సార్‌ను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు వరంగల్‌లో మర్కజీ పాఠశాలలో జరిగిన మీటింగ్‌లో అయ్యదేవర కాళేశ్వరరావు తెలంగాణ భాష, యాసపై మాట్లాడుతూ మీదీ ఒక భాషేనా ఉర్దూలో కలిసి పోయింది. మీకు భాష, నాగరికత తెలియదు అంటుంటే తిరుగుబాటు బావుటా ఎగరేసిన మొదటి ఉద్యమకారుడు జయశంకర్ సార్. అక్కడే మొదటి లాఠీచార్జీ జరిగింది. సీటీ కాలేజీలో విద్యార్థుల ఆందోళనలో పాల్గొనేందుకు బయలదేరిన ఆయన భవనగిరిలో బస్సు ఫెయిలై ఆగి పోయారు. అదే రోజు సిటీకాలేజీలో పోలీస్ కాల్పులు జరిగి ఆరుగురు మరణించారు.

నేను కాలేజీ చేరుకుని ఉంటే కాల్పుల్లో చచ్చిపోయేవాడిని. తెలంగాణ బాధ, దుస్థితి చూసే పరిస్థితి తప్పేది అని నాతో ఎన్నోసార్లు వాపోయేవారు అని చెప్పారు. అనంతరం చర్చలో భాగంగా వివిధ పార్టీల సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సలహాలకు ముఖ్యమంత్రి బదులిస్తూ 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను శాశ్వతంగా ఉంచేలా తెలంగాణ మార్టియర్స్(అమరుల) మొమోరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. అమరుల ఫోటోలతో వారికి సముచిత గౌరవం దక్కేలా దానిని అద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు. న్యూయార్క్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో దీని నిర్మాణం ఉంటుందన్నారు. అలాగే రాష్ర్టావతరణ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో అమరుల స్థూపానికి ముఖ్యమంత్రి, అదేసమయంలో జిల్లాల్లో కలెక్టర్లు వందనం సమర్పించిన అనంతరమే ఉత్సవాలు ప్రారంభించేలా ఆదేశాలు ఇస్తామన్నారు.

హిమాచల్ ఘటనపై సంతాపం

హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన విద్యార్థులకు సంతాపం ప్రకటిస్తూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. విద్యార్థుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ రెండు నిమిషాల మౌనం పాటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కేసీఆర్ ఆ ఘటన పూర్వాపరాలను నెమరువేసుకున్నారు. ఆ దుర్వార్త ఈ నెల 8న ఉదయం 9 గంటలకు క్యాబినెట్ సమావేశంలో ఉండగా తన దృష్టికి వచ్చిందని, 18మంది బాలురు, 6గురు బాలికలు గల్లంతయ్యారని అధికారులు చెప్పారని తెలిపారు. ఆ వెంటనే హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ బీఆర్ మీనా, గ్రేహౌండ్స్ ఎస్పీ కార్తికేయన్‌ను అక్కడికి పంపి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించామని, హిమాచల్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌తో మాట్లాడానని చెప్పారు.

అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శులతోపాటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమన్వయం చేశారన్నారు. కేంద్ర హోంశాఖను, జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సంప్రదించామని చెప్పారు. బాధిత కుటుంబాలకు చెందిన 15 మందిని ఢిల్లీమీదుగా చంఢీఘర్‌కు విమానం ద్వారా పంపించి, అక్కడినుంచి ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కులూకు తరలించినట్లు చెప్పారు. ఎయిర్ కోస్తాకు చెందిన ప్రైవేటు విమానంలో మరికొందరు తల్లిదండ్రులను ఘటనా స్థలానికి పంపినట్లు చెప్పారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఇంకా అక్కడే ఉండి ప్రతినిత్యం సహాయ పనులను పర్యవేక్షిస్తున్నారని, అదనపు డీజీపి రాజీవ్ ద్వివేది 15మంది గజ ఈతగాళ్లతో వెళ్లినట్లు ప్రకటించారు. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించడంతోపాటు స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

ఎవరెస్టు విజేతలకు అభినందన..

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌లను శాసనసభ అభినందిస్తూ తీర్మానం ఆమోదించింది. వీరిద్దరితో పాటుతోపాటు వారి కోచ్ బీ శేఖర్‌బాబుకు కూడా రూ.25 లక్షల చొప్పున నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ తీర్మానించింది. పూర్ణ, ఆనంద్ కుటుంబాలకు ఐదేసీ ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించి, వ్యవసాయానికి బోర్‌వెల్ వేయడంతోపాటు ఏడాది పాటు వ్యవసాయ పెట్టుబడిని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారు నివాసముంటున్న ఇంటికి అదనంగా మూడు గదుల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు.

హైకోర్టు విభజన..

రాష్ట్ర విభజనలో భాగంగా హైకోర్టును కూడా విభజించాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానించింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం విభజన బిల్లులో సైతం నూతన హైకోర్టును ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ఇచ్చారని గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలి

జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానించింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ మన దేశంలోనే ఇది మగవారి పని, ఇది ఆడవారి పని అంటూ విచక్షణ పాటింపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచి, ఆ సీట్లను మహిళలకు కేటాయించాలని కేసీఆర్ కేంద్రానికి సూచించారు.

చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు.. బీసీ మంత్రిత్వ శాఖ...

చట్ట సభల్లో బీసీలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ సభ మరో తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రి వర్గంలో బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరుతూ సభ తీర్మానించింది.

తెలంగాణకు ప్రత్యేక హోదా...

తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హోదాను కల్పించాలని మరో తీర్మానాన్ని సభ ఆమోదించింది. తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడినందున ప్రత్యేక హోదాకు పూర్తి అర్హత ఉందన్నారు. తెలంగాణ, సీమాంధ్ర రాష్ర్టాలను సమానంగా చూడాలని ఆయన కేంద్రాన్ని సూచించారు. ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇచ్చి మరో రాష్ర్టాన్ని విస్మరిస్తే సమస్యలు వస్తాయన్నారు.

సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు..

సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపునివ్వాలని సభ తీర్మానించింది. సింగరేణి సంస్థలో 62,000 మంది పని చేస్తున్నారని, ఈ సంస్థపై ఆధారపడి దాదాపు 500 కంపనీలు ఉత్పత్తిని సాధిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

తీర్మాన పాఠం..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో ప్రాణాలు వదిలిన అమరులందరికీ ఈ సభ ఘనంగా నివాళులు అర్పిస్తోంది. 1969లో అసువులు బాసిన 369 మందికి తెలంగాణ వీరులకు, మలిదశ తెలంగాన ఉద్యమంలో స్వచ్చందంగా ప్రాణాలు వదిలిన సుమారు 1200 మంది వీరకిశోరాలకు ఈ సభ జోహార్లు అర్పిస్తూ తీర్మానం చేస్తోంది
త్యాగనిరతికి జోహార్లు..

తెలంగాణ వస్తేతప్ప ఇక్కడి ప్రజల బతుకులు బాగుపడవని, తమ చావుద్వారానైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యేక తెలంగాణ ఇస్తుందనే ఆశతో వారి ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టిన త్యాగధనుల అమరత్వం అజరామరం. వారి త్యాగనిరతిని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. వారి త్యాగఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగనిరతికి ఈ సభ జోహార్లు పలుకుతోంది.

60 ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రను శాశ్వతంగా ఉంచేలా తెలంగాణ మార్టియర్స్(అమరుల) మెమోరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. అమరుల ఫొటోలతో వారికి సముచిత గౌరవం దక్కేలా దానిని అద్భుతంగా నిర్మిస్తాం. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తలపించే విధంగా దీని నిర్మాణం జరుగుతుంది. అలాగే రాష్ర్టావతరణ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి అయినా, జిల్లాల్లో కలెక్టరైనా అమరుల స్తూపానికి వందనం సమర్పించిన అనంతరమే ఉత్సవాలు ప్రారంభిస్తారు.


టీవీ-9 పై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కే..

తెలంగాణ శాసనసభ్యులను అవమానపరుస్తూ కార్యక్రమం ప్రసారం చేసిన టీవీ-9పై చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు అప్పగిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సభ్యులను అవమానపరిచిన టీవీ-9 పై చర్యలు తీసుకోవాల్సిందేనని సభ అభిప్రాయపడింది. స్పీకర్ తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఎలాంటి చర్యనైనా తీసుకోవచ్చని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని సభ స్పీకర్‌కే వదిలేస్తుందని తెలిపారు. కాగా టీవి-9పై చర్యల విషయంలో స్పీకర్‌తో పాటు అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన 11 తీర్మానాలివి..

-తెలంగాణ అమరులకు సంతాపం
-హిమాచల్ మతులకు సంతాపం
-ఎవరెస్ట్ విజేతలకు అభినందన
-టీవీ-9పై చర్య అధికారం స్పీకర్‌కు
-పోలవరం ఆర్డినెన్స్ ఉపసంహరణ
-తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి హోదా
-సింగరేణి కార్మికులకు ఆదాయం పన్ను మినహాయింపు
-మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు
-బీసీలకూ 33 శాతం రిజర్వేషన్
-కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
-రాష్ట్ర హైకోర్టు విభజన

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి