గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 16, 2014

టీవీ 9పై చర్య తీసుకోవాల్సిందే...

-రాజకీయ పార్టీల ఏకగ్రీవ డిమాండ్
-అసభ్యకర ప్రసారాలపై స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
-చర్యల అధికారం స్పీకర్, మండలి చైర్మన్‌కు అప్పగింత
-చానళ్ల వ్యంగ్య ప్రసారాలపై చర్యకు సభ్యుల డిమాండ్
-వ్యక్తిగత ప్రసారాలను ఈ అంశంతో ముడిపెట్టొద్దన్న సీఎం
తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కార్యక్రమం ప్రసారం చేసిన టీవీ 9 చానల్‌పై చర్యలకు రంగం సిద్ధమైంది. శాసనసభ్యుల పట్ల అభ్యంతరకర భాషను వాడుతూ టీవీ 9 ప్రసారం చేసిన కార్యక్రమాన్ని సీఎం కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం అసెంబ్లీ దష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శనివారం కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సదరు చానల్‌పై కఠిన చర్య తీసుకోవాలని అన్ని పార్టీల సభ్యులు సూచించించారు. దీంతో టీ బ్రేక్ సమయంలో అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తోపాటు అన్నిపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

kcr


టీవీ కార్యక్రమంలో వాడిన భాషపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. అవమానకర రీతిలో ప్రసారాలు చేసిన చానల్‌పై చర్య తీసుకునే అధికారాన్ని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులన్న గౌరవం లేకుండా ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేసిన చానల్‌పై అసెంబ్లీ చట్టాల ప్రకారం స్పీకర్, చైర్మన్ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ కేవలం టీవీ 9 చానల్‌లోనే కాకుండా మరికొన్ని చానళ్లలో కూడా అలాంటి వ్యంగ్య ప్రసారాలు వస్తున్నాయని, ప్రధానంగా వ్యక్తిగతంగా ఈ ప్రసారాలు ఉంటున్నాయని తెలిపారు. 

అలాంటి కార్యక్రమాలను కూడా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై సీఎం స్పందిస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందిపడ్డ అంశాలతో అసెంబ్లీని అగౌరవపరిచే ప్రసారాలను ముడిపెట్టొద్దని, మిగిలిన అంశాలను తర్వాత చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. అభ్యంతరకర ప్రసారాలు చేసిన చానల్ క్షమాపణ కోరుతూ ఏమైన విజ్ఞాపన ఇచ్చారా..? అని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి అడుగటంతో చానల్ రాసిన లేఖను సమావేశంలోనే స్పీకర్ మధుసూధనాచారి చదివి వినిపించి సభ్యుల స్పందనలు కోరారు. దీంతో క్షమించి వదిలేయటమనే మాటేవద్దని, చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని అన్ని పార్టీల సభ్యులు ముక్త కంఠంతో కోరినట్లు సమాచారం. సభ మొదటి సమావేశాల్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరైందేనా అని ఓ సభ్యుడు అనటంతో సభ్యులంతా చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఇలాంటి ప్రసారాలు చేస్తున్న మరో రెండు చానళ్లపై కూడా చర్య తీసుకోవాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, అసెంబ్లీ మొత్తం వ్యవహారాన్ని వ్యక్తిగత అంశాలతో పోల్చిచూడొద్దని, యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ఉన్న కార్యక్రమంపై మాత్రమే మాట్లాడాలని సీఎం కోరినట్లు సమాచారం. టీవీ 9పై చర్యలు తీసుకోవాల్సిందేనని మండలిలో ప్రతిపక్ష నేత డీ శ్రీనివాస్ కూడా సూచించారని తెలిసింది. ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ మొదటి తప్పుగా పరిగణించి సదరు చానల్‌ను క్షమిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ఆలోచించాలని, అయితే మెజార్టీ సభ్యుల నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అంతకు ముందు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత చట్టాలకు అదనంగా కొత్త కేబుల్ చట్టాన్ని తెస్తే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి