గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 02, 2019

తెలంగాణ రాష్ట్రావతరణ పంచమ వార్షిక పర్వ దినోత్సవ శుభకామనలు!

సంబంధిత చిత్రం

ఉ.
శ్రీకరులై వెలింగెడి యశేష జనావళి సంతసించుచున్
జేకొనినట్టి సాత్కృత విశిష్టయునౌ తెలఁగాణ రాష్ట్రమే
ప్రాకటమౌచు నీ దినమె రమ్యసుశోభిత నవ్యరాష్ట్రమై
మేకొని యేర్పడెన్, జగతి మెప్పుల నందుచుఁ బొంగిపోవుచున్!

ఉ.
నా తెలఁగాణ స్వేచ్ఛగను నవ్వుచు హాయిగ వెల్గునంచు, నీ
నేతలు వీరులుం బ్రజలు నిత్యసుశోభలఁ దేలునట్లు, నేఁ 
డీ తెలఁగాణ రాష్ట్ర మది యెప్పటి నుండియొ వేచియుండ, నౌఁ
గాత మటంచు వచ్చెఁ దెలఁగాణము! స్వప్నము సత్యమాయెఁగా!

సీ.
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
        నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
        కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
        వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
        కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ
గీ.
డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును!

ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్షఁ గేసియార్!

సీ.
ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
        తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
        సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
        జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
        సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;
గీ.
యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు!

శా.
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్!

తే.గీ.
సకల జనులిఁక సంతోష సౌఖ్యములను
బొంది, వెలిఁగెడుఁ గావుత పూర్ణముగను!
శాంతి కల్గుతఁ దెలుఁగు రాష్ట్రద్వయమున!
స్వేచ్ఛ యెసఁగుత! యభివృద్ధి వేగ గొనుత!!

తే.గీ.
ఆయురారోగ్యభోగభాగ్యైహికములు
సకలశుభముల నొందియు, సౌమ్యతఁ గొని,
నవ్య రాష్ట్రమ్మునం దెలంగాణ జనులు
శుభము లీప్సితములుఁ బొంది, శోభఁ గనుత!!

స్వస్తి

జై తెలంగాణ! జై జై తెలంగాణ!