గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
సంస్మృతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంస్మృతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, జనవరి 12, 2018

ఆకాశంలో ధ్రువతార - అలిశెట్టి ప్రభాకర్!

hd image of alisetti prabhakar కోసం చిత్ర ఫలితం


తే.గీ.
కరినగరిని జగిత్యాల పురవరమున
జనన మందియుఁ దన చిన్నతనమునందె
తండ్రి మరణించఁ దానె పెద్దయయి యింటి
బరువుఁ గొనె నలిశెట్టి ప్రభాకరుండు!


శార్దూలము
ఆదర్శమ్మును వెల్గఁజేయుకొఱకై యాదర్శ కళ్యాణమున్
మోదానన్ గని, భాగ్యమన్ దనదు సమ్మోదమ్మునన్ భార్యగన్,
బేదింటన్ జనియించినట్టి పడుచున్ విత్తమ్మునుం గోరకే
తా దారగ్రహణమ్మునం గొనెను నౌదార్యమ్మునన్ ధీరుఁడై!


తే.గీ.
జీవికకయి సంపాదించు భావముఁ దన
మనమునందున నిల్పి, సంపదలఁ గనక,
తాను ధనికుఁడౌ కొఱకయి తపనపడని
భాస్కరోన్నతుఁడయ్య ప్రభాకరుండు!


ఆ.వె.
తనదు కళయె ప్రజల ఘనతరాంచితమైన
జీవనమును వెల్గఁ జేయుకొఱకె
యున్నదంచుఁ దలఁచి, యున్నతిం గొనఁగాను
చిత్రకారునిగనుఁ జెలఁగి వఱలె!


తే.గీ.
చిత్రకారునిగా నుండి చిత్రములకుఁ
బ్రాణమందించి ప్రజల జీవనముఁ దనదు
కుంచెతోడుతఁ జిత్రించి, కోరి కోరి
ప్రజల హృదయాల వెలుఁగొంద శ్రమనుఁ బంచె!


తే.గీ.
కుదురుగాను ఛాయాగ్రాహకునిగ నెదిగి
ముద్దుఁగొల్పు ఛాయాచిత్రములవి యెన్నొ
జీవకళ యుట్టిపడఁగఁ దీర్చియును దిద్ది,
మెల్లమెల్లగఁ గవియయ్యె సల్లలితుఁడు!


కం.

జనమనములఁ వెలిఁగింపఁగఁ
దన హృదయమునందు వఱలు తఱచగు భావాల్
వినయాంచిత గుణ మయుఁడై
ఘనతరముగఁ గవితలందుఁ గనఁబఱచి యిడెన్!


తే.గీ.
హైదరాబాదు నగరమ్ము సాదరమున
స్వాగతము వల్కఁ దఱలియు వచ్చి, దాని
స్థిరనివాసమ్ముగాఁ గొని, జీవితమ్ముఁ
గడుప మొదలిడి, జనులందు ఘనుఁడునయ్యె!


తే.గీ.
క్రమముగాను నాంధ్రజ్యోతి గారవింప,
వారి దినపత్రికను నొక్క ప్రక్క నున్న
కాలమందు సిటీలైఫ్ వికాసమందఁ
దనదు చిన్న కైతలు వెల్గె దినదినమ్ము!


ఆ.వె.
తనదు కైత చేతఁ దనదైన ముద్రచేఁ
బాఠకుల యెదలును పల్లవింప,
సమసమాజ చేతనమును, నాలోచనా
దృక్పథమునుఁ బెంచి, స్థిరత వెల్గె!


తే.గీ.
ఇట్లొనరఁగఁజేసినయట్టి హితవరులగు
కొద్దిమందిలో నితఁడు నొక్కొండు నయ్యు
వఱలుచునె క్షయ బారినిఁ బడియుఁ దాను
దిరిగిరాని లోకాలకు నరిగెఁ దుదకు!


తే.గీ.
న్యాయవర్తన తోడ ధనార్జనమ్ము
వలయు నంచును దొరికిన వానితోనె
బ్రతుకు సాఁగించి, కైతకై పాటుపడియుఁ,
దనదు కళలనుఁ బ్రజలకై ధారపోసి,
యాకసపు ధ్రువతారయై యడరె నతఁడు!


స్వస్తి



మహామహోపాధ్యాయుఁడు - కోలాచల మల్లినాథ సూరి!


image of kolachala mallinatha suri కోసం చిత్ర ఫలితం

కం.

ఘన కాళిదాస కవి మన
సును నెఱిఁగియు వ్యాఖ్య వ్రాసి సుకవి బిరుదుచే
ఘనుఁడౌ కోలాచల మ
ల్లినాథ సూరిన్ నుతింతుఁ బ్రీతిఁ గవితలన్!


తే.గీ.
కాళిదాస భారవి మాఘ కవుల ఘనత
కుద్దియైన శ్రీహర్షునిఁ గూడ తనదు
వ్యాఖ్యచేతను దెలుఁగుల హర్షితులుగఁ
జేసి మల్లినాథుఁడు వెల్గె స్థిరముగాను!


కం.

సఖ్యతఁ దెలుంగు సంస్కృత
ప్రఖ్యాత కవీంద్ర శాస్త్ర పండితుఁడయ్యున్
వ్యాఖ్యాతృ శిరోమణిగా
విఖ్యాతిం గొని వెలింగె విశ్వమునందున్!


తే.గీ.
ఆ మహామహోపాధ్యాయ ధీమతుఁ డిలఁ
గాళిదాసాది సుకవుల గరిమఁ దెలుప
మున్ను పంచమహాకావ్యములకుఁ దాను
వ్యాఖ్యలను వ్రాసి ప్రాచుర్యపఱచె భువిని!


తే.గీ.
మెతుకు సీమను వెలసియు బ్రతుకునకును
సార్థకతఁ బెంచు సాహిత్య సంస్కృతు లిడి
పఱఁగ విద్యార్థి లోకమ్ము పఠన సేయ,
వ్యాఖ్య లందించి, చిరజీవియై నిలిచెను!


తే.గీ.
కావ్యసౌందర్యమునకు వికసనము నిడి,
రసము చిప్పిల్ల, శయ్యయు రమ్యతఁ గొన,
శ్లోక పద వాక్య సుగతార్థ లోకనుఁడయి
వ్యాఖ్య విరచించె ధీశక్తి పరిఢవిలఁగ!


కం.

మును పెందఱు వ్యాఖ్యాతలు
ఘనముగ వ్యాఖ్యానములనుఁ గావించిననున్
దన వ్యాఖ్యానముచేతను
జన మన మలరార నిల్చె సంస్కృత జగతిన్!


ఆ.వె.
ప్రాఁత పద్ధతులను వదలి, కొంగ్రొత్తవౌ
పద్ధతులను గొనియు వ్రాసె వ్యాఖ్య!
కావ్య సంస్థిత వరకవి హృదయావిష్కృ
తంపు వ్యాఖ్య నిడియు ధన్యుఁ డాయె!


ఆ.వె.
అన్వయమ్ము తోడ, ననపేక్షిత మమూల
విషయ మిడక, తనదు విద్య వెలుఁగ,
సంస్కృతజ్ఞులంత సంతృప్తి పడునట్లు
వ్యాఖ్య వ్రాసి, తాను వఱలె భువిని!


తే.గీ.
పూర్వ వ్యాఖ్యాతృ పాండితీ పూర్ణములగు
వ్యాఖ్యలను వీడి, తనదైన వ్యాఖ్యఁ గొనియు,
బాలకులు సులభమ్ముగఁ బఠన సేయఁ
గలుగు రీతిని విరచించె ఘనతరముగ!


ఆ.వె.
కాకతీయ రాజ్య ఘనవైభవోపేత
భూషితుఁడయి, రాజ పోషణమునఁ
దళుకు లీనఁగా, శతావధానియు నయ్యు,
తనదు ప్రతిభఁ జాటె ధరణిలోన!


తే.గీ.
మందబుద్ధులకును వ్యాఖ్య మహితముగను
నర్థమగు రీతి వ్రాసియు, నవని కెపుడు
శ్రేయమునుఁ గూర్పఁగాను సంజీవనిగను;
సహృదయోల్లాస మిడఁగ రచనము సేసె!


కం.

ఈ రీతిని వ్యాఖ్యానము
సారించియు బాలకులను సంస్కృతమునఁ దాఁ
గోరియుఁ జదువఁగఁ జేసియు
మీఱిన యా మల్లినాథు మెత్తు మనమునన్!




స్వస్తి


బుధవారం, జనవరి 10, 2018

తెలుఁగు భాషా ప్రథమ స్వతంత్ర కవి - పాల్కుఱికి సోమనాథ మహాకవి!

hd image of palkuriki somana కోసం చిత్ర ఫలితం


కందములు:
ఘన కాకతీయ కాల
మ్మునఁ దిరమగు నోరుఁగంటి పురిఁ బాల్కుఱికిన్
జననమ్ము నంది తా వెలిఁ
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!

వారని శివ భక్తియు దై
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వీరమహేశ్వర వ్రతుఁడై
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!

తెలుఁగుం గన్నడ సంస్కృత
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
బులకించె జనుల హృదులునుఁ
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!

శివకవి యుగమ్ము నందునఁ
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
బ్రవిమల కాంతులఁ జిమ్మఁగ
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!

కమనీయ వీర శైవయు
తము బసవపురాణ పండితారాధ్యచరి 
త్రముల విరచించి జనులకు
నమల ద్విపదాఖ్య పద్యహారముల నిడెన్!

అనుభవసారము నెల్లను
ననుభవసార మను పేర నతుల సుకావ్య
మ్మును రచియించియుఁ బ్రజ కిడి
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!

పలుకావ్యాల్ విరచించియుఁ
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
విలువైన రీతిఁ బ్రసరణ
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!

శివభక్తుల కథ లెల్ల న
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
శివ మహిమలఁ జూపించెను
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!

శ్రీ వీరశైవ భూసుర
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
యా వీరశైవ ఘనుఁడే
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!

ఆ మహనీయుని కెనయగు
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
సామాన్యుఁడు కాఁ డాతం
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్! 

స్వస్తి

బుధవారం, జనవరి 03, 2018

భారతదేశపు ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రి బాయి పూలే



తేటగీతులు:

భరతదేశమ్మునందునఁ బ్రథమ మాని
నీ యుపాధ్యాయి సావిత్రి బాయి ఫూలె
సాహసమ్మునకును సమాజావసరపు
టుద్యమమ్ము నడపినట్టి సద్యశోధి!

ఆమెనుం గూర్చి ముచ్చట లాడకుండ
స్త్రీల స్వేచ్ఛాసమానత్వ లీలఁగూర్చి
మాటలాడఁగలేరయ్య మహిళ లెపుడుఁ
దమకు స్వేచ్ఛ నొసంగిన దైవమగుట!

మును మహాత్ముఁడౌ జ్యోతిబా ఫూలె తోడఁ
దన వివాహమ్ము జరిగిన తదుపరి తన
జీవితమె మాఱిపోయె! సుశ్రేష్ఠుఁడైన
భర్త యడుగు జాడలఁ జరింపఁగఁ దలంచె!

కుల వివక్షతకు వ్యతిరేకులయి జ్యోతి
రావు ఫూలె దంపతులు విరామ మిడక,
వంచనకు గుఱియైనట్టి బాధితులనుఁ
జేరఁదీసి, వెతలఁదీర్చి, స్థిరత నిడిరి!

చదువుకొనుటకునుఁ గుటుంబ సభ్యులెంత
వ్యాతిరిక్త్యమ్ముఁ జూపించి, వంకలిడిన,
ధైర్యముగ నిలువంబడి, ధవుని యాజ్ఞఁ
బడసి, సామాజికోద్యమ పాత్రనుఁ గొనె!

భర్త నుండియుఁ బ్రశ్నించు స్పందనలను
నేర్చుకొని, యగ్ర కులపు మన్నెఱికముపయిఁ
దిరుగఁబడి, ఛీత్కృతులు, ఱాళ్ళ దెబ్బలెన్నొ
లెక్క సేయక, తాఁ బ్రజ్వలించె నపుడు!

అల్ప కుల బాలికలను సమాదరించి,
చదువు నేర్పె! కార్మికుల, కర్షకుల కొఱకు
రాత్రి పాఠశాలలను ప్రారంభపఱచి,
వెలుఁగు లిడి, తాను వెలిఁగె సావిత్రిబాయి!

అగ్ర కులములందున్నట్టి యధవలకును
మూర్ధజమ్ములఁ బట్టియు ముండనమునుఁ
జేయ నెదిరించి, మాన్పంగఁజేసి, వారి
యార్తినిం బాపి, రక్షించె నమ్మవోలె!

విధవలకు శరణము నిడు వేశ్మములను
స్థాపనము సేసి, చదువులఁ జక్కపఱచి,
వారి కాళ్ళపై వారి నిల్వంగఁజేసి,
బ్రతుకు నిచ్చి కాపాడె వరాల తల్లి!

పూణెలోఁ బ్లేగు వ్యాపింపఁ బోరి తాను
తనదు తనయుని సాయమ్ముఁ గొనియు వేగఁ
బ్రజలఁ గాపాడి, చివర కా వ్యాధిసోఁకి,
ప్రాణము ల్వీడి, తానేఁగె స్వర్గమునకు!

అట్టి యసహాయ శూరకు, నట్టి ధీర,
కట్టి సంస్కర్త్రి, కట్టి మహాత్మ, కట్టి
మాత, కట్టి సన్నుత దయామయికి నేను
వందనము సేతు నిరతమ్ము డెందమందు!


స్వస్తి

సోమవారం, అక్టోబర్ 02, 2017

గాంధీజీ!

మిత్రులందఱకు
గాంధీ జయంతి పర్వదిన
శుభాకాంక్షలు!

సంబంధిత చిత్రం

మత్తకోకిల:
హే మహాత్మ! మహోన్నతా! ఘన ♦ హేమ భూమి ఫలప్రదా!
రామభక్త! స్వరాజ్య కాముక! ♦ గ్రామ వృద్ధి కృతేప్సితా!
ధీమతా! లవణోద్యమ వ్రత! ♦ దేశభక్తి వికాసకా!
క్షేమ దాయక! నీచ హేయక!! ♦ శిష్ట కీర్తిత నాయకా!!

తేటగీతి:
శ్వేతముఖులను ద్రోలంగఁ ♦ జేసితయ్య
యెన్నియో యుద్యమమ్ముల ♦ నిచట నీవు!
పేదలకు లేని వస్త్రాలు ♦ వీడి నీవు
ముతుక దోవతి కండువల్ ♦ ముఱిసినావు!!

ఆటవెలది:
కరమునందుఁ గఱ్ఱ; ♦ కాళ్ళకుఁ జెప్పులు;
పుట్ట గోచి; యొల్లె ♦ భుజము పైని;
రొండిని గడియార♦ముండ శోభిల్లుచు,
దేశభక్తి నిడిన ♦ దేశికుఁడవు!

చంపకమాల(పంచపాది):

“కుల మత వర్గ జాతి మన♦కున్న తిరోగమనంపు గోడలే;
యిల నివి యున్న, యున్నతియె ♦ యెందును నుండక, భ్రష్టమౌదు; మే
విలువలు లేక, యొండొరు ల♦భీప్సితముల్ దెగటార్చి, శత్రులై
నిలుతురు; కొట్టుకొందు; రివి ♦ నీచములయ్య; త్యజింప మేలొగిన్
గలుగు” నటంచు బోధనలఁ ♦ గాచితివే మన భారతీయులన్!

కందము:
దండమయా గాంధీజీ!
దండమయా బాపు! నీకు ♦ దండము నేతా!
దండము మోహనదాసా!
దండమయా కర్మచంద్ర! ♦ దండములయ్యా!!

-:శుభం భూయాత్:-

ఆదివారం, ఏప్రిల్ 30, 2017

అమరుడవన్నా...విద్యాసాగరన్నా...నీకు జోహార్లు...

నీటిపారుదల రంగ నిపుణులు
తెలంగాణ ముద్దుబిడ్డ
కీర్తిశేషులు
రామరాజు విద్యాసాగర్ రావు గారికి
అశ్రుతర్పణము

Vidyasagar-RAo


నీటి విషయాన జరుగు దుర్నీతినిఁ దెల
గాణ కనులఁ గట్టినయట్లుఁ గాను చూపి
నట్టి యింజనీర్ తెలగాణ కంకితుఁడగు
రామరాజు విద్యాసాగరన్నకశ్రు
తర్పణమ్మందఁజేతును త్వరితముగను!

భౌతికమ్ముగఁ దెలగాణ ప్రజలముందు
నీవు లేకున్నఁ, బారెడి నీటి ధ్వనుల
యందు నీ మాటలు వినెద; మట్లె పొలపుఁ
బచ్చఁదనమందు నీదు రూపముఁ గనెదము!

నీటి విషయాలఁ దెలిపియు, నిప్పు రగులఁ
జేసి, యాంధ్ర నాయకుల దుశ్చేష్టితముల
నెఱుకపఱచియుఁ దెలగాణ నిద్రలేపి
యుద్యమింపఁగఁ జేసితివో మహాత్మ!

కేంద్ర జలసంఘమునను సాంకేతికునిగఁ
బనియుఁ జేసిన యనుభవంబంత మేళ
వించి, సాగునీటినిఁ బంచు విషయమందు
మన తెలంగాణకును జరిగిన దురితము
లిల సహేతుకముగ విమర్శించినావు!

ఆంధ్రజలదోపిడినిఁ దెలంగాణలోని
సకల జనుల కర్థమ్మగు సరళితోడఁ
దెలియఁజేసి, యుద్యమమున స్థిరతమమగు
వెలుఁగు లందఁజేసియు నిట వెలిఁగితివయ!

మన తెలంగాణ యుద్యమ మలిదశ కొక
వైపు జయశంక రింకొకవైపు నీవు
నిలిచి, యుద్యమస్ఫూర్తిని నింపిన ఘన
రాష్ట్ర సాధక యజ్ఞ కర్మఠుఁడవైతి!

"నీరు - నిజములు" పేరిట నిక్కమైన
విషయముల నీవ తెల్పియు, వెంటవెంట
జరుగు పరిణామములఁ దెల్పి, జనుల హృదుల
స్థిరతరమ్మగు స్థానాన స్థిరపడితివి!

"నీరు నిధులు నియామక నియమము" లవి
మన తెలంగాణ యుద్యమమ్మునఁ బునాదు
లయ్య! యిందున నీరమ్మె యత్యవసర
మైన "కాలమ్ము"గా నీకు నమరెనయ్య!!

నీర మీయక కృష్ణమ్మ పారుచున్న,
పఱఁగ గోదారి జలమీక పరుగులిడెడి
యాంధ్ర కుట్రల నెల్లను నందఁజేసి,
ప్రజ యమాయకత్వ సువిదారకుఁడవైతి!

ముఖ్యమంత్రి కేసీయారు ముఖ్యమైన
సలహదారునిగా నుండి, సక్రమమగు
నెన్నొ జల ప్రణాళికలను నెన్నికమెయిఁ
దెలిపి బంగారు తెలగాణఁ దిరపఱచియు
నీరముల సస్యముల నీవె నిలిచితివయ!

ఘనుఁడ! నీటిపారుదలరంగనిపుణుండ!
పుణ్య తెలగాణ తల్లికి ముద్దుబిడ్డ!
జన జల ప్రదాత! జల హృది సంస్థితుండ!
రామరాజ విద్యాసాగరా నమోఽస్తు!

జన్మభూమి నేత్రమ్ముల జాలువారు
బాష్పవారిని నాపఁగఁ బ్రతినఁ బూని,
జీవితమ్మంకితమ్ముగాఁ జేసినట్టి
సుజనసాగర! విద్యన్న! జోతలివిగొ!

నీదు మరణమ్ము తెలగాణ నేల కెపుడుఁ
దీర్చలేనట్టి లోటాయె! తిరముగాను
నీదు చరితమ్ము తెలగాణ నేలయందు
నిలిచి వెలుఁగును, రవిచంద్రు లిల స్థిరముగ
వెలుఁగులనుఁ బ్రసరించుచు వెలయుదాఁక!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


గురువారం, డిసెంబర్ 03, 2015

తెలంగాణ అమరవీరా...శ్రీకాంత్ చారీ...నీకు జోహార్... జోహార్...!!

(నేడు శ్రీకాంత చారి వర్ధంతి)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనులు ఎందరో. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతచారి మరణం యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది. తెలంగాణ ఉద్యమం అనగానే మొదట గుర్తుకొచ్చేది అమరుల త్యాగం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరుగని విధంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం. అరవై ఏళ్ల వివక్షకు చరమగీతం పాడుతూ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.

2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న ఉద్యమనేత కేసీఆర్‌ను పోలీసులు కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా ఉద్యమ కాగడా అయ్యింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జై తెలంగాణ నినాదం చేస్తూ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతచారి భగభగమండిపోయిండు. ఉద్యమ మిత్రులు మంటలార్పేలోపే తీవ్ర గాయాలతో కుప్ప కూలి పోయాడు. ఆస్పత్రిలో అయిదు రోజులు చికిత్సపొందుతూ శ్రీకాంతచారి.. నన్ను బతికించినా మళ్లీ తెలంగాణ కోసం సచ్చిపోతా అంటూ వీరమరణం పొందినాడు. శ్రీకాంతచారి త్యాగం యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఆలోచింపజేసింది. సకల జనులను, సబ్బండ వర్ణాలను రోడ్లపైకి తెచ్చింది. సీమాంధ్ర పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, బంద్‌లతో తెలంగాణ ప్రాంతం అట్టుడుకిపోయింది. 

నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో పుట్టిన శ్రీకాంతచారి ఫిజియోథెరపి కోర్సును చదువుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రాష్ట్రసాధనోద్యమానికి వెన్నుదన్నుగా ఉండేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీకాంతచారి రాష్ట్ర సాధన కోసం హిమాలయాలంత త్యాగం చేశాడు. శ్రీకాంతచారి తెగింపు, త్యాగం తెలంగాణ ప్రజలకు వేగు చుక్కై దారి చూపింది. శ్రీకాంతచారి మన మధ్య లేకున్నా అతని ఆశయం నెరవేరి మన కళ్లముందే కదలాడుతున్నది. శ్రీకాంతచారి ఆశయాల ప్రేమికులుగా బంగారు తెలంగాణ సాధనలో మనమంతా నిమగ్నం కావడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. 



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, సెప్టెంబర్ 09, 2015

మన భాషకు పట్టాభిషేకం...!!!

తెలంగాణ ప్రజలకు, మేధావులకు, బ్లాగు వీక్షకులకు
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు!


ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబర్ 9ని ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. కాళోజీకి తెలంగాణ భాష అన్నా యాస అన్నా అపారమైన అభిమానం. ఆయన రచనలన్నీ కొనసాగింది తెలంగాణ మాండలికంలోనే. ఉమ్మడి రాష్ట్రంలో రెండున్నర జిల్లాల భాషనే దండి భాషగా గుర్తించి అదే ప్రామాణికమైన భాష అని గత ప్రభుత్వాలు నిర్ణయించడం ఒక విధంగా తెలంగాణ భాష, యాసలను అగౌరవపరచడమే అని విశ్వసించిన కాళోజీ, రాష్ట్రంలో చెలామణిలో ఉన్న అన్ని మాండలీకాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే వారు. కాళోజీ కవిత్వంలో మనకు మూడు ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి సరళమైన భాష. రెండవది ధిక్కార స్వరం, మూడవది మానవతావాదం. కాళోజీ తన రచనలలో సరళమైన భాషను ఎంచుకున్నారు కాబట్టే వారు ప్రజలకు దగ్గరైంది. ఒకవేళ కాళోజీ సరళమైన శైలిని ఎంచుకోకపోతే అతని నా గొడవ తన గొడవగానే మిగిలిపోయేది. ఇది మన గొడవగా గానీ మనిషి గొడవగా గానీ మారేది కాదు. అందుకే అతను వేమన వలె అసలు సిసలైన ప్రజాకవి అయ్యారు. 

నాది పలుకబడుల భాష, బడిపలుకల భాష కాదు అని గర్వంగా చెప్పిన కాళోజీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుక భాషలోనే రాయాలి అని చెప్పేవారు. తెలుగు భాషలో ఒక ప్రాంతం భాష ఆధిపత్యం వహించి మిగితా ప్రాంతాల ప్రజల భాషను తక్కువగా చూడడం, న్యూనతకు గురి చేయడం ఎంతమాత్రం అంగీకారం కాదు. కాళోజీకి అన్న విషయాన్ని వారి రచనలే తెలియజేస్తున్నయి. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు, ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు అని నినదించారు. తెలంగాణ భాష యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. కాళోజీ అన్న విషయం...వారు రాయప్రోలు సుబ్బారావు విషయంలో స్పందించిన తీరే ఒక చక్కటి నిదర్శనం. ఉస్మానియా విశ్వవిద్యాల యం తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావుగారు తరచుగా తెలంగాణ భాష యాసలను కించపరుస్తూ మాట్లాడుతుండేవారు. ఇతను గైర్ ముల్కీ. గైర్ ముల్కీ అయిన సుబ్బారావు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పందించారు.

లేమావి చిగురులను లెస్సగా మేసేవు
ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వారిదే కోకిలా నువు
పాడు పాటెవ్వారిదే కోయిలా?
అని సుతిమెత్తగా చురకలంటించిరి.


కాళోజీకి మాతృభాషపట్ల ఎనలేని గౌరవం. మాతృభాషను ఆదరించక పరభాషపై మోజు పెంచుకుని కన్నతల్లి వంటి స్వభాషను నిరాదరణకు గురిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పదించారు.

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలునేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా?

ఇది 1942లో రాసిన కవిత. ఇప్పటికి ఇది మనకు వర్తిస్తుంది. పరభాష మనల్ని మనం మనంగా బ్రతుకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలి అన్న కాళోజీ మాటలు ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్నేళ్లుగా కాళోజీ జన్మదినం రోజును తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా ఆయన అభిమానులు జరుపుతున్నారు. కానీ నేడు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం.


శ్రీశ్రీచే తెలంగాణ లూయి అరగాన్‌గా స్తుతించబడ్డ కాళోజీ ఆలోచనల్లో ఆచరణలో అసలు సిసలైన మానవతావాది. ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే కాళోజీ గొడవంతా సగటు మనిషి గొడవ. అతనికి మానవత్వం పరమావధి. కాళోజీ గొడవ మనిషి గొడవ. కాళోజీకి మానవత్వం పరమావధి. దార్శనిక చరిత్రలో మొదటిసారిగా మానవున్ని కేంద్రంగా చేసి నిర్మించే దర్శనానికి పునాదులు వేసిన తత్త్వవేత్త ప్రొటాగరస్. ప్రొటాగరస్‌తో ప్రారంభమైన మానవతావాదం క్రమంగా అభివృద్ధి చెంది వివిధ రకాల మానవతా వాదాలుగా పరిణామం చెందింది. 


అయితే కాళోజీ మాత్రం అన్నిరకాల మానవతా వాదాలను తనలో విలీనం చేసుకున్న వ్యక్తి. అతనిదొక విశిష్ఠమైన మానవతావాదం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా అంటాడు. నానా యిజాల అడుగున చూడ నా యిజందే అగుపడును జాడ అని. మానవుడే అన్నింటికి కొలమానం అనే తాత్త్విక చింతనను ప్రొటాగరస్ నుంచి, ప్రశ్నించే స్వభావం వున్నవాడే మనిషి అని చెప్పే దార్శనిక ధోరణి ని ఎం.ఎన్. రాయ్ నుంచి ఈ విధంగా వివిధ దార్శనికుల విషయాలన్నింటిని తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. ప్రహ్లాద చరిత్రకు కాళోజీ ఇచ్చిన భాష్యంలో ప్రశ్నించే స్వభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి రచనలన్నింటిలో మొదటి నుంచి చివర వరకు మానవతావాదానికి సంబంధించిన కోణం ఆవిష్కరింపబడ్డది. మానవుని మూర్తిమత్వ వికాసానికి దోహదపడని ఏ యిజాన్ని అయినా సరే అతడు ఈసడించుకునేవాడు. అతని దృష్టిలో సంఘాలు నియమాలు సాంప్రదాయాలు మనిషిలోని కుళ్లుకు మారురూపాలు. అతను ఆశించిన సమాజం మానవుని మానవుని మాదిరిగా చూడగలిగే సమాజం. అందుకే అతడు ప్రజాస్వామ్య విలువలకు గాని పౌరహక్కులకు గాని భంగం వాటిల్లితే సహించేవాడు కాదు. పౌరహక్కులకు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగినప్పుడు కాళోజీ స్పందించిన విధానాన్ని అపార్థం చేసుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. కాళోజీ హింసావాది అని... నక్సలైట్ అని... అనడం జరిగింది. కాళోజీ నా గొడవలో ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పు కాదు అని. 


హింస, ప్రతిహింస, రాజ్యహింసల మధ్య వ్యత్యాసం నిర్వచనాలు తెలువని వారే కాళోజీని అపార్థం చేసుకున్నది. కాళోజీ తాత్త్విక దృష్టిలో దౌర్జన్యాలను ఎదిరించే ప్రతి మనిషి ఒక ఉగ్రనరసింహుడే. తిరుగుబాటే బతుకుబాటగా మనిషి ఎంచుకోవడానికి కారకులు పాలకులు అని అతని విశ్వాసం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు అని. ఎం.ఎన్. రాయ్ జయప్రకాష్ నారాయణ వలె పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఆదరించినవాడు కాళోజీ. ప్రజాస్వామ్య విలువలను తనలో సంపూర్ణంగా జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరమైతే నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడుతాను అన్న వోల్తేర్ ప్రజాస్వామిక దార్శనిక భావాలను తనలో సంపూర్ణంగా జీర్ణించుకున్న వ్యక్తి కాళోజీ.

తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రజా సంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన స్వరాన్ని వినిపించాడు. అణగారిన ప్రజల కోసం తన గళమెత్తాడు. తెలుగు ప్రజల పౌరహక్కుల కోసం శ్రమించాడు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచినప్పుడల్లా వారి ధర్మాన్ని గుర్తు చేశాడు. పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాశ్ నారాయణ్ గూర్చి కాళోజీ చెప్పిన మాట కాళోజీ జీవితానికి అక్షరాల వర్తిస్తుంది. ఒక దార్శనికుడు మరణించినంత మాత్రాన అతని దర్శనం అంతరించిపోదు. కాళోజీ ఈనాడు భౌతికంగా మన మధ్య లేకున్నా అతని భావాలు మాత్రం మనిషి గొడవగా సగటు మనిషి ఉన్నంతకాలం ఉంటాయి. మన భాష, మన పలుకుబడులకోసం ఇపుడు మన స్వతంత్ర రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరగడం గర్వించతగింది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



మంగళవారం, ఆగస్టు 25, 2015

తెలంగాణ చైతన్య దీపిక...!!!


డాక్టర్ దేవులపల్లి రామానుజరావు 20వ శతాబ్దిలో ఐదు దశాబ్దాల కాలం భాషా సాంస్కృతిక వికాస యుగాన్ని శాసించారు. రేయింబవళ్లు పాటుపడ్డారు. తెలుగునాట రామానుజరావు కవి, రచయితలకు, పండితులకు తలలోని నాలుకగా మసలుకున్నారు. ఎక్కిన ప్రతీ వేదిక మీద కంచుకంఠంతో సారభూతమైన ప్రసంగాలు చేసి విమర్శకులను మెప్పించారు. కవిగా, వక్తగా, పత్రికా సంపాదకునిగా, బహుభాషావేత్తగా, విద్యావేత్తగా నిరంతరం బహుకార్యమగ్నులై సఫలజీవనం గడిపారు.


1942లో తెలంగాణ పేరుతో దినపత్రిక హైదరాబాద్ నుంచి వెలువడింది. ఆ పత్రిక సంపాదకవర్గంలో చేరమని కోరుతూ మాడపాటి హనుమంతరావు రామానుజరావుకు లేఖ రాశారు. అయితే అప్పటికే నాగపూర్‌లో న్యాయకళాశాలలో చేరడంవల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.


నిజాం కాలంలో పాఠశాలలు తక్కువ. అక్షరాస్యత మరీ తక్కువ. మొత్తం జనాభాలో ఉర్దూ భాషీయులు పదిశాతమే అయినా నిజాం ఉర్దూను అధికార భాషగా అమలు పరిచారు. తెలుగు చదివే అవకాశాలులేవు. పైగా తెలుగు చదవడం, మాట్లాడటం నేరమన్నట్లు చూసేవారు. హిందువులు సైతం షేర్వానీ, పైజామా ధరించేవారు. ఇళ్ళలో, బంధుమిత్రులు, ఇతరులతో ఉర్దూలోనే మాట్లాడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగును నిలబెట్టడానికి 1943మే 23న ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. తొలి అధ్యక్షులు లోకనంది శంకరనారాయణరావు. మలి అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి. దేవులపల్లి రామానుజరావు నాగపూర్‌లో న్యాయశాస్త్ర పట్టభద్రులై తిరిగిరాగానే ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభ్యునిగా చేరారు. 


పరిషత్తు మొదటి వార్షిక సభలు వరంగల్ కోటలో తెలంగాణ తెలుగు ఆత్మగౌరవ ప్రదర్శకంగా జరిగాయి. ఉదయరాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావు కార్యదర్శిగా ఉన్నారు. కోటలో కవి సమ్మేళనం కోసం వేసిన పందిరిని రజాకార్లు తగులబెట్టారు. అయినప్పటికీ జంకక యథావిధిగా కార్యక్రమం నిర్వహించుకోవటంలో రామానుజరావు చేసిన కృషి కీలకమైంది. ఆ సభల్లో ఆయన తెలంగాణలోని ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించిన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాశరథి అక్కడే రామానుజరావుకు తొలిసారి పరిచయం కావడమే గాక ప్రదర్శనను ప్రారంభించి అభినందించారు.


నాగపూర్‌లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం చేస్తున్నకాలంలో పి.వి.నరసింహారావు రామానుజరావుకు సహాధ్యాయి. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు, అవధానాలు, గ్రంథాలయాలు, నవలలు, పత్రికలు రామానుజరావును తెలుగు సాహిత్యం వైపు ఆకర్షించాయి. సికింద్రాబాద్‌లో సత్యహరిచంద్ర నాటక కర్త బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిని కలుసుకున్నారు. ఆయన స్వయంగా ఒక పాత్ర ధరించి ప్రదర్శించిన ఆ నాటకాన్ని రామానుజరావు మిత్రులతో కలిసి వీక్షించారు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషతుకు అనతికాలంలోనే రామానుజరావు కార్యవర్గ సభ్యుడై, 1949లో ఉపాధ్యక్షుడయ్యారు. పరిషత్తు పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా యావజ్జీవితం పరిషత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం వెచ్చించారు. సారస్వత పరిషత్తు శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 


పరిషత్తు ఎన్నో గొప్ప గ్రంథాలను ప్రచురించింది. నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ప్రాచ్యకళాశాల, పండితశిక్షణ కళాశాల ఏర్పాటైంది.1953 జనవరిలో పరిషత్తు సప్తమ వార్షిక సభలు మూడు రోజులపాటు ఆలంపురంలో జరిగాయి. దేవులపల్లి రామానుజరావు పరిషత్తు అధ్యక్షుల హోదాలో సభలకు అధ్యక్షులయ్యారు. నాటి ఉప రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు మహామహులైన కవి పండితులు సభల్లో పాల్గొన్నారు. చూడటానికి పొట్టివాడైనా సాహిత్యకృషిలో విరాణ్మూర్తిగా పేరుపొందిన రామానుజరావుకు ఈ కృషిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రెండు భుజాలుగా, రెండు అద్భుత వేదికలుగా ఉన్నాయి.


దేశానికి స్వాతంత్య్రం రాగానే అన్ని రాష్ర్టాల్లో వలెనే 1957లో ఆంధ్రప్రదేశ్‌లోనూ సాహిత్య అకాడమీ ఏర్పడింది. మొట్టమొదట బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా, విశ్వనాథ సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు గొప్ప సాహితీవేత్త అయినా జాతీయస్థాయిలో బహుకార్య నిమగ్నులైవుండటం వల్ల ఆయన పనులను, తమ పనులను రామానుజరావే చూసేవారు. అకాడమీ పక్షాన శతాధిక గ్రంథాలు ముద్రించారు. ప్రముఖుల జయంతులు,వర్ధంతులు నిర్వహించారు. రచయితలు తమ పుస్తకాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించేవారు. 


ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు బహూకరించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోపాలరెడ్డి, రామానుజరావుల సారథ్యంలో సాహిత్యానికి నిత్యకళ్యాణం పచ్చతోరణంలా పండుగలు చేసేవారు. ఆయన తలపెట్టిన, నిర్వహించిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయం కావలసిందే. విజయం కోసం రామానుజరావు చూపిన పట్టుదల, చేసిన పరిశ్రమ అలాంటిది. స్వయంగా ఏ సభలోనైనా, ఏ విషయం మీదనయినా క్లుప్తంగా, సారభూతంగా ప్రసంగించి పండితుల మెప్పుపొందే శక్తిమంతులు. 


తెలుగు, ఆంగ్లం, ఉర్దూ తదితర అనేక భాషల్లో పండితులు. సాహిత్యమే గాక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల గురించి సమగ్రమైన అవగాహన కలిగినవారు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరికీ లొంగేవారు కారు. ప్రజాస్వామ్యవాది. అధికారాన్ని ఎవరిపైనా చెలాయించక వస్త్వాశ్రయదృష్టితో వ్యవహరించేవారు. సాహిత్యంలో ఆనాటి పరిణామాలు, ధోరణులన్నీ ఆయనకు కరతలామలకం. కవి రచయితల కృషిపై ఎవరూ చెప్పనవసరం లేకుండా సొంతంగా అంచనా కలిగి ఉండేవారు. అందువల్లనే ప్రతిభకు తగిన గుర్తింపు అడగకనే అందేలా చూసేవారు.


రామానుజరావుకు తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితి, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి అనేక ఇతర సంస్థలు, వ్యవస్థలతో సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తృతిలో ఆయన ప్రత్యక్ష పాత్రవుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా పదేళ్లు సేవలందిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిండికేటు, సెనేట్ సభ్యునిగా వైస్ ఛాన్స్‌లర్‌గా విశ్వవిద్యాలయ విద్యా కార్యక్రమాలపై ప్రభావం చూపారు.


ఐదు దశాబ్దాల పాటు తెలంగాణను కేంద్రంగా చేసుకొని యావత్ తెలుగు నేలలో సమున్నత వ్యక్తిత్వంతో భాసించారు దేవులపల్లి రామానుజరావు. ఆధునిక తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్ది స్వర్ణయుగమైతే ఆ బంగారం పండటంలో నీరుపోసి పెంపు చేసిన రైతుపాత్ర రామానుజరావుది. తెలంగాణ వైతాళికుల్లో అగ్రాసనాన నిలపదగిన అతికొద్ది మందిలో రామానుజరావు ఒకరు. తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసిన వారిలో అగ్రగణ్యులు రామానుజరావు. ఆయన పెంచి పెద్ద చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నేటికీ వర్ధిల్లుతూ వారి స్మృతిని పచ్చగా కాపాడుతున్నది.


వ్యాస రచయిత:
- డాక్టర్ జె.చెన్నయ్య


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, జులై 28, 2015

అబ్దుల్ కలాంకు అశ్రు నివాళి..


అబ్దుల్‌కలాం తమిళనాడులోని రామేశ్వరంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో అనేక కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు చదివారు. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా సాగిన కలాం ప్రస్థానంలో ఆయన దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివి. శాస్త్రవేత్తగా కెరీర్ ప్రారంభించిన కలాం దేశం గర్వించదగిన స్థాయికి చేరుకున్నారు. అరవయ్యో దశకంలో డీఆర్‌డీఓలో శాస్త్రవేత్తగా ఆయన దేశానికి అనేక విజయాలు అందించారు.

భారతదేశపు  పదకొండవ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మరణంతో భారత శాస్త్ర, సాంకేతిక రంగం మార్గదర్శకున్ని, పెద్దదిక్కును కోల్పోయింది. కలాం శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి అంతా ప్రజల కోసమేనని చాటి చెప్పారు. సైన్సును ప్రజల కోసం వినియోగించడంలో అగ్రభాగాన నిలిచారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజల ముందు తలవంచి నిలిచేలా చేసిన కలాం తనదైన ప్రజానుకూల దృక్పథంతో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. భారత అణ్వస్త్ర పితామహుడిగా, క్షిపణి రంగ రూపశిల్పిగా దేశానికి సేవలందించి భారత కీర్తిపతాకను విశ్వ వినువీధిలో సమున్నతంగా నిలిపారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించిన కలాం పీఎస్‌ఎల్ వీ, ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. కలలు కనండి వాటి సాకారం కోసం కష్టపడండి అన్న ఆయన మాటలు కోట్లాదిమంది యువతకు ఆదర్శం. భారత అణుశాస్త్ర పితామహుడిగా రక్షణ రంగంలో కలాం చేసిన కృషి మన దేశ ప్రతిష్ఠను ప్రపంచపటంలో నిలబెట్టాయి. దేశంలో ఆయన స్ఫూర్తితోనే అనేకమంది అంతరిక్ష శాస్త్రవేత్తలు వచ్చారంటే అతిశయోక్తి కాదు.

ఆధునిక టెక్నాలజీతో అమెరికా, రష్యా లాంటి దేశాలు అందనంత ముందుకు దూసుకుపోతున్న సమయంలో అంతరిక్ష నౌకలకు రూపకల్పన చేసి విజయవంతంగా ప్రయోగించారు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్ తదితర క్షిపణులు కలాం కృషితో భార త అమ్ములపొదిలోకి చేరాయి. కలాం అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ క్షిపణులకు రూపకల్పన చేయడం విశేషం. 1998 పోఖ్రాన్-2 అణు పరీక్షలో కీలకమైన సంస్థాగత, సాంకేతిక పాత్ర పోషించారు. అలాగే శాస్త్రసాంకేతిక రంగాలు ప్రజల జీవనంలో సమూల మార్పుకు, జీవన ప్రమాణాలు వృద్ధి చెందేందుకు కృషిచేయాలని చెప్పడమే కాదు, ఆచరణలో నిజం చేసిన ఆయన, ప్రజల జీవనంలో మౌలిక మార్పుకోసం కృషి చేశారు. నగర ప్రజలకు అందుబాటులో ఉన్న సాంకేతికతను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పుడే నిజమైన అభివృద్ధి మార్పు సంభవిస్తుందని చెప్పి ప్రొవిసన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ టుం రూరల్ ఏరియాస్ (పురా)కు రూపకల్పన చేశారు.

శాస్త్రవేత్తగా అబ్దుల్‌కలాం చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. అంతేకాదు ఆయనను ఈ దేశ పదకొండవ రాష్ట్రపతిగా ఎంచుకుని సమున్నతంగా గౌరవించింది. దానికనుగుణంగానే ఆయన ఒక సంక్లిష్ట సమయంలో రాష్ట్రపతి పదవి చేపట్టి భారత ప్రథమ పౌరుని కర్తవ్యాలను నెరవేర్చారు. ప్రజల రాష్ట్రపతిగా ఆయన పేరు గడించారు. అత్యున్నత స్థానంలో ఉన్నా పిల్లలకు దగ్గరైన వ్యక్తుల్లో నెహ్రూ తర్వాత స్థానాన్ని కలాం దక్కించుకున్నారు. ఆయన చివరి శ్వాస వరకు పిల్లలతోనే ఉన్నారు. కలాం తన జీవిత కథను వింగ్స్ ఆఫ్ ఫైర్‌గా వెలువరించారు. ఇంగ్లీషులో ముద్రించిన ఈ పుస్తకాన్ని తర్వాత పదమూడు భాషల్లోకి అనువదించారు. బ్రెయిలీ లిపిలో కూడా ఈ పుస్తకం ముద్రితమవడం విశేషం.
క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని.., వైద్యశాస్ర్తానికి జోడించి సేవలందించాలని కలాం కలలు కనేవాడు.

ఆ కలలకు అనుగుణంగా ఆయన హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో పనిచేస్తున్నప్పుడు ప్రఖ్యాత కార్డియాలజిస్టు సోమరాజుతో కలిసి తన ఆలోచనలను పంచుకున్నాడు. వీరివురి కృషి, ఆలోచనల్లోంచే గుండె సంబంధ రోగాలనుంచి కాపాడే స్టెంట్ తయారీకి అంకురార్పణ జరిగింది. ఈ ఆలోచనామృతంలోంచే.. కలాం-రాజు స్టెంట్ తయారై ఇవ్వాళ వేలాది మందికి శ్వాసను నిలుపుతున్నది. క్షిపణి శాస్త్ర విజ్ఞానాన్ని వైద్యశాస్త్రంతో జోడించి ప్రజలకు సేవలందించాలన్న ఆయన కలల లోంచి ఉద్భవించిన కలాం- రాజు స్టెంట్ ఎందరినో హృద్రోగం నుంచి కాపాడితే.. అదే గుండెపోటుతో కలాం తుదిశ్వాస విడవటం విషాదం. అత్యున్నత రాష్ట్రపతి పదవిని ప్రజల ముంగిట నిలిపి ప్రజలందరికీ ప్రేమను పంచిన అబ్దుల్ కలాం అమరుడు.


అబ్దుల్ కలాం మాట..

-యువతకు ముఖ్యంగా నేనిచ్చే సందేశం ఏంటంటే.. భిన్నంగా ఆలోచించే సాహసం చేయండి. ఆవిష్కరణల్లో సాహసం చూపండి. ఎవరూ వెళ్లని దారిలో వెళ్లండి. అసాధ్యమనుకొనే దానిని కనిపెట్టేందుకు సాహసం చేయండి. సమస్యలను జయించండి. విజయాన్ని ఒడిసి పట్టండి. ఈ గొప్ప లక్షణాలను యువత తప్పక అలవర్చుకోవాలి.

-నా దృష్టిలో నాయకుడంటే లక్ష్యమున్నవాడు. అభిరుచి ఉన్నవాడు. సమస్యను చూసి భయపడకుండా దానిని ఎలా ఓడించాలో తెలిసినవాడు. పూర్తి చిత్తశుద్ధితో పనిచేయటం నాయకుడికి ఉండాల్సిన అత్యంత ముఖ్య లక్షణం.
-గొప్ప వ్యక్తులకు మతమంటే స్నేహాన్ని పెంపొందించేంది. అల్పులకు అది కొట్లాడుకొనేందుకు ఒక సాధనం.
-ఒకదేశం అవినీతి రహితం కావాలన్నా, గొప్ప మేధస్సులతో నిండాలన్నా సమాజంలో ముగ్గురివల్లనే సాధ్యమని నేను బలంగా నమ్ముతాను. వారే తల్లి, తండ్రి, గురువు.

-ప్రస్తుతం నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే కొనసాగుతున్నందున మనకు ఇంగ్లిష్ తప్పనిసరి. మన భాషల్లో నిజమైన వైజ్ఞానిక కార్యకలాపాలు మొదలవ్వటానికి మరో రెండు దశాబ్దాలు పడుతుందని నేను భావిస్తున్నాను. అప్పుడు మనం కూడా జపనీస్‌లాగా ముందుకు సాగవచ్చు.
-మనిషికి కష్టాలూ అవసరమే.. ఎందుకంటే కష్టాలు ఉన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలడు.
-విద్యార్థికి ఉండవల్సిన అతిముఖ్య లక్షణాల్లో ఒకటి ప్రశ్నించటం. విద్యార్థులారా ప్రశ్నించడం నేర్చుకోండి.
-మనం స్వేచ్ఛగా లేకపోతే.. ఎవరూ మనల్ని గౌరవించరు.
-కవిత్వమనేది అత్యున్నతమైన సంతోషం నుంచి లేదా అత్యంత విచారం నుంచే వస్తుంది.


జై హింద్      జై అబ్దుల్ కలామ్




ఆదివారం, జూన్ 28, 2015

స్ఫూర్తి ప్రదాత!!!


(నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి)

నేడు పీవీ నరసింహారావు 94వ జయంతి. ఆయన రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం నేటి అవసరం. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించడం, పాఠ్యాంశాలలో ఆయన జీవిత చరిత్రను చేర్చడం అభినందనీయం. ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను మలుపు తిప్పిన పీవీ భారత చరిత్రలో ఒక మైలురాయి. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి రాష్ర్ట మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా చేసిన కృషి చరిత్రాత్మకమైనది. బహుభాషా కోవిదుడైన పీవీ సాహిత్యాన్ని ఎక్కువగా చదివేవారు. 


1946-50 మధ్య కాకతీయ పత్రిక నిర్వహణలో తలమునకలై తన సృజనాత్మకతకు, జర్నలిజానికి మెరుగులుదిద్దుకున్నారు. అనేక కథలు, వ్యాసాలు కలం పేర్లతో రాశారు. విశ్వనాథ సత్యనారాయ ణ వేయిపడగలు నవలను సహస్ర ఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. తన జీవితాన్ని రాజకీయాలలోని అనేక పార్శ్వాలను ఇన్‌సైడర్ (లోపలి మని షి) పేరుతో ప్రచురించి సంచలనం సృష్టించారు.


కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో 1921 జూన్28న జన్మించారు. పీవీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నందుకు యూనివర్సిటీ నుంచి వెళ్ల గొట్టారు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చేర్చుకొమ్మని కోరితే నిరాకరించిన ఘన త సీమాంధ్రులది. దాంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకు న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పీవీ మం త్రిగా, ముఖ్యమంత్రిగా విద్యా, ఉద్యోగ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు.


శ్రీకాకుళ నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన భూ పంపిణీ గురించి లోతుగా ఆలోచించి భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చారు. సీలింగ్ వల్ల భూములు కోల్పోతున్న సీమాంధ్ర పెత్తందార్లు, భూ స్వాములు కలిసి జై ఆంధ్ర ఉద్యమం 1972లో ప్రారంభించి ముఖ్యమంత్రి పదవి నుంచి పీవీ దిగేదాకా విశ్రమించలేదు. ఆ తరువాత గవర్న ర్ పరిపాలన ప్రకటించబడింది. తరువాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. పీవీ ఇందిరాగాంధీ నాయకత్వంలో అనేక పదవులు చేపట్టి తనను తాను నిరూపించుకున్నారు. అనేక సభల్లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రసంగాలకు అనువాదకులుగా వ్యవహరించారు.


పీవీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నప్పుడు పేద, గ్రామీణ విద్యార్థుల కోసం.. పట్టణ, నగర, ప్రైవేట్ విద్యారంగం కన్న ఉన్నతంగా విద్యావకాశం కల్పించాలని జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. త్రి భాషా సూత్రాన్ని అనుసరించి ఉత్తర భారత దేశంలోని అనేక నవోదయ పాఠశాలలో తెలుగును పాఠ్యాంశంగా నేటికీ చదువుతున్నారంటే, తెలుగు పండిట్‌లు ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పనిచేస్తున్నారంటే అదంతా పీవీ ముందుచూపు వల్లనే సాధ్యపడింది. రాజీవ్ గాంధీ అకాల మరణం తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోయింది.


మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీవీ బయటి నుంచి ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకానికి, అలా ఎన్డీఏ, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాలకు మార్గదర్శనం చేశారు. ఆర్థిక సంస్కరణల పితామహుడుగా నిలిచిపోయారు. మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు ఓబీసీలకు కేంద్ర సర్వీసులలో 27 శాతం రిజర్వేషన్లను అమలు జరిపి చరితార్థులయ్యారు.


పీవీ 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా 10వ ప్రధాన మంత్రిగా పనిచేశారు. పీవీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయింది. ఇతర దేశాల్లో బంగారం కుదువ పెట్టుకొని వెళ్లదీసి న కాలమది. అలాంటి దశలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ దృక్పథంతో ముందుకు సాగారు పీవీ. ఆ సందర్భంగా వామపక్షాలు, ఇతర విపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోశాయి. దేశాన్ని ఇతర దేశాలకు అమ్మేస్తున్నారని విమర్శించారు.


కానీ రాజీవ్ గాంధీతో ప్రారంభమైన ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం, టెలిఫోన్, టీవీ, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసింది. ఆ క్రమాన్ని మరొక మలుపులోకి పీవీ తీసుకువెళ్లారు. ఆర్థిక సంస్కరణల కోసం అప్పటికే అర్థికశాస్త్రవేత్తగా సుప్రసిద్ధులైన మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక శాఖ మం త్రిగా నియమించి సంస్కరణలను వేగవంతం చేశారు. పీవీ దూరదృష్టి ఎంత గొప్పదో నేడు అందరికీ తెలిసి వస్తున్నది. దక్షిణాది నుంచి తొలిసారిగా ప్రధాన మంత్రి పదవి చేపట్టిన పీవీ భారత చరిత్రలో మహోన్నతమైన అధ్యాయాన్ని సృష్టించారు. అరుదైన నేతగా పేరుగాంచారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం గా నిలిచారు. తెలంగాణ మట్టినుంచి ఎదిగిన మహా నేతగా ఆయన చూపిన మార్గం మనందరికి ఆదర్శం. 


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



గురువారం, ఆగస్టు 07, 2014

గురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసిరావుగారికి నివాళులు...


దివి: ఆగస్టు 07, 2014 నాడు పూజ్యులు, గురుమూర్తులు, తెలుగు ఆధ్యాత్మరామాయణ కర్త, ప్రముఖ అష్టావధాని, సత్కవి, పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...

సీ.
శంకరాభరణ సత్సాహితీ కవిగణ
స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;

తే.గీ.
ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
స్వర్గమేగిన నేమాని పండితార్య!
మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!

-oO: "స్వస్తి" :Oo-

మంగళవారం, జులై 22, 2014

ప్రజల గుండెల్లో కొలువైన సాహితీవేత్త...దాశరథి కృష్ణమాచార్యులు!

బ్లాగు వీక్షకులకు, తెలంగాణ ప్రజలకు
తెలంగాణ కవి దాశరథి జన్మదిన శుభాకాంక్షలు!

"నా తెలగాణ కోటి రతనమ్ముల వీణ"యటంచుఁ బల్కి, తా
నేతగనుండి, పోరి, చెఱనిల్చి, "నిజాము పిశాచమా మహా
భూతమ"యంచుఁ బిల్చి, మన పూర్వపుఁ దెల్గుల విల్వఁ బెంచు ధీ
దాతయు, శక్తియుక్తుఁడగు దాశరథే మన మార్గదర్శియౌ!
-గుండు మధుసూదన్

-నేడు దాశరథి 89వ జయంతి
-దాశరథి సేవలను కొనియాడిన సీఎం కేసీఆర్ 
Dasaradhi

పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. మంగళవారం దాశరథి 89వ జయంతి సందర్భంగా ఆయన సాహితీ సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను, కష్టాలను అగ్నిధార పేరుతో పద్యాల రూపంలో రాసి, వినిపించి ప్రజల్లో చైతన్యం కలిగించిన గొప్ప మనిషి దాశరథి అని ఆయన సోమవారం ఓ ప్రకటనలో కీర్తించారు.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడని పేర్కొన్నారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పాండిత్యం గల దాశరథి కథలు, నాటికలు, సినిమా పాటలు రాయడమే కాకుండా, రేడియో ప్రయోక్తగా కూడా విభిన్న రూపాల్లో తన సాహితీ సేవలను అందించారని కొనియాడారు. దాశరథి లాంటి వారి కృషి ఫలితంగానే తెలంగాణ సమాజం నిత్య చైతన్య స్రవంతిలో ప్రయాణం చేసిందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి మహనీయులను కేవలం స్మరించుకోవడమే కాకుండా తరతరాల పాటు వారి నుంచి స్ఫూర్తి పొందేవిధంగా కార్యక్రమాలు రూపొందించుకుంటామని ప్రకటించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శుక్రవారం, జులై 11, 2014

తెలంగాణ వైతాళికుడు.. జల ప్రదాత..నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌!

- నేడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌ జయంతి

- ఇంజినీర్స్ డేగా గుర్తింపునిచ్చిన తెలంగాణ సర్కార్
navab

తెలంగాణ సాగునీటిరంగ వైతాళికుడు, జలరంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌కు ఎట్టకేలకు మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో సాగునీటిరంగానికి ఆద్యుడిగా నిలిచిన నాటి ఇంజినీర్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డే గా గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవాబ్‌అలీ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జలసౌధలో ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది.

ఈ సందర్భంగా భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నవాబ్‌అలీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సర్‌ఆర్థర్ కాటన్ ఎలాంటి వారో తెలంగాణకు నవాబ్‌అలీజంగ్ అలాంటి వారని అంటారు. కానీ కాటన్ కంటే నవాబ్ అలీ ఎక్కువ సేవలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చరిత్రను గుర్తించకపోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ ఇంజినీర్లు తప్పుపడుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రావడంతో నవాబ్‌అలీ జయంతిని ఇంజినీర్స్ డేగా ప్రకటించాలన్న వారి డిమాండ్ నెరవేరింది.

తెలంగాణ జల ప్రదాత

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నిజాంసాగర్ వరకు నవాబ్‌అలీ ముద్ర కనిపిస్తుంది. 1877లో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అలీ.. ఇంజినీర్‌గా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో విశేష సేవలందించారు. ఇంగ్లాండ్‌లోని కూపర్ హిల్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1905నుంచి 1948వరకు తెలంగాణలో సాగునీటిరంగానికి విశేష సేవలందించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్, వైరా, పాలేరు, నిజామాబాద్ పోచారం, డిండి ప్రాజెక్ట్, కరీంనగర్ అప్పర్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లకు, ఉస్మానియా దవాఖానా.. ఇలా ఎన్నింటికో రూపకల్పన చేసిన ఆయన సేవలను దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించి, జాతీయ ప్రణాళిక కమిషన్ సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఇంజినీర్‌ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంపై ఇంజినీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్ శుభాకాంక్షలు

ఇంజినీర్స్‌డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను బంగారు బాటలో నడిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలీ వంటి ఇంజినీర్లు ఆనాడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఇంజినీర్లు బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శనివారం, జూన్ 28, 2014

పదవులకే ఠీవి.. మన పీవీ

-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు
-అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి
-దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ
-మాజీ ప్రధానిని పట్టించుకోని ప్రభుత్వాలు
-పరాయిపాలనలో తెలంగాణ బిడ్డల విస్మరణ
-ఇకపై ఆ దుస్థితి కొనసాగొద్దంటున్న సీఎం కేసీఆర్
-తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రత్యేక గుర్తింపు
-పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం
PV
పాములపర్తి వెంకట నరసింహారావు.. తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆ బిడ్డ ప్రజాజీవితంలో అంచెలంచెలుగా ఎదిగి క్లిష్ట సమయంలో భారతదేశ ప్రధానిగా ఐదేండ్లపాటు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయంగా తన ప్రత్యేకతను చాటిచూపిన నేత. మృదుస్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోం, విదేశాంగ, రక్షణ మంత్రిగా రాణించారు. పదవులకు వన్నె తెచ్చారు. తన రాజనీతిజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం క్లిష్ట సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి, అనంతరం ప్రధానిగా ఐదేండ్లు రాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో నిరాటంకంగా పరిపాలన కొనసాగించారు.

ఆ బిడ్డకు జన్మనిచ్చింది ఈ తెలంగాణ గడ్డ. పోరు తెలంగాణ నుంచి ఎదిగి రాజకీయ సమరంలో విజయభేరి మోగించారు. 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న 83 ఏండ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. ఆయన 93వ జయంతి నేడు. అంతటి గొప్ప పదవులు నిర్వహించిన ఆ నేతను ఇంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సముచితరీతిలో గౌరవించలేదు. ఇక్కడ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఇంతకాలం పరాయిపాలనలో విస్మరణకు గురయిన తెలంగాణ బిడ్డల జీవితాలను, చరిత్రలను సమాజానికి, ఈ తరానికి తెలియజేయాల్సిందేనని సంకల్పించింది. తెలంగాణ పోరాట వారసత్వ స్ఫూర్తితోనే పోరాడి గెలిచి తెలంగాణను సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం ఇప్పుడు పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. వివిధ రంగాల్లో రాణించిన తెలంగాణ బిడ్డల ఘనతను చాటిచెప్పే యత్నంలో ఇది తొలి అడుగు.

తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన పీవీ నరసింహారావు తెలుగు నేలపైనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం తన ప్రత్యేకతను చాటిచెప్పారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి, వందేమాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులై, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లో అడుగుపెట్టారాయన. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి, నూతన విధానాలకు నాంది పలికారు. భారతదేశంతో విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కృషి సలిపారు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఆయన జీవిత విశేషాలను గుర్తుచేసుకుందాం.

వరంగల్ జిల్లాలో పుట్టి.. కరీంనగర్ జిల్లాలో పెరిగి..

పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించారు. మూడేండ్ల వయసులో పీ రంగారావు, రత్నాబాయి దంపతులు దత్తత చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందేమాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుకుగా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పుణె ఫెర్గొసన్ కాలేజీలో బీఎస్సీ అంతరిక్ష పరిశోధన (ఆస్ట్రానమి), ఆ తర్వాత నాగ్‌పూర్ యూనివర్సిటీ నుంచి లా పూర్తిచేశారు. ఎల్‌ఎల్‌బిలో ఆయన గోల్డ్‌మెడల్ సాధించారు. అనంతరం హిందీలో సాహిత్యరత్న చేశారు. నాడు నిజాం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పీవీ కీలక పాత్ర పోషించారు. 

రాజకీయాల్లో అంచెలంచెలుగా..

1940లో రాజకీయాల్లో ప్రవేశించిన పీవీ తాను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొనసాగారు. స్వామి రామానందతీర్థ పీవికి రాజకీయ గురువు. రామానంద తీర్థకు ముగ్గురు ప్రియశిష్యులు. వారిలో పీవి మొదటివారు. మరో ఇద్దరు ఎస్‌బీ చవాన్, వీరేంద్రపాటిల్. ఈ ముగ్గురు కూడా ఆయా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా పనిచేయడం గమనార్హం. వీరిలో పీవిని ప్రధాని పదవి వరించింది. ఆయన ఐదేండ్లపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు.

1952లో పీవీ తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి కమ్యూనిస్ట్ నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1984, 1989 లోక్‌సభ ఎన్నికల్లో హన్మకొండతోపాటు మహరాష్ట్రలోని రాంటెక్ లోక్‌సభ స్థానాల నుంచి పీవీ పోటీచేశారు. 1991 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది.

అప్పటికి పార్లమెంటు సభ్యుడిగా లేని పీవీ ప్రధాని పదవి చేపట్టిన అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉపఎన్నికలో లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో పీవీ మెజారిటీ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీగా రికార్డు సాధించింది. అప్పుడు పీవీ ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు పోటీ నుంచి వైదొలిగి సహకరించాయి. ఆ తరువాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాలతోపాటు ఒడిశాలోని బర్హంపూర్ స్థానాల నుంచి పోటీచేసిన పీవీ రెండుచోట్లా గెలుపొందారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బర్హంపూర్‌కు ప్రాతినిధ్యం వహించారు. 

మంత్రిగా జైళ్ల సంస్కరణల నుంచి..

రాజకీయాల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న పాములపర్తి వెంకట నరసింహారావు అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టి గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందారు. 1962లో నీలం సంజీవరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టిన పీవీ రాష్ట్ర జైళ్ల శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.

జైళ్ల సంస్కరణల్లో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే మొదటిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అక్కడ కూడా అనేక మార్పులు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించారు. అనంతరం విద్యాశాఖమంత్రిగా పనిచేసిన సమయంలో పీవీ ప్రవేశపెట్టిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయంటే అతియోశక్తి కాదు. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే.

ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు ఏడాదిన్నరపాటు పనిచేసిన పీవీ తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలో తొలిసారిగా భూసంస్కరణలు తీసుకొచ్చారు.

పీవీ హయాంలో తెలంగాణ ఉద్యమంతోపాటు జై ఆంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో.. చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. భూసంస్కరణల చట్టం అమలు రుచించని సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దె దించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరిపోశారని కొందరంటుంటారు.

మైనారిటీలో ఉన్నా.. ఐదేండ్ల పాలన

ప్రధానమంత్రిగా పీవీ బాధ్యతలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. అయినా పీవీ తన వాక్‌చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో ఐదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపర్చారు. ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సంస్కరణల ద్వారా గట్టెక్కించి ప్రగతి పథంలో నడిపించారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు, ప్రజల మద్దతుతో అందర్ని కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు.

కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు.. ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దే బాటలు వేశారు. ప్రధానిగా పనిచేసిన ఐదేండ్లకాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలే తప్ప 1996లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శా రాకపోవడం ఆయన పాలన తీరుకు నిదర్శనం. గడచిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏ మాత్రం ఆలోచించకుండా.. ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతుందనే ఎజెండాతోనే పీవీ ముందుకు వెళ్ళేవారని ఆయన సన్నిహితులు, దగ్గరనుంచి చూసినవారు చెప్తుంటారు. 

పదవులకు దూరమై.. పార్టీలోనే కొనసాగి..

కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో పీవీ 1998లో లోక్‌సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటీచేయలేదు. ప్రధాని పదవీకాలం ముగిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలపాటు పదవులకు దూరంగా ఉంటూ, సాహిత్య సేవచేస్తూ కాంగ్రెస్‌తోనే తన అనుబంధం కొనసాగించారు. బహుభాషా కోవిదుడిగా, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కరణకర్తగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. 

జాతీయ రాజకీయాల్లో రాణింపు..

ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన అనంతరం పీవీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1975లో తొలిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను హన్మకొండ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలబెట్టింది. 1980లో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో పీవీకి చోటు దక్కింది. అప్పట్లో ఆయన కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో కొంతకాలంపాటు కేంద్ర హోంశాఖ, తర్వాత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. 1988లో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు.

కొత్త కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1991లో రాజీవ్‌గాంధీ మరణానంతరం ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీని ప్రధాని పదవి వరించింది. అలా ఆ పదవి చేపట్టి తెలుగు రాష్ట్రం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా పీవీ రికార్డు సాధించారు. తన పాలనలో పీవీ అనేక సంస్కరణలు చేపట్టి కొత్త ఒరవడి, కొత్తదనాన్ని చూపించారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరుగాలని ఆయన కోరుకునేవారు.

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!