తెలంగాణ సోదరుడా,
శుభాకాంక్షలందుకొనుము!
అసెంబ్లీకి వచ్చినట్టి
"బిల్" విజయము సాధించెను!!
అసెంబ్లిలో నిన్న బిల్లు
కీలక ఘట్టము ముగిసెను!
రాష్ట్రపతియె పంపిన "బిల్"
లక్ష్యమ్మే నెరవేరెను!!
బిల్లుపైన చర్చ ముగిసె
నని తెలిపిన స్పీకరుండు
సీ ఎం నోటీసుపైన
వోటింగ్ పెట్టిన చెల్లునె?
చర్చ ముగిసినట్టి బిల్లు
నెట్టుల వ్యతిరేకింతురు?
చర్చ పిదప బిల్లు తిర
స్కరణమగుచొ లోటేమిటి?
శాసనసభ కార్యక్రమ
ఎజెండలో లేని యట్టి
నోటీసుకు వోటింగును
పెట్టుటయే "వారి" కుట్ర!!
బిల్లు చర్చ, అధికరణము
మూడు ప్రకారమ్ము జరిగె!
అసెంబ్లిలో రూలు ప్రకా
రము తీర్మానమ్ము జరిగె!!
బిల్లుపైన చర్చ సేయ
అసెంబ్లికధికారమిడియు,
వ్యతిరేకముకై వోటింగ్
జరిపెడు అధికార మిడిరె?
రాజ్యాంగము నసెంబ్లియే
ఎట్లు అధిగమించగలదు?
అధికరణము మూడుకన్న
రూలు డెబ్బదేడు మిన్నె??
అధికరణము మూడు పరిధి
లోకి రూలు డెబ్బదేడు
రాదుగాక రాదయ్యా,
ఇది పగటి కలేనయ్యా!!
ముఖ్యమంత్రి సీమాంధ్రుడె,
మంత్రికూడ సీమాంధ్రుడె,
స్పీకరుండు సీమాంధ్రుడె!
అందరు కుమ్మక్కయ్యిరి!!
పిల్లి కండ్లు మూసికొనియు
"నన్నెవ్వరు చూడలేదు"
అని భావించిన రీతిగ
సీమాంధ్రులు వర్తించిరి!!
యాభై ఓవర్లు ముగిసి
పోయిన తరి "బంతి" వేయ
లెక్కలోకి రానియట్లె,
"బిల్" తిరస్కరణ కూడా!!
కుక్కయె బెదిరించి చెప్పు
నెత్తుకొనియు పోయినట్లు,
పనికిరాని తీర్మానము
చేయ తెలంగాణాగునె?
ముగ్గురు మూర్ఖుల కృతములు
కేంద్రమ్మే చూసుకొనును!
విలువ లేని తీర్మానము
గూర్చి బెంగ వలదయ్యా!!
జరుగవలయు ననుకొన్నది
విజయవంతముగ జరిగెను!
సీమాంధ్ర దురాగతముల
పై విజయమె మనదాయెను!!
త్వరలోనే పార్లమెంటు
"టీ బిల్" ఆమోదింపగ,
తెలంగాణ మేర్పడునయ!
మన కల నెరవేరునయా!!
బంగరు తెలగాణ కలను
సాకారము చేసికొనగ
మనమంతా నడుముకట్టి
పూనుకొనగవలెనయ్యా!
తెలంగాణ సోదరుడా,
శుభాకాంక్షలందుకొనుము!
అరువదేండ్ల తెలంగాణ
కాంక్షను నెరవేర్చుకొనుము!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!