గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 22, 2014

రాజధానికి వరల్డ్ క్లాస్ పోలీసింగ్ ప్రతిపాదనలు!

-రాజధానికి వరల్డ్ క్లాస్ పోలీసింగ్!
-జీపీఎస్, జీపీఆర్‌ఎస్, ఇన్‌బిల్ట్ ఇంటర్నెట్ వాహనాలు
-1650 ఇన్నోవా కార్లు, 1600 పెట్రోలింగ్ బైకులు.. సిటీ పోలీస్‌కు బ్లూకలర్ డ్రెస్సు
-నెల రోజుల్లో అన్నీ అందుబాటులోకి తేవాలన్న సీఎం కేసీఆర్
-హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: హోంమంత్రి నాయిని
-గల్లీ గస్తీ పేరుతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ట్రాఫిక్ సిబ్బందికి షిఫ్ట్ డ్యూటీలు..
-వారాంతపు సెలవులు
-బంజారాహిల్స్‌లో వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూం
-నగర కమిషనరేట్‌కు కొత్త భవనం
-వరంగల్, కరీంనగర్, మంచిర్యాలలో కమిషనరేట్లకు ప్రతిపాదనలు

ప్రపంచ స్థాయి సాంకేతికతను పుణికిపుచ్చుకునేలా పోలీస్ శాఖను రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు సమర్పించిన రూ. 350 కోట్ల వ్యయం కాగల ప్రతిపాదనలను శనివారం ఆయన ఆమోదించారు. మరికొన్ని ప్రతిపాదనలను సైతం త్వరగా రూపొందించి నెల రోజుల్లో వాటిని అమలు చేసే కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. నేరాలను వేగంగా అరికట్టి, ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు రాజధాని నగరాన్ని సంపూర్ణ సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నెల రోజుల్లో ఆధునీకరణ ప్రతిపాదనలన్నీ అమలులోకి తేవాలని ఆదేశించారు. శనివారం ఆయన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ శాఖను పటిష్ఠం చేస్తేనే హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

police
పోలీస్ శాఖ ఆధునీకరణకు తమప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. పోలీసు సిబ్బందిపై ఒత్తిడి, అధికారుల వేధింపులు తగ్గితే సమర్థంగా వారు పనిచేస్తారని ఆయన అన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఇక వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం వల్ల పోలీస్ సర్వీస్ లెవల్ పారామీటర్స్‌ను పెంచుకోవచ్చని ఆయన చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు నగరంలో కొత్తగా పోలీస్ శాఖకు జీపీఎస్, జీపీఆర్‌ఎస్, ఇన్‌బిల్ట్ ఇంటర్నెట్ ఉన్న 1650 ఇన్నోవా కార్లు, 1600 పెట్రోలింగ్ బైకులను ఆయన మంజూరు చేశారు. దానికితోడు నగరమంతా సీసీ కెమెరాలు, ప్రైవేట్ సీసీ కెమెరాలతో అనుసంధానించే కంట్రోలింగ్ రూం, పోలీసులకు ప్రత్యేకంగా కొత్త యూనిఫాం, నగరం అనువణువునా నిఘా కోసం గల్లీ పోలీసింగ్‌తో పాటు హైదరాబాద్ కమీషనరేట్‌కు నూతన భవన నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.

దీనితో పాటు రాష్ట్రంలో మరింత మెరుగైన పోలీసింగ్ కోసం కొత్తగా మూడు కమిషనరేట్లను వరంగల్, కరీంనగర్, మంచిర్యాలలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. అదనపు సిబ్బంది నియామకాలతో పాటు సిబ్బంది పనివేళలు, వారి కుటుంబాల సంక్షేమం తదితర అంశాలన్నింటిపైనా ఆయన అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ముందస్తు రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 5 వేల మంది కానిస్టేబుళ్లు, 600 మంది ఎస్సైలను నియమించుకోవాల్సి ఉంటుందని పోలీస్ అధికారులు సీఎంకు ఈ సందర్భంగా నివేదిక సమర్పించారు. నిధులకు ఎలాంటి ఇబ్బందిలేదని, నెల రోజుల్లో పూర్తి మార్పు రావాలని సీఎం ఆదేశించారు. సిబ్బందిపై పనిఒత్తిడి, అధికారుల వేధింపులు ఉండకుండా చూస్తే ఎలాంటి సమస్యలు రావని సూచించారు. డ్రెస్ కోడ్‌పై ఓ కమిటీ వేసి వెంటనే దాన్ని కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే లోగో డిజైన్‌కు సంబంధించి ఫ్యాషన్ డిజైనర్లతో చర్చించాలని సూచించారు.

వాస్తవ రూపం దాల్చిన నమస్తే తెలంగాణ కథనం...

అత్యాధునిక సాంకేతికతతో పోలీస్ శాఖను రూపుదిద్దుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని నమస్తే తెలంగాణ ఇచ్చిన కథనం వాస్తవరూపం దాల్చింది. రాజధాని పోలీస్‌ను స్మార్ట్ పోలీస్‌గా మార్పు చేసేందుకు శనివారం సీఎం కేసీఆర్‌తో హోం మంత్రి సహా పోలీస్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. పోలీస్ శాఖను పూర్తి స్థాయిలో అధునికంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రతిపాదనలను డీజీపీ అనురాగ్ శర్మ సీఎంకు సమర్పించారు. పోలీస్ శాఖకు కావాల్సిన అన్ని సౌకర్యాలపై అధికారులు స్టడీ టూర్లుచేస్తున్నారని, అవి రాగానే పూర్తి స్థాయిలో కార్యచరణ అందిస్తామని డీజీపీ సీఎంకు వివరించారు. ఆయన సమర్పించిన నివేదికలో పోలీస్ డ్రెస్‌కోడ్, లోగో, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, ట్రాఫిక్ సిబ్బందికి అదనపు జీతం, వరల్డ్ క్లాస్‌కంట్రోల్ రూంతో పాటు పలు కీలక అంశాలు పొందుపరిచారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: నాయిని

అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలు వెల్లడించారు. పోలీస్ శాఖలో నూతన విధానాలను నెల రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలోని మొత్తం పోలీస్ శాఖను పటిష్టపరిచేందుకు ఆధునిక పద్ధతులను అవలంబించబోతున్నామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా పోలీస్ వ్యవస్థను అత్యాధునిక టెక్నాలజీతో అభివద్ధి చేయబోతున్నామని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు పెట్రోలింగ్, రక్షక్ వాహనాలను పూర్తిగా మార్చి ఇన్‌బిల్ట్ ఇంటర్నెట్ ఉన్న 1650 ఇన్నోవా కార్లను, 1600 పెట్రోలింగ్ బైకులను వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.

ప్రతి పెట్రోలింగ్ వాహనానికి జీపీఎస్, జీపీఆర్‌ఎస్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గల్లీ గస్తీ పేరుతో ప్రజలకు మరింతగా పోలీస్ సేవలను అందించనున్నామని హోంమంత్రి తెలిపారు. నగరంలో ఏ మూల ఏ చిన్న నేరం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని తెలిపారు. ఇక రాష్ట్రంలో మహిళలపై నేరాలను అదుపుచేయడమే కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హోం మంత్రి తెలిపారు. మహిళా పోలీస్ సిబ్బందిని పెంచుతామని తెలిపారు. మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను త్వరలోనే రూపొందిస్తామని ఆయన తెలిపారు.

డ్రెస్ కోడ్ మారుతోంది...

జంట కమిషనరేట్లపరిధిలో పోలీస్ డ్రెస్ కోడ్ మారుతుందని హోంమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో త్వరలోనే నూతన డ్రెస్ కోడ్ తెస్తామన్నారు. టోపీ నుంచి షూ వరకు పోలీస్ డ్రెస్ కోడ్ మార్చాలనీ సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. న్యూయార్క్, లండన్, వాషింగ్టన్ డీసీ పోలీస్ డ్రెస్ కోడ్‌ను పరిశీలించి లైట్ బ్లూకలర్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ ప్యాంట్ జంట కమిషనరేట్ల పోలీస్ డ్రెస్ కోడ్‍గా డీజీపీ అనురాగ్ శర్మ ప్రతిపాదించారని హోంమంత్రి తెలిపారు. ఈ డ్రెస్ కోడ్‌పై పూర్తి అధ్యయనం చేసి నెల రోజుల్లో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు వేస్తామని హోంమంత్రి తెలిపారు. వారాంతపు సెలవులు కూడాఅమలు చేస్తామని ప్రకటించారు. సిబ్బంది కొరతను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అవసరమైన సిబ్బందిని నియమించుకుంటామని తెలిపారు.

పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష

తెలంగాణలోని జిల్లా ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో డీజీపీ అనురాగ్ శర్మ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 3గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల శాంతి భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ఏయే జిల్లాల్లోపోలీస్ శాఖకు ఎలాంటి సౌకర్యాలు కావాలో ప్రతిపాదనలు స్వీకరించారు. కొత్త జిల్లాలు ఏర్పడితే ఆయా జిల్లాల్లో పోలీసింగ్ వ్యవస్థపై కూడా అధ్యయనం చేయాలని డీజీపీ అధికారులకు సూచించారు. త్వరలోనే పోలీస్ లోగోతోపాటు షోల్డర్ బ్యాడ్జి మారిపోతుందని, వీలైనంత త్వరంగా అందుబాటులోకి తెస్తామని ఎస్పీలకు చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ వద్ద కొత్త కమిషనరేట్ భవనం?

ఇదిలా ఉంటే...హైదరాబాద్ కొత్త కమిషనరేట్ భవన నిర్మాణానికి రోడ్ నెం 12లో ఉన్న తెలంగాణ భవన్ పక్కన ఉన్న ఏపీఎస్పీ క్యాంప్ స్థలాన్ని పరిశీలించాలని సిటీ కమిషనర్ మహేందర్‌రెడ్డిని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. సుమారు 8ఎకరాల విస్తరించి ఉన్న ఈ స్థలంలో అత్యాధునిక హంగులతో కూడిన సిటీ కమిషనరేట్‌తో పాటు ప్రపంచ స్థాయి కంట్రోల్ రూం వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చునని ఆయన భావిస్తున్నారు. కమిషనరేట్‌కు దాదాపు 350 కార్ల పార్కింగ్ కెపాసిటీ ఉండేలా చూడాలని, పూర్తి స్థాయి టెక్నాలజీ ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటుచేయాలని, వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించుకునేందుకు వీలుగా అతి పెద్ద కాన్ఫరెన్స్ హాలు కూడా ఉండేలా డిజైన్ చేయించాలని సీఎం కమిషనర్‌కు సూచించారు. ఇక వరల్డ్ క్లాస్ కంట్రోల్ రూములో సీసీ టీవీ కంట్రోలింగ్ వ్యవస్థను తీర్చిదిద్దాలని, పోలీస్, ప్రైవేట్ సీసీ కెమెరాల అనుసంధానం ఉండేలా చూడాలని చెప్పారు. వీటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు పటిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.

కమిషనరేట్లుగా వరంగల్, కరీంనగర్, మంచిర్యాల

హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రాష్ట్రంలో మరో మూడు కొత్త కమిషనరేట్లను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ సమాయత్తం అవుతోంది. అభివృద్ధి చెందుతున్న నగరాలైన వరంగల్, కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాల్లో పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటుచేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వరంగల్ అర్బన్ ఎస్పీ వ్యవస్థను తీసేసి రూరల్ పోలీస్‌స్టేషన్లను కలుపుతూ కమిషనరేట్ ఏర్పాటుచేయబోతున్నారు. కోల్‌బెల్ట్, నల్ల బంగారు గనిగా పేరు గాంచిన మంచిర్యాల పోలీస్ వ్యవస్థను కూడా కమిషనరేట్ చేసే ఆలోచనలో పోలీస్ ఉన్నతాధికారులున్నట్టు తెలిసింది. మంచిర్యాల కమర్షియల్‌గా పేరు గాంచిన పట్టణంగా మారుతుండటంతో కోల్‌బెల్ట్ కమిషనరేట్‌గా ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి