గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 25, 2014

గురుకుల్ ట్రస్ట్ భూముల పందేరంలో "బాబు"దే బడాషేర్!

-గురుకుల్ ఖాతాలో బాబుదే సింహభాగం
-చంద్రబాబు హయాంలోనే సగం పందేరం
-స్వయంగా 5 ఎకరాలు కొని విక్రయించిన వైనం
-ట్రస్ట్ భూములు దేవాదాయానికి బదలాయించిందీ ఆయనే

రెండు దశాబ్దాల పోరాటఫలం రాజధాని నడిబొడ్డున గురుకుల్ ట్రస్ట్ భూములకు విముక్తి ప్రారంభమైంది. మంగళవారం ఆ భూముల్లోని అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్నటిదాకా జబ్బలు చరిచిన భూకబ్జాదారుల గుండెలు పగిలాయి. గురుకుల్ ట్రస్ట్ భూమి అంటే అక్షరాలా 12 వేల కోట్ల విలువైన ఆస్తి. సీమాంధ్ర పాలకులు, పైరవీకారులు, కబ్జాదారులకు బంగారు బాతుగుడ్డు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే బందిపోటు దొంగలకన్నా దారుణంగా దోపిడీకి తెగబడ్డ భూమి. ఎక్కడో ఉత్తర భారతంలో పుట్టి ఇక్కడి పేద పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఓ ధన్యజీవి ఇచ్చిన యావదాస్తిని "ఒక్క భాష-ఒక్క జాతి" అంటూ పక్కకు చేరిన సీమాంధ్రులు నిస్సిగ్గుగా దోచుకున్నారు. 

అయ్య జాగీరులా అడ్డికి పావుశేరుగా అమ్ముకున్నారు. ఒకటి కాదు రెండు కాదు..627 ఎకరాలు. ఉత్తరాంధ్ర..కోస్తా.. సీమ ప్రాంతాలు వేరు కావొచ్చు కబ్జాలు మాత్రం ఒకటే. ఎవడికి దొరికింది వాడు ఆక్రమించేసుకున్నారు. ఒక్క ఎకరా కూడా మిగల్లేదు. భూముల విలువ పెంచుకునేందుకు హైటెక్కుల సోకులు అద్దారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రులే కబ్జాలను ప్రోత్సహించారు. వారు కుటుంబ సభ్యులు, సోదరులు, బావలు, బామ్మర్దులు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టి ఆకాశహర్మ్యాలు లేపేశారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు. కబ్జాల క్రమబద్ధీకరణకు చట్టాలు మార్చారు. కోర్టు తీర్పులు చెత్తబుట్టపాలు చేశారు. ఏ ప్రయోజనం కోసం ఆ భూములు ఉద్దేశించారో ఆ గురుకులంలో పేద పిల్లలు ఆకలితో మాడుతుంటే.. ఆక్రమించిన వారు ఐదు నక్షత్రాల ఆహారశాలలు నిర్మించుకున్నారు. 


చంద్రబాబు హయాంలోనే గ్రహణం....
గురుకుల్ ట్రస్ట్ భూములను టోకున పందేరం చేసిన ఘనత చంద్రబాబు సర్కారుదే. అప్పటిదాకా కొద్దికొద్దిగా కరుగుతూ వచ్చిన భూమిలో ఏకంగా 300 ఎకరాలు పందేరం చేసింది బాబు సర్కారు. భూములను నామమాత్రంగానైనా పర్యవేక్షించే అధికారం కూడా లేకుండా చేసేందుకు ఏకంగా ట్రస్ట్ బాధ్యతలు ప్రభుత్వానికి బదిలీ చేసింది కూడా ఆయన సర్కారే. చంద్రబాబు సర్కారే దాదాపు 300 ఎకరాలను స్వాధీనం చేసుకొని న్యాక్, హైటెక్స్‌లను నిర్మించింది. పనిలో పనిగా నోవాటెల్ హోటల్‌కు100 ఎకరాల భూమిని పందేరం చేసింది. మరో 30 ఎకరాలను హుందాయ్‌‍షోరూమ్‌కు కట్టబెట్టింది. మిగిలిన భూములు ఆశ్రితుల పరమయ్యాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే ఐదెకరాలు కొనుగోలుచేస్తే, ఆయన సతీమణి ఒక ఎకరం కొనుగోలు చేశారు. తర్వాత కారణాలేమైనా బాబు వాటిని అమ్మేశారు. ముఖ్యమంత్రే కొనుగోలు చేస్తున్నారన్న ఉద్దేశంతో అనుమతులు లేకున్నా ఈ భూమిని కొనేందుకు అనేకమంది ఎగబడ్డారు. ఇలా సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సగం ట్రస్ట్ భూములను సర్కారు పద్ధతుల్లో లాక్కున్నాడు. మరో వైపు ఘట్‌కేసర్ గురుకుల్ ట్రస్ట్‌ను ట్రస్ట్ సభ్యులు నిర్వహించలేరంటూ 1998లో ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను స్వీకరిస్తూ దేవాదాయ శాఖకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 

ట్రస్ట్ రద్దు చేసి ఆ భూముల బాధ్యతను దేవాదాయ శాఖకు బదలాయించారు. దేవుడి మాన్యాలనే రక్షించలేని దేవాదాయ శాఖ రాజధాని నడిబొడ్డున కోట్ల విలువచేసే భూమిన రాజకీయ రాబందులనుంచి రక్షించగలదంటే ఎవరూ నమ్మరు. కానీ బాబు సర్కారు మాత్రం నమ్మింది. ఫలితం కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పైగా ఆ భూముల విలువలు పెంచుకునేందుకు ప్రభుత్వం హైటెక్కుల భవనాలు నిర్మించింది. ఆక్రమించు.. విలువ పెంచు.. అమ్మి సొమ్ము చేసుకో... ఇదే సీమాంధ్రులు మొదటినుంచి పాటిస్తూ వచ్చిన వ్యాపారసూత్రం. ఇదే సమయంలో అంతకు ముందు ట్రస్టు సభ్యుడు కిషన్ లాల్ చేసిన అమ్మకాలు, ఇచ్చిన జీపీఓలు చీకాకు పెట్టడంతో కిషన్‌లాల్ చేపట్టిన అమ్మకాలు చెల్లవంటూ 30 సెప్టెంబర్ 2000 సంవత్సరంలో ప్రభుత్వం 703 జీవో జారీ చేసింది. ఇందులో మరో ఎత్తుగడా ఉంది. ఆక్రమించుకున్న భూములన్నీ అక్రమం కావడంతో అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. 

సర్కారు వాటిని క్రమబద్ధం చేయాలన్నా సమస్యే. ఈ జీవోను అడ్డు పెట్టుకుని భూములు కొన్న వారు కోర్టుకువెళితే జీవోపై స్టే వస్తుందని, తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని భావించారని చెబుతారు. అయితే న్యాయస్థానం మరో రకంగా స్పందించింది. 2003లో హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి తాను ఇచ్చిన తీర్పులో ప్రభుత్వం ఇచ్చిన జీవో 703 సరైనదేనని ధ్రువీకరించారు. 1987 వరకు జరిగిన క్రయవిక్రయాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తీర్పు చెప్పారు. ట్రస్ట్ భూములు అమ్మడానికి, కొనడానికి కూడావీలు లేదని చెప్పారు. ఎవరైనా కొన్నా, అమ్మినా వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పు అమలు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత ఈ భూములను పట్టణ భూగరిష్ట చట్టం పరిధిలోకి తెచ్చి కబ్జాలకు చట్టబద్ధత కల్పించేందుకు యత్నించారు. మొత్తానికి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో చంద్రబాబు హయాం 300 ఎకరాలు మింగేసింది. 

ఆనాటి గురుకుల్ ట్రస్ట్ సభ్యులు వీరే...
-వినాయకరావు కేశవ్ కరోట్కర్
( హైదరాబాద్ రాష్ట్ర మంత్రి)
-పండిట్ నరేంద్రజీ
-కొత్తూరి సీతయ్య గుప్తా
-శ్రీమతి జానకీ దేవి
( దివంగత వ్యాస్ భార్య)
-లక్ష్మినారాయణ గుప్తా(ఐఏఎస్)
-రాంగోపాల్ సుఖ్‌దేవ్ రాథి
-బి. కిషన్‌లాల్
( హైదరాబాద్ నగర మేయర్)
-పండిట్ సూర్యకరణ్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి