గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 31, 2014

తెలంగాణకు చెందిన కార్మికనిధిని...లూటీచేసిన ఆంధ్రాబాబులు...!!!

muralisagar


police


కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అణిచేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం, అధికారులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. ఓవైపు కరెంట్.. మరోవైపు నీళ్లపై అనవసర రాద్ధాంతాలకు తెరతీస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం తాజాగా కార్మికశాఖలో వందల కోట్లు లూటీ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.420 కోట్లను విజయవాడలోని ఒక బ్యాంక్‌కు తరలించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నిధులు తరలించేందుకు ప్రయత్నించామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారే స్వయంగా పేర్కొనడం వారి కుట్ర బుద్ధిని బయటపెడుతున్నది. 
-బాబు కుతంత్రం!
-తెలంగాణ సొమ్ము 420 కోట్లు బెజవాడకు మళ్లింపు
-ఆధారాలు దొరక్కుండా ఫైళ్ల మాయం
-కార్మికశాఖ కమిషనర్ అశోక్‌కుమార్ ఫిర్యాదుతో గుట్టు రట్టు
-ఏపీ సచివాలయంలో దాక్కున్న అదనపు కమిషనర్ మురళీసాగర్, మేనేజర్ రామారావు
-నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు
-ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకున్నామన్న అధికారులు

ఉమ్మడి నిధులనుంచి దాదాపు రూ. 609 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దొంగచాటుగా ఇప్పటికే సుమారు రూ. 420 కోట్లు తరలించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ కృష్ణారావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని సమాచారం. మరో రూ.200 కోట్లు తరలించడానికి చేసిన వారి ప్రయత్నం తెలంగాణ కార్మిక సంఘాల అప్రమత్తతతో బెడిసికొట్టింది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళీసాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావు ఆధారాలు దొరక్కుండా రాత్రికి రాత్రి ఫైళ్లను తరలించారని హిందూ మజ్దూర్ యూనియన్ ఆరోపించింది. ఈ మేరకు గురువారం కార్మికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. హెచ్‌ఎంఎస్ ఆరోపణతో అప్రమత్తమైన కమిషనర్ అశోక్‌కుమార్ నిధులకు సంబంధించిన ఫైళ్లను వెతికారు.
ఎక్కడ కూడా ఫైళ్లు కనిపించలేదు. దీంతో కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ అశోక్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీమాంధ్ర అధికారుల అసలు గుట్టు రట్టయింది. అడ్డదారిలో ఉమ్మడి నిధులను ఆంధ్రా ఖాతాలోకి తరలించిన విషయం వెల్లడైంది. తెలంగాణ నిధులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు కమిషనర్ ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలుసుకున్న మురళీసాగర్ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి కోరినా విచారణకు వచ్చేందుకు మొండికేశారు.

చీఫ్ సెక్రటరీ దగ్గర ఉన్నాను.. రాలేనని మొండిగా సమాధానం ఇచ్చారు. దీంతో సచివాలయం గేట్ దగ్గర మాటు వేసిన పోలీసులు మొదట రామారావును, ఆ తర్వాత ఏపీ కార్మికశాఖ కమిషనర్ రామాంజనేయులు కారులో వెళ్తున్న మురళీసాగర్‌ను నాటకీయపరిణామాల మధ్య అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పబ్లిక్ డిపాజిట్ అకౌంట్‌లోని రూ. 452 కోట్లు తెలంగాణ ఖాతాలో వేసి మిగతా నిధులను మళ్లించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వివాదానికి దారితీస్తున్నదని నమస్తే తెలంగాణ ఇటీవలే బయటపెట్టింది.

ఇంకా ఆంధ్ర అకౌంట్లలోనే నిధులు..


రాష్ట్ర విభజన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా కార్మికశాఖలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్ నిధులన్నీ ఆంధ్రా అకౌంట్‌లలోనే మగ్గుతున్నాయి. ఈ నెల 17న తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్‌ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదలైంది.

ప్రత్యేక బ్యాంక్ ఖాతా కూడా తెరిచారు. కానీ అందులో ఒక్క రూపాయి ఇప్పటి వరకు జమకాకుండా ఆంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారు. పైగా దశల వారీగా కోట్ల రూపాయలను విజయవాడ బ్యాంకు ఖాతాకు తరలించడం కార్మికశాఖలో కొన్నిరోజులుగా కలకలం రేపుతున్నది. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్ (భవన, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ) బోర్డు ఖాతాలో ఉన్న దాదాపు రూ. 1468 కోట్లు ఇంకా ఉమ్మడి ఖాతాల్లోనే ఉన్నాయి. 

ఆ నిధులను భవననిర్మాణంలో ఇతర రంగంలో పనులు చేస్తూ ప్రమాదానికి గురైన లేదా మరణించిన కార్మికుల కుటుంబసంక్షేమానికి, గర్భవతులైన మహిళా కార్మికులకు, కార్మికుల పిల్లల చదువులకు ఉపయోగిస్తారు. ఇందులో తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణకు దాదాపు రూ. 609 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 859 కోట్లు ఇవ్వాలని లెక్కలు తేలాయి. అధికారికంగా ఇటీవల మరో రూ. 80 కోట్ల సెస్ వసూలైంది. ఉమ్మడి ఖాతాలో దాదాపు రూ. 1500 కోట్లు ఉన్నాయి.

ఇందులో పబ్లిక్ డిపాజిట్స్ అకౌంట్ కింద రూ.452 కోట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పబ్లిక్ డిపాజిట్స్ అకౌంట్‌లోని నిధులను కొన్ని ప్రత్యేక అవసరాలకే వాడాల్సి ఉంటుంది. వాటిని రెగ్యులర్‌గా తీసుకుని వాడుకోవడానికి వీలులేదు. ఆ ఖాతాలో నిధులను తెలంగాణకు కేటాయించి మిగిలిన రూ. 900 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. కీలకమైన పదవుల్లో ఆంధ్రకు చెందిన వారుండటం, తెలంగాణకు అధికారుల కొరత ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం: డీసీపీ : కార్మికశాఖ కమిషనర్ అశోక్ ఫిర్యాదు మేరకు ఫైళ్ల మాయం ఘటనలో కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావులను ఏపీ సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కార్మికశాఖ కార్యాలయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు చెప్పారు. రూ. 420 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. తనకు సమాచారం లేకుండానే తెలంగాణ కార్మికశాఖకు సంబంధించిన రూ. 420 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించారని సమాచారం రావడంతో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ అశోక్ తెలిపారు.

ఏపీ సర్కార్ ఆదేశాల మేరకే.. : మురళీసాగర్


ఫైళ్లు ఎత్తుకుపోయినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కార్మికశాఖ అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ, ఇతర సంక్షేమ బోర్డు సెక్రటరీ మురళీసాగర్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే రూ. 420 కోట్లు విజయవాడబ్యాంకుకు బదిలీ చేశానని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖల ఉమ్మడి సమావేశం జరిపిన తర్వాతే ఎవరి వాట ఎంతో తేలుతుందన్నారు.

కమిషనర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబును దాటవేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

గురువారం, అక్టోబర్ 30, 2014

జోనల్ పోస్టులుగా చూపించి...తెలంగాణలో తిష్ఠవేసిన...ఆంధ్రా లెక్చరర్లు!

- డిగ్రీ లెక్చరర్ల స్థాయిలో వక్రీకరణ
- తెలంగాణలో 330 మంది ఆంధ్ర డీఎల్‌ల అడ్డా
- ఆంధ్రలో అవస్థలు పడుతున్న 120 మంది
జోనల్ పోస్టులుగా చూపించి తెలంగాణలో తిష్ఠ వేసేందుకు ఆంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారు. డిగ్రీ లెక్చరర్ల స్థాయిని తగ్గించి వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో తిష్ఠవేసిన 330 మంది డిగ్రీ లెక్చరర్ల కారణంగా ఆంధ్రలో 120 మంది తెలంగాణవాసులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2011లో ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సీమాంధ్ర అధికారుల కుట్రలకు బలవుతున్నారు. గ్రూప్ వన్ స్థాయి పోస్టును జోనల్ పోస్టుగా చూపించి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వారిని అటు ఇటు కాకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైన పనిచేసే అధికారం ఉన్న పోస్టులను జోనల్ పోస్టులుగా చూపిస్తూ ఏపీ కాలేజీయేట్ విద్య కమిషనర్ గతంలోనిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం మేరకే కమల్‌నాథన్ కమిటీకి ఉద్యోగుల వివరాలు అందజేశారని డిగ్రీ లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జోనల్ క్యాడర్‌గానే గుర్తించడంవల్ల భవిష్యత్‌లో ఏపీ జోనల్‌లోనే ఉండిపోవాల్సి ఉంటుందని, తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశాన్ని కోల్పోతామంటున్నారు. ప్రస్తుతం ఏపీలో తెలంగాణ డిగ్రీ లెక్చరర్లు 120 మంది వరకు పనిచేస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఏపీ లెక్చరర్లు 330 మంది పనిచేస్తున్నారు. వీరంతా తెలంగాణలోనే ఉండి పోయేందుకు జోనల్ పోస్టుగా డీఎల్ పోస్టులను చూపించాలని కుట్రలు చేశారు. డీఎల్ పోస్టులను స్టేట్ క్యాడర్ పోస్టులుగా గుర్తించాలని, తిరిగి తెలంగాణకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీలోని తెలంగాణ డిగ్రీ లెక్చరర్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కార్మిక విభాగంలోనూ ఇదే కుట్రలు..


స్టేట్ క్యాడర్ పోస్టుకు చెందిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టును మల్టీ జోనల్ పోస్టులుగా చూపిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక క్యాడర్ పోస్టును మార్చాలంటే ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో రాష్ట్రపతి ఆమోదం లేకుండా దొంగ జీవోలు తీసుకువచ్చి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టులను మల్టీజోన్‌గా చూపించడంతో తెలంగాణ ఉద్యోగస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈ విషయంపై కార్మికశాఖలో తెలంగాణ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పోస్టును తక్షణమే స్టేట్ క్యాడర్‌గా చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

సీమాంధ్ర ప్రభుత్వం చేసిన కుట్రలను తక్షణమే అడ్డుకోవాలని, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారంతా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో తొమ్మిదో షెడ్యూల్‌లో గాని, పదో షెడ్యూల్‌లో గాని ఎక్కడా చూపించకపోవడంతో అందులో పనిచేస్తున్న దాదాపు 50 అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కూడా రెండురాష్ర్టాలు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని లేబర్ డిపార్టుమెంట్ అధికారుల బందం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

మంగళవారం, అక్టోబర్ 28, 2014

జలదోపిడీ చేస్తూనే...దొంగేడుపు లేడుస్తారా...!!??

kcr


శ్రీశైలంలో విద్యుదుత్పత్తి విషయంలో ఆంధ్రబాబుల దొంగేడుపును కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్రం విడిపోయినా వాళ్లు సాగిస్తున్న జలదోపిడీని ఆధారాలతోసహా బయటపెట్టారు. నీటి విషయంలో రాజీపడేది లేదని.. తమ హక్కులను కాపాడాలని కోరారు. సోమవారం సచివాలయంలో పండిట్‌తో సమావేశమైన కేసీఆర్.. సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్లు నదీ జలాల విషయంలో తెలంగాణ తీవ్ర అన్యాయానికి, దోపిడీకి గురైందని తెలిపారు.
-రాష్ట్రం విడిపోయినా ఆగని ఆంధ్ర అకృత్యాలు
-ఆంధ్రబాబులది దొంగేడుపే..
-నిబంధనల ప్రకారమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి
-మా హక్కులను కాపాడండి
-కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎస్కే పండిట్‌తో సీఎం కేసీఆర్
-నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పండిట్ హామీ
ఆంధ్ర నేతల జలదోపిడీని అరికట్టి తెలంగాణకు న్యాయంచేయాలని పండిట్‌ను సీఎం కేసీఆర్ కోరారు. కృష్ణానదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నుంచి పోతిరెడ్డిపాడు వరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. ఆంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలు వెలకట్టలేనన్ని త్యాగాలు చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారని.. అందుకే చంద్రబాబునాయుడు కక్ష పెంచుకొని, తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ.. నీళ్లు, కరెంట్ విషయంలో నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణచట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సి ఉన్నా దానిని చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. సీలేరు నుంచి కరెంట్ ఇవ్వడం లేదని, ఈ విషయంలో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

గోదావరి రివర్ బోర్డు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పినా చంద్రబాబు సీలేరు కరెంట్ ఇవ్వలేదన్నారు. కృష్ణపట్నంలో తెలంగాణ జెన్‌కో, డిస్కంలు రూ.1050 కోట్ల పెట్టుబడి పెట్టాయని, 54 శాతం విద్యుత్ తెలంగాణకు రావాలన్నారు. అయినా బాబు కరెంట్ ఇవ్వకపోగా హిందూజా నుంచి కూడా విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇన్ని కుట్రలతో తెలంగాణకు కరెంట్ రాకుండా చేయడం వల్లే విద్యుత్ కొరత ఏర్పడిందని, ఈ క్రమంలో రైతులను ఆదుకొనేందుకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం అనివార్యమయిందని ముఖ్యమంత్రి కేసీఆర్.. పండిట్‌కు వివరించారు.

నిబంధనలు అధిగమించలేదు


శ్రీశైలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నందుకే విద్యుత్ ఉత్పత్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. రిజర్వాయర్‌లో 857 అడుగుల వరకు నీరు ఉన్నప్పటికీ అడుగంటుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పండిట్‌కు తెలిపారు. ఈ సందర్భంగా జీవోలు 69, 107, 233ల గురించి కేసీఆర్ ప్రస్తావించారు.

వీటి ప్రకారం 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇన్ని జీవోలు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లలో ఏనాడు నిబంధనలు పట్టించుకోలేదని, ఏ ఒక్క ఏడాది కూడా 834 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించలేదని ఆధారాలతో సహా ఆయన ముందుంచారు. 750 అడుగుల వరకు నీటిని వాడుకున్న విషయాన్ని కూడా పండిట్ దృష్టికి తెచ్చారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అవసరాల మేరకు ఎంత నీటినైనా వాడుకున్నారని, తాము ఇప్పుడు నిబంధనల మేరకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా గగ్గోలు పెడుతున్నారని కేసీఆర్ వివరించారు. కృష్ణానది జలాల దోపిడీ విషయంలో కూడా బోర్డు కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.

మొదటి నుంచి కృష్ణా నది జలాల విషయంలో తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతుందో కూడా సమావేశంలో వెల్లడించారు. నాగార్జునసాగర్ అసలు పేరు నందికొండ ప్రాజెక్టు అని, ఇప్పుడున్న ప్రాజెక్ట్ కన్నా 19 కిలోమీటర్ల ఎగువన నిర్మించడానికి మొదట ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. కానీ సమైక్య రాష్ట్రంలో కేటాయింపులు, ప్రాజెక్ట్ డిజైన్ మార్చి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. మొదట తెలంగాణకు 160 టీఎంసీలు, ఆంధ్రకు 80 టీఎంసీలు కేటాయించగా.. చివరికి తెలంగాణకు 25 టీఎంసీలు కూడా దక్కే అవకాశం లేకుండా చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇక సాగర్ ఎడమ కాలువ నిర్మాణం మొదట ఇల్లెందు, గార్ల దాకా చేయాలని నిర్ణయించినప్పటికీ చివరికి ఆ కాలువ పాలేరు రిజర్వాయరు వద్దకే చేరిందన్నారు. అక్కడి నుంచి కృష్ణా నీటిని మళ్లీ ఆంధ్రకే తరలించడానికి కుట్ర చేశారని తెలిపారు.

జల దోపిడీ ఆగలేదు


శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్ర సర్కారే అక్రమంగా నీటిని వాడుకుంటున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలుగుగంగ ద్వారా 15 టీఎంసీలు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీలు మాత్రమే వాడుకునే హక్కు ఉన్నప్పటికీ దాదాపు 338 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనువైన రిజర్వాయర్లను నిర్మించుకున్నారని, పోతిరెడ్డిపాడు ద్వారా జలదోపిడీ యథేచ్ఛగా సాగుతున్నదన్నారు.

తెలంగాణలో జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్డీఎస్‌లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని, అదే ఆంధ్రలో మాత్రం ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకున్నా ప్రాజెక్టులు పూర్తయ్యాయని పండిట్‌కు చెప్పారు.

ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల కృష్ణా నీటిలో తెలంగాణకు ఉన్న వాటాను వినియోగించుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. కృష్ణానది జలాల్లో కేటాయింపుల్లోనే అన్యాయం జరిగిందని, బచావత్ ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలు వినిపించే అవకాశం కూడా రాలేదని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే తెలంగాణకు ఇప్పుడైనా న్యాయం చేయాలని ఎస్కే పండిట్‌కు విజ్ఞప్తిచేశారు. 29న కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరుగుతున్నందున తెలంగాణకు జరిగిన అన్యాయంపై సవివరంగా చర్చించాలని కోరారు. రాష్ట్రం తరఫున బోర్డు సమావేశానికి సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని సీఎం తెలిపారు. సాగర్ పూర్తి స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టు అయితే, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు అని.. దీనికనుగుణంగా నీటి వాడకం విషయంలో కచ్చితమైన ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని కోరారు.

మా హక్కులు కాపాడండి


శ్రీశైలంలో నీటిని వాడుకొనే, విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే హక్కు తెలంగాణకు ఉందని.. ఈ హక్కును కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణానది యాజమాన్యబోర్డు చైర్మన్ పండిట్‌ను కోరారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిందని, అలాంటిది నీటి విషయంలో తాము రాజీపడే ప్రశ్నేలేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. శ్రీశైలం నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలన్నీ తప్పని, ఇదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో హైకోర్టులో సమర్పించిన రిట్ పిటిషన్‌లో నీటి వాడకం విషయంలో ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉందని చెప్పిన విషయాన్ని కేసీఆర్.. పండిట్ దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యమంత్రి చెప్పిన విషయాలన్నీ సావధానంగా విన్న పండిట్.. బోర్డు సమావేశంలో ఈ అంశాలన్నింటినీ తప్పకుండా చర్చించి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

సోమవారం, అక్టోబర్ 27, 2014

ఉల్లంఘనలు వారికి అలవాటే!

-పెద్దమనుషుల ఒప్పందం నుంచి పీపీఏల దాకా అదే వైఖరి
-ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
-తెలంగాణకు విద్యుత్ దక్కకుండా కుట్రలకు శ్రీకారం
ఒప్పందాల ఉల్లంఘనల్లో సీమాంధ్రులు ఆదినుంచి ఘనులే..! నాడు పెద్దమనుషుల ఒప్పందంనుంచి నేటి పీపీఏల (విద్యుత్ ఒప్పందాల) దాకా అదే వైఖరి అవలంబిస్తున్నారు..! ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు..! తెలంగాణపై తనకున్న అక్కసును వెల్లగక్కడానికే పీపీఏ కుట్రకు చంద్రబాబు తెరతీశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఈఆర్సీ ఆమోదించలేదన్న సాకుతో తెలంగాణ రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన వాటా (53.89 శాతం)కు కత్తెర పెట్టిన ఏపీ సర్కారు కుట్రలను మూడు నెలలుగా నమస్తే తెలంగాణ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూ వస్తున్నది.

babu-cartoon

ఆంధ్రాలోని పవర్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం లేదనే కారణం, ప్రస్తుతం ఆంధ్రాల్లో నిర్మాణాలు పూర్తిచేసుకున్న కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టులకు అసలు పీపీఏలే లేవనే సాకుతో తెలంగాణకు విద్యుత్ వాటా దక్కకుండా చేసే ప్రయత్నాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని న్యాయ, విద్యుత్ రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. తన పాలనలో తానే స్వయంగా ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాలను నేడు చంద్రబాబు బేఖాతరు చేయడం.. చట్టధిక్కారమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌వాటాలకు సబంధించిన జీవో నం.53కి చట్టబద్ధత లేదనడం.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను ఉల్లంఘించడమేనని విమర్శలు వ్యక్తమవు తున్నాయి. కాగా, పీపీఏలకు ఏపీఈఆర్సీసీ ఆమోదం ఉన్నట్లే భావించాలని కూడా ఈఆర్సీ స్పష్టం చేసినా.. ఏపీ ప్రభుత్వం పట్టువీడటం లేదు. విశాఖపట్నం సమీపంలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్) తెలంగాణ యాజమాన్యహక్కులు లేవనడం ఎంతమాత్రం సరైందికాదని నిపుణులు పేర్కొంటున్నారు. హిందుజాలో విద్యుత్ విభజన తెలంగాణకు 53.89శాతం వాటా, ఆంధ్రప్రదేశ్‌కు 46.22 శాతం వాటాలను విభజన చట్టం స్పష్టంగా పేర్కొందని.. దీని ప్రకారం 1040 మెగావాట్ల సామర్ధ్యం గల హిందుజా ప్రాజెక్టునుంచి రాష్ర్టానికి 600మెగావాట్లకు పైగా విద్యుత్‌వాటా దక్కాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు.

కృష్ణపట్నంపై కిరికిరి


సమైక్యరాష్ట్రం (ఆంధ్రప్రదేశ్)లోని నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉమ్మడి వాటాతో ఏర్పాటైన నెల్లూరు జిల్లాలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్) విద్యుత్ ఉత్పత్తిలోనూ తెలంగాణకు వాటా లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొనడం అనైతికమేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ (కృష్ణపట్నం) 2013 ఆగస్టులో బాయిలర్ లైటప్ చేసి ఏపీజెన్‌కో సరికొత్త చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి ఏపీజెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పీవీ) కింద ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ(ఏపీపీడీసీఎల్) ఏర్పాటుచేశాయి. ఏపీపీడీసీఎల్ ఆధ్వర్యంలో 2X800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మాణం జరపాలనేది వాటి లక్ష్యం. అందులో ఏపీజెన్‌కో 51 శాతం వాటా, నాలుగు డిస్కమ్‌లు 49 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. నాలుగు డిస్కమ్‌ల్లో సీమాంధ్రలోని రెండు డిస్కమ్‌లు(ఈస్ట్రన్, సదరన్), తెలంగాణలోని రెండు డిస్కమ్‌లు(సెంట్రల్, నార్తరన్) ఉన్నాయి. డిస్కమ్‌లకు సంబంధించిన వాటాలను కూడా గతంలోనే నిర్దేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం ఇప్పటికే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి(కమిషన్ ఆఫ్ డేట్-సీఓడీ) చేయాల్సి ఉంది. ఇదే సమయంలో మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే ఏపీ మంత్రులు కృష్ణపట్నంపై కిరికిరి చేయడంలో అర్థంలేదని న్యాయ, విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 26, 2014

ఏపీఎండీసీపై ఆంధ్రాబాబు మరో కుట్ర...!!!

-డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కార్
-నిధుల పంపిణీపై పేచీకోసమే!
-న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రా సర్కార్ మరోసారి ఉల్లంఘించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ప్రకటించి మరో వివాదానికి కాలు దువ్వింది. ఏపీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా, రెవెన్యూ, ఆర్థిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, మైన్స్ అండ్ జియాలజీ సంచాలకులను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో గందరగోళం నెలకొంది. విభజన ప్రక్రియ పూర్తి కాకముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను నియమించడం సమర్థనీయం కాదని ఉద్యోగులు అంటున్నారు. చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా దోచుకోవడానికే ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి డీమెర్జర్ ప్లాన్‌పై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆంధ్రా సర్కార్ మాత్రం తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
న్యాయం కోసం.. ఏపీ ఎండీసీలో ఆంధ్రా చట్ట విరుద్ధ చర్యలను తెలంగాణ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రా బాబు దుశ్చర్యలను సీరియస్‌గా తీసుకున్న సీఎం న్యాయస్థానంలో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ ఉద్యోగుల వేతనాలు ఆపడంనుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం దాకా ఏపీ ఉల్లంఘనల చిట్టాలన్నింటి మీదా ప్రభుత్వం దృష్టి సారించింది. సంస్థ ఆదాయ పంపిణీని విభజన చట్టం ప్రకారమే జరపాలని మన ప్రభుత్వం చెబుతుంటే ఏపీ సర్కారు మాత్రం మొత్తానికి మొత్తం మళ్లించుకోవాలని చూస్తున్నది.

మధ్యేమార్గంగా డీమెర్జర్ ప్లాన్‌ను నిపుణులకమిటీ ఆమోదించి సంస్థ విభజన జరిగేదాకా నిధులను ఏ రాష్ట్రమూ వినియోగించుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది. ఏపీ సర్కారు దుశ్చర్యలను ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తెలంగాణ ఆదాయవనరులను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారన్నారు. కడపనుంచి ఆదాయం ఎక్కువగా వస్తున్నదంటూ నిధులన్నీ ఆంధ్రకు తరలించాలని చూస్తున్నాడని, అదే ఇతర సంస్థల విషయానికి వచ్చినపుడు మాత్రం జనాభా ప్రాతిపదిక అంటూ వాదిస్తున్నాడని మండిపడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


శనివారం, అక్టోబర్ 25, 2014

చంద్రబాబు ఓ దగాకోరు...!

kcr


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరు మీద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారంనాడు సచివాలయంలో దాదాపు రెండు గంటలపాటు జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు చర్యలు, వ్యాఖ్యలను కడిగిపారేశారు. చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా వ్యవహరిస్తున్నాడని, ఇక్కడ పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి బతుకు వారు బతకాల్సింది పోయి పక్కరాష్ట్రంలో నిప్పులు పోస్తున్నాడని అన్నారు. తమకు ముందు చూపు లేదన్న బాబుకు ఉన్నది దొంగచూపు మాత్రమేనన్నారు.

-తెలంగాణకు సైతాన్‌లా దాపురించిండు
-ఆయన దగా ఖరీదు రూ.608 కోట్లు
-తెలంగాణ పంటలు ఎండబెట్టాలని కంకణం కట్టిండు
-విభజన చట్టం ఉల్లంఘించి కరెంటు ఆపుతున్నడు
-బాబు ద్రోహం మీద సుప్రీంకు వెళ్తం
-ముక్కుపిండి పరిహారం వసూలు చేస్తం
-స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
-ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు

చంద్రబాబు చేసిన మోసానికి తెలంగాణ ప్రభుత్వం అదనపు విద్యుత్ కోసం రూ. 608 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతున్నం. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను వదిలిపెట్టేది లేదు. ముక్కుపిండి వసూలు చేస్తాం. చంద్రబాబు చేసిన నష్టంమీద సుప్రీంకోర్టుకు వెళతాం అని స్పష్టం చేశారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని నిలువరించేది లేదని, పంటలను కాపాడుకోవడం తమ ప్రాధాన్యతని అన్నారు. కేటాయించిన జలాల ప్రకారం 81 టీఎంసీల నీరును వినియోగించుకునే హక్కు తెలంగాణకు వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈఆర్సీ ఛీ కొట్టినా బుద్ధిరాలేదు..


విద్యుత్ పీపీఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించారని ఏపీ ఈఆర్సీ చంద్రబాబుకు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ బుద్ధి రాలేదు. చంద్రబాబు దొంగచూపుల వల్ల తెలంగాణ రాష్ట్రం కరెంటు కటకటలకు లోనవుతుంది. ఆయన మోసం వల్లనే 82 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 4 నెలల్లోనే నష్టపోయాం అని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు తెలంగాణ పాలిట సైతాన్‌లా దాపురించి ఈ ప్రాంత రైతుల ఉసురుపోసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక్కడ పంటలను ఎండబెట్టాలని శపథం తీసుకొని, పంటలు ఎండేదాక నిద్రపట్టే పరిస్థితి చంద్రబాబుకు లేనట్లు ఉందన్నారు. తెలంగాణను పూర్తిస్థాయిలో మోసం చేసేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రైతులను, డ్వాక్రా మహిళలను కూడా దగా చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. దేశంలోనే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. తెలంగాణకు బాబు చేసిన అన్యాయానికి సాక్ష్యాలివిగో అంటూ కేసీఆర్ రికార్డులను విలేకరులకు చూపారు.

శ్రీశైలం మీద మాకు హక్కుంది..: శ్రీశైలం నీ అయ్య జాగీరా.. అది సంయుక్త ప్రాజెక్టు. రెండు రాష్ర్టాలకు హక్కు వుంది. 97 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించారు. కల్వకుర్తికి 25 టీఎంసీలు, బీమాకు 20 టీఎంసీలు, నెట్టెంపాడు 22 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు కేటాయిస్తే ఏపీని పాలించిన ఆంధ్రా ముఖ్యమంత్రులు, సమైక్య పక్షపాతులు తెలంగాణకు న్యాయం చేయకుండా రెండు దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం చేశారు.

20 టీఎంసీల నికర జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా... రెండు దశాబ్దాలపాటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణాన్ని కమిటీలమీద కమిటీలువేసి జాప్యంచేసి చివరకు టన్నెల్ నిర్మాణం అంటూ కుట్రలు చేశారు. గ్రావిటీద్వారా నీరందించే అవకాశం వున్నా సకాలంలో ఆంధ్రా పాలకులు చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నీటికి పూర్తి హక్కు ఉన్నా రిజర్వాయిర్ల దగ్గర అడుక్కుతినే స్థితికి తెచ్చారు.

తెలంగాణకు ఒక్క యూనిట్ ఇచ్చావా?: తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు తెలంగాణలో ఒక్కటంటే ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. మొత్తానికి మొత్తం ఆంధ్రలోనే పెట్టారు. అవీ అన్నీ ప్రైవేటు పీపీఏలే. ఇవాళ విద్యుత్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో వున్నాయి.. తెలంగాణకు కరెంటు ఇవ్వనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. పైగా హిందూజా యాజమాన్యాన్ని కూడా బెదిరించాడు. తెలంగాణ కరెంటు కొరతకు కారకుడే చంద్రబాబు.

మాకు ముందు చూపుంది... ఆయనలాగా దొంగ చూపు లేదు... ఆ దొంగ చూపు చూపువల్లనే తెలంగాణకు చట్టప్రకారం రావలసిన కరెంటు రాలేదు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే 300 మెగావాట్లు సరఫరా చేస్తామంటున్నారు. ఆయన్ను ఎలా నమ్మగలం? మేమేమైనా పిచ్చివాళ్లమా. 900 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం. 300 తీసుకుంటమా? బరాబర్ ఉత్పత్తి చేస్తం. చంద్రబాబు జారీచేసిన జీవో 69 ప్రకారమే 834 అ డుగుల నీటిమట్టం వరకు కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. శుక్రవారం శ్రీశైలంలో 857 అడుగుల నీటిమట్టం వుంది.

ఆబిడ్స్‌లో చర్చకు సిద్ధమా?: మాట్లాడితే చర్చలంటున్నడు..కరెంటుపై చంద్రబాబుతో చర్చకు సిద్ధం. రా..అబిడ్స్‌లో నెహ్రూ బొమ్మవద్ద చర్చించుకుందాం. నీ బండారం బయటపడుతుంది. లేదంటే ప్రకాశం బ్యారేజి మీద అయినా సరే..నువ్వు అక్కడి రైతులు డ్వాక్రామహిళలకు ఏం హామీలిచ్చినవో.. ఎట్ల దగా చేసినవో..సీడీలు కూడా పట్టుకొని వస్త..

నాలుకనా తాటి మట్టనా?: చంద్రబాబూ నీది నాలుకనా? తాటిమట్టనా? వైఎస్ హయాంలో జీవో 107 ప్రకారం 834 నుంచి 854 అడుగులకు పెంచితే దానిని తీవ్రంగా వ్యతిరేకించింది నువ్వే. ప్రస్తుత నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ, మరో నేత ధూళిపాళ నరేంద్ర ఆధ్వర్యంలో ఆనాడు ప్రకాశం బ్యారేజీవద్ద ఆందోళన చేశారు. చంద్రబాబు కూడా అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తూ ఈ జీవోను వ్యతిరేకించారు. అంటే 834 అడుగుల వరకు శ్రీశైలం నీటిని వినియోగించుకోవచ్చని చంద్రబాబే ఆనాడు చెప్పారు. దృశ్యరూపకం ప్రదర్శించారు. మేలు చేయాల్సిన రాజే...అంటూ వాళ్ల పత్రిక కూడా దీనిపై వార్తలు ఇచ్చింది. ఇవన్నీ రికార్డులో ఉన్నాయి. చూసుకోవచ్చు.. నీది నాలుకనా తాటిమట్టా... ఎవరిని మోసగిస్తావు?

నీ మోసాలకు అంతే వుండదా? అని చంద్రబాబుపై కేసీఆర్ కన్నెర్ర చేశారు.

ముఖ్యమంత్రివని గౌరవమిచ్చాను..: చంద్రబాబూ.. తెలంగాణపై అంత కక్ష ఎందుకు పెట్టుకున్నావు. ఎందుకు మోసం చేస్తున్నావు. ఎంత జరిగినా ఇంతదాకా మాట్లాడలేదు.. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రివనే సంస్కారంతో గౌరవమిస్తూ వచ్చాను. జూరాలలో సకాలంలో విద్యుత్ ప్లాంట్లను పునరుద్ధరించలేదని విమర్శిస్తున్నావు. వరదలో మునిగిన యూనిట్‌వల్ల నష్టపోయింది కేవలం 80 మెగావాట్లే. అసలు ఆ ప్రాజెక్టు ఇంకా ప్రారంభమే కాలేదు.

నీ ఏలుబడిలో శ్రీశైలం కుడిగట్టు పవర్ ప్రాజెక్టు మునిగిపోతే నువ్వేం చేసినవు? నీది దుర్మార్గపు పంథా. ప్రపంచ చరిత్రలో ఇలాంటి మనస్తత్వం ఎవరికీ ఉండదు. ముందుచూపు మాకుంది. నీ దొంగ చూపువల్లనే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. 

కోర్టుకు పోతున్నం..: విభజన చట్ట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని ప్రాజెక్టులనుంచి తెలంగాణకు 53.89 శాతం రావలసి వుంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించడంతోపాటు అసత్య ప్రచారం చేస్తున్నాడు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. జరుగుతున్న లోటుపాట్లపై మా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు.

నేను ప్రధాని నరేంద్ర మోడీ, గోయల్‌కు కూడా వివరించాను. రూ. 8లు యూనిట్‌కు ఖర్చైనా విద్యుత్‌ను కొంటున్నాం. అవన్నీ పత్రికల్లో వేయించుకోలే. ఆ ముఖ్యమంత్రిలాగా సీఎం బిజీ.. బిజీ.. అంటూ పత్రికల్లో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేం నిబద్ధతతో పని చేస్తున్నాం.
గవర్నర్‌కు అన్నీ చెబుతున్నాం..: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్నాను. సీఈఏ ఆర్డరును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించింది. వారి ఏపీఈఆర్సీయే వారికి చెంపదెబ్బలాంటి తీర్పునిచ్చింది.

వాస్తవాలు ఇలా ఉన్నా యి. నువ్వు తప్పు చేస్తూ మోసాలు చేస్తున్నావు. అసమర్థత మాదా? నిజం నిలకడమీద తెలుస్తుంది. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. హిందూజా, కృష్ణపట్నం ప్రాజెక్టునుంచి తెలంగాణకు కరెంటు రాకుండా ప్రయత్నిస్తున్నావు. తెలంగాణ పంటల నష్టం చెల్లించాల్సి ఉంటుంది. జాగ్రత.. దీన్ని ముక్కుపిండి వసూలు చేస్తాం. తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్. ఎవర్నీ వదిలిపెట్టం.
నువ్వో చీటర్‌వి..: పైరవీలు చేసి కృష్ణా ట్రిబ్యునల్‌ను పిలిపించుకున్నావు. నీ మోసం ఎవరికి తెలియదు. సాధారణ ఎన్నికల్లో నీవు చేసిన ప్రసంగాల వీడియో ఫుటేజి మాదగ్గర వుంది. నీ బండారం బయట పెడతా. సాటి సీఎంవని మర్యాద పాటిస్తున్నాను.

నీవు చీటర్‌వు. ఏపీ రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశావు. 95వేల కోట్ల రుణాల మాఫీ ఎలా అని విమర్శలొస్తే నువ్వు బచ్చాగాడివంటూ హామీలమీద హామీలు ఇచ్చావు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాను.. ఋణాల మాఫీ ఎలా చేయాలో తెలుసని అన్నావు. అయితే ఇప్పటికీ రైతులకు పైసా మాఫీ చేయలేదు. కథలు చెబుతున్నావు, మెలికలు పెడుతున్నావు, పరిమితి విధిస్తున్న పచ్చి మోసగాడివి నీవు .రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించపోయినా మేం తెలంగాణలో రుణ మాఫీ ప్రక్రియపై నిర్ణయాలు తీసుకుని రైతులకు మేలు చేశాం.

తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుండగా నీవే అక్కడ రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశావు... మేము తప్పు చేశామా.. నీ బండారం చాలా వుంది. మేము మానవత్వంతో ప్రవర్తించాము. నీవు కరెంటు ఇవ్వకపోయినా తుఫాను సమయంలో అక్కడి ప్రజలకు ఇబ్బంది వుందంటే విద్యుత్ పరికరాలను (ట్రాన్స్‌ఫార్మర్స్) తెలంగాణ రాష్ట్రంనుంచి అక్కడికి తరలించాం. కానీ నీ పెత్తనమేంది? కిరికిరి పెడుతున్నావెందుకు? ప్రతిచోటా కిరికిరే. మా బతుకు మేం బతుకుతాం....అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

శుక్రవారం, అక్టోబర్ 24, 2014

మానండయ్యా...మీ చౌకబారు రాజకీయాల్ని...!!!

సీమాంధ్ర పాలనలో తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో- కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా చేయగలిగినంత చేస్తున్నది. కానీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినందు వల్ల లోటు ఏర్పడుతున్నది. గత ఏడాది దాదాపుగా ఇదే సమయానికి రోజువారీ డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా ఆనాటి ప్రభుత్వం 122. 35ఎంయూలు సరఫరా చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక కుట్రలు, అడ్డంకుల మధ్య గతం కన్నా ఎక్కువగా 143 ఎంయూలు సరఫరా చేసింది.
తెలంగాణ రైతులు నీళ్ళులేక, కరెంటు లేక గోస పడుతున్నారంటే ఇందుకు కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు చేసిన ద్రోహమేనని చిన్న పిల్లలు కూడా చెప్పగలరు. అయినా టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ తక్షణమే కరెంటు ఇవ్వాలని రాద్ధాంతం చేయడం విచిత్రంగా ఉన్నది. విద్యుత్ సమస్యలు తీర్చాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు గురువారం సచివాలయానికి వచ్చి ధర్నాకు దిగారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం, రైతులపై ప్రేమ ఒలకబోయడం ఇది మొదటిసారి కాదు. కొద్ది రోజుల కిందటనే ఈ టీడీపీ పెద్దలు బస్సుయాత్ర చేపట్టారు. మేమున్నామంటూ కాంగ్రెస్ వాళ్లు రైతు భరోసా యాత్ర అంటూ ఒకటి చేపట్టారు.

కలెక్టరేట్ల ముందు ధర్నాలు సాగించారు. రోజుకో పెద్దమనిషి కరెంటు సమస్య మీద ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇది చాలదన్నట్టు బీజేపీ నాయకులు కూడా నిరసనలకు దిగారు.

వైఎస్‍ఆర్‍సీ పార్టీకి చెందిన ఒక నాయకుడైతే చంద్రబాబు ముందు చూపు వల్లనే ఆంధ్ర ప్రదేశ్ కరెంటు కొరతను ఎదుర్కోవడం లేదని ప్రశంసిస్తున్నాడు.

ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా ముందు చూపుతో వ్యవహరించి సీమాంధ్ర ప్రాంతానికి కరెంటు కష్టాలు లేకుండా చూసుకున్నారు.

కానీ తెలంగాణకు చెందిన ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ముందుచూపుతో ఏమి చేశారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలె!

వీళ్ళే...ప్రజలకు రెండు అంశాలపై సంజాయిషీ ఇచ్చుకోవాలె. 

మొదటిది- రైతుల కోసం ఇంత గొడవ చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన ద్రోహం గురించి ఆనాడు ఎందుకు మాట్లాడ లేదు?

రెండవది- ఇప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఎందుకు నిలదీయడం లేదు?

ఇంతకాలం తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు నిర్లక్ష్యం చేయడం వల్లనే రైతులు బోరుబావులు తవ్వుకుని కరెంటుపై ఆధారపడే గతి పట్టింది.

తెలంగాణలో కరెంటు అవసరం ఉన్నది.

ఇక్కడే బొగ్గు, నీటి వనరులు ఉన్నాయి. అయినా సీమాంధ్రలో విద్యుత్ కేంద్రాలు నెలకొల్పి, ఇక్కడి వాటిని నిర్మాణం జరగకుండా తొక్కిపెట్టింది సీమాంధ్ర పాలకులే కాదా?
-రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఇవ్వాలని స్పష్టంగా ఉన్నది.
-అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
-చంద్రబాబు తెలంగాణకు కరెంటు ఇవ్వాల్సి వస్తుందని విద్యుత్కేంద్రాల ఉత్పత్తిని నిలిపివేయడం ఎంత అన్యాయం! ---పీపీఏల రద్దుకు యత్నించాడు.
-విద్యుత్కేంద్రాలు ఉత్పత్తి చేయకపోవడం వల్ల సీమాంధ్ర ప్రజలకు వచ్చే లాభమేమీ లేదు. కానీ ఇక్కడి రైతుల కడుపు మీద దెబ్బ కొట్టడానికి విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా పడావు పెట్టడం ఎంత క్రూరమైన చర్య!
-ముంపు గ్రామాల బదిలీకి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పినప్పుడు- అది విభజన చట్టంలో ఉందంటూ దీర్ఘాలు తీసిన బీజేపీ నాయకులు ఇప్పుడు అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటా విద్యుత్ ఇవ్వాలని అడగందుకు?

రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అంతిమ బాధ్యత కేంద్రానిదే అని విభజన చట్టంలో ఉంది కదా. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత ఉన్నా చంద్రబాబును, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలె. ఇక్కడ ఆందోళనలు జరిపి ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం తగదు.

సీమాంధ్ర పాలనలో తీవ్ర అన్యాయం జరిగిన నేపథ్యంలో- కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు నెలలుగా చేయగలిగినంత చేస్తున్నది. కానీ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగినందు వల్ల లోటు ఏర్పడుతున్నది. గత ఏడాది దాదాపుగా ఇదే సమయానికి రోజువారీ డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉండగా ఆనాటి ప్రభుత్వం 122. 35ఎంయూలు సరఫరా చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక కుట్రలు, అడ్డంకుల మధ్య గతం కన్నా ఎక్కువగా 143 ఎంయూలు సరఫరా చేసింది. అయితే డిమాండ్ 165 ఎంయూలకు పెరగడం వల్ల కొరత ఏర్పడింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఈ కొరత సమస్య తీర్చాలని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. మన రాష్ట్రం ఏర్పడింది కనుక మన రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా పనులు సాగుతాయి. చెరువుల పూడిక తీయించడానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు దీర్ఘకాలిక వ్యూహాలు అమలు అవుతున్నాయి.

దీని వల్ల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ఈ వాస్తవాలు తెలిసి కూడా ప్రతిపక్షాలు సీమాంధ్ర పాలకవర్గాలు ఆడించినట్టల్లా ఆడడం సమర్థనీయం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని గడువుకు ముందే కూలుస్తానని ఇటీవలే చంద్రబాబు నిర్లజ్జగా వ్యాఖ్యానించాడు. మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అదే ఎజెండాను అమలు చేస్తున్నాయనే అనుమానం కలుగుతున్నది.

ఏ రాష్ట్రంలో అయినా కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు, నాయకులు ఒక్కటిగా నిలబడతారు. ఉదాహరణకు- కర్ణాటకకు, తమిళనాడుకు కావేరీ జలాల కోసం వివాదం తలెత్తినప్పుడు- రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఎక్కడివారు అక్కడ తమ రాష్ట్రం ప్రయోజనాల కోసం ఏకమయ్యారు. మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించాలె. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల బాధ్యత ఎంతో గొప్పది. అవి నిర్మాణాత్మకంగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

గురువారం, అక్టోబర్ 23, 2014

చంద్రబాబూ..నీ కుట్రలు జర ఆపుబాబూ!!

బ్లాగు వీక్షకులకు, తెలంగాణ ప్రజలకు

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!!





chandra


శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగులదాకా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి. 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే జీవో 69 కూడా విడుదల చేసిండు. 770 అడుగులు ఉన్నపుడు కూడా కరెంటు ఉత్పత్తి చేసిన దాఖలాలున్నయి. మరి ఇప్పుడు 862 అడుగుల వరకు నీళ్లుంటే, తాగునీటి సమస్య అంటూ కరెంటు ఉత్పత్తి ఆపాలని కృష్ణా ట్రిబ్యునల్‌కు లేఖ రాస్తవా? అసలు నువ్వు రాజకీయాలకు అర్హుడివేనా? అంటూ టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

-లేదంటే ఆంధ్ర కార్యాలయాలకు కరెంటు కట్

-శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపమనడం దుర్మార్గం
-770 అడుగుల వద్ద కూడా కరెంటు ఉత్పత్తి చెయ్యలేదా?
-చంద్రబాబు వైఖరికి నిరసనగా ట్యాంక్‌బండ్‌పై ఆందోళన
-టీటీడీపీ నేతలపై టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల మండిపాటు

శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్త్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణా ట్రిబ్యునల్‌కు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాయడానికి వ్యతిరేకంగా మంగళవారం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టారు. పునర్విభజన చట్టం ప్రకారం 54 శాతం కరెంటు ఇవ్వకుండా అడ్డుకుంటున్నడని మండిపడ్డారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చుని చంద్రబాబు కుట్రలు, తెలంగాణ టీడీపీ నాయకుల తీరును ఎండగట్టారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు హోరెత్తాయి. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, గొంగిడి సునీత, కనకారెడ్డి, వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఆమోస్, బీ వెంకటేశ్వర్లు, భానుప్రసాద్‌రావు, యాదవరెడ్డి, సలీం, సుధాకర్‌రెడ్డి, జగదీశ్, పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేశ్, నాయకులు ప్రేమ్‌కుమార్ థూత్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రలో ఓట్లు నమోదు చేయించుకోండి: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్


తెలంగాణ టీడీపీ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం గెలిచినట్లుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్లు విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు ప్రమాణం చేసిన పదిరోజుల్లోనే పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా పీపీఏలను రద్దు చేసిండు. తెలంగాణ అంధకారంలో ఉండాలి.

ఏపీ మాత్రం సల్లగుండాలి అనే దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నరు. కరెంటు కష్టాలను తీర్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వచ్చే మూడేండ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో న్యాయబద్దంగా తెలంగాణకు 54 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని 12 రోజులుగా ఉత్పత్తి ఆపించి, 800 మెగావాట్లను దొంగతనంగా వాడుకుంటున్నరు.

బాబు చర్య నీచాతి నీచం: ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్


20 ఏండ్లు టీడీపీ, 40 ఏండ్లు కాంగ్రెస్ ఈ రాష్ర్టాన్ని పాలించిండ్రు. ఇక్కడ బొగ్గు ఉంది, నీళ్లున్నయి. కానీ విద్యుత్‌కేంద్రాలను మాత్రం ఆంధ్రల పెట్టిండ్రు. చివరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన కరెంటును కూడా ఇయ్యకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తుండ్రు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని లేఖ రాయడం నీచాతి నీచం.

babu


ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ కుట్రలా?: ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు


ఒకవైపు చంద్రబాబు కరెంటు ఆపుతుంటే, ఇంకోవైపు టీటీడీపీ ఎమ్మెల్యేలు కరెంటు కోతలంటూ ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? కలిసున్నపుడు అరవయ్యేండ్లు ప్రతిదానిలో తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు న్యాయపరంగా కరెంటు వాటా ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లో భ్రమ కల్పించేందుకు కుట్ర చేస్తున్నరు. చంద్రబాబు వైఖరి నచ్చకే చాలామంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరిండ్రు. త్వరలో ఆ పార్టీ ఖాళీ అయితది. ఉమ్మడి రాజధాని పేరిట సకల సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తూ కుట్రలు చేయడం సిగ్గుచేటు.

బద్మాష్ యాత్ర: ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు


ఒకవైపు చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, ఇంకోవైపు టీ టీడీపీ నాయకులు బస్సు యాత్ర చేస్తరు. వాళ్లది బస్సు యాత్ర కాదు.. బద్మాష్ యాత్ర. వారి కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మరు. అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఆరువేల మెగావాట్ల విద్యుత్తు కోసం ఒప్పందం చేసుకుంది. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? ఇప్పటికైనా టీటీడీపీ నేతలు తెలంగాణ ప్రజల కోసం పని చేయాలి.

కుట్రలు ఆపకుంటే ఆంధ్ర కార్యాలయాలకు కరెంట్ కట్: ఎమ్మెల్సీ యాదవరెడ్డి


అసలు రాష్ట్రంలో కరెంటు కష్టాలకు బాధ్యులెవరో తెలంగాణ టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి. 60 ఏండ్లు ఆంధ్రలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రులు, విద్యుత్‌మంత్రులు అందరూ వాళ్లే అయి ఈ కుట్ర చేసిండ్రు. కేసీఆర్ ఉద్యమ సమయంలోనే ఈ కుట్రలన్నింటినీ ప్రజలకు చెప్పిండ్రు.

అందుకే పునర్విభజనచట్టంలో తెలంగాణకు 54 శాతం కరెంటు రావాలని పొందుపరిచినరు. న్యాయపరంగా రావాల్సిన కరెంటును ఇవ్వకుండా కుట్రలు చేస్తున్న చంద్రబాబు ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనుగోలు చేయకుండా కూడా కుట్రలు చేస్తున్నరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలి. చంద్రబాబు కుట్రలు ఆపకుంటే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర కార్యాలయాలకు కరెంటు కట్ చేస్తం.

ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి: ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి


తెలంగాణలో అంతా బోర్ల మీద వ్యవసాయం చేస్తరు. అందుకే వీటిని ఎట్ల నిలుపుదల చేయాలా అని చంద్రబాబు కుట్రలు చేస్తున్నరు. కృష్ణపట్నం, లోయర్ సీలేరు నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కరెంటు దక్కేలా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకోవాలి. హుదూద్ తుపాన్ వస్తే విశాఖకు విద్యుత్ పరికరాలు సరఫరా చేసి సహకారం అందించినం. కానీ తెలంగాణ రైతాంగం బాధలు పడుతుంటే కరెంటు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నరు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, అక్టోబర్ 21, 2014

వీళ్ళు...మారరుగాక...మారరు...!!!

 
-శ్రీశైలం విద్యుత్తు ఆపించండి..కృష్ణా ట్రిబ్యునల్‌కు చంద్రబాబు ఫిర్యాదు
-హక్కు ప్రకారమే ఉత్పత్తి: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో మంచినీటి ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయించాలని ఫిర్యాదులో పేర్కొంది. రాయలసీమలో మంచినీటి కోసం ముందు జాగ్రత్త చర్యగా శ్రీశైలం ఎడమ కాలువ విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించడంతో సోమవారం కృష్ణా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. 

కుట్రల బాబు తాజా ఎత్తు:

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని రైతులు అల్లాడిపోతున్నారని తెలిసినా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అయితే శ్రీశైలం విషయంలో బాబు ఎన్ని పాచికలు వేసినా అవి పారవని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 860.2 అడుగుల వరకు నీరు ఉంది. నిబంధనల ప్రకారం చూసినా జలాశయంలో 834 అడుగులకు చేరే వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శ్రీశైలంలో 770 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి చేశారని వారు గుర్తు చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం (సోమవారం) 860.2 అడుగులు ఉంది. ఈ మాత్రానికే మంచినీటి కొరత ఏర్పడే ప్రసక్తే లేదని నిపుణులు చెప్తున్నారు. 

ప్రాజెక్టు కట్టిందే విద్యుత్తు కోసం:

 అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. దీన్ని ఇతర అవసరాలకు వాడబోమని ఆనాడు చెప్పారు. ప్రాజెక్టు కట్టిన తర్వాత కుంటి సాకులు, గుడ్డిసాకులు చెప్పి నీటిని రాయలసీమకు తరలించడం ప్రారంభించారు. విషయం ఇది కాగా శ్రీశైలం జలాశయంలోని నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. దొంగచాటుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే... దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని టీ ఇంజినీర్లు విమర్శిస్తున్నారు.

ఆ ఫిర్యాదు నిలువదు:

 విద్యాసాగర్ రావు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమి లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అభిప్రాయపడ్డారు. పాత నిబంధనలు పరిశీలిస్తే, ఏపీ వాదనలో బలం లేదని తేలిపోతున్నదని స్పష్టం చేశారు. శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్న నీటిమట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని నిబంధనలే చెప్తున్నాయని, ఈ విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ తొందరపడి నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏ తప్పూ లేదని విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, అక్టోబర్ 20, 2014

ఉమ్మడితో టీఎస్‌ఆర్‌టీసీ దోపిడీ...!!!

తెలంగాణ విభజనకు పూర్వం, తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల్లో వీలైనంత భాగాన్ని దోచుకోవాలనీ, వీలుకాకపోతే ఆర్టీ సీ విభజనను మరింత జాప్యం చేయాలని చూస్తున్నారు. నష్టాలు మన నెత్తిన ఎత్తి, లాభాలను దోచుకోవాలనీ కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలి. సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని రక్షించుకోవాలి. రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలైంది. తెలంగాణ అంతా కొత్త శోభ సంతరించుకొంటున్నది. ప్రతి విభాగం నూతనోత్సాహంతో తమ తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుంటున్నది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. కాని సామాన్యుని ప్రయాణ సాధనం ఆర్టీసీకి ఉమ్మడిగ్రహణం వీడక తల్లడిల్లుతున్నది. 
నాలుగు నెలల ప్రత్యేక రాష్ట్రంలో 21 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము, సీమాంధ్ర ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యింది. శ్రమ తెలంగాణ ఆర్టీసీ కార్మికులది, దోపిడీ సీమాంధ్ర ఆర్టీసీది. కాలం గడుస్తున్న కొద్దీ గాయం విస్తరిస్తున్న బాధ. ప్రభుత్వం ఈ కిరికిరిని వెంటనే పరిష్కరించాలనీ ప్రజలు ,తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు.
తెలంగాణలో రవాణా వ్యవస్థ పటిష్టమైంది, విశిష్టమైంది. 1932లో నైజాం పాలనలో మీర్జా వజ్రత్ అలీ, జనరల్ మేనేజర్‌గా తెలంగాణలో రవాణా వ్యవస్థను ప్రారంభించారు. ఇది ఆనాటికి అత్యుత్తమమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష. ఆవిధంగా ఎదిగిన ఆర్టీసీ నేడు లక్షా 25 వేల మంది కార్మికులతో 25వేల బస్సులతో దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా ఎదిగి ప్రతిరోజు కోటి 50 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నది. దీని వెనక శ్రమ, సంపద అంతా 10 జిల్లాల తెలంగాణ ఆర్టీసీ కార్మికులది, ప్రజలది.

తెలంగాణ ప్రాంత ప్రజల విశ్వసనీయ ప్రయాణ సాధనం ఇప్పటికీ ఆర్టీసీ మాత్రమే. ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు, వ్యక్తిగత వాహన వినియోగం సీమాంధ్ర కంటే తెలంగాణలో తక్కువ. సీమాంధ్ర ప్రాంత పరిస్థితి దీనికి భిన్నం. వ్యక్తిగత వాహన వినియోగ సామర్థ్యం, మరో రవాణా సౌకర్యమైన రైలు వినియోగం చాలా ఎక్కువ. ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ సీమాంధ్రలోనే తిష్ఠవేసినవి. ఒకే నెంబర్ మీద అనేక బస్సులు నడిపిన ఘన చరిత్ర ఆ ప్రాంత ట్రావెల్స్ యాజమాన్యాలకు ఉన్నది. ప్రైవేటు బస్సులు కదిలిన తర్వాతే ఆర్టీసీ బస్సులు కదలాలి. ప్రైవేటు బస్సులన్నీ నిండు కుండల్లా కదుల్తుంటే, వెనక ఆర్టీసీ బస్సు ఖాళీగా రావలసిందే. కనీసం క్రాస్ చేసి ముందుకెళ్లితే ఆర్టీసీ కార్మికుల మీద దాడులు జరిగిన ఘటనలు కోకొల్లలు. ఇంతకాలంగా సర్వసాధారణంగా వినిపించే మాట నష్టాల్లో ఆర్టీసీ! ఇది విస్తరించడానికి, నష్టాలు పెరగడానికి సీమాంధ్ర ఆర్టీసి వల్లనే అనే సంగతి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అనుభవంలోకి వస్తున్నది.

ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని గండికొడుతూ వస్తున్న సీమాంధ్ర ఆర్టీసీ యాజమాన్యం, అక్కడి ప్రభుత్వం- తెలంగాణ ప్రాంత ఆర్టీసీ మూల సంపదను కొల్లగొట్టే పనిలో పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జవహర్ కమిటీ కుట్రలను భగ్నం చేస్తూ ధర్నాలకు దిగి పోరాడుతున్నారు. జవహర్ కమిటీ రిపోర్టు యధాతథంగా ఆమోదిస్తే తెలంగాణకు వెయ్యికోట్ల ఆస్తి నష్టం సంభవిస్తుంది.ఈ ప్రాంత ఆర్టీసి లేవలేని స్థితిలోకి నెట్టబడుతుంది. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం జవహర్ కమిటి రిపోర్టును తిరస్కరించాలి. తెలంగాణ ప్రాంత ఆర్టీసీ ఆస్తులు తరతరాలుగా వారసత్వంగా లభించినవే. ఇక్కడి భూములు, భవనాలు ఇక్కడి కార్మికుల చెమటతో నిర్మించినవే.

తెలంగాణ ఆస్తుల్లో భాగం అడుగుతున్న వారు సీమాంధ్ర ప్రాంతంలోని బస్‌స్టాండ్‌లు, బస్‌డిపోలు, షాపింగ్ కాంప్లెక్సులు తదితర ఆస్తుల్లో భాగం పంచుతారా? అన్నది సూటి ప్రశ్న. మాదిమాకే మీదీమాకే అనే దోపిడీ తత్వాన్ని సీమాంధ్ర ఆర్టీసీ నాయకులు విడనాడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. ఆర్టీసీని శాస్త్రీయంగా విభజించాలి. అది త్వరగా జరగాలి. పోటీపడి రెండు ప్రాంతాల ఆర్టీసీ ఎదగాలి. విడిపోయిన మూడు నెలల వ్యవధిలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు శ్రమించి 8కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. సీమాంధ్ర ఆర్టీసీకి 21 కోట్లు నష్టం. గణాంకాలు పరిశీలించే కమిటి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 1958 జనవరి నాటికి అప్పటి ప్రభుత్వం నుంచి రాజధానిలో 16 స్థిరాస్తులు, మిగిలిన తొమ్మిది తెలంగాణ జిల్లాల్లోని 42 స్థిరాస్తులను మార్కెట్ విలువను చెల్లించి ఆర్టీసీ కొనుగోలు చేసింది.

దానికి ఇప్పటి సీమాంధ్రకు సంబంధమేలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఆదాయంతోనే ఇప్పుడున్న సీమాంధ్ర ఆర్టీసీ ఆస్తులు సంపాదించుకొన్నవే. అట్లాంటప్పుడు నిజంగా వాటిలో భాగస్వామ్యం అడగవలసింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యమే. ఇదే సహజ న్యాయం కూడా. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు కార్మికులు- మానీళ్ళు, మానిధులు, మా ఉద్యోగాలు మాకు కావలసిందే అని ఉద్యమించింది దీని కోసమే. ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే.. ఈ ప్రాంతంలోని ఆర్టీసీ ఆస్తిలో చిల్లిగవ్వగాని, గజం స్థలం గానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు.ఈ దోపిడీని అడ్డుకోవడానికి ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.జవహర్ కమిటీ రిపోర్టు తీవ్రమైన దోపిడీకి దారితీసే విధంగా ఉన్నది.కాబట్టి దాన్ని బేషరతుగా రద్దుచేయాలి. ఆర్టీసీ ఉద్యోగులు విభజన కోసం ఏర్పాటైన షిల్లాబెడె కమిటీ ద్వారానే త్వరతగతిన జరగాలి.

ఆర్టీసీ ఆదాయ వ్యయాన్ని రెగ్యులర్‍గా ఆడిట్ చేస్తున్న కమిటీ జె.బి.ఆర్. కన్సల్టెంట్ ద్వారానే జరగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.తెలంగాణ విభజనకు పూర్వం, తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల్లో వీలైనంత భాగాన్ని దోచుకోవాలనీ, వీలు కాకపోతే ఆర్టీసీ విభజనను మరింత జాప్యం చేయాలని చూస్తున్నారు. నష్టాలు మన నెత్తిన ఎత్తి, లాభాలను దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ సమాజం మేల్కోవా లి. సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని రక్షించుకోవాలి.అవసరమైతే మరో ఉద్యమానికి నాంది పలకాలి. తగిన నియమాలు నిబంధనలు స్పష్టంగా రాసుకుని ఆర్టీసీలో విభజన ప్రక్రియను వేగవంతం చేయాలి. తద్వారా ఆర్టీసీ ప్రగతి చక్రాన్ని తెలంగాణ ప్రజల మేలుకోసం పరు గెత్తించాలి. ఇదే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష.

ఆదివారం, అక్టోబర్ 19, 2014

శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి ఆగదు!!!

-ఈ విషయంలో ఏపీ మంత్రి నాతో మాట్లాడలేదు
-మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ
శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తిని ఆపే అవకాశం ఏమాత్రం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. "మా పంటలను ఎండబెట్టుకుని మీకు (ఆంధ్రప్రదేశ్‍కు) నీళ్ళు ఇవ్వాలా ? తెలంగాణ రైతులు ఇబ్బందుల్లో ఉన్న సంగతి మీకు తెలియదా?

hareeshraoతెలంగాణలో విద్యుత్‌లోటు ఉందన్న సంగతి మీ కంటికి కనబడటం లేదా? విద్యుత్తులో తెలంగాణ వాటా (53.89శాతం) ఇవ్వకపోగా మా రైతులకు అన్యాయం చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం?" అని ఆయన ప్రశ్నించారు. శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ మంత్రి దేవినేని ఉమా తనకు ఫోన్ చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఏపీ సర్కారు అక్కడి రైతాంగం రెండో పంటకు నీళ్ళ గురించి ఆలోచిస్తుండగా.. తాము తెలంగాణ రైతన్నల మొదటి పంట గురించి ఆలోచిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, అక్టోబర్ 18, 2014

తెలంగాణలో...నాటి వివక్షతోనే...నేటి విద్యుత్ కష్టాలు!

తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా ఈ సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది. దీనివల్ల విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగింది.
కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. నానా తంటాలు పడి ఆరుగాలం శ్రమించే రైతులు నేలరాలడం బాధాకరమైన విషయమే? ఆ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందే. సాగు చేసిన భూమిలో మొలకెత్తిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్న పైరులను చూసి అల్లాడుతున్న రైతు, ఎండిన బీళ్లు చూడలేక చలించిపోయి తనువు చాలిస్తున్నాడు.

వర్షాలు లేకపోవడం ద్వారా బోర్లపైనే ఆధారపడే రైతులు కరెంటు కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.అప్పు చేసి సాగు చేసిన పంటలు మధ్యలోనే ఎండిపోవడంతో చేసిన అప్పు, చేసిన సాగు.. పంటలు మధ్యలోనే ఎండిపోవడం ద్వారా చేసిన అప్పు ఏవిధంగా తీర్చాలో అనే తపనతో మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అన్నివర్గాల భరోసా అవసరమే.

అయితే రైతన్నల ఆత్మహత్యలపై ప్రతిపక్ష పార్టీలు పాలక ప్రభుత్వంపై అర్థం పర్థంలేని విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ‘భరోసా యాత్ర’ ల పేరుతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తలా మూడు జిల్లాల పర్యటించి రైతుల ఆత్మహత్యలకు పాలక పార్టీనే ముద్దాయిని చేసి చూపిస్తున్నాయి. అయితే ఈ రైతన్నల ఆత్మహత్యలకు కారకులెవరు? పాలక పార్టీనా? కరెంటు కోతలా? కరువు కాలమా? లేదా గత ప్రభుత్వ విధానాలా? అనేది పరిశీలించి చూడాల్సిన అవసరం ఉన్నది.

మొదటగా వర్షాభావం పరిస్థితి చూద్దాం. వ్యవసాయానికి ప్రాణాధారమైన వర్షాలు ముఖం చాటు వేయడంతో రాష్ట్రంలో కరువు అల్లాడుతున్నది. తొలకరి వానలకు సైతం నోచుకోకపోవడంతో గత కొన్నేళ్ళుగా ఎన్నడులేని విధంగా పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్రంలో జిల్లాలో దుర్భిక్షం నెలకొన్నది. వర్షపాతం సాధారణం కన్నా 40శాతం తక్కువ కురిసింది. ఫలితంగా రాష్ట్రంలో వరిపంట 1.64 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 3.22 లక్షలు, పెసర 0.5లక్షలు, కంది 1.75 లక్షలు, మినుము 0.15 లక్షలు, సోయా 2.10 లక్షలు, పత్తి 12.12 లక్షలు, జొన్న 0.34 లక్షలు, ఆముదం 0.55 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేయడం జరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో అతి తక్కువగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో 52 శాతం మేరకే సాగు చేయడం జరిగింది.

ఆదిలాబాద్ జిల్లాలో 14.2 సెంటీమీటర్ల వర్షపాతంతో రాష్ట్రంలో మొదటిస్థానం ఉండి 7 శాతం సాగు చేయడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే పంట సాగు చాలా తక్కువని వ్యవసాయ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. వర్షాభావం తగ్గటం వల్ల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆత్మహత్యలు చేసుకుని కడుపుకోత మిగుల్చుతున్నారు. దీనికి పాలక పార్టీనే కారణం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టటం చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా! మరి ఆ ఆత్మహత్యలకు గత పాలకులు బాధ్యత వహించగలరా?
రెండవది కరెంటు కష్టాలు - తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా ఈ సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది.

దీనివల్ల విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాది అంటే జూలై-ఆగస్టు నాటికి 1500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం ఉంటే, ఇప్పుడది 1900నుంచి రెండు వేల మెగావాట్లకు పెరిగిందని అధికార వర్గాలే తెలియచేస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు ఏటా అగస్టు నుంచి అక్టోబర్ చివరి వరకు కరెంటు వినియోగం అధికంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో వర్షాలు లేకపోవడంతో జూలై నుంచే గరిష్ఠ స్థాయిలో పంటలకు విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఐదేళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు.రాష్ట్రంలో బోర్లు, బావుల కింద 37లక్షల ఎకరాలు ఖరీఫ్‌లో సాగు చేయాల్సి ఉంది. కానీ కేవలం 25లక్షల ఎకరాలు మాత్రమే సాగుచేసినా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అధికారవర్గాలు వాపోతున్నాయి.

తెలంగాణ జెన్‌కో ద్వారా 409మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 2744.35మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా తరచూ అనేక యూనిట్లలో లోపాలు తలెత్తి ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. ఇటీవలి కాలంలో కొత్తగూడెం, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పలుమార్లు లోపాలు తలెత్తగా మరికొన్ని చోట్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేయడం జరుగుతున్నది. ఇదే గాకుండా నాసిరకం బొగ్గు కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేక పోవడంతో జల విద్యుత్‌కేంద్రాలు పని చేయడం లేదని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తరుచూ తలెత్తుతున్నాయని విద్యుత్ అధికారులు అంటున్నారు.

అయితే ఈ కరెంటు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే జలయజ్ఞం ప్రాజెక్టుల క్రింద వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా తెలంగాణ రైతాంగానికి ఫలితం మాత్రం దక్కలేదు . ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకమే దీనికి నిదర్శనం. మూడేళ్లలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తామని 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్ళు కాదు కదా! పదేళ్ళు పూర్తయింది. పనులు పూర్తి కాలేదు. జరిగిన పనిలో కూడా అంతా డొల్లతనం కనబడుతున్నది. 25 టీఎంసీల నీటి వినియోగంతో 3.4 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగు నీరందించేందు కు 2990 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది.
ఆరు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ కాంగ్రెస్ పాలకులు 3.4 లక్షల ఎకరాలకు కాదు కదా 34 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారు. అంటే కాంగ్రెస్ పాలకులు తెలంగాణ రైతాంగానికి ఎంతటి మేలు చేసిండ్రో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టుల కట్టలు పూర్తి అయి ఉంటే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందేది. పంటలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతు చేతికొచ్చి లాభాలు చేకూర్చేవి. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ ‘రైతు భరోసా’ పేరుతో ప్రజల్లోకి వెళ్ళినా తగిన స్పందన రాకపోవడంతోనే మూడు జిల్లాలకు పరిమితం అయ్యిందని చెప్పక తప్పదు. జలయజ్ఞం పేరిట లక్షల కోట్ల రూపాయలు అవినీతికి కారకులైన కాంగ్రెస్ నాయకులు పంట సాగుకు మాత్రం నీరు అందించలేకపోయారు.
ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో ఉనికి కోల్పోయినా రైతుల పేరుతో యాత్రలు చేసి రైతులను పరామర్శింస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కానీ కరెంటు కోసం బషీర్ బాగ్ దండయాత్ర చేసిన వామపక్షాల కార్యకర్తలను పిట్టల్లా కాల్చి చంపిన నాటి టీడీపీకి చెందిన నేతలు ఇవ్వాళ కరెంటు కోతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. రైతు రాజ్యమే రామరాజ్యం అని అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అప్పట్లో రైతులను అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు రైతులు ఎవ్వరూ మరువలేదు. రైతుల ఆత్మహత్యల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కింది. తన పదేళ్ల పరిపానలో సుమారు 17,242 మంది రైతులను పొట్టన పెట్టుకున్న టీడీపీ ఈ నాడు రైతు ఆత్మహత్యలపై మాట్లాడటం చూసి బాధిత కుటుంబాలు విస్తుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సంక్షోభానికి గత పాలకులే కారణమని రైతులు కన్నెర్ర చేయడంతో మధ్యలోనే తమ యాత్రలు ఆపి ఢిల్లీకి నివేదిక ఇస్తామని పయనం అవుతున్న తీరు కనపడుతూనే ఉన్నది.
గత 17ఏళ్లలో సుమారు 33,326 మంది రైతుల ఆత్మహత్యలపై అనేక అధ్యయనాలు జరిగాయి. 2004లో జయతిఘోష్ కమిషన్, 2006 లో జస్టిస్ రామచంద్రారెడ్డి కమిషన్, 201లో మోహన్ కందా కమిటీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యలపై అనేక సిఫార్సులు చేశాయి. ముఖ్యంగా రైతులందరికీ సాగునీరు అందించాలని, కౌలుదారులతో సహా రైతులందరికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని చెప్పాయి. గిట్టుబాటు ధరపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని సూచించాయి. కానీ ఆ సిఫార్సులు ఏవి కూడా అమలు కాకుండా పోవడం వల్లే వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు నష్టం కలిగిస్తూ బడా బాబులకు లాభాలు చేకూర్చిన గత పాలకులు అన్ని విధాలుగా రైతులను నిర్లక్ష్యం చేశారు. ఈ వివక్ష, నిర్లక్ష్యాల కారణంగానే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగింది. నేటికీ కొనసాగుతున్నది.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం...గత పాలకులు తెలంగాణకు చేసిన నస్టాన్ని అధిగమించే పనిలో ఉన్నది. ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకొనేందుకు సిద్ధం అయింది. ‘రుణమాఫీ’ పథ కంతో సుమారు 36లక్షల మంది రైతులకు అప్పులు మాఫీ చేస్తూ రైతులకు ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసింది. ప్రస్తుతం 25 శాతం బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే చెల్లించి మిగతా 75శాతం వచ్చే మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ సర్కారు బ్యాంకులకు రుణం చెల్లించనున్నది. ఈలోగా రైతులు బ్యాంకర్ల ద్వారా కొత్త రుణాలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నది.
ఈ విషయం అర్థంగాక కొందరు రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడు తున్న తీరు కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని ప్రతి పక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం విషాదం. అంతకన్నా జాతి ద్రోహం మరొకటి లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విపక్షాలు విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ కరువు-కరెంటు కష్టాలను తీర్చాలి. తెలంగాణ నవ నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. అందుకు పార్టీలకతీతంగా కలిసి నడవాలి. 

శుక్రవారం, అక్టోబర్ 17, 2014

సీమాంధ్ర అక్రమార్కుల భూదాహం...150 కోట్ల భూమికి ఎసరు!

-న్యాయస్థానానికి ఇచ్చిన భూమి మళ్లింపు
-గత ప్రభుత్వ హయాంలో మాయాజాలం
-వైఎస్ పేషీ ఫోన్‌కాల్‌తో మొదలైన అక్రమాలపర్వం
-ఆగమేఘాల మీద ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపు
-వాస్తవాలు తేలినా సాగదీస్తున్న యంత్రాంగం
-రేపు మరోసారి విచారణ
అది హైటెక్ సిటీ సమీపంలో ఉన్న పదెకరాల సర్కారు భూమి. ఫక్తు ఖారీజ్ ఖాతా అని రికార్డుల్లో ఉంది. రంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం పరిధిలోకి వచ్చే సర్వేనంబరు 972గల ఆ భూమిని 2006లో ఐదెకరాలు సబ్‌స్టేషన్ నిర్మాణానికి సీపీడీసీఎల్‌కు... ఆతర్వాత రెండు దఫాలుగా మిగిలిన ఐదెకరాల భూమిని తొమ్మిదో మెట్రోపాలిటన్ కోర్టుకు కేటాయించారు. క్షేత్రస్థాయి పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారుల సమక్షంలో హైకోర్టు నుంచి వచ్చిన అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రక్రియలు, రికార్డులు జరిగిపోయాయి. అయితే ఈ భూమికి డిమాండు పెరగడంతో కొందరు సీమాంధ్రుల కన్ను పడింది.
2008లో తెర వెనక పావులు కదిపారు. ఆ పదెకరాల భూమిని 1961లో భరత్‌రెడ్డి అనే స్వాతంత్య్ర సమరయోధుడికి (పొలిటికల్ సఫరర్) కేటాయించారంటూ ఆయన వారసులు ఇద్దరు రంగారెడ్డి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ భూమిపై వచ్చిన ఇలాంటి దరఖాస్తులను అధికారులెవరూ కనీసం పట్టించుకోరు. కానీ ఈ దరఖాస్తుపై వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేషీ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చింది. రంగారెడ్డి జిల్లా అధికారులు బాలానగర్ తహసీల్దార్‌ను ఆదేశించడంతో ఆయన ఆ పదెకరాల భూమిని చెరో ఐదెకరాలు మ్యుటేషన్ చేసి... రికార్డుల్లో అమెండ్‌మెంట్ కూడా చేసి పారేశారు. గతంలో ఈ భూమిని సీపీడీసీఎల్, న్యాయస్థానానికి కేటాయించిన విషయాన్ని విస్మరించారు. కనీసం ఆ కేటాయింపులను రద్దు కూడా చేయలేదు.

నిబంధనలు ఏం చెప్తున్నాయి?..


ఎవరికైనా ప్రభుత్వం పట్టా ఇస్తే దానిని 30 రోజుల్లో పోడీ (క్షేత్రస్థాయిలో పొజీజిషన్‌కు వెళ్లి... రికార్డుల్లో తమ పేరిట పేరు మార్పించుకోవాలి) చేయించుకోవాలి. లేనట్లయితే ప్రభుత్వం తిరిగి దానిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. సదరు స్వాతంత్య్ర సమరయోధుడికి కేటాయించినట్లుగా ఉన్న పట్టా 21.11.1961లో జారీ చేసినట్లుగా ఉంది. అంటే సుమారు 52 ఏండ్లు గడిచింది. ఇప్పటిదాకా పత్తాలేని వారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చారన్న అనుమానం అధికారులకు రావాలి. మరోవైపు ఆ వారసుల వద్ద ఆ పట్టా మినహా ఇతర ఆధారాలేవీ లేవు.

అసలు ఆ పట్టా సరైనదా? కాదా? అని సరిపోల్చుకోవడం అధికారుల బాధ్యత. అదీ జరగలేదు. ఎందుకని అంటే గతంలో ఐడీపీఎల్‌లో ఉన్న ఎమ్మార్వో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులన్నీ తగలబడ్డాయని సమర్థింపు. నిబంధనల ప్రకారం 30 రోజుల తర్వాత ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉన్న అధికారులు, అది పట్టించుకోకుండా అర శతాబ్దం తర్వాత వస్తే గుడ్డిగా మ్యుటేషన్ చేసి, రోజుల వ్యవధిలోనే రికార్డుల్లోనూ పేర్లు మార్చేశారు. ఈ మ్యుటేషన్ ప్రక్రియ జరిగిన కొన్నిరోజులకే ఆ తహసీల్దార్ పదవీ విరమణ చేశారు.

గుట్టు రట్టయినా మడత పేచీలు..


మ్యుటేషన్ ప్రక్రియ ముగిసీ ముగియగానే ఎంజీ కన్‌స్ట్రక్షన్స్ పేరిట కొందరు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో స్థానిక న్యాయవాదులు అడ్డుకొని, కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని, ఒక ఐపీఎస్ అధికారి తమ్ముడినని చెప్పుకున్న అతడిని మాత్రం వదిలేశారు.

వ్యవహారం కేసుల దాకా వెళ్లడంతో రెవెన్యూ అధికారులు తిరిగి విచారణ నిర్వహించారు. 2013లో బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఈ అక్రమ మ్యుటేషన్‌ను రద్దు చేయాలంటూ కలెక్టర్‌కు నివేదిక వెళ్లింది. కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ మ్యుటేషన్ రద్దు చేస్తూనే మరోసారి సదరు స్వాతంత్య్ర సమరయోధుడి వారసుల దరఖాస్తులను పరిశీలించాలని మడతపేచీ పెట్టారు. దాదాపు ఏడాది కాలంగా ఆ దరఖాస్తు పరిశీలన పేరిట ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఈనెల 18న కూడా మరోసారి విచారణ తేదీని ఖరారు చేశారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమాంధ్రుల ఒత్తిళ్లు ఇంకా ఎలా పని చేస్తున్నాయో అర్థమవుతుంది. అయితే తమ కోర్టుకు కేటాయించిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలుకోమంటూ కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ పట్టుదలగా ఉంది. న్యాయశాఖ కూడా స్పందించి ఈ భూమిలో తొమ్మిదో మెట్రోపాలిటన్ న్యాయస్థాన భవన నిర్మాణ పనులకు పూనుకోవాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, అక్టోబర్ 16, 2014

ఇవి...విపక్షాలా?...ఆంధ్రాపక్షాలా?

తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్, హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్‌సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతులతో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా? 


కొత్త రాష్ట్రం. సూటిగా చెప్పాలంటే కొత్త సంసారం. అంతేకాదు గత కాలపు పాలనలో అనేక విధ్వంసాలు. విభజనలో సవాలక్ష అన్యాయాలు. ఈ అవరోధాలన్నిటినీ అర్థం చేసుకొని అడుగులేయాలంటే, ఎంతటి గొప్ప నాయకుడికైనా కొంత కాలమైనా పడుతుంది. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వమొచ్చి 130 రోజులైంది. ఇంత చిన్న కాలంలో ఏదో చేయలేదని విపక్షాల గావుకేకలు! ఇంతకాలం సాగిన విధ్వంసానికి, అన్యాయాలకు కారకులే విమర్శకులైన ఈ విపక్షాలను చూసినపుడు ఇవి విపక్షాలా? ఆంధ్రాపక్షాలా?అన్న సందేహం కలగడం సహజం. ఇపుడు కొత్తగా బస్సు యాత్రల అవతారం కూడా అందులో భాగంగానే చూడకతప్పదు. ఒకటి కాంగ్రెస్ బస్సు. ఇంకొకటి తెలుగుదేశం బస్సు. మూడో పక్షం నేనూ ఉన్నానంటూ బీజేపీ ఆందోళనలు! 
కాంగ్రెస్ వాళ్లది రైతు భరోసా యాత్ర. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చెప్పేస్థితిలో ఉన్నాడా?

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ ప్రాజెక్టులు బోలెడు వచ్చాయి. తెలంగాణలో డిమాండ్‌ను చూసైనా ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో చెప్పగలరా? ఆంధ్రాలో విద్యుత్ ప్రాజెక్టులకు తెలంగాణ మంత్రుల చేతనే అనుమతులిప్పించిన ఘనత కాంగ్రెస్‌ది. విద్యుత్ డిమాండ్ తెలంగాణలో ఉండగా, సీమాంధ్రలో పవర్ ప్రాజెక్టులు స్థాపిస్తుంటే ఇదే కాంగ్రెస్ నేతలు అప్పుడు కళ్లు మూసుకున్నారు. విద్యుత్, నీటి దోపిడీలు తెలంగాణ మంత్రుల చేతనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిది నిజం. నీటిపారుదల మంత్రిగా పొన్నాల ఏడేళ్లు పనిచేశారు. పొన్నాల చేతనే వైయస్ పోతిరెడ్డిపాడుకు మరిన్ని పొక్కలు కొట్టించాడు. 44 వేల క్యూసెక్కుల నీటి దోపిడీకి ఆయన చేతనే జీవో జారీ చేయించాడు. తెలంగాణ రైతు బతుకులో మట్టికొట్టిన వారే, ఇపుడు తగుదునమ్మా అంటూ రైతు భరోసా యాత్ర చేయడాన్ని ఏమందాం?

ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనాలన్నా కనీసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం చేసిన పాపాన పోలేదు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా, ట్రాన్స్‌మిషన్ కారిడార్ లేదు. దాని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుంది. అప్పటి దాకా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ మనకు లభ్యంకాదు. ఆ పాపం ఎవరిదందాం? నాలుగు నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అందామా? గత 35 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలదందామా? పోనీ, గత 5 ఏళ్లు గా తెలంగాణలో తుఫాను, వర్షాభావాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారమైనా ఇచ్చారా? 5 ఏళ్ల కాంగ్రెస్ కాలంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇపుడు కేసీఆర్ ప్రభుత్వం రూ.480 కోట్ల పంట నష్టం విడుదల చేసింది. రైతులకు భరోసా కల్పిస్తామంటూ బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలను, రైతులోకమే పైన పేర్కొన్న ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెబుతారు? 

ఇక తెలుగుదేశం బస్సు రాజకీయం చూద్దాం. తెలంగాణ సకల దరిద్రాలకు తెలుగుదేశం పుట్టుకే కారణమని తెలియని వారు ఎవరూ ఉండి ఉండరు. దాని పుట్టుకతోనే తెలంగాణ దోపిడీ, నిధుల మళ్లింపులు, ఉద్యోగాల ఆక్రమణ, ఆక్రమ డిప్యూటేషన్లు, హైదరాబాద్‌కు పెరిగిన సీమాంధ్ర వలసలు, భూముల ఆక్రమణలు, ల్యాండ్ మాఫియాలు.. ఎన్నని చెప్పగలం? ఇక చంద్రబాబు కుర్చీ చేపట్టిన నాటి నుంచి మొదలైన తెలంగాణ రైతు కష్టాలు తిరుగులేకుండా నేటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయం దండగ అన్న పాలకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే నని చరిత్ర చెపుతున్నది.

దేశంలో రైతుల ఆత్మహత్యల పరంపరకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు పాలనను ఏ రైతైనా ఎలా మర్చిపోగలడు? అలాంటి చంద్రబాబు సైగలతో ఇపుడు టీ-టీడీపీ నేతలు రైతు పేర బస్సు యాత్ర చేపడితే నవ్వుకోవడం తప్ప మరేమైనా ఉంటుందా? ఉద్యమకాలంలో, తన పొలం దగ్గరకు వచ్చిన చంద్రబాబును ఫణికర మల్లయ్య(వరంగల్‌జిల్లా)అనే ఒక సాధారణరైతు ఏమడిగాడో తెలంగాణ టీడీపీ నేతలకు గుర్తుందో లేదో తెలియదు. కానీ తెలంగాణను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆరోజు మల్లయ్య వేసిన ప్రశ్న ఈరోజుకూ మిగిలే ఉంది. తెలంగాణను తన ఆధిపత్యంలో ఉంచుకొని తిరిగి దోపిడీ సాగించాలనే చంద్రబాబు తీరే ఫణికర మల్లయ్య ప్రశ్న సజీవంగా ఉందని చెపుతుంది. తెలంగాణను అడ్డుకోలేకపోయి నా.. దాని మూలాలను దెబ్బతీసే తంత్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలొస్తాయని నేను ముందే చెప్పాను అని బాబు ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. విభజన జరిపినపుడు సమస్యలను జోడించిన ఘనత బాబు గారిదే కదా! రాష్ట్రం ఇచ్చినా తమ ఆధిపత్యంలోనే తెలంగాణ బతకాలనే బాబు గారి కుతంత్రాలకు విభజన పర్వంలోనే బీజం వేశారు.

ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్య, పోలవరం ముంపు మండలాలు, రెండు జీవనదులపై ఆంక్షలు.. ఇవన్నీ బాబు గారి పుణ్యమే కదా! అలాగే తామే సృష్టించిపెట్టిన విద్యుత్ సమస్యపై ఇవాళ తెలంగాణ తమ్ముళ్లను ఎగదోయడంలోని మర్మం తెలియంది కాదు. నిజానికి సీమాంధ్రలో డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అదేదో ఇవాళ తన పాలనా సామర్థ్యం తోనే తన రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనలాగ చేయలేకపోయారని, తనకు మించినోడు లేడన్నట్లు చెప్పుకున్నారు.కనీసం ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్లు ఉండాలి. అలాంటి ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్‌లు కూడా తెలంగాణకు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు పుణ్యం మూలాన్నే కదా... ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వెంటనే విద్యుత్ పొందలేకపోతున్నది! పైగా మావద్ద మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని గొప్పగా చెపుతున్నారు.

నిజంగా తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా, కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ,హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్‌సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతులతో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా? ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించబడిన ఏ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తిలోనైనా తెలంగాణ రాష్ట్రంవాటా కలిగి వుంటది. విభజన బిల్లులో ఉన్న 54 శాతం విద్యుత్ వాటాకే ఎగనామాలు పెడుతున్న చంద్రబాబు, మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామనడం చూసి వినే వారే సిగ్గు పడాలేమో!

ఇక బీజేపీ చేపడుతున్న రైతుల పేర ఆందోళనల వైపు చూద్దాం. పోలవరం ముంపు మండలాలు, ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై బిల్లులో ఉన్నట్లుగానే అమలు చేస్తున్నామని బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి మొదలుకుంటే, హైదరాబాద్ దాకా చెపుతూవస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్నట్లుగానే ఎందుకు అమలు చేయడంలేదో బీజేపీ నేతలు చెప్పడం లేదెందుకు? 

బిల్లులో తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటాను ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానిదనే సోయి బీజేపీ నేతలకు లేదెందుకు? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని బతిమిలాడితే విద్యుత్ వాటా ఇప్పిస్తాం అనే రీతిలో బీజేపీ నేతల మాటలు అపుడపుడు వినబడుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 4 రోజులకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి చెప్పారు. మరోసారి ఆమధ్య వెళ్లారు. ఇపుడు మళ్లీ వెళ్ళి వచ్చారు. న్యాయమైన విద్యుత్ వాటా కోసం ఇన్ని సార్లు మొర పెట్టుకున్నా ఇప్పించలేకపోతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగకుండానే పోలవరం ముంపు మండలాలను మాత్రం ఏపీలో ఎలా విలీనం చేయగలిగింది?

బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని పదే పదే చెపుతున్న బీజేపీ నేతలు.. విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్న వాటానే ఎందుకు ఇప్పించడంలేదో చెప్పాలి. చట్టబద్ధమైన న్యాయం కూడా చేయలేని బీజేపీ ఇవాళ తెలంగాణ రైతుల పేరిట ఆందోళనలు చేపట్టడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. తెలంగాణ విద్యుత్ కొరత తీర్చడం ఒక్క తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ బాధ్యతను మరిచి ఆందోళనలు చేపట్టి రైతులనే మోసం చేయాలనుకోవడం సరికాదు. తెలంగాణ రైతుల పట్ల నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటా ఇప్పించాలి. ఎన్‌టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ర్టానికి ఇస్తామని కేంద్రం చెప్పిన మాటను అమలు చేయించాలి. 

Editpage Articel By Kalluri Srinivas reddy

రైతులు వర్షాలు లేక, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న మాట నిజం. అయితే కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి ఉన్న సమస్యల తోరణాలు ప్రజలకు తెలియనివి కావు. ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధిని ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు తప్ప, ఆంధ్రాపక్షాల వలె గావుకేకలు పెడుతున్న విపక్షాల మాటలను ప్రజలు లెక్కలోకి తీసుకోరనేది కూడా నిజం. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధిని, దాని పనితీరును కొంతకాలం గమనిస్తే ప్రజలకు ఈ ప్రభుత్వం పట్ల ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అవసరమనుకుంటే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు తప్ప, ఆంధ్రా అధిష్ఠానం, ఢిల్లీ ఆధిష్ఠానం కలిగిన బయటిపార్టీల ప్రతిపక్ష పాత్రలకు తెలంగాణలో అర్థమేలేదని చెప్పాలి. 

బుధవారం, అక్టోబర్ 15, 2014

ఆంధ్రకు తెలంగాణ ఆపన్న హస్తం...

-తుఫాన్ పీడిత జిల్లాలకు రూ.18కోట్ల విద్యుత్ పరికరాలు
-530 ట్రాన్స్‌ఫార్మర్లు, 2500 విద్యుత్ స్తంభాలు
-900 కి.మీ. పొడవైన విద్యుత్ వైర్లు : సీఎస్ రాజీవ్‌శర్మ వెల్లడి
-సహాయ చర్యలకు తాజాగా 9 మంది డిప్యూటీ కలెక్టర్లు
హుదూద్ తుఫాన్‌వల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చింది. హుదూద్ తుఫాన్‌తో ఆంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్ర నష్టంవాటిల్లింది. ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్లు పాడై, స్తంభాలు ఒరిగిపోయి.. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. సత్వరం పరిష్కరించాల్సిన అంశంగా విద్యుత్ సమస్య ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. సుమారు రూ.18 కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను అందించింది. 
ఏపీకి 50 పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు, 180 మీడియం ట్రాన్స్‌ఫార్మర్లు, 300 చిన్న ట్రాన్స్‌ఫార్మర్లను అందించినట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. వాటితోపాటు 28,500 విద్యుత్ స్తంభాలు, వాటికి అవసరమైన.. 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల దూరాలకు కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా విద్యుత్ వైర్లను అందజేసినట్లు రాజీవ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే ఐదుగురు ఐఏఎస్ అధికారులను, మరికొంత మంది సిబ్బందిని కూడా పంపించామని చెప్పారు.

ఆంధ్రాలో సేవలకు 9మంది డిప్యూటీ కలెక్టర్లు


తుఫాన్ ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు తాజాగా తొమ్మిది మంది డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పంపించనుంది. వీరిలో ధర్మారావు, ఎస్ వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు, పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఈ మురళి, కే వెంకటేశ్వర్లు, ఎన్ సత్యనారాయణ, కే చంద్రశేఖర్‌రావు, వీ నాగన్న ఉన్నారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల జాబితాను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా మంగళవారం సాధారణ పరిపాలన(పొలిటికల్) శాఖకు ప్రతిపాదించారు. ఎంపిక చేసిన డిప్యూటీకలెక్టర్లందరూ బుధవారం ఆంధ్రాకు వెళ్లనున్నారు.

నాడు కశ్మీర్‌కు.. నేడు ఆంధ్రప్రదేశ్‌కు..


ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఇటీవల కశ్మీర్‌లో తీవ్ర వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తాగునీటిని శుద్ధిచేసే వాటర్ ఫిల్టర్లు హైదరాబాద్‌లోనే లభిస్తాయన్న సమాచారం మేరకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో సహకారం కోరింది. వెంటనే స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం వాటిని సత్వరమే కశ్మీర్‌కు పంపించింది. దీనితోపాటు కశ్మీర్ వరదబాధితులకు రూ.10కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

తాజాగా హుదూద్ తుఫాన్ తాకిడికి అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలను ఆదుకునేందుకు కేసీఆర్ చొరవ చూపారు. ఏపీ అడిగిన సహాయం సత్వరమే అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎం ఆదేశం మేరకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను, కొంతమంది విపత్తుల నిర్వహణ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించారు. ఇప్పుడు దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణకు కూడా సహాయం చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉదారతకు నిదర్శనమని ఉన్నతాధికారులు అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!