గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 19, 2014

తెలంగాణ బొగ్గుపై ఏపీ కన్ను!

-14కోట్ల టన్నుల బొగ్గును కాజేసేయత్నం
-పేరులో సామ్యం చూపి వింతవాదన
-బొగ్గు దక్కించుకొనేందుకు కేంద్రంపై ఒత్తిడి !
-బొగ్గును ఏపీ జేన్‌కోకు ఇస్తే ఉద్యమమే: టీబీజీకేఎస్
power-transmissionసమైక్య రాష్ట్రంలో జరిగిన ఒప్పందాలను అనుకూలంగా మలుచుకొని తెలంగాణ బొగ్గును తన్నుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు పావులు కదుపుతున్నది. విద్యుత్‌తోపాటు దాని ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కూడా దోపిడీ చేసేందుకు కుట్రలకు తెరలేపింది. సింగరేణి, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లు సంయుక్తంగా వెలికితీయాల్సిన రూ.28వేల కోట్ల విలువైన 140మిలియన్ టన్నుల బొగ్గును మొత్తంగా ఏపీ జెన్‌కోకు మళ్లించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేవలం పేరులో సామ్యం చూపి మధ్యప్రదేశ్‌లోని సులియారి-బెల్వార్ బొగ్గు క్షేత్రం తమకే దక్కుతుందని వింతవాదనకు తెరలేపుతున్నది. తెలంగాణకు 15వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 5వేల మెగావాట్లు ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో వచ్చే మూడేళ్లలో థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుండగా, వాటికి ఆదిలోనే గండి కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.

పేరు మాదే కాబట్టి బొగ్గు మాకే..!

మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలీ జిల్లా సులియారి-బెల్వార్ బొగ్గు క్షేత్రాన్ని కేంద్ర బొగ్గుశాఖ జీవో నం.110 ద్వారా 2010 అక్టోబర్ 30న ఏపీఎండీసీకి కేటాయించింది. ఈ బొగ్గును వెలికితీయటానికి సింగరేణి, ఏపీఎండీసీ సంయుక్తంగా ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. 2013 జూలై ఒకటోతేదీన కార్పొరేట్ గుర్తింపు సంఖ్య యూ10300ఏపీ2013ఎస్‌జీసీవో88684తో ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్పత్తి చేసే 140మిలియన్ టన్నుల బొగ్గును ఏపీ జెన్‌కో వినియోగించుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అతి తెలివిని ప్రదర్శిస్తున్నది.

నాటి నిబంధనల్లో ఏపీ జెన్‌కో అని పేర్కొన్నారని, ప్రస్తుతం తమ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ పేరు కూడా అదే కాబట్టి ఆ బొగ్గు మొత్తం తమకే దక్కాలనే విచిత్ర వాదన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. కేంద్రంలో ఉన్నది తమ శ్రేయో ప్రభుత్వమే కాబట్టి, సర్కారును బుట్టలో వేసుకొని ఈ బొగ్గును ఎలాగైనా తన్నుకుపోవాలని పథకం రచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సింగరేణితో పాటు ఏపీఎండీసీ నుంచి వేరుచేయనున్న తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మాత్రమే బొగ్గును వెలికితీయాల్సి ఉంటుంది. ఏపీజెన్‌కో నుంచి ఏర్పడిన తెలంగాణ జెన్‌కోకు ఆస్తుల పంపకంలో భాగంగా ఈ బొగ్గును కూడా పంచాల్సి ఉంది.

ఆ లెక్కన టీ జెన్‌కోకు 58.8 మిలియన్ టన్నుల బొగ్గు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా బొగ్గు ఉత్పత్తి కోసం ఏర్పరచిన జాయింట్ వెంచర్‌లో భాగస్వామి అయిన సింగరేణి సంస్థ భౌగోళికంగా కేవలం తెలంగాణకే పరిమితం. అంటే తెలంగాణ సంస్థ తవ్వితీసిన బొగ్గు కూడా ఆంధ్రప్రదేశ్‌కే చెందాలనే అర్థం పర్థం లేని వాదనకు ఏపీ ప్రభుత్వం తెరలేపుతున్నది. పేరు ఒక్కటే అయినంత మాత్రాన బొగ్గంతా తమకే దక్కాలనటం సరికాదని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.

సులియారి-బెల్వార్ కోల్‌బ్లాక్ తెలంగాణకే చెందాలి: టీబీజీకేఎస్

గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని సులియారి-బెల్వార్ బొగ్గు క్షేత్రం సింగరేణి సంస్థకు, తెలంగాణకే చెందుతుందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) పేర్కొంది. ఈ బొగ్గు క్షేత్రం తెలంగాణకు దక్కకుండా చేస్తే ఆందోళన తప్పదని టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. సింగరేణి సంస్థ, ఏపీఎండీసీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించాల్సిన బొగ్గు బ్లాక్‌ను ఏపీజెన్‌కోకు కేటాయించే ప్రయత్నాలు సాగుతున్నాయని, అదే జరిగితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి