గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 25, 2014

జై తెలంగాణ అన్నందుకు కక్షసాధింపు


-ప్రాధాన్యం లేని చోట్ల పోస్టింగులు
-సర్వీసు రికార్డుల్లో ప్రతికూల రిమార్కులు
-తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉన్నతాధికారుల దుశ్చర్య
-ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామంటున్న ఉద్యోగులు

జై తెలంగాణ అని ఉద్యమించినందుకు తెలంగాణకు చెందిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులపై సీమాంధ్ర ఉన్నతాధికారులు సాగించిన కక్షసాధింపు ఇది.. డిసిప్లినరీ ఫోర్స్‌లో పనిచేస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా ఉద్యమిస్తారంటూ వారు తెలంగాణ ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా వెనుకడుగు వేయకపోవటంతో ఏకంగా తెలంగాణ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో వ్యతిరేక రిమార్కులు రాశారు. తెలంగాణ కోసం గళమెత్తిన ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యమయ్యేలా కుట్రలకు తెగించారు. దీంతో కొంతమంది అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగి ఈ రిమార్కులను తీసివేయించుకోగలిగినా చాలామంది ఇప్పటికీ వాటివల్ల ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి.. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. 

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపక, అటవీ, రవాణా, తూనికలు కొలతలు, ఎక్సయిజ్ శాఖలాంటి యూనిఫాం సర్వీసుల్లో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది సైతం ఉద్యమంలోకి దూకాలనుకున్నారు. అయితే, ఉన్నత స్థానాల్లో సీమాంధ్ర అధికారులే ఎక్కువగా ఉండటం...డిసిప్లినరీ ఫోర్స్ కావటంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటారేమోనన్న భయంతో చాలామంది ఆ పని చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లోనూ కొందరు ఉద్యోగులు ధైర్యంగా ముందుకొచ్చారు. 2009, డిసెంబర్‌లో యూనిఫాం సర్వీసెస్ జాయింట్ యాక్షన్ కమిటీని ప్రారంభించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించారు. దాంతో అప్పట్లో అధికారంలో ఉన్న సీమాంధ్ర పాలకులు.. సీమాంధ్ర ఉన్నతాధికారులు వారిపై కన్నెర్ర చేశారు. జై తెలంగాణ అని నినదించిన ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. 

ప్రస్తుతం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటిండెంట్‌గా ఉన్న కొలను వెంకట్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ ఉదంతాలే దీనికి నిదర్శనం. యూనిఫాం సర్వీసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరితోపాటు మరికొంతమందిని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. వీరిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కుట్రలూ చేసింది. ఇందులోభాగంగానే ఉన్నత స్థానాల్లోని సీమాంధ్ర అధికారులు చాలామంది తెలంగాణ ఉద్యోగులను అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించారు. అంతే కాకుండా వారి సర్వీసులకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో వ్యతిరేకంగా రిమార్కులు రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు అత్యంత కీలకం. ఇందులో వ్యతిరేకంగా రిమార్కులు ఉంటే ప్రమోషన్లు రావటంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో తమ సర్వీసు రికార్డుల్లో నమోదుచేసిన వ్యతిరేక రిమార్కులను తొలగించే అంశాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళతామని బాధిత ఉద్యోగులు చెప్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి